పురాతన గ్రంధాల్లో చదివాము— వైద్య శాస్త్రంలో మన దేశంలో ఎందరో ఘనాపాఠీలుండేవారని… మన పెద్దలు తమ అనుభవంచేతనైనేమిటి, ఆ గ్రంధాలు చదవడం వలన అయితేనేమిటి, తరతరాలుగా వనమూలికలనే ఉపయోగించి వైద్యం చేసేవారు. వీటిని ఎలా వాడాలో, ఏ మొతాదులో వాడాలో కూడా పుస్తకాల్లో వివరంగా ఉండేది… కాలక్రమేణా వంశపారంపర్యంగా సామాన్యులకి కూడా అందుబాటులోకి వచ్చాయి. పైగా ఈ వనమూలికలు చాలా ప్రదేశాల్లో దొరికేవి. ఏ మూలిక దేనికి ఉపయోగిస్తుందో తెలిస్తే చాలు… ఇంట్లోనే ప్రధమ చికిత్సలాటిది కానిచ్చెసి, అవసరాన్నిబట్టి ఏ వైద్యుడివద్దకో తీసికెళ్ళేవారు..
అందుకనేనేమో మన చిన్నప్పుడు, ఏదెబ్బైనా తగిలి రక్తం కారుతూంటే, వెంటనే ఏ పసుపో అద్దేస్తే రక్తం కాస్తా కారడం ఆగిపోయేది. అలాగే ఏ కావిర్లు లాటివో వస్తే, అదేదో చెట్టు ఆకులు తెచ్చి, పసరు ఓ నాలుగైదురోజులు తాగిస్తే, మామూలు గా అయిపోయేవారు. ఇంక పాము కాటులూ, తేలుకాట్లకీ అయితే , ఏవో మంత్రాలు వేస్తే, ఆ విషం కట్టుబడిపోయేది. “ మంత్రాలకి చింతకాయలు రాల్తాయా” అని ఇప్పటివారు హేళన చేయొచ్చు, కానీ రాలేవన్నది మాత్రం నిజం… అలాగే పెరిగిపెద్దయాము కదా.. ఏ పిప్పిపన్ను నొప్పో వస్తే ఓ లవంగం అక్కడ పెట్టుకుంటే, ఆ నొప్పి తగ్గేదిగా. అవన్నీ ఈనాటివారు విన్నప్పుడు నవ్వులాటగా కనిపించవచ్చు, కానీ ఈ లవంగాలతోనూ, ఈ పసుపుతోనూ తయారుచేసి, ఏదో బహుళజాతి కంపెనీవాళ్ళో , పెద్దపెద్ద వ్యాపార ప్రకటనలతో హోరెత్తించేసి, తయారీ ఖర్చుకి నాలుగైదింతలు చేసి అమ్మినా, ఎగబడి కొనుక్కుంటారే కానీ, “ అరే ఇది మన పసుపే, మన లవంగమే కదా.. “ అని ఒక్కడూ ఆలోచించడు. ఒకానొకప్పుడు పళ్ళు తోముకోడానికి, బొగ్గో, వేపపుల్లో వాడేవారు.. అవన్నీ exploit చేస్తూ, “ మీ Tooth paste లో Coal ఉందా, Neem ఉందా “ అని ప్రకటనరావడం తరవాయి, “ అబ్బ ఎంత మంచి పేస్టో.. “ అంటూ ఇంట్లో వాళ్ళందరూ ఆ పేస్టే వాడ్డం… వీటికి సాయం , యోగా లో ప్రసిధ్ధిచెందిన ఆ పతంజలి గారేమో , బహుళజాతి కంపెనీలు తయారుచేసే ప్రతీ వస్తువునీ, మన దేశీయ పేరుపెట్టగానే , వాటి వెనక్కాల పడ్డం ఓ వేలం వెర్రైపోయింది…
ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆరొగ్యవిషయంలో, విదేశీ శాస్త్ర్జజ్ఞులు చెప్పిందే మన వాళ్ళకి వేదం… పోనీ మనవాళ్ళేదైనా చెప్తే వింటారా, అబ్బే . అదేదో విదేశీకంపెనీ ఓ మందుతయారుచేసిందంటే, వాళ్ళ దేశం లో అమ్ముడుబడ్డా లేకపోయినా, మనవాళ్ళు మాత్రం తప్పకుండా కొంటారు… ఎంతైనా ఫారిన్ కంపెనీదికదాండీ.. అంటూ.. అవే మూలాలతో దేశంలో ఎవరో తయారుచేస్తే దానిమొహం చూసేవాడుండడు… ఆ విదేశీ శాస్త్రజ్ఞులు తక్కువ తిన్నారా ఏమిటీ? యుగయుగాలనుండీ మన దేశంలో విరివిగా వాడుకలో ఉండే కొన్నిటిని, ఏదో research పేరుతో “ హాఠ్ దాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యానికి హానికరం “ అంటాడు. అప్పుడెప్పుడో, మన పసుపు మీద అవాకులూ చవాకులూ మాట్టాడారు.. చివరకి వాళ్ళ విదేశీ కంపెనీలే తెలివితెచ్చుకుని, అదే పసుపు కి బ్రహ్మరధం పడుతున్నారు. ఈమధ్యన ఇంకోడెవడో “ కొబ్బరి నూనె విషంతో సమానం.. “ అన్నాడు. అంటే మనవాళ్ళు యుగయుగాలనుండీ కొన్ని చోట్లైతే వంటకి కూడా, వాడుతున్నది విషమా? మనవాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యా రాలేదే? ఆయనెవరో ఈమధ్యన రొజూ ఓ మూడు నాలుగు చెంచాల కొబ్బరి నూనె తాగితే, ఎలాటి ఆరోగ్యసమస్యలూ ఉండవన్నారు. ఎవరిని నమ్మేదీ?
అసలు గొడవంతా ఎక్కడంటే, మనవాళ్ళు దేశంలో వైద్యవిద్య అభ్యసించి, పై చదువులకి విదేశాలు వెడతారే అక్కడొచ్చింది… పోనీ ఆ పైవిద్యేదో మన దేశంలోనే చదవొచ్చా అంటే, ఇక్కడేమో ప్రవేశానికే వందలకొద్దీ ఆటంకాలు, ఏవేవో అడ్డంకులు.., కాదూ కూడదంటే, ఏ Private College లోనో కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఈ గొడవంతా పడలేక, ఆ ఖర్చేదో పెట్టుకుంటే, హాయిగా విదేశీ degree దొరుకుతుందికదా అని, అక్కడకే లైను కట్టేస్తున్నారు. పైగా ఆ డాక్టరు పేరు చివర ఓ విదేశీ degree తగిలిస్తే, కాసుల వర్షమే కదా…
“ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు “ అన్న లోకోక్తిలోంచి బయటపడితే తప్ప, మనకి బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు…
సర్వేజనాసుఖినోభవంతూ…