టెన్త్ అయ్యాక ఇంటర్, ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగో, మెడిసెనో, ఆ తర్వాత పీజీ, కుదిరితే ఈ లోగా మంచి ఉద్యోగం.. యవత ఆలోచనలు ఇలాగే ఉండడం సహజం. కానీ ప్రపంచం చాలా వేగంగా పరుగులు పెట్టేస్తోంది. ఆ వేగాన్ని అందుకోవడానికి యువత ఇంకా వేగంగా పరుగులు పెట్టాల్సి వస్తోంది. పరగులు పెడుతోంది కూడా. ఉద్యోగం అన్న ఆలోచన పక్కనపెట్టి, పదో తరగతి నుండే కొత్త ఆలోచనలు చేస్తోంది. నీ కన్నా తోపెవడిక్కడ. నీకు నువ్వే బాస్ అని ఎవరికి వారు మోటివేట్ చేసుకుంటున్నారు. అందుకే కొత్త ఆవిష్కరణలు ఇప్పుడు యవతనుండే పుట్టుకొస్తున్నాయి. వారు చేసే ప్రతీ కొత్త ఆలోచన ఓ కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. తద్వారా సమాజం, ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది యువత. ఓ వైపు యువత పెడదారి పడుతున్నారన్న ప్రచారంతో పాటు, ఇదిగో ఇలాంటి కొత్త ఆవిష్కరణల ఆవిర్భావానికి కూడా యువత ముందుంటుంది.
ఏ కొత్త ఆలోచనకైనా ఆన్‌లైన్‌లో కావల్సిన సమాచారం అందుబాటులో ఉంటోంది. సోషల్ మీడియాని చెడుకు ఉపయోగించే వారితో పాటు, మంచి కోసం ఉపయోగించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేవారు కూడా లేకపోలేదు. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ఈ తరహా యువత నూతన ఆవిష్కరణలకు వేదికవుతోంది. కేవలం చిన్న చిన్న ఆలోచనలే స్టార్ట్ అప్స్‌కి పూల బాటలు వేస్తున్నాయి. ఇంతా చేసి, ఆ స్టార్టప్‌లో ఉండేది ఎంతమంది అంటే, ఒకే ఒక్కరు. నేనే బాస్. నేనే వర్కర్. అన్నీ నేనే అనుకుని రంగంలోకి దిగుతోంది నేటి యువత. పది కంపెనీల చుట్టూ రెజ్యూమ్ పట్టుకుని తిరగడం కంటే ఇది చాలా సులువుగా అనిపిస్తోంది నేటి యువతకు. దాంతో కుప్పలు తెప్పలుగా స్టార్టప్స్ వెలుగు చూస్తున్నాయి. ఓ కొత్త ఆలోచన యువతకు ఆద్భుతమైన జీవనోపాధిని కలిగిస్తోంది. ఎక్కడో ఉద్యోగం చేస్తే, అక్కడి బాస్ ఇచ్చే వేతనం గురించి ఆలోచించాలి. అదే తానే ఓ స్టార్టప్ స్టార్ట్ చేస్తే తనతో పాటు, పదిమందికి పని కల్పించే స్థాయికి ఎదగొచ్చు. అదే నేటి యువత కోరుకుంటోంది.
ఈ క్రమంలోనే తన ఆలోచనలకు నిరంతరం పదును పెడుతూనే ఉంది. 'కోటి విద్యలు కూటి కొరకే' అన్నారు వెనకటికి మహానుబావులు. నిజమే ఫుడ్ చైన్స్ దగ్గర్నుంచి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ దాకా, షార్ట్ ఫిలింస్ నుండి, సిల్వర్ స్కీన్స్ దాకా.. ఒక్కటేమిటి, అగ్గిపుల్ల సబ్బుబిళ్లా, కుక్క పిల్లా కాదేదీ కవితకనర్హం.. అన్నట్లు కొత్త ఆలోచనలకు 'అనర్హం' అనడానికి ఏదీ లేదు. ఐడియా కొత్తగా ఉంటే చాలంతే. నెలకి లక్ష సంపాదన చిన్న మాట. అంతకు మించి సంపాదిస్తే, ఆ కిక్కే వేరప్పా. ఇదీ నేటి యువత ఆలోచన. అందుకే బాస్ కింద పని చేయాలనే పాత ఆలోచనకు గుడ్‌బై చెప్పేసి, 'నాకు నేనే బాస్' అంటోన్న ఈ తరానికి హ్యాట్సాఫ్ చెబుదాం.!