( కాంచీపురం లోని శైవ క్షేత్రాలు )
లోపలి ప్రాకారంలో దుర్గ , కార్తిక , భవతి , త్రిపురాంతక , గరుడారూఢ ( విష్ణుమూర్తి ) , అసురసంహార , నరసింహ , త్రివిక్రమ , శివుడు తాండవం చేస్తున్న మరియు శివుడు బ్రహ్మ యొక్క అయిదవ శిరస్సు ఖండిస్తున్న విగ్రహాలు వుంటాయి . దక్షుని యజ్ఞం భగ్నం చేస్తున్న శివుని విగ్రహం , శివతాండవం , పత్నీసమేతుడైన బ్రహ్మ , గంగాధర , శ్రీదేవి భూదేవి సమేతుడైన విష్ణుమూర్తి , లింగోద్భవం , భిక్షాటన , రావణుడు , ఆత్మలింగానికి పూజలు చేస్తున్న వాలి ,నందిపై కూర్చొనియున్న అర్ధనారీశ్వరుల విగ్రహాలను చూడొచ్చు . విమానగోపురం దక్షణ భాగాన శివుని శాంతరూపమైన దక్షిణామూర్తిని చూడొచ్చు . శివుడు వీణ చేతపట్టివున్న విగ్రహం మరే యితరమందిరాలలోనూ లేదేమో ? .
ఇసుక రాయి విగ్రహాలు మలచడానికి అనువుగా వుంటుంది కాని యెక్కువ సంవత్సరాలు వుండవు , వర్షాలకు కరిగిపోతాయని అంటారు , కాని సుమారు 14 వందల సంవత్సరాలు గడచినా యీ విగ్రహాలు చెక్కుచెదరక వున్నాయంటే గొప్ప విశేషమే .
ఈ కోవెలలో వున్న మరో విశేషమేమిటంటే యీ మందిరంలో వున్న సన్నని దారిలో భక్తులు మోకాళ్లమీద ప్రాకుతూ వెళ్లడం చూసి వివరాలడిగితే అలా ప్రాకుతూ వెళ్లిన వారికి మరుజన్మ వుండదని చెప్పేరు . ప్రాకడం మొదలుపెట్టే గేటుని ‘ మరణద్వారం ‘ అని అంటారు , అలా పారుతూ వెళ్లిన తరువాత ఓ చిన్న గొయ్యలోకి దిగి తిరిగి చిన్న ద్వారం గుండా పైకి వస్తాం , అలా పైకి వచ్చే ద్వారాన్ని ‘ మాతృ గర్భమని ‘ , లేక ‘ జన్మ ద్వారమని ‘ అంటారు . జీవుడు మరణానంతరం తిరిగి జన్మ యెత్తేవరకు జరిపే ప్రయాణానికి ప్రతీక అని అంటారు . ఈ దారిలో మోకాళ్లమీద ప్రదక్షిణ చేసినవారికి మరుజన్మ వుండదని స్థానిక భక్తుల నమ్మకం .
కంచికామాక్షి దేవి మందిరం ——
కైలాశనాథ మందిరానికి ఆనుకొని వుంటుంది కామాక్షి దేవి మందిరం . గర్భగుడిలోని అమ్మవారినే కాక ఆ మందిరంలో వున్న మిగతా దేవతా మూర్తులను కూడా దర్శించికోవాలి.
మరో చిన్న సమాచారం యేమిటంటే కాంచీపురంలో అమ్మవారికిగాను వున్న ప్రత్యేకమందిరం యిదొక్కటేనట , విచిత్రంగా వుందికదూ , వందలసంఖ్యలో శైవ , విష్ణుమందిరాలువున్నాయి కాని అమ్మవారికి యిదొక్కటే మందిరమట . తమిళనాడులో మధురమీనాక్షి , తిరువనై కావల్ లో అఖిలాండేశ్వరి , కంచి కామాక్షి మందిరాలను ప్రముఖంగా చెప్పుకుంటారు .
కామాక్షి దేవిని లలితా మహా త్రిపురసుందరీ రూపంగా యిక్కడ పూజిస్తారు .
ఈ మందిరం కూడా పల్లవరాజులచే ద్రావిడ శిల్ప కళతో నిర్మింపబడింది .
గర్భగుడిలో అమ్మవారు పద్మాసనంలో కూర్చొని నాలుగు చేతులలో పైనున్న రెండు చేతులలో చెరుకు విల్లు , అయిదు కలువపూలగుఛ్చం దాని పై వాలివున్న చిలుక , కిందనున్న రెండుచేతులలో పాశం , అంకుశం ధరించి వుంటుంది . అమ్మవారి విగ్రహం తాంత్రిక గ్రంథాల ఆధారంగా నిర్మింపబడిందట . తాంత్రిక శిల్పం యిలాగే వుండాలని తంత్ర చూడామణిలో వుందట , కీర్తిమతి , దేవగర్భ అనే నామాలతో కూడా అమ్మవారిని పూజిస్తారు .
8 వ శతాబ్దానికి చెందిన శంకర భగత్పాదులు కామకోఠి పీఠాన్ని స్థాపించి మూల విగ్రహాన్ని యీ మందిరం లోని గర్భగృహం లో ప్రతిష్ఠించేరు . దీనిని గాయత్రి మంటపం అని అంటారు . విగ్రహానికి నాలుగువైపులా వున్న నాలుగు గోడలు నాలుగు వేదాలకి ప్రతీకలు , గుడిలో వున్న 24 స్థంభాలు గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలని , శ్రీ విద్యాపరమేశ్వరి గాయత్రిదేవిలో లీనమై ప్రకట గాయత్రిగానూ రహస్యగాయత్రి కామాక్షిదేవి రూపంలో పూజలందుకుంటోంది .
పరాంబ ఆగ్నేయ ముఖంగా యోన్యాసనంలో కూర్చొని వుంటుంది .
భంఢాసురుని నేతృత్వంలో దానవులు పరమ బలపరాక్రమములతో దేవతలపై దండెత్తిరాగా దేవతలు దానవుల ధాటికి తాళలేక , దానవులతో తలపడేందుకు బ్రహ్మ , విష్ణు మహేశ్వరుల శక్తులు చాలక పరాశక్తి కొరకు యాగం తలపెడతారు , యాగం కొరకు కాంచీపుర ప్రాంతం అనువైనదిగా తలచి అక్కడ యాగం చేస్తూ వుంటారు . యాగం నుంచి ఉత్పన్నమైన శక్తులు పక్షులరూపాలలో రాబోయే ఆదిపరాశక్తిని సేవించుకొనేందుకు అక్కడి చెట్లపై నిరీక్షిస్తూ వుంటాయి . దేవతల యాగంతో ప్రశన్నురాలైన ఆది పరాశక్తి తన వాసమైన ‘ మేరు పర్వతం ‘ నుంచి రహస్యమార్గం ద్వారా ‘ బిలం ‘ గుండావచ్చి దేవతల , పక్షుల సేవలందుకొని రాక్షస సంహారం గావించింది .
పరాశక్తి విగ్రహం స్థూల ( ద్యాన యోగ్య , సవయవ ) , సూక్ష్మ ( మంత్ర మరియు యంత్రాత్మిక ) కరణ లేక వాసనాత్మక అనే ఆమె మూడు గుణాలకు ప్రతీక గా చెప్పబడింది . పరాశక్తి ప్రకటితమైన బిలం ప్రస్తుతం గర్భగుడిలో వున్న తపోమగ్న కామాక్షి సన్నిధి లో వుంది .
పరమేశ్వరుడు పరాశక్తిని నాలుగు యుగాలలోనూ సేవించుకున్నాడట , నాలుగు యుగాలలోనూ శివుడు దూర్వాసమహాముని , పరశురాముడు , ధౌమ్యుడు , ఆదిశంకర భగవత్పాదులు గా అవతరించి పరాశక్తిని సేవవించుకున్నట్లు గా చెప్తారు . పరాశక్తి బిలం నుండి ప్రకటితమైనప్పుడు మొదటిపూజ చేసేందుకు పరమేశ్వరుడు దూర్వాసమహాముని లో ఐక్యమై యిక్కడ వేచియుండి పరాంబ ప్రకటితమవగానే మొదటి పూజ శ్రీచక్ర రూపంలో అమ్మవారికి తంత్ర పూజ చేసుకున్నాడట . శ్రీవిద్య ద్వారా పరాంబికను కాంచీపురంలో ప్రతిష్ఠించటం వల్ల పరమేశ్వరుని సాంప్రదాయగురువుగాను , పరాంబికను గురుమూర్తి స్వరూపిణిగాను పూజిస్తారు . శ్రీచక్రంలో వశిన్యాది వాగ్దేవతలను వారి వారి స్థానాలలో ప్రతిష్ఠంచేరు . శ్రీపురంలో కూడా యీ శ్రీ చక్రాన్ని ప్రమాణంగా తీసుకొని శ్రీచక్రాన్ని నిర్మించినట్లుగా చెప్తారు .
