తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( కాంచీపురం లోని శైవ క్షేత్రాలు )
కంచి కామాక్షి ని దర్శించుకున్న తరువాత కుమారకొట్టం వెళదాం . కుమారకొట్టం అంటే యెంతో దూరం వెళ్లాలి అనుకుంటున్నారా ? అబ్బే కామాక్షిమందిరానికి , ఏకాంబరేశ్వరాలయానికి మధ్యలో వుంటుంది యీ కుమారకొట్టాం . కుమారస్వామి మందిరాన్ని కుమారకొట్టం అని అంటారు . ఈ మందిరానికి వున్న ముఖ్యమైన విశేషం యేమిటంటే సోమస్కందం ప్రకారం కుమారస్వామి శివపార్వతుల మధ్య కూర్చొని వుంటాడు . ఇక్కడ యీ మందిరం కామాక్షి దేవి , ఏకాంబరేశ్వరుల మధ్యన వుంటుంది .

ఈ మందిరం కూడా మిగతా మందిరాలలాగానే 6 నుంచి 8 వ శతాబ్దం మధ్యలో  కంచిని పరిపాలించిన పల్లవులచే నిర్మింపబడింది . కోవెల విమానగోపురాన్ని ‘ చక్రవిమానం ‘ అంటారు . దీనిని 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించేరు . ప్రస్తుతం వున్న మందిరాన్ని 1911 లో గ్రానైటు రాతితో పునఃనిర్మించేరు .

గర్భగుడిలో స్కందుడు బ్రాహ్మణ రూపధారియై దర్శనమిస్తాడు . అంటే ఒక చేత కమండలం మరోచేత జపమాల ధరించి కనిపిస్తాడు . దేవతల సైన్యాధికారి యిలా బ్రాహ్మణరూపంలో వుండడమేమిటా ? అని అనుమానం రాకమానదు . ఆ కధ తరువాత తెలుసుకుందాం . స్తంభాలపై మంటపాలమీద అనేక స్కందపురాణానికి సంబంధించిన ఘట్టాలను చూడొచ్చు . మందిరం రెండో ప్రాకారంలో వినాయకుడు , దుర్గ , వల్లీ దేవసేన సమేత కుమారస్వామి , బ్రహ్మ  , సంధికేశ్వరుడు మొదలయిన పరివార ఉపమందిరాలను చూడొచ్చు .

ఇక స్థలపురాణం లోకి వస్తే బ్రహ్మ  ప్రణవ మంత్రం గొప్పతనాన్ని తెలుసుకోలేక అవమానకరంగా మాట్లాడటంతో కోపించిన కార్తికేయుడు తన పిడికిలితో బ్రహ్మ తలపై మోది అతనిని బంధీగా యిక్కడ వుంచుతాడు , బ్రహ్మ లేకపోవడంతో సృష్టి ఆగిపోతుంది , శివుడు కుమారస్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మను విడిచిపెట్టమని చెప్తాడు , జరిగిన పొరపాటుకు చింతించి బ్రహ్మకు క్షపార్పణలుచెప్పి కార్తికేయుడు బ్రాహ్మణ వేషధారియై శివార్చనలో గడిపిన ప్రదేశం యిది .

ఈ మందిరం లోని మరో విశేషమేమిటంటే ‘ స్కందపురాణ ‘ రచన యిక్కడే జరిగిందట .

‘ కచ్చియప్ప ‘ అనే శివాచారి ప్రతీరోజూ తాను రాసిన స్కందపురాణాన్ని గర్భగుడిలో స్వామి వారి పాదాలవద్ద వుంచి వెళ్లిపోయేవాడట , రాత్రి స్వామి వచ్చి ఆ రచనలో వున్న తప్పులను దిద్ది , మార్పులు చేర్పులు చేసే వారట , అలా స్వామివారి సహాయంతో  కచ్చియప్ప పురాణాన్ని పూర్తి చేసేడట . ఇక్కడ స్వామివారికి నిత్యపూజలతోపాటు ప్రతీ సంవత్సరం స్కందషష్ఠి , తైపూసం వుత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు .

ఈ మందిరంలో మరో విశేషమేమిటంటే యే కాలమైనా కూడా కోవెలలో నెమళ్లు తిరుగుతూ కనిపించడం , యివి పెంపుడు నెమళ్లు కావుట  ఇదండీ కుమారకొట్టం గురించిన వివరాలు . కుమారకొట్టానికి దగ్గరగా వున్న కఛ్చపేశ్వరాలయం గురించి తెలుసుకుందాం . శివకంచిలో వున్న మరో విశాలమైన మందిరం , స్థానికంగా పేరువున్న మందిరం , విశాలమందిరం కూడా . కాని మిగతామందిరాలలా పేరుపొందలేదు . దీనిని శివాలయం అనాలో వైష్ణవాలయం అనాలో తెలీదు , కాని మందిరం మాత్రం చాలా విశాలమైనది . రాతి ప్రహరీగోడ లోపల పుష్కరిణి గబగబా చూడ్డం వల్ల వివరంగా చూడలేకపోయేం . 5 అంతస్థుల రాజగోపురం , విశాలమైన ప్రాంగణం తప్ప మందిరం గురించి పెద్దగా జ్ఞాపకం లేదు . వీలుచూసుకొని మరోమారు వెళ్లి చూడాలి .

స్థలపురాణం గురించి తెలుసుకుందాం.

అమృతమంథనం సమయంలో మంథర పర్వతం సముద్రంలో మునిగిపోతూ వుండగా విష్ణుమూర్తి కూర్మావతారం యెత్తి వీపుపై మంథరపర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోస్తూవుంటాడు . కొంతసమయం గడిచేసరికి విష్ణుమూర్తికి శక్తి తగ్గిపోయి బాధకలుగసాగింది , అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుని కంచిలో ప్రార్ధించగా పరమేశ్వరుడు అతనికి అపారమైన శక్తినివ్వగా విష్ణమూర్తి కూర్మావతారములో అమృతమంథనాన్ని కొనసాగించేడట .

విష్ణుమూర్తి కఛ్చప రూపంలో  ఆరాధించిన లింగం కాబట్టి దీనిని కఛ్చపేశ్వరుడు అని అంటారు .

ఇప్పుడు మరో అద్భుతమైన మందిరం గురించి తెలుసుకుందాం . అది చిత్రగుప్తుని మందిరం . ఎప్పుడూ వినలేదుకదూ ? , అదీ యీ మధ్యన కట్టించినదికాదు , ఇదికూడా సుమారు 7,8 శతాబ్దాల మధ్య కాలంలో పల్లవులచే నిర్మింపబడింది . మూడంతస్థల రాజగోపురంతో వున్న మందిరం , 1911 లో మరమ్మత్తులు జరిపించడంతో చాలా కొత్తగా కనిపిస్తుంది . కాంచీపురం బస్టాండుకి సుమారు 5, 6 కిలోమీటర్ల దూరంలో వుందీ మందిరం .

ఈ మధ్యన మనవారు ‘ చిత్రగుప్తుని నోము ‘ అని చేసుకుంటున్నారు . ఈ నోము యెందుకు చేసుకుంటున్నారు అంటే చిత్తగుప్తుడు యమధర్మరాజుకి వారి తరఫున మంచిగా చెప్పి పాపపుణ్యాల చిట్టాలో పాపం లేకుండా చేస్తాడని అని అంటారు .

