'బంచిక్ బంచిక్ చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా..' అంటాడో సినీ కవి. యోగా చేస్తే ఒళ్లు విల్లులా ఒంగుతుంది. మనసును ఆహ్లాదంగా ఉంచుతుంది. యోగా ఒక్కటే కాదు, ఫిట్‌నెస్ కోసం చాలా మార్గాలున్నాయ్. రోజూ క్రమం తప్పకుండా 30 నిముషాల పాటు వేగవంతమైన నడక అనేక అనారోగ్య సమస్యల్ని దరి చేరనీయకుండా చేస్తుందని వైద్యులు నెత్తీ నోరూ బాదుకుంటున్నా, చాలా మంది సింపుల్‌గా డోంట్ కేర్ అనేస్తుంటారు. ఫిట్‌నెస్ స్టూడియోలకు వెళ్తాం. వీకెండ్స్‌లో ఏక బిగున ఐదారు గంటలు నానా రకాల వర్కవుట్స్ చేసేస్తాం. ఏడు రోజులు చేయాల్సిన దానికన్నా ఒక్కరోజులోనే అంతకు మించి చేసేస్తాం.. అనే భావన చాలా మందిలో ఉంటుంది. అలా చేస్తే ఎప్పుడో డెభ్బై ఏళ్లకో, ఎనభై ఏళ్లకో రావాల్సిన చావు పాతికేళ్లకే పరుగెత్తుకుంటూ వచ్చి పలకరించేస్తుంది.
ఫిట్‌నెస్ అంటే అదేదో బాకీ కాదు. ఒక్కసారే తీర్చేద్దామనడానికి. రోజూ వడ్డీ కట్టాల్సిందే. ఒకటి రెండు రోజులు మిస్ అయితే నష్టమేమీ లేదు. అసలు వ్యాయామం ఎలా చేయాలి.? అన్న ప్రశ్నకు డ్టార్లు చెప్పే సమాధానం.. మీ శరీరాన్ని అర్ధం చేసుకోండి. దానికి తగ్గట్లు నడుచుకోండి అని.. వేగంగా నడవడం. ఓపికకు తగ్గట్లుగా వేగం పెంచి పరుగెత్తడం రకరకాల ఎక్సర్‌సైజులు చేయడం ఆ ఎక్సర్‌సైజుల్లో భాగంగా చిన్న చిన్న బరువులు ఎత్తడం, డాన్స్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, గార్డెనింగ్ చేయడం, యోగాసనాలు వేయడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలున్నాయి. ఏం చేసినా అది మన శరీరానికి సూట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి. వంద కేజీల బరువున్న వ్యక్తి వేగంగా పరుగెత్తేసి నెలరోజుల్లో పది కేజీలో, పాతిక కేజీలో తగ్గిపోతానంటే కుదరదు. బరువు తగ్గడు సరికదా ఆసుపత్రి బిల్లు పెరిగి ఆస్థులు కరిగిపోతాయి. సో ఇక్కడ శరీర ధర్మాన్ని అర్ధం చేసుకోవడం ముఖ్యం.
మన శరీరం గురించి మనకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది.? దానికి సరైన వ్యాయామం ఎంత అవసరమో తీసుకునే డైట్ పక్కాగా ఉండడం కూడా అంతే అవసరం. ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయకూడదు. లైట్‌గా జ్యూస్ తీసుకుని వర్కవుట్స్ మొదలుపెడితే మంచిది. వర్కవుట్స్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. మధ్యాహ్నం ఆహారం సరిపడినంత తీసుకుని, రాత్రి ఆహారం మితంగా ఉండేలా చూసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ మధ్యలో ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. లంచ్‌కీ, డిన్నర్‌కీ మధ్యలో కూడా తేలికపాటి స్నాక్స్ ఉపకరిస్తాయి. పడుకునే ముందు కూడా అవసరాన్ని బట్టి అతి కొద్ది మొత్తంలో ద్రవాహారం కావచ్చు, ఘనాహారం కావచ్చు తీసుకుని నిద్రకు ఉపక్రమించొచ్చు. అయితే ఆహారం తీసుకున్న తర్వాత ముప్పై నిముషాల తర్వాత మాత్రమే నిద్రకు ఉపక్రవమించడం మంచిది. సిక్స్ ప్యాక్ కండలు మాత్రమే ఫిట్‌నెస్ అనుకుంటే సరిపోదు. ఇండియన్ ఫిజిక్ సిక్స్ ప్యాక్ కోసం డిజైన్ చేయబడలేదు. ఆ మాటకొస్తే ఏ మనిషి ఫిజిక్ అయినా అంతే. ఫిట్‌గా ఉండాలి. హెల్దీగా ఉండాలి. ఇదీ నిఖార్సయిన ఫిట్‌నెస్ మంత్ర.