రెండవ ప్రాకారంలో దూర్వాసమహాముని ( క్రోధ భట్టారకుడు ) , పరశురాముడు మొదలైన విగ్రహాలను చూడొచ్చు . మూడవ ప్రాకారంలో హయగ్రీవ , అగస్త్య మహామునుల మందిరాలను చూడొచ్చు . ఇక్కడే ‘ లలితా త్రిశతి ‘ లోకానికి చెప్పబడింది .
సతీ దేవి యొక్క నాభి క్రిందభాగం పడ్డ ప్రదేశం కాబట్టి కామాక్షీదేవి 51 అమ్మవారిపీఠాలలో ఒకటి అని చెప్తారు , చాలామంది స్థానికులు అష్టాదశపీఠాలలో ఒకటి అని అంటారు , అమ్మవారి అంగం పడ్డ ప్రదేశమని అంటారు , కాని శంకరాచార్య విరచిత శ్లోకం ప్రకారం అస్సాం లో వున్న కామాక్య లో వుంది అష్టాదశపీఠం .
గర్భగుడికి బయట వున్న మండపాలలో అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకోవచ్చు .
శంకరభగవత్పాదులు కామకోఠి పీఠస్థాపన చేసేటప్పుడు శ్రీచక్రాన్ని పునఃప్రతిష్ఠ చేసి యిప్పుడు గర్భగుడిలో మనం చూస్తున్న కామాక్షి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠంచేరు . అలాగే కాశీలో కూడా విశాలాక్షి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించేరు . ఇప్పుడన్న కామాక్షి విగ్రహానికి పక్కగా ఆది కామాక్షి విగ్రహం వుంటుంది .ఈ మందిరంలో వున్న ముఖ్య ఉప మందిరాలను గురించి తెలుసుకుందాం . సాధారణంగా మందిరానికి వెళ్లినప్పుడు మూల విగ్రహాన్ని దర్శించుకొని గబగబా ఓ ప్రదక్షిణ చేసుకొన తీర్థం పుచ్చుకొని ఓ మారు కోవెలలో కూర్చోవాలి కాబట్టి యిలా కూర్చున్నామనిపించి వచ్చెస్తాం , అలాకాక కాస్తనెమ్మదిగా మందిరంలో వున్న వుపమందిరాలను , మందిరంలో వున్న శిల్పసంపదను చూసుకొని మందిరాన్ని గురించిన స్థలపురాణం , విశిష్టతలను తెలుసుకుంటే మంచిది , అన్ని మందిరాలను గురించి కాకపోయినా ముఖ్య మందిరాలను గురించైనా తెలుసుకుంటే మంచిది . కొన్ని మందిరాలలో విగ్రహాల కన్నా ఆప్రదేశం ప్రాముఖ్యత యెక్కువగా వుంటుంది . ఆ వివరాలు తెలుసుకొని ఆప్రదేశానికి వెళితే మనసుకి హాయిగా వుంటుంది .
చాలా మంది అమర్నాథ్ వెళ్లొచ్చి యేం చూడలేదని , అక్కడ పెట్టిన శివుడిపటం చూసొచ్చేమని చెప్పడం జరిగింది . అదివిని నేను చాలా బాధపడ్డాను . కనీసం టూరు ఆపరేటర్లు కాస్త మందిర వివరాలను , మందిరంలో ముఖ్యంగా చూడవలసిన విశేషాలను యాత్రీకులకు వివరిస్తే బాగుంటుంది .
ఆది కామాక్షి ——-
ఆది కామాక్షి మందిరం కామాక్షి మందిరానికి దగ్గరగా వుంటుంది . ఈ మందిరం దూర్వాసమహాముని చే నిర్మింపబడింది . 8 శతాబ్దంలో ఆదిగురువు శంకరాచార్యులవారు యిప్పుడు గర్భగృహంలో వున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించేరు .
తపః కామాక్షి ——-
‘ మాంగాడు ‘ లోని తపః కామాక్షిని గురించి చదివేం , ఆ మామిడి తోటలో తపస్సు చేసుకున్న పార్వతి శాపవిమోచనపొంది కాంచీపురంలో వేగావతీనదీతీరంలో మామిడిచెట్టు క్రింద మన్నుతో శివలింగం చేసుకొని తపస్సు చేసుకుంటూ శివుని రాకకై యెదురుచూసిందట . ఈ దేవిని ‘ బిల ద్వారానికి ‘ దగ్గరగా మూలవిగ్రహానికి కుడివైపున చూడొచ్చు .
అంజన కామాక్షి ——-
అంజన కామాక్షిని అరూప లక్ష్మి అని కూడా అంటారు . అంజన కామాక్షి మందిరం మూలవిరాట్టుకి యెడమ వైపున ఉత్తరముఖంగా సౌభాగ్య గణపతి మందిరం దగ్గర వుంటుంది . శాపవసాన రూపాన్ని పోగొట్టుకున్న లక్ష్మి రూపం తిరిగి పొందటానికి రాముడు త్రేతాయుగంలో పరాంబికను పూజించిన ప్రదేశం యిదేనట , పరాశక్తికి కుంకుమ పూజచేసినవారు ముందుగా ‘ అంజన కామాక్షికి సమర్పించి తరువాత యింటికి తీసుకు వెళతారు . అంజన కామాక్షి రామబీజలో రామునికి ప్రతీక అని , కమకలాక్షరలో కామాక్షికి ప్రతీక అని అంటారు .
శ్రావణ కామాక్షి ———-
శ్రావణ కామాక్షి మందిరం రెండవ ప్రాకారంలో వుంటుంది . ఆమెని బంగారు కామాక్షి అనికూడా అంటారు , యెందుకంటే యీ విగ్రహం బంగారంతో చేసినది . పరాంబిక తన మూడవకంటినుంచి యీ దేవిని సృష్టించిందట , అయితే యిప్పుడున్న యీ బంగారు విగ్రహం అసలుసిసలైన కాదుట , అసలు విగ్రహం శ్యామశాస్త్రిగారి పూర్వీకులు ముస్లిమ్ పాలకుల నుంచి రక్షించి తంజావూరుకు తరలించేరట , తంజావూరులోని మ్యూజియం లో యీ విగ్రహం సంరక్షించ బడుతోంది . ఈమె యేకాంబరేశ్వరుని పత్ని , అందుకే యీమెని యేకాంబరేశ్వరి అని కూడా వ్యవహరిస్తూ వుంటారు .
ఉత్సవ కామాక్షి ——
ఉత్సవాలలో , ఊరేగింపులలో యీ విగ్రహాన్ని వుంచుతారు , యీ విగ్రహానికి యిరువైపులా శారద , రమ విగ్రహాలు వుంటాయి . కామాక్షి మందిరంలో శివలింగం కాని శివునికి వేరేగా మందిరం కాని వుండదు . ఎందుకంటే చితగ్ని నుండి లలితాంబికగా శివశక్త్యాత్మిక గా వుద్భవించింది కాబట్టి . ఊరేగింపులలోను వుత్సవాలలోనూ ఒక్క కామాక్షీదేవి విగ్రహాన్ని మాత్రమే వుంచుతారు . కామాక్షిని లలితాంబికగా పూజిస్తున్నారు .
క్రోధ భట్టారక మందిరం ———
దూర్వాసమహామునిని క్రోధ భట్టారకుడు అని అంటారు . దేవీ ఉపాసకులలో ప్రముఖంగా 32 ని చెప్పుకుంటారు . వారిలో దూర్వాసుడు , లోపాముద్ర , మన్మథుడు ముఖ్యులు . అమ్మవారు భక్తుల చెడు చర్యలను నియంత్రించే క్రియాశక్తిని దూర్వాసుడు పరాంబిక యొక్క సాత్విక క్రోధ రూపాన్ని ప్రకటించేవాడట . దూర్వాసుడు కామాక్షి పీఠాన్ని స్థాపించి ‘ భూప్రస్తార శ్రీచక్రాన్ని అమ్మవారికి యెదురుగా స్థాపితం చేసేడట . దూర్వాసుడు పరాంబికను సేవించుకుంటూ లలితా స్థవరత్న ,( ఆర్య ద్విశతి ) , త్రిపుర మహిమా స్తోత్రం , పరాశంభు మహిమ లను రచించేడు .
తిరు కల్వనూర్ మందిరం ———-
పుష్కరిణికి దగ్గరగా వుంటుందీ మందిరం . ఇది విష్ణుమందిరం . శాపవిమోచన పొందిన పార్వతి శివునితో పరిణయం కొరకు వేచియుండగా లక్ష్మీదేవి పార్వతిని పెండ్లికూతురుగా అలంకరించడానికి వస్తుంది . ఇద్దరూ మాట్లాడుకుంటూవుండగా విష్ణుమూర్తి కుతూహలంతో చాటుగా వారి మాటలు వినడానికి దాగుకొని వుండడం కనిపెట్టిన పార్వతి విష్ణుమూర్తిని ‘ దొంగ ‘ అని సంభోదిస్తుంది . వైష్ణవుల 108 దివ్యదేశాలలో యిది వొకటి . ఈ మందిరంలో శైవులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .
కామాక్షి మందిరవివరాలు తెలుసుకున్నాం కదా ? పై వారం కంచిలోని మరికొన్ని మందిరాల గురించి చదువుదాం , అంత వరకు శలవు .