అయితే యీ చిత్ర గుప్తుడు యెవరు అంటే యమధర్మరాజు దగ్గర పాపపుణ్యాల చిట్టాను యెటువంటి పక్షపాతం లేకుండా చూడడడానికి నియమింపబడినవాడు , గుప్త అంటే ఖాతాలు సరిచూసేవాడు అని అర్దంకాగా చిత్ర అనేదానికి మూడు కథలు ప్రచారంలో వున్నాయి . వాటిలో మొదటది , మహేశ్వరుడు పార్వతీ దేవి కలిసి యమధర్మరాజుకు సహాయకుని యివ్వదలచి బంగారు పత్రంపైన ఒక చిత్రాన్ని వేస్తారు , ఆ చిత్రానికి కావలసిన మార్పులు చేర్పులు చేసిన పిమ్మట ఆ చిత్రానికి ప్రాణం పోస్తారు , చిత్రం నుంచి పుట్టిన వాడు కావడంవల్ల చిత్ర , ఖాతాలు చూసేవాడు గుప్త కాబట్టి చిత్రగుప్తుడయేడు . మరో కధ ప్రకారం దేవతల గురువైన బృహస్పతి కి దేవేంద్రునకు మాటామాట వచ్చి దేవగురువు అలిగి భూలోకానికి వెళ్లిపోయేడట , దేవేంద్రుడు తన దురుసు తనానికి చింతించి బృహస్పతిని వెదుకుతూ భూలోకానికి వెళ్లి బ్రహ్మ ను కాంచీపురం సమీపాన కనుగొని అక్కడకి వెళ్లి అక్కడ శివలింగాన్ని చూచి అభిషేకానికి జలంసమకూర్చుకోవాలని తటాకం వద్దకు వెళ్లగా ఆ తటాకం బంగారు కలువలతో నిండి వుండడం చూసి ఓ కలువను కోస్తాడు ఆ కలువ బాలుడిగా మారిపోతుంది , చేతిలో వున్న బాలకుని యేం చెయ్యాలో తోచని ఇంద్రుడు దిక్కులు చూస్తూవుండగా బృహస్పతి అక్కడకి వచ్చి , ఆ దినం చైత్ర పౌర్ణమి కావడంతో అతనికి ‘ చిత్ర ‘ అని నామకరణం చేస్తాడు . ఇంద్రుడు అతనిని యమధర్మరాజు దగ్గర పాపపుణ్యాల చిట్టా రాయడానిక నియమించుతాడు , అందుచేత అతను ‘ చిత్ర గుప్తుడయేడు అనేది రెండో కథ .

ఇక మూడవ కథ యేమిటంటే దేవేంద్రుడు సంతానం కొరకు కాంచీపురంలో శివుని కొరకై తపస్సాచరించగా కొంతకాలానికి శివుడు పత్యక్షమౌతాడు , ఇంద్రున కోరిక విన్న శివుడు థదాస్థు అని దీవిస్తాడు . ఇంద్రాణి సంతానానికై నిరాకరించడంతో ఇంద్రుడు శివుని మార్గము చూపమని అడుగుతాడు , శివుడు కామధేనువు ఇంద్రుని సంతానాన్ని గర్భమునందు సంరక్షించమని ఆదేశించగా కామధేనువు ఆ శిశువును తొమ్మిది మాసములు గర్భమున మోస్తుంది . ప్రసవానంతరం ఇంద్రుడు , ఇంద్రాణి ఆశిశువును పెంచిపెద్ద చేస్తారు . అతడే చిత్రుడు యమధర్మరాజు వద్ద పాపపుణ్యాల ఖాతా రాయడానికి నియమింపబడి చిత్రగుప్తుడౌతాడు .

చిత్ర గుప్తుని జన్మ వృత్తాంతం విన్నాం కదా ? మందిరం కూడా చూసెద్దాం , కొత్తగా కట్టిన గర్భగుడిలో కలం చేత పట్టుకొని పెద్ద పుస్తకం ముందు కూర్చొని వున్న చిత్రగుప్తుని రాతి విగ్రహం వుంటుంది . చిన్న పుష్కరిణి వున్న ఓ మోస్తరు మందిరం . ఈ మందిరాన్ని కూడా పల్లవులు కట్టించారు తరువాత రాజ్యానికి వచ్చిన చోళులు విజయనగరరాజులు మరమ్మత్తులు చేయించేరు . 1911 లో మరమ్మత్తుపనులు చేయిస్తున్నప్పుడు చీకటిగదిలో పడివున్న రెండు లోహపు విగ్రహాలను కనుగొన్నారు , అవి చిత్రగుప్తుడు అతని భార్య ‘ కర్నికంబాళ్ ‘ విగ్రహాలుగా గుర్తించేరు . వీటిని మధ్యమంటపములో చూడొచ్చు .

రోజూ ఆరు నిత్యపూజలతోపాటు ప్రతీ అమావాస్యకు ప్రత్యేక పూజలు జరుపుతారు . కేతుగ్రహానికి చిత్రగుప్తుడు అధిదేవత కాబట్టి యిక్కడ కేతుగ్రహదోష నివారణార్ధం అమావాస్యనాడు ప్రత్యేకపూజలు జరుపుతూవుంటారు . చైత్రపూర్ణమినాడు చిత్రగుప్త జయంతి వేడుకలు ఉత్సవాలు నిర్వహిస్తూవుంటారు .

వచ్చేవారం మరిన్ని వివరాలు తెలుసుకుందాం , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు