ఆర్ టీ సీ ప్రయాణ ప్రాంగాణాల్లో స్వచ్ఛ్ భారత్!
పొద్దుట లేచింది మొదలు ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుని నిత్య కార్యక్రమాల్లోకి దిగుతాం. పనిచేసే పరిసరాలు, పరికరాలూ పరిశుభ్రంగా ఉంచుకుంటాం. కాని అదేమిటో మనం మనది కాని ఏదైనా ప్రదేశానికి వెళ్లినా లేదా అందరికీ సంబంధించిన కామన్ ప్లేసేస్ విజిట్ చేసినా మనం అవలంభించే నీట్ నెస్ మాయం అయిపోతుంది. వీటికి రోడ్లు, గుళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్క్ లు ఇత్యాదివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అక్కడ గచ్చు కంఫు కొడుతుంటుంది. అయినా మనం అక్కడకి వెళ్లి ’మన పని’ కానిచ్చుకు వచ్చేస్తాం.
నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, దాదాపు నగర శివార్లలోని అన్ని బస్టాండ్ల లోపలా ఉమ్ములు, చెత్తా..బస్టాండ్ బోర్డర్ లోపల చుట్టూతా పేరుకుపోయిన మురికి, ఉచ్చలు ఉంటాయి. దోమలు ఈగలైతే సరేసరి. కొండొకచో పందులూ స్వైర విహారం చేస్తుంటాయి. రాత్రీ పగలనేది లేదు, బస్ దిగంగానే మగాళ్లు అక్కడకెళ్లి మూత్ర విసర్జనం చేస్తుంటారు. ఎంతటి అపరిశుభ్రత? రోగాలురాక ఏం చేస్తాయి. వర్షాకాలమైతే ఇహ చెప్పనక్కర్లేదు. బస్ బేల దగ్గర బురద, మురికి, వాసన. లోపలికి అడుగుపెట్టలేం. పెట్టాలంటే సర్కస్ లో చేసిన అనుభవం ఉండి తీరాలి. అంతేకాదు కాళ్లకు అంటిన బురదతో బస్ లు ఎక్కితే, లోపలా బురద అవదూ! ప్రభుత్వం, ఆర్ టీ సీ యాజమాన్యం చోద్యం చూస్తున్నాయేమో మరి. మనమంటే ప్రయాణ అవసరం పడినప్పుడే స్టాండ్ కు వెళతాం. కాని ఆర్ టీ సీ స్టాఫ్, అమ్ముకునే వాళ్లు ఆ పరిసరాల్లోనే తిరుగుతుంటారే! ఎంత అలవాటయిన ప్రదేశాలయినా ఆరోగ్యానికి అనర్థ హేతువే కదా!
నేనిదంతా ఎందుకు రాస్తున్నానంటే, మొన్న నేను ఆఫీసు పని నిమిత్తం ఖమ్మం వెళుతూ, సూర్యాపేటలో బస్ హాల్ట్ అయితే మూత్ర విసర్జన కోసం కిందకు దిగాను. హాశ్చర్యం- బస్టాండ్ చుట్టూతా దడి కట్టి, బస్టాండ్ ప్రాంగణం నీట్ గా ఉంది. యూరినల్స్ శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నట్టు పరిశుభ్రంగా ఉన్నాయి. అలాగే సత్తుపల్లి బస్టాండ్ లో సులభ్ ఎదురుగా దడికట్టి, అందులో ఉన్న గులాబీ మొక్కలు పూలతో ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో. నిజంగా వాటికి కారకులెవరో ఆ మహానుభావులకి హాట్సాఫ్! నాకు తెలిసి ఆర్ టీ సీ బస్టాండ్ మేనేజర్ అయుంటారు. ఇలా ఎవరికి వారు తమ తమ బస్టాండ్ లను పరిశుభ్రంగా ఉంచుకుంటే, ప్రయాణికుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తూ, ఉమ్ములూ చెత్త వేయకుండా (పెనాల్టీలు సరయిన విధానం ఎంతమాత్రం కాదు) చూసుకుంటే జనం వేరే ప్రయివేటు వాహనాల వంక చూడరు.
స్టాండ్ లు, విచారణ, టిక్కెట్లు ఇచ్చే కౌంటర్లు, భద్రతకు ప్రధాన్యమిచ్చే చక్కటి అనుభవం కలిగిన స్టాఫ్, సరయిన బస్సులు వాటి నిర్వహణ సామర్థ్యం ఉండి అలసత్వం, అలక్ష్యం వల్ల కొంత సొమ్ము ప్రయివేటు పరం అవుతోందంటే శోచనీయమే కదా! ప్రయివేట్ వాహన నిర్వాహకులకు వాహనాలు తప్ప ఇంకేమున్నాయి. మనకు ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అయినా లాభాలు కళ్ల జూస్తున్నారు కదా!
నాకు తెలిసి దక్షిణ మధ్య రైల్వే నీట్ నెస్ కు చక్కటి ప్రాధాన్యం ఇస్తోంది. ప్లాట్ ఫాం లు (మారు మూల స్టేషన్లలో కూడా) ప్రయాణీకులు కూర్చోడానికి అనుగుణంగా ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ, మంచి నీళ్లు, టాయ్ లెట్స్, రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తూ ప్రయాణికుల మన్ననలందుకుంటోంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారిన రోజున ఆర్టీసీ, లాభాల్లో గణనీయ ప్రగతి పొంది ప్రయివేటైజేషన్ అన్న మాట వినిపించకుండా స్వయం సాధికారత సాధించి ముందుకు దూసుకుపోతుంది. ప్రయాణికుల్లో ఏ ఒక్కరూ ప్రయివేట్ వాహనాలెక్కరు.