ఇంతవరకు చెప్పుకున్న మందిరాలే కాక ‘ సత్యనాధేశ్వరాలయం , మైత్రలీశ్వరాలయం , ఒనకంఠేశ్వరాలయం , ముక్తేశ్వరమందిరం యిలా యెన్నో మందిరాలు వున్నాయి . అన్ని మందిరాలు చూడాలి అంటే ఓ నెలరోజులు కంచిలో వుండాలేమో ?ముందు చెప్పుకున్నాం కదా కంచి పట్టుచీరలకు ప్రసిధ్ది అని , బజారు వీధంతా చీరల షాపులతో కళకళ లాడుతూ వుంటాయి , ఒక చోట చూసిన డిజైను మరో చోట వుండదు , చవుకగా కూడా వుంటాయి . ప్రతీ యిల్లూ కూడా ఓ షాపనే చెప్పుకోవచ్చు .
మనంకొనుక్కోవాలి అనుకుంటే పెద్దషాపులనే యెంచుకోడం మంచిది , షాపు యెంచుకోడానికి ఓ కొండగుర్తేమిటంటే జనాలు యే షాపులోయెక్కువగ వుంటే ఆషాపుకే వెళ్లాలి . ఇవి కాక యిక్కడ చూడవలసిన ముఖ్యమైనది ఆది శంకరాచార్యుల వారి కామకోఠిపీఠం . ఈ పీఠం క్రీశ్తుపూర్వం 482 లో ఆది శంకరాచార్యుల వారిచే స్థాపించబడింది .ప్రస్తుతం వున్న స్వామి విజయేంద్ర సరస్వతి 70 వపీఠాధిపతి . ఇది కామకోటిపీఠం వారిచ్చిన పీఠాధిపతుల జాబితా చూస్తే లెక్క సరిపోతోంది , కాని చరిత్ర కారుల ప్రకారం ఆది శంకరాచార్యులు 8 వ శతాబ్దానికి చెందినట్లుగా చెప్తారు , యేది నమ్మాలి యేది నమ్మకోడదో తెలీని అయోమయం .
సరే ప్రస్తుతం లోకి వస్తే ఆశ్రమం అంటే యిలా వుండాలనేటట్టు వుంటుందీ ఆశ్రమం , చాలా నిశ్సబ్దంగా సమయానికి అన్నివిధులు నిర్వర్తిస్తూ కనిపిస్తారు ఆశ్రమవాసులు . మనకి కూడా యేదో ప్రశాంతత కలిగి మనసుకి హాయిగా వుంటుంది . లోపలమందిరంలో జీవకళతో వున్న దుర్గా దేవికి నిత్యం కుంకుమ పూజలు జరుగుతూ వుంటాయి . ఆ మంత్రోఛ్చారణ వింటూవుంటేచెవులకి మనసుకి యెంతో హాయిగా వుంటుంది . నిజంగా దుర్గాదేవి అక్కడ కొలువై వుందనిపిస్తుంది .
పెద్ద పెద్ద చలువరాతి మంటపాలు భక్తులతో నిండి వుంటాయి , లోపల యెంతమందో గురువుల బృందావనాలు వుంటాయి .
ఇక్కడి లైబ్రరీలో యెన్నో దుర్లభమైన తాళపత్రగ్రంధాలు వున్నాయి , శంకర ట్రస్టు ద్వారా యెన్నో స్కూళ్లు , కాలేజీలు ,విశ్వవిద్యాలయాలు , ఆసుపత్రులు , వేదపాఠశాలలు నడపబడుతున్నాయి .
ఈ పీఠాన్ని 18 శతాబ్దంలో ముస్లిమ్ ప్రభువుల ఒత్తిడులవల్ల కుంభకోణానికి మార్చారు , తిరిగి 19వ శతాబ్దంలో ఆంగ్లేయులపాలనలో కాంచీపురానికి మార్చేరు .
కాంచీపురం వెళ్లేవారు తప్పకుండా చూడవలసిన ప్రదేశం యిది అనడంలో సందేహం లేదు .
గురువుల బోధలు వింటూవుంటే మనకితెలీకుండానే తలవంచి నమస్కరిస్తాం , యే భాషలోనైనా వారు అనర్గళంగామాట్లాడగలగడం , యే విషయానికి సంబంధించిన ప్రశ్నకైనా అవలీలగా జవాబులు చెప్పగలగడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది .అన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఆ గ్రంథాలను యెన్ని మార్లు చదివి వుండాలి , దైవాంశ వుంటేతప్ప యిలాంటివి సాధ్యం కావు .|
కాంచీపుర సందర్శనం తరువాత మనం ‘ తిరుత్తణి ‘ వెడదాం . తిరుత్తణి చెన్నై నగరానికి సుమారు 87 కిలోమీటర్ల దూరం లోవున్న పట్టణం .
తరుత్తణి వరి చెరకు పంట భూములతో సస్యశ్యామలంగా వుండే ప్రాంతం , ఇక్కడవున్న ‘ కుమారస్వామి ‘ మందిరం వల్ల యీపట్టణం పేరు పొందింది . తమిళులు దీనిని ‘ మురుగన్ అరుపడైవీడు ‘ అని అంటారు . తమిళనాడులో వున్న ఆరు ముఖ్యమైనకుమారస్వామి మందిరాలలో యిదివొకటి , యీ ఆరు ప్రదేశాలలో కుమారస్వామి కొలువై వుంటాడని భక్తుల నమ్మకం , మిగతా 5కుమారస్వామి మందిరాలు యెక్కడెక్కడ వున్నాయో తెలుసుకుందాం , పళని , స్వామిమలై , తిరుపనకుండ్రం , పళముదిర్చోలై ,తిరుచెందూరు . తారకసురుని తో యుధ్దం చెయ్యడానికి స్కందుడు తన సైన్యం తో వెళుతూ పై ప్రదేశాలలో విడిది చేసేడట ,అందుకే యీ ప్రదేశాలు స్కందుని నివాస స్థానాలు ప్రసిధ్ది పొందేయి .
తమిళనాడు యాత్రలలో ముఖ్యంగ చెప్పుకోదగ్గది యిక్కడి భోజనసదుపాయాలు , పొద్దున ఆరింటినుంచి కాఫీ , యిడ్లీదుకాణాలు తెరిచేస్తారు . విరిగిపోతున్న కర్రబెంచీల వీధి హోటలులో అయినా కమ్మని యిడ్లీ కాఫీలు దొరుకుతాయి , ముఖ్యంగాతిన్న తరువాత కడుపు పాడవదు .
ఈ మందిరం లో కుమారస్వామి ‘ శక్తిధరుని ‘ రూపంలో పూజలందుకుంటున్నాడు .
తిరుత్తణి బస్సుస్టాండు నుంచి , రైల్వే స్టేషను నుంచి కూడా కొండపైకి బస్సు సౌకర్యం వుంది .
మందిరం వున్న కొండను ‘ తనిగై ‘ కొండ అని అంటారు . మందిరం భక్తిగీతాలతో కొండ మారుమ్రోగి పోతూవుంటుంది .కొండపైన 5 అంతస్థుల రాజగోపురం కొండకిందనుంచి కనిపిస్తూ వుంటుంది . చుట్టూరా పెద్ద ప్రహారీగోడ , లోపల ద్వజస్థంభం ,ఉపమందిరాలు , పైనున్న మందిరం వరకు 365 మెట్లు యివి సంవత్సరంలో వున్న రోజులకు ప్రతీకట , రంగురంగుల దేవతామూర్తులు యిట్టే ఆకట్టుకుంటాయి . బంగారు విమానగోపురం మనలని ఆకట్టు కుంటుంది .
లోపలి ప్రాకారంలో రెండుమందిరాలు , ఒకటి మూలదేవతైన స్కందుని కొరకు మరొకటి దేవసేన , వల్లి ల కొరకుకేటాయించబడ్డాయి . మెట్లు యెక్కుతూ వుంటే మాత్రం చాలా ఆయాసం అనిపించింది . ప్రాకారంలో వినాయకుడు , పార్వతి ,శివుడు , వాసుకి , నాగకన్నెల ఉపమందిరాలను చూడొచ్చు . గర్భగుడిలోని స్కందుని విగ్రహం తూర్పుముఖంగా వుంటుంది .మందిరంలో వున్న స్కందుని వాహనమైన ఐరావతం ( నెమలికదా వాహనం అనుకుంటున్నారా ? ఆ కథ స్థలపురాణం చెప్తాను )కూడా తూర్పుముఖంగా వుండడం విశేషం .
ఈ మందిరం యెన్నో పురాణ గాథలతో ముడిపడివుంది .
ముందుగా మనం చెప్పుకున్నట్లు తారకాసురుని సంహారం కోసం దేవసైన్యాధిపతి అయిన స్కందుడు తన సేనలతో యిక్కడసేదతీరేడు , తారకాసురుడు పిండివాలముతో స్కందుని ఛాతీ పై గాయపరుస్తాడు తిరుత్తణి లో స్కందుని విగ్రహానికి ఛాతీ భాగంలోరంధ్రం వుంటుంది .
ఐరావతం గురించి చెప్పుకుందాం .
ఇంద్రుని కుమార్తె దేవసేనతో స్కందుని వివాహ సమయాన ఇంద్రుడు సమస్త కానుకలతో పాటు ఐరావతాన్ని కూడాయిచ్చేడట , ఐరావతం లేకపోయేసరికి అలకాపురి కళతప్పిపోయిందట , విషయం తెలుసుకున్న స్కందుడు ఐరావతాన్ని తిరిగిఇంద్రునకు యిచ్చివేయగా కానుకగా యిచ్చిన ఐరావతాన్ని తిరిగి తీసుకోడానికి నిరాకరించి ఇంద్రుడు ఐరావతాన్ని అలకాపురిముఖంగా వుంచవలసినదిగా కోరుతాడు , అందుకు యీ మందిరంలో ఐరావతం తూర్పుముఖంగా వుంటుంది . అందుకే యీమందిరంలో సుభ్రమణ్యునికి వాహనం నెమలికాదు ఐరావతం .
ఈ మందిరంలో స్కందునికి పూసిన గంధం ప్రసాదంగా యిస్తారు , యీ గంధానికి గాయాలను మాన్పే శక్తి వుందని అంటారు .ఈ మందిరంలో గంధం తియ్యడానికి వుపయోగించే రాతి పీట ఇంద్రుడు దేవసేనకు యిచ్చిన మిగతా అరణపు సామానులతోపాటుయిచ్చేడట , దానిమీద అరగదీసిన గంధం యివాళకూడా స్కందునకు పూస్తారు , మరునాడు దానిని దర్శనార్థం వచ్చిన భక్తులకుయిస్తారు .
కుమారకొట్టం గురించి కిందటి సంచికలో చదివేం కదా ? స్కందుని చెరనుండి విడిపించబడ్డ బ్రహ్మ కైలాశాన శివునిదర్శించుకొని తిరిగి వెళుతూ తిరుత్తణిలో తనని సేవించుకోలేదని స్కందుడు కోపించగా బ్రహ్మ యిక్కడ ఓ తటాకాన్ని నిర్మించేడుదానిని ‘ బ్రహ్మ సోనై ‘ అని అంటారు .
విష్ణుమూర్తి వద్దనుంచి కపటాన శంఖం , చక్రం పొందిన తారకాసురుని వధించి స్కందుడు శంఖ చక్రాలను తిరిగి విష్ణుమూర్తికియిచ్చిన ప్రదేశంకూడా యిదే .
అమృతమంథన సమయంలో వాసుకి శరీరానికి కొండ రాపిడ వలన బాగా బాధ కలుగగా యిక్కడకు వచ్చి స్కందునిఉపచారాలతో కోలుకొన్నదట , అలాగే మంధరపర్వతంకూడా . సుభ్రమణ్యుని పాములకు రాజు అని కూడా అంటారు ,అందుకనేనేమో చాలా కుమారస్వామి మందిరాలలో జంటనాగులకి కూడా ఉపమందిరాలు వుండడం , నాగదోషం వల్ల పిల్లలుకలగని వారు మందిరంలో నాగప్రతిష్టలు చెయ్యడం , కొత్త పసుపు బట్టని ఉయ్యాలలాగా స్థల వృక్షానికి కట్టడం చేస్తూ వుంటారు .అలాంటివి యిక్కడకూడా చాలా వున్నాయి .
త్రేతాయుగంలో శ్రీరాముడు రావణబ్రహ్మను సంహరించిన తరువాత విచలిత మనస్కుడై రామేశ్వరంలో లింగ ప్రతిష్టచేసితిరుత్తణి మందిరంలో కొంతకాలంగడిపి అప్పుడు అయోధ్యక వెళ్లేడట , ద్వాపరయుగంలో అర్జనుడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడుయిక్కడ కొంతకాలం వుండి స్కందుని సేవించుకున్నాడట , స్కందుడు అగస్త్యమునికి తమిళ భాషను ప్రసాదించిన ప్రదేశంయిదేనని తమిళుల నమ్మకం . ఇక చరిత్రలోకి వస్తే సుమారు 200 సంవత్సరాలకు పూర్వం ముత్తుస్వామి దీక్షితార్ కివృధ్దబ్రాహ్మణుని రూపంలో వచ్చి స్వామి తియ్యని ప్రసాదం తినిపించగా దీక్షితులు తన మొదటి కీర్తన యిక్కడ ఆలపించేరట .
గోