ఇంకో ఐదు రోజుల్లో వినాయక చవితి.
ప్రతి గల్లీలో హడావుడి కనిపిస్తోంది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల దాకా ఇళ్లకూ, షాపులకు అలసి పోకుండా, చెప్పులరిగేలా తిరిగి చందాలు వసూలు చేస్తూ ‘కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించ లేరు’ కాబట్టి తమకు తోచినంతలో బుజ్జి గణపతి స్థాయి నుంచి పెద్ద బొజ్జ గణపయ్య దాకా గల్లీల్లో ప్రతిష్టించి తమ భక్తిని చాటుకోవాలని ఉవ్వీళ్లూరుతున్నారు.
రోజూ ఆ గణ నాయకుడికి పూజలు చేస్తూ, తమకు ఎదురయ్యే విఘ్నాలను బాపాలని సంవత్సరం మొత్తం అందరూ చల్లగా, ఎటువంటి చీకూ చింతా లేకుండా హాయిగా గడిపేలా చూడాలని కోరుకుంటారు.
వినాయకుడి భారీ సైజు తగ్గించాలని, అలంకరణ కోసం సహజ సిద్ధమైన రంగులనే వాడాలని ఎంతో కాలంగా ‘పర్యావరణ పరిరక్షణ’ తమ బాధ్యత అనుకునే వాళ్లు జనంలో అవగాహన కలిగించగా, దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రభావవంతంగా కనిపిస్తున్నాయి.
పందిట్లో రోజూ ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు, వాటికి కావలసిన రకరకాల పూజా సామాగ్రీ, పత్రీ, పూలూ, పళ్లు ఓహ్! ఒక్కటనేమిటి ఆ ఏకదంతుడు అందరికీ ఆ పదకొండు రోజులు భక్తి సంగతి కాస్త పక్కన పెడితే, భుక్తికి మార్గం చూపిస్తాడు. వినాయకుడు చాలా మందికి ఆరాధ్యదైవం. అందరి దేవుళ్లలా కాదు. పిల్లాజెల్లా, ముసలి ముతకా ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు..కాదు కాదు అందర్నీ కలుపుకుంటాడు. ఆయనని చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్లనక్కర్లేదు. కొండలు, గుట్టలు ఎక్కనక్కర్లేదు. వ్యయ ప్రయాసలకు ఆస్కారమే లేదు. మడి ఆచారాలు, భారీ పూజలూ అఖ్ఖర్లేదు. చక్కగా మన వీధి వాకిట్లో కొలువై ఉంటాడు. నాలుగు గరిక ముక్కలు పాదాలపై వేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు. కోరికలు తీర్చేస్తాడు.
నవరాత్రులు ఒక ఎత్తు. నిమజ్జనం ఒక ఎత్తు. అంగరంగ వైభవంగా, ఆడంబరంగా స్వామిని తొమ్మిది రోజులూ సంతోష పరచి, అమ్మానాన్నలైన పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు పంపడానికి, అందంగా అలంకరించిన లారీల్లో్, బళ్లలో గణనాయకుణ్ని ఉంచి, రోడ్డెంట చిన్నగా ఊరేగిస్తూ, దారెంట వెళ్లే వాళ్లకు పులిహోరా, పరవాణ్ణం ప్రసాదంగా పెడుతూ, చెరువు దగ్గరకు తెచ్చి”గణపతి పప్పా మోరియా’ అని అరుస్తూ నెమ్మది నెమ్మదిగ నీళ్లలో నిమజ్జనం చేస్తుంటే మనకి చూడ రెండు కళ్లు చాలవు.
మన ఇళ్ల దగ్గర వినాయకుళ్లని నిలిపినా ఖైరతాబాద్ వినాయకుడు ‘ఎంత ఎత్తుంటాడు? ఏ విధంగా ఉంటాడు?’ అనేది అందర్లో ఆసక్తిని రేకెత్తించే అంశం. అలాగే వివిధ చోట్ల ప్రతిష్టించిన వినాయకులు పురాణ పాత్రల నుంచి ఇప్పటి కంటెంపరరీ ఫిగర్స్ వరకూ రూపొందించబడి ఉండడం, అలాగే సెల్, బైక్ ఇత్యాది వస్తువులని ఉపయోగించే రీతుల్లో రూప కర్తలు తయారు చేయడం విశేషం. నాకు తెలిసి ఏ దేవుడూ ఇంత మాడర్న్ గా, మన మధ్య మనలా ఉండడు. అందుకే ఆయన్ను అందరూ ఓన్ చేసుకుంటారు. ఆయన మీద మన రచయిత(త్రు)లు సరదాగా కథలు అల్లుతుంటారు....కార్టూనిస్టులు కార్టూన్లేస్తుంటారు....ఆయనతోబాటు ఆయన వాహనమైన మూషికానిదీ కథలకూ, కార్టూన్లకూ ప్రత్యేక స్థానమే....సరదాగా ఎవరెన్ని సెటైర్లు వేసినా, అందరూ భయపడేది మళ్ళీ ఆయనకే... అందుకే "విఘ్నాలు తొలగించు దేవా" అని ఆయనను ప్రార్థించనిదే ఏ పనీ ప్రారంభించరు.
ఈ సంవత్సరం మనందరం సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. వినాయక చవితిని చక్కగా జరుపుకుని కథాక్షతలు తలపై ఉంచుకుని, తొమ్మిది రోజులూ వీలైనంత మంది వినాయకుళ్లని పందిళ్లకెళ్లి దర్శించుకుని పునీతులమవుదాం. నిమజ్జనం అనంతరం మళ్లీ వచ్చే సంవత్సరం మన వద్దకు కదలి వచ్చే వినాయకుణ్ని మనసులో స్మరించుకుందాం. ఆనంద పరవశులమవుదాం.
సిద్ధీ బుద్ధీ సమేత వినాయకుడు మనందర్నీ చల్లగా చూడాలని కోరుకుంటూ- మన గోతెలుగుకు, సారథికి, సంపాదకుడికి, సంబంధిత సభ్యులకు మరీ ముఖ్యంగా పాఠకులకూ వినాయక చవితి శుభాకాంక్షలు!