ఆయ్.. మరి మీరు రావాలండీ....
(గోదారోళ్ళ కితకితలు – ఫేస్ బుక్ గ్రూపు వారి – ముచ్చటగా మూడవ ఆత్మీయ సమ్మేళనం..)
గోదారోళ్ళ గ్రూపు కత:
సోషల్ మీడియా లో ఒక గ్రూపు లక్షమంది సభ్యుల తో అలరించడం ఒక సంచలనం..
అలాంటి సంచలనం సాధించిన ఒక వినూత్నమైన గ్రూపు - గోదారోళ్ళ కితకితలు
ఇది కేవలం కాలక్షేపం కోసం పెట్టిన గ్రూపు కాదు...గోదారోళ్ల యాస ను బతికించడం కోసం...గోదారోళ్ల మమకారాలు తెలియజేయడం కోసం...అందుకే ఈ అంశాలు ఉట్టి పడేలానే ఈ గ్రూపు లోని పోస్ట్ లు ఉంటాయి..
కేవలం హాస్యస్పూరకం గా ఉండే..సరదా పోస్ట్ లు మాత్రమే ఈ గ్రూపు లో అప్రూవ్ చేస్తారు..లింక్,లు వీడియో లు అసలు ఉండవు..
గ్రూపు సభ్యులు అందరూ. అక్కా,చెల్లి,బావ గారూ అనే పిలుచుకోవాలి..
ఇవివి సత్యనారాయణ – గ్రూపు ప్రారంభకులు, అడ్మిన్:
గ్రూపు అడ్మిన్ ఈ వీ వీ సత్యనారాయణ కు గోదారి అన్నా...గోదారోళ్ల ప్రేమలు అన్నా..ప్రాణం..
గోదారోళ్ళ చమత్కారం, మధ్య తరగతి మందహాసం...సరదాలు, సరసాలు, ప్రేమలు, ఆప్యాయతలు. తొణికిస లాడుతూ ఉంటాయి ఆయన పోస్ట్ ల లో..
ఈ గ్రూపు పోస్టులలో కొంచెం చమత్కారం.. అన్నిటికీ మించి ఎటకారం పాలు కూడా ఎక్కువే..
ఈ వీ వీ గారు పెట్టె పోస్ట్ లు ఒకరికి అమ్మమ్మ ను,మరొకరికి మేనత్త ను గుర్తు చేస్తే.. అందరికీ ఆత్మీయతను కళ్ళలో నింపుతాయి..ప్రతీ ఒక్కరూ తమ జీవితం లోకి తొంగి చూసుకుంటారు..నిత్యం యాంత్రికం గా పరుగెడుతున్న వారికి ఈ గ్రూపు లో పోస్ట్ ..అపి.. ఒరే పెహేదూ(ప్రసాదూ)..ఏడికి రా..బోయనం అయిందా!నిన్న పులసట్టుకొచ్చాను ..సాయంత్రం ఓ పాలింటికి రా..రెండు ముక్కలు తిని ఎల్దువు గాని! అంటూ కల్మషం లేని ప్రేమలు గోదారోళ్లకు సొంతం అన్నట్టుంటాయి.
గ్రూపును మోసిన పాట – పాటను మోసిన గ్రూపు:
మూడేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ గ్రూపు --- ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదుగుతూ నేడు లక్ష దాటిన సభ్యులతో లక్షణంగా కళకళలాడుతోంది...
ఈ గ్రూపు సభ్యులు, గేయ రచయిత అయిన శ్రీ నూజిళ్ళ శ్రీనివాస్ గారు రచించిన “ఆయ్... మేం గోదారోళ్ళమండీ.. “ అన్న పాట ప్రభంజనంలా ప్రపంచమంతా చుట్టేసింది... మనుషులు మిన్నండీ..మా మనసులు ఎన్నండీ.. అంటూ. .గోదారోళ్ల మనస్తత్వానికి అద్దం పట్టిన పాట ఇది. దీనితో నూజిళ్ళ శ్రీనివాస్ గారి పేరు గోదారోళ్ల శ్రీనివాస్ గా మారిపోయింది. గోదారోళ్ళ సంస్కృతి, సంప్రదాయాలను జానపద శైలి లో కళ్ళెదుట ఉంచే ఆ పాట మ్యూజిక్ లేకుండానే మ్యాజిక్ చేసింది...
ప్రముఖ గాయని శ్రీమతి అడపా సురేఖ గారి గొంతులో లక్షలాదిమంది శ్రోతలను ఆకట్టుకున్న ఈ పాట – తరువాత నూజిళ్ళ శ్రీనివాస్ గారి స్వీయ గళంలో కూడా వినపడి, అనేక వేదికలపై పాడబడి, ఇంకా నేటికీ గోదావరి అభిమానుల గుండె చప్పుడుగా సెల్ ఫోన్ రింగు గా వినబడుతూనే ఉంది... మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ పాట ఒక సంచలనం గా మారిపోయింది. ఈ పాట రచయిత శ్రీ నూజిళ్ళ శ్రీనివాస్ “గోతెలుగు.కాం” లో అనేక కథలు ప్రచురించిన కథా రచయిత కూడా..!
ఇంతలా సంచలనం సృష్టించిన ఈ పాట ఇప్పుడు గోదావరి ప్రాంతంలోని నిర్మాతలు, దర్శకులు నిర్మిస్తోన్న “ఆనందం అంబరమైతే” చిత్రం లోకి తీసుకోబడి, మరింత చేరువ కాబోతోంది.
ఇది గ్రూపు కాదు కుటుంబం...
ఈ గ్రూపు సభ్యులు ఒక కుటుంబం..ఎవరికైనా బాగోక పోతే..ఆ ప్రాంతం వ్యక్తి..మన బావకు ఒంట్లో బా లేదు..హాస్పిటల్ లో చేర్చామూ..అని పిక్ పోస్ట్ చేయ గానే..ఆ దగ్గరలో ఉన్న గ్రూపు సభ్యులు హాస్పిటల్ కు వెళ్లి పలకరించడం...ఆర్ధిక సాయం చేయడం కూడా జరుగుతోంది..బావా..ఎలా ఉన్నారు?తగ్గిపోతుంది.. అన్న మాటలు ఆపదలో ఉన్న వారికి ఒకింత స్వాంతన నిస్తాయి కదూ! ఇక్కడే ఈవీవీ గారు సభ్యుల్ని అనుబంధాలతో కట్టేశారు..
ఈ గ్రూపు లో డబ్బుకు స్థానం లేదు..రాజకీయాలకు అసలు ఆస్కారం లేదు..కేవలం నవ్వులు మాత్రమే పువ్వుల్లా విరబూస్తాయి. ..గోదారి యాసకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు..
ఈ మధ్య జలీల్ అనే గ్రూపు సభ్యులు ఒకరికి బాగోక వైజాగ్ లో హాస్పిటల్ లో ఉన్నారని తెలియ గానే..అడ్మిన్ ఈవీవీ మరికొందరు వెళ్లి పలకరించి వచ్చారు..
గ్రూపు లో ఎందరో ప్రముఖులు..పెద్ద పెద్ద వ్యాపారస్తులు,ఉపాధ్యాయులు..ఎందరో ఉన్నారు..
డాక్టర్ కర్రి రామా రెడ్డి గారు,విజిలెన్స్ ఎస్.పి.,సి ఐ లు,ఎస్ ఐ లు..డాక్టర్ లు..ఎందరో ఉన్నారు..
అందరినీ కలిపే ఒకే ఒక్క దారం గోదారి యాస.. అదే జీవం.. అదే శ్వాస గా గ్రూపు ని నిర్వర్తిస్తూ..
లక్ష మంది సభ్యులను ఒకే తాటి పై నడిపిస్తున్న ఈ వీ వీ సత్యనారాయణ మరియు ఇతర అద్మిన్స్, సభ్యులు అభినందనీయులు.
అంతే కాదండోయ్..! ఈ గ్రూపు మీద ఏకంగా Facebook App కూడా వచ్చేసింది ( https://apps.drollapps.com/activities/why-do-you-like-godarolla-kitakitalu/76 )
గ్రూపు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం:
ఇంతకీ చెప్పనే లేదు... ఈ గ్రూపు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఈ సెప్టెంబర్ 30 న రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు లోని రాజు గారి తోట లో (హార్లిక్స్ ఫేక్టరీ కి ఎదురుగా) ఏర్పాటు చేయడం జరిగింది... ఆ సందర్భంగా గోదారోళ్ళని, గోదారోళ్ళని, గోదారి యాసను ప్రేమించే ఇతర ప్రాంతాల తెలుగు వారైన గ్రూపు సభ్యులను ఆహ్వానిస్తూ , ఏర్పాట్లను చేస్తూ “గోదారోళ్ళ కితకితలు” బృందం తలమునకలవుతోంది... ఈ ఆత్మీయ సమ్మేళనం గోదావరి యాసకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, ప్రేమలకు, ఆప్యాయతలకు పట్టం కట్టాలని ఆశిద్దాం...
పరస జగన్నాధరావు, ఉపాధ్యాయులు, రాజమహేంద్రవరం