ఇతర జీవాల మల్లేనే మనిషి మనుగడకూ ఆహారం అవసరం. తిండి కలిగితే కండ కలదోయ్. కండ కలవాడేనోయ్ మనిషోయ్! అన్నాడు ఓ కవి. అప్పటి రోజుల్లో అది నిజం. ఎందుకంటే యంత్రాల మీద ఎక్కువ ఆధారపడకుండా కాళ్లూ, చేతులతోటే కష్టించి పనిచేసే వాడు. ఇప్పట్లా బస్సులు, కార్లూ, ఆటోలు, క్యాబ్లులాంటివి లేవు కాబట్టి ఎంత దూరమైనా నడిచి వెళ్లేవాడు. కండలు. కొవ్వూ కరిగించుకునేవాడు. తినే తిండికి అది సరైన వ్యాయామంగా ఉండేది. ఇప్పుడలా కాదు కదా! కదలకుండానే అన్ని పనులూ అయిపోతున్నాయ్. దాని వల్ల స్థూలకాయం(ఒబెసిటీ). దాన్ని తగ్గించుకోడానికి డైటింగ్ లు, వాకింగ్ లు, వర్క్ అవుట్ లు, నూనె, కొవ్వు పదార్థాల రెస్ట్రిక్ట్రెడ్ డైట్ ఎట్సెట్రా..ఎట్సెట్రా...(ఆఫీసులోని పని ఒత్తిడితో చాలా మందికి వీటికి కేటాయించడానికి సమయం చిక్కడం లేదు)
ఎప్పుడైతే మనిషి బతకడం కోసం తినడం మానుకుని, రుచుల కోసం వెంపర్లాడుతూ తినడం మొదలెట్టాడో అప్పటి నుంచి మొదలయ్యింది అసలు సమస్య. తింటం తింటున్నాడు కాని అది డైజెస్ట్ చేసుకునేంత శ్రమేది? ఉద్యోగ పరిస్థితుల్లో కూడా చాలా చాలా మార్పులొచ్చాయి. కష్ట పడడం తక్కువైంది. ఏ సీ రూముల్లో, కంప్యూటర్ ల ముందు గంటల కొద్దీ కూర్చుని పనిచేస్తుంటే అలుపెరుగని శరీరం తిన్నదాన్ని ఎలా అరిగించుకుంటుంది?
ఒకప్పుడు సిటీలోనే పెరిగిన నాకు "పూతరేకుల రుచి చెప్పడానికి మా అమ్మ నానా తంటాలూ పడింది. అవి ఇక్కడ దొరకవాయే! కొంతకాలం తర్వాత మా ఊరు ఉండి-భీమవరం వెళ్లినప్పుడు మాత్రమే వాటిని చూడ గలిగాను. తిన్నాను. ఇప్పుడలా కాదు. స్వగృహ ఫుడ్స్ అన్ని ఊళ్ల రుచులను అందిస్తున్నాయి. ఫుడ్ కోర్ట్స్ అన్ని దేశాల, స్టేట్ ల, జిల్లాల రుచులకు వేదికలవుతున్నాయి. ట్వంటీ ఫోర్ అవర్స్ శాకాహారం, మాంసాహారపు కమ్మటి పదార్థాలను యాప్ ల ద్వారా ఇంటి ముంగిట్లోకి తెచ్చే సంస్థలు కోకోల్లలు. ఆహార పదార్థాల అందుబాటులో ఇది విప్లవాత్మక మైన మార్పు అనడంలో సందేహం లేదు.
నాలుకను అదుపు చేసుకోక పోతే (మాటల్లో కాదు తినడంలోనండోయ్) శరీరం అదుపులో ఉండదు. బీ పీ, సుగర్ లాంటి అనేక వ్యాధులు శరీరాలను ఆశ్రయిస్తున్నాయి. అతలాకుతలం చేస్తున్నాయి. తామర తంపరగా పెరుగుతున్న స్టార్ స్థాయి హాస్పిటల్స్ దీనికి ఉదాహరణ.
తాను లావయిపోతున్నానన్న స్పృహ కలిగిన మనిషి రకరకాల ప్రయత్నాలతో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. స్ప్రౌట్స్ (మొలకలొచ్చిన గింజలు) తినడం, వెజిటెబుల్ సలాడ్లు మాత్రమే తీసుకోవడం, జిమ్ కెళ్లి భారీగా వర్కవుట్ లు చేయడం, టీ వీల్లో చూపించే రక రకాల మందులు వాడడం, రోడ్డు పక్కన అమ్మే పసరు మందులు కొనుక్కుని సేవించడంలాంటివాటితో పాటు లైపో లాంటి ట్రీట్ మెంట్ లకూ సిద్ధపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు.
జీవితం చాలా విలువైనది. మన పెద్దలు ఒక విలువైన సామెత చెప్పారు. అది అన్నింటికీ వర్తిస్తుంది. అదేమిటంటే- అతి సర్వత్ర వర్జయేత్! అతి ఎక్కడా పనికి రాదు అని. దాహం, ఆకలి తీరాక ఒక సిగ్నల్ ఇచ్చే లా భగవంతుడు మానవ శరీరాన్ని రూపొందించాడు. అలాగే ఎలాంటి ఆహారం, ఎలాంటి పరిసరాల్లో, ఏ సమయాల్లో ఎలా తినాలో కూడా మన పెద్దలు చెప్పారు. భగవంతుడు కొన్ని పళ్లను ఆయా రుతువుల్లో అందే ఏర్పాటు చేశాడు. వాటిని తాజాగా తినాలి. అవన్నీ పాతకాలం మాటలని కొట్టేసి, నియమానుసారం తినకుండా, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తింటే శరీరం తన రూపు రేకల్ని కోల్పోవడమే కాకుండా, అనారోగ్య హేతువవుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి ఆహారమే ప్రథమ కారణం. ఇది తెలుసుకుంటే నూరేళ్లు చల్లగా శారీరక, మానసిక ఆరోగ్యాలతో బతకొచ్చు.
*****