'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్..' అని ఓ పెద్దాయన చాలా కాలం క్రితమే చెప్పాడు. ఓ మనిషి కోసం దేశమంతా కంటతడి పెట్టిందంటే అతనెంత గొప్పవాడై ఉండాలి. అందుకే అతను మనుషులందరిలోకీ ప్రత్యేకమైనవాడు. అవును అతను మహనీయుడు చిరస్మరణీయుడు, మహానుభావుడు అన్నింటికీ మించి అందరివాడు. పరిచయం అక్కర్లేని పేరది. ఆ పేరే అటల్ బిహారీ వాజ్‌పేయ్. కొన్నేళ్లుగా ఆయన రాజకీయాల్లో లేరు. అసలీ ప్రపంచంలోనే లేరు. జీవించే ఉన్నా అదొక అచేతనావస్థ. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆ పరిస్థితి ఆయనకు కొంత మేలే చేసింది. ఇప్పుడున్న కుళ్లు రాజకీయాల్ని ఆ మహానుభావుడి కంట పడకుండా చేసింది. ఆయన ఇప్పుడు జీవించి లేరు. వాజ్‌పేయి మరణించారన్న వార్త దేశంలో ప్రతీ ఒక్కరితోనూ కంట తడి పెట్టించింది. నెహ్రూ నుండి నరేంద్ర మోడీ వరకూ దేశానికి ఎందరో ప్రధానమంత్రులుగా పని చేశారు. అందరిలోకీ వాజ్‌పేయి విలక్షణ వ్యక్తిత్వం కలవాడు.
ఆయన ప్రధాన మంత్రిగా పని చేసినప్పుడు, ఆయన ఆలోచనలు పాతికేళ్ల కుర్రాడిలా పరుగులు పెట్టేవి. ఆరు పదులు దాటిన వయసులో ఓ వ్యక్తి ఇంకెవరికీ సాధ్యం కానీ అద్భుతమైన ఆలోచనల వెంట అలుపూ సొలుపూ లేక పరిగెత్తడం అంటే ఆ పరుగు దేశ ప్రజల కోసమే అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అదే వాజ్‌పేయ్ అంటే. ఈ దేశం నాకేమిచ్చింది అనే నిరాశా, నిస్ప్రహలో కొట్టి మిట్టాడే యువతకు వాజ్‌పేయ్ జీవితం చెంపపెట్టులాంటిది. 70ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రతనం తాలూకు వేగం చూపించడం వాజ్‌పేయికి మాత్రమే చెల్లింది. ఆలోచన, ఆచరణ ఈ రెండూ వాజ్‌పేయ్‌ని చూసే ఎవరైనా నేర్చుకోవాలి. దేశంలో 100 కోట్ల మంది ప్రజలుంటే అందులో ఏ ఒక్కరూ ద్వేషించలేని వ్యక్తి ఒక్క వాజ్‌పేయ్ మాత్రమే.
పార్టీల పరంగా రాజకీయ వైరం ఉన్నా, ఎవరూ వాజ్‌పేయ్‌ని కనీసం రాజకీయ ప్రత్యర్ధిలా కూడా చూడలేదు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చుట్టూ ఎంతో మంది శత్రువుల్ని మనకు తెలియకుండానే తయారు చేసుకుంటున్నాం. అలాంటిది రాజకీయాల్లో ఉంటూ, శుత్రువు అనేవాడు లేకుండా అందరితోనూ కలిసి మెలిసి ఉండడమంటే, ఆయన ఎంత ప్రత్యేకమైన వ్యక్తో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. తప్పు జరుగుతుంటే, ఇది తప్పు అని నిలదీసే తత్వం తన వాడే తప్పు చేసినప్పుడు అది తప్పు అని ఒప్పుకుని తన వాడికి బుద్ది చెప్పడం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో మనం చూడలేం. వాజ్‌పేయ్ తర్వాత మన్మోహన్ సింగ్‌ని చూశాం. నరేంద్రమోడీని చూశాం. అయినా నేటి యువతకు ఆదర్శం అంటే అది ఖచ్చితంగా వాజ్‌పేయ్ మాత్రమే. ప్రత్యర్థిని పదునైన విమర్శలతో ఎండగట్టడంలో, సున్నితంగా చురుకైన పదాలతో చమత్కారంగా మెప్పించడం ఓ కళ. ఆ కళలో ఆరితేరిన వాజ్‌పేయి ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. విలువలకు కేరాఫ్ ఆడ్రస్ వాజ్‌పేయ్. రాజకీయాల్లో ఉన్నవారైనా రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నావారైనా, సాధారణ యువతైనా వాజ్‌పేయ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇదీ వాజ్‌పేయ్ జీవితం ఇచ్చే సందేశం.