ఛాలెంజ్ అంటే యూత్.. యూత్ అంటేనే ఛాలెంజ్.! చాలామంది చెప్పే మాట ఇది. ఫలానా ఉద్యోగం సాధిస్తానని ఛాలెంజ్ చేయడం.. ఆ స్థాయికి ఎదుగుతానని ఛాలెంజ్ చేయడం వరకూ ఓకే. కానీ, ప్రాణాలు తీసుకోవడంలో 'చాలెంజ్' ఏంటి, ఛండాలం కాకపోతే! సోషల్ మీడియా కారణంగా ఈ 'పిచ్చి ఛాలెంజ్‌లు' పీక్స్‌కి వెళ్ళిపోతున్నాయి. 'అరేయ్, నీకు చేతనైతే కిందికి దూకు..' అంటూ ఛాలెంజ్ విసిరే సన్నిహితులెక్కువైపోయార్. వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ వైపుకు అంతే వేగంగా దూసుకెళ్ళగలవా? అని ఓ గర్ల్‌ఫ్రెండ్ ఛాలెంజ్ విసిరిందంటే చాలు, ప్రాణాల్ని పణంగా పెట్టి ఆ పని పూర్తి చేసేస్తారు కొందరు. ఆ తర్వాత మాట్లాడుకోవడానికేముంది? జీవితం ఖతం అయిపోతుంది అక్కడితో. ఛాలెంజ్ అంటే ఇప్పుడు యూత్‌కి ఓ 'భయంకరమైన ఆట'గా మారిపోవడం దురదృష్టకరం.
మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా తమను తాము మార్చుకోవడం తప్పేమీ కాదు. కానీ ఆ మార్పు మన ప్రాణాల్ని తీసేలా వుండకూడదు.
ప్రాణమే పోయాక, ఛాలెంజ్‌కి విలువేముంటుంది? అన్న చిన్న ఆలోచన నేటి యువతరానికి లేకపోతోందంటే, యువత ఇప్పుడున్న అయోమయ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఈ విషయంలో ఒక్కటే. ఒకర్ని మించి ఇంకొకరు పోటీ పడ్తున్నారు. ఆకాశంలో సగం, అన్నింటా సగం - చివరికి ప్రాణాలు తీసుకోవడంలోనూ అంతే. ఓ అంచనా ప్రకారం అమ్మాయిలు ఈ మధ్య అబ్బాయిల్ని మించి దిక్కుమాలిన ఛాలెంజ్‌లతో ప్రాణాలు కోల్పోతున్నారట. ఏం జరుగుతోంది సమాజంలో! సోషల్ మీడియా పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా ఛాలెంజెస్ పుట్టుకొస్తున్నాయి. కికి ఛాలెంజ్ అంటాడు ఒకడు, బ్లూ వేల్ చాలెంజ్ అంటాడు మరొకడు. రోజుకొకటి కాదు, పూటకొకటి.. గంటకొకటి అన్నట్లుగా ఈ ఛాలెంజెస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేస్తున్నాయి. వీటిల్లో చాలావరకు ప్రాణాలతో చెలగాటమాడేవే.
ఛాలెంజ్‌ని ఎదుర్కోలేకపోతే అది చేతకానితనమేనన్న సహచరుల 'చవకబారు' వెటకారాలతోనే ఎక్కువమంది తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. పది మంది ఒక్క చోట గుమికూడి, ఛాలెంజెస్ విసురుకోవడం పాత పద్ధతి. ఇప్పుడలా కాదు, జస్ట్ సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్‌ని షేర్ చేస్తే చాలు. జరగాల్సిన ఘోరం జరిగిపోతోంది. ఊపిరి బిగబట్టుకోవడం, శరీరంపై కోతలు కోసుకోవడం, మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతూ రోడ్డు మీద అడ్డదిడ్డంగా వాహనం నడపడం.. ఇవన్నీ నయా ఛాలెంజెస్. ఇవన్నీ ప్రాణాలు తోడేసే ఛాలెంజ్‌లేనని అర్థమవుతోంది కదా! విద్య అన్నది వివేకాన్ని పెంచాలి. దురదృష్టవశాత్తూ వివేకం లేకుండా చేసే ఈ ఛాలెంజ్‌లను విద్యావంతులే ప్రోత్సహిస్తున్నారు.. వాటికి బలయిపోతున్నారు కూడా.
భారతదేశమంటే యువతకు కేరాఫ్ అడ్రస్. యువ సత్తా చాటాల్సిన భారతీయులే దురదృష్టవశాత్తూ ఈ ఛాలెంజెస్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నది మరో సర్వే ఫలితం. కుట్రపూరితంగా ప్రపంచ దేశాలు భారతదేశంపై ఈ తరహా ఛాలెంజెస్ ద్వారా దాడి చేస్తున్నాయని అనుకోవాలా? ఎందుకు అనుకోకూడదు! కావాల్సింది వివేకమే. ఆ వివేకంతో ఆలోచిస్తే, ఏ ఛాలెంజ్ ఎలాంటిదో అర్థమయిపోతుంది. అసలు ఆ ఛాలెంజ్‌ని స్వీకరించాలా? వద్ధా? అన్నదానిమీదా క్లారిటీ వస్తుంది. బీ కేర్‌ఫుల్ యూత్.