గోతెలుగు :నమస్కారం ఇందూరమణ గారూ..ఎలా వున్నారు?
ఇందూరమణ : నమస్కారం..ఆనందమానందమాయెనే....మీ అభిమానానికి అభివాదం..
గోతెలుగు :అన్వేషణ మొదలై పాతిక వారాలుగా విజయవంతంగా నడిపిస్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు..
ఇందూరమణ : అది మీ అభిమానం...పాఠక నెటిజన్ల ఉదార ఆదరణ....
గోతెలుగు :ఇంతకీ " ఆమె " ఎవరు? ఆమె అన్వేషణ ఎవరి/దేనికోసం? ఎందుకిలా పాఠకులను సస్పెన్స్ లో ముంచెత్తుతున్నారు? ఎప్పుడు తేల్చుతారు?
ఇందూరమణ : ఆమె పేరు మహాశ్వేత...ఆమెకి కావల్సినదేదో....దేనికోసమో...ఆమె తపన..తహతహ చూస్తున్నారుగా..సారీ, చదువుతున్నారుగా....చూద్దాం..ముందుముందు ఏం జరుగుతుందో..?!
గోతెలుగు :రాబోయే వారాల్లో అన్వేషణ ఇంకా ఎలాంటి మలుపులు తిరగబోతోంది?
ఇందూరమణ : మలుపు,, తలపులు చెప్పి రావు కద సార్, అయినా, ఆమెతోపాటూ మీరూ అన్వేఅణలో పాల్గొంటు(చదువుతూ)న్నారుగా...మీకే తెలుస్తుంది....
గోతెలుగు :కొత్త పాత్రలు రాబోతున్నాయా? వాటి గురించేమైనా చెప్తారా?
ఇందూరమణ : ఇందులో చెప్పడానికేముంది సార్...తినబోతూరుచడిగితే ఎలా? ప్రయాణమన్నాక మజిలీలూ...సీరియలన్నాక కొత్తకొత్త పాత్రలూ...ఊహించని సంఘటనలు ఎదురు కావడం సహజమేగా.....
గోతెలుగు :ఈ ఇతివృత్తం ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందా?
ఇందూరమణ : కారణం...కాకరకాయ ఏమీలేదు..సస్పెన్స్..పరిశోధన ప్రధానాంశాలుగా ఎంచుకొని మంచి నవల రాయాలనుకొన్నాను..అదే విషయం మీతో చెప్తూ ' అన్వేషణ ' పేరు చెప్పగానే దర్శకుడు వంశీ గారి అన్వేషణ గుర్తు చేశారు. అంత గొప్పగా ఉండకపోయినా, దాదాపు అంత సస్పెన్స్ ఉంటుందని చెప్పాను కదా....మీరు రాయమని ప్రోత్షహించబట్టే ఈ అన్వెషణ ఇలా కొనసాగుతోంది...
గోతెలుగు :దాదాపు మీ సీరియల్స్ లో సిమ్హాచలం, విశాఖ పట్నం పరిసరాలను ఎంచుకుని కళ్ళకు కట్టినట్టు అక్షరీకరిస్తారు....దీని వెనుక నేపథ్యం ఏమిటి?
ఇందూరమణ : తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఎంత సమయమైనా మాట్లాడగలము కదా..అదే ముక్కూ మొహం తెలియని వాళ్ళతో అలా మాట్లాడగలమా? ఇదీ అంతే, నాకు బాగా తెలిసిన..నేను బాగా తిరిగిన ప్రదేశాలు, ప్రాంతాలు నేపథ్యంగా ఎంచుకుంటే కథలో లీనమై...పాత్రలతో మమేకమై..నాకు తెలీకుండానే, పేజీలు పేజీలు రాసుకుంటూ సాగిపోతూంటాను..అదే సరిగ్గా అవగాహన లేని అనుభం కాని నేపథ్యమైతే పెన్ను పట్టుకుని తెల్లమొహం వేసుక్కూర్చోవాల్సిందే కదా..ఇలాగే, ఎవరో మహానుభావుడు వెనకటికి హైదరాబాద్ వెళ్ళిన హీరోగారు బీచ్ కి షికారుకెళ్ళానని రాసారట....హుస్సేన్ సాగర్ అంటే సముద్రమనుకొని..ఇలా ఉంటుంది..తెలిసీ తెలీకుండా రాస్తే.
గోతెలుగు :గోతెలుగుతో మీ అనుబంధంబంధం గురించి చెప్తారా?
ఇందూరమణ : నేను గోతెలుగు పాఠక నెటిజన్లకు బాగా తెలిసిన (పాత)వాడినే. గతంలో నేను రాసిన ' ఏజెంట్ ఏకాంబర సిబీఇ 007 ' నలభై రెండు వారాలు ధారావాహికగా వచ్చింది. అది నా అభిమాన పాఠక మిత్రులకు గుర్తుందే ఉంటుందనుకుంటాను.
గోతెలుగు :సీరియల్ రచనకు పూనుకొన్నప్పుడు, ఆసక్తి కలిగించే కథనం, శైలి, ఇతివృత్తం, వీటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ?
ఇందూరమణ : కథ....అంటే ఇతివృత్తం...కథే కదా సార్, వీటికి మూలం, ఆ తర్వాత కథని ఆసక్తి కలిగించే కథనంతో, రక్తి కట్టిస్తూ మంచి ఎత్తుగడతో మొదలెడతాం. అదే నా శైలి.
గోతెలుగు : అచ్చు పత్రికలకు, అంతర్జాల పత్రికలకు రచనలు చేయడంలో తేడా/ప్రయోజనం ఏమిటి?
ఇందూరమణ : రాతలో తేడా ఏమీ లేదు...దేని ప్రాముక్యత దానిదే..దేని ప్రయోజనం దానిదే..
గోతెలుగు : మీ కథలు నేరుగా కానీ, మూల కథలుగా తీసుకుని గానీ సినిమాలుగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీరేమైనా ప్రయత్నాలు చేసారా, చేస్తున్నారా?
ఇందూరమణ : నా కథలు, సీరియల్స్ చదువుతుంటే మీకే తెలుస్తుంది. నేను కథ గానీ, నవల గానీ రాయడం మొదలు పెడితే సినిమాటిక్ గానే కథాకథనం అల్లుకుంటాయి. నేను గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ " ఉషాకిరణ్ మూవీస్ " వారి స్టోరీ డిపార్ట్ మెంట్ లో రచయిత గా పని చేసాను. సినిమా కథలు ఎంపిక చేయడం నా ఉద్యోగం. నేను ఇటీవల కథ-మాటలు-స్క్రీ ప్లే రాసిన " ఇంకేంటి ? నువ్వే చెప్పు ! " అన్న సినిమా గత జనవరిలో విడుదలైంది...ప్రస్తుతం సినిమా రచయితగా ఒక్కో అడుగూ వేస్తూ ముందుకు సాగుతున్నాను.
గోతెలుగు :ఈమధ్య రచనా రంగంలోకి ఔత్సాహికులు చాలా మందే వస్తున్నారు. వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
ఇందూరమణ : ఎక్కువ చదవాలి.చదివిన కథని విశ్లేషించుకోవాలి. ఆ రచయిత కథని ఎలా మొదలు పెట్టాడో...ఎలా ముగించాడో కథలో ఏం చెప్పాడో అవగాహన చేసుకుని తాను అదే కథని మరో కోణంలో విభిన్నంగా ఎలా రాయగలనో అని ప్రయత్నిస్తే....మీలో ఉన్న రచయిత పరిపక్వత చెందుతాడన్నది నా అభిప్రాయం..
గోతెలుగు :గోతెలుగు పాఠకులకు చెప్పాలనుకుంటున్నదేమైనా ఉందా?
ఇందూరమణ : ఔత్సాహిక రచయిత(త్రు)ల కోసం మేము " ప్రియమైన రచయితలు " అన్న వాట్సాప్ గ్రూప్స్ నిర్వహిస్తున్నాము...రచయిత మిత్రులు ఎందరో ఇందులో భాగస్వాములై ఉన్నారు. సాహిత్య సేవ చేస్తున్నారు....
గోతెలుగు :ఓకే అండీ ....మరోసారి శుభాభినందనలు....
ఇందూరమణ : మీకనదరికీ శుభాభినందనలండీ....