సంప్రదాయం కేవలం సంప్రదాయం కోసం కాదు
సంప్రదాయం ప్రాముఖ్యత కేవలం అది సంప్రదాయం అని కాదు. ఆ సంప్రదాయానికి మూలమైన అద్భుతమైన అనుభూతిని, నేటి తరాల వారు కూడా అనుభవించేందుకు ఏర్పరచిన విలువైన సాధనం సంప్రదాయం. దురదృష్టవశాత్తూ మనం వెయ్యేళ్ళ కిందట జరిగింది ఏదయినా అదంతా వర్తమానం కంటే గొప్ప అని భావించే స్థితికి చేరాం. అది సరి కాదు. వెయ్యేళ్ళ కిందట కూడా మీలాంటి, నాలాంటి మనుషులుండేవాళ్ళు. సంఘర్షణలూ, సమస్యలూ, మూర్ఖత్వాలూ అన్నీ ఉండేవి. కానీ లోకులకు బాగాగుర్తు ఉండిపోయేవి మాత్రం కొద్దిమంది మహనీయుల మహోజ్జ్వలమైన జీవితాలే. దాన్ని బట్టి ఆ కాలంలో అందరూ అలాగే ఉండేవారు అనుకొంటారు. కాదు! ఆ కాలంలోనూ కొద్దిమంది వ్యక్తులే అలా ఉండేవారు. ఇప్పుడు కూడా అలాంటి వారు కొద్దిమంది ఉన్నారు.
సంప్రదాయం అన్నది వ్యక్తిగతమైన అనుభూతిలో సజీవ అనుభవంగా చూసుకొనేందుకు సాధ్యమైనది అయి ఉండాలి. అలాంటి సంప్రదాయమే సజీవ సంప్రదాయంగా నిలుస్తుంది. అలా కాని సంప్రదాయం తల మీద మోపిన భారం అవుతుంది. తరవాతి తరమో, దాని తరవాతి తరమో, దాన్ని వదిలేస్తుంది.
సంప్రదాయాలను పరిరక్షించటం అవసరమా?
ప్రయోజనం లేని సంప్రదాయమంతా నాశనమైపోతుంది. మీరు మీ తరవాతి తరం మీద వాళ్ళకు ఉపయోగపడని దాన్ని నిర్బంధంగా రుద్దలేరు. మీరు అది ఎంత పవిత్రమైనదని భావించినా, ఏమీ లాభం లేదు. కనక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, వెనక్కు వెళ్ళి, సంప్రదాయం మూలాలు కనుక్కొని, ఆ మౌలికమైన అనుభూతిని ఇక్కడ కూర్చున్న వాళ్ళకు అందుబాటులోకి తీసుకురాగలగాలి. అప్పుడిక, 'దయచేసి సంప్రదాయాన్ని పరిరక్షించండి!' అని వాళ్ళకు చెప్పనక్కరలేదు. దాన్ని వాళ్ళూ ఎలాగూ సజీవంగా ఉంచుకొంటారు.
(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)