పౌరుడు పలుగయ్య : కొత్తమంత్రి కావాలని చాటింపు వేస్తున్నారే? పాతమంత్రి ఏమయ్యారూ?
పౌరుడు పారయ్య : పాత మంత్రిగారే ఇప్పటి రాజుగారు మరి !
పౌరుడు పలుగయ్య : ఐతే రాజుగారేమైనట్లు?
పౌరుడు పారయ్య : మన వెనుక ఆ గుంపులో వున్నాడు చూడు !!
భటుడు బాలయ్య : రాజుగారి కిరీటం, మొహం మీదికి జారిపోకుండా ఎత్తిపట్టుకుని, ఇద్దరు బలశాలులు, నుంచున్నారే?
భటుడు భద్రయ్య : రాజుగారికి కిరీటాలంటే మక్కువ. రోజుకో కిరీటం పెట్టుకుంటారు. బంగారు,వెండి, పంచలోహం, ఇత్తడి కిరీటాలు ధరిస్తారు తెలుసుగ...ఈరోజు బరువైన ఉక్కు కిరీటం తలకి పెట్టుకున్నారు!!
రాజు శూరన్న : మహామంత్రీ, ఈరోజు మనం ప్రారంభించిన " మనిషికొక మొక్క " పథకం గురించిన చర్చకి ప్రజలను ఆహ్వానించాం కదా ? కొలువుకి ఒక్కరూ రాలేదేం??
మంత్రి మల్లన్న : నాటిన మొక్కలను పశువులు, గొడ్లూ, గొర్రెలు తినకుండా ప్రజలు కాపలా కాస్తూ కూచున్నారు ప్రభూ!!
సైనికుడు సంజయ్ రాజు : మన సైన్యంలో గుర్రాలన్నీ ఆడ గుర్రాలే దండనాయకా !
దండనాయకుడు దన్ రాజు : మంచిదే కదా...ఆకలేస్తే, సైనికులు, గుర్రాల పాలు పితికించి తాగొచ్చు కదా...
సైనికుడు సంజయ్ రాజు : సమస్య ఎక్కడంటే, శత్రురాజు సైన్యంలో అన్నీ మగ గుర్రాలేనట ! వాటితో మన గుర్రాలు జతకడతాయేమోనని భయంగా వుంది నాయకా !
భోజనాల రాజు : మహామంత్రీ, మనం ప్రారంభించిన మధ్యాహ్న్న భోజన పథకం సజావుగా సాగుతోందా? ఈ రోజు మనం ఏ బడికి వెళ్తున్నాం? ఏ విద్యార్థికి నేను స్వయంగా భోజనం తినిపించబోతున్నాను?
వడ్డనల మంత్రి : ఏ బడికీ వెళ్ళడం లేదు రాజా....! నిన్న తమరు భోజనం తినిపించిన విద్యార్థి అతిసారా వ్యాధితో మరణించాడని తెలిసింది. జనం కర్రలూ, కత్తులూ కొడవళ్ళతో కోపంగా వున్నారని వార్త !!
సేవకుడు చాడీలప్ప : మహాప్రభూ, ఈ రథ సారథి మద్య ప్రభావంతో రథాన్ని దీప స్థంభంతో గుద్ది స్థంభాన్ని పడగొట్టాడు....!
రాజు రక్షన్న : అదేమంత పెద్ద నేరమనిపించలేదు....ఆ స్థంభం ఖరీదును, ఆ రథ సారధి జీతంలో పట్టుకుని, అతడ్ని ఒదిలేయండి !
సేవకుడు చాడీలప్ప : అతడు మద్యాన్ని తానొక్కడు మాత్రం తాగలేదు ...గుర్రాలకి కూడా పట్టించాడు ప్రభో!
రాజు : మహారాణీ, మా చెలికాళ్ళు, మీ చెలికత్తెలూ కానరారేమీ?
రాణి: ఈరోజు, ప్రేమికుల దినం. అందరూ ఉద్యానవనంలో చేరారు !
రాజు : ఔనా? మనిద్దరమూ ఉద్యానవనంలో గాక, ఇక్కడున్నామేమి?
రాణి : ఈరోజు ప్రేమికులదినం అన్నాను కద ప్రభూ!!
దుమ్మువీధి దుర్గయ్య : మనరాజుగారు, ప్రతి పౌరుడి ఖాతాలో పదివేల వరహాలు జమ చేస్తానని మాటిచ్చి, ప్రజల మన్ననలు పొందారు. ఐతే మన ఖాతాలో డబ్బు వేశారా?
ధూళి సందు సమ్మయ్య : మాటిచ్చిన మరుసటిరోజు, ప్రతి పౌరుడు పదివేల వరహాలు పన్ను కట్టాలని ఉత్తర్వు జారీ చేశారు తెలియదా ?
దుమ్మువీధి దుర్గయ్య : తెలుసు. అంత పన్ను కట్టలేమని, అసలు కట్టమని చేప్పేశాం కదా ?
ధూళి సందు సమ్మయ్య : రాజుగారు సరేనన్నారు ! అంటే మనఖాతాలో పదివేల వరహాలు జమచేసినట్లే కదా ?
రాజు ఏమన్న : మహామంత్రీ తమరు రోజు ఎవరో ఒకరి గురించి చాడీలు చెబుతుంటారు కదా....ఈరోజు చెప్పలేదేం?
మంత్రి కాదన్న : చెప్పాను ప్రభూ...!
రాజు ఏమన్న : ఎవరితో....ఎవరి గురించి...?
మంత్రి కాదన్న : మహారాణిగారితో...తమరి గురించే ప్రభీ!!
రాజు : మంత్రివర్యా....నేనొక తెలివైన ప్రశ్న అడుగుతాను..మీరు తెలివైన సమాధానం ఇవ్వగోరుతాను !
మంత్రి : అలాగే ప్రభూ !
రాజు : ఒక పచ్చి అబద్ధం చెప్పండి చూద్దాం !
మంత్రి : మీరు నిజంగా తెలివైనవారు మహారాజా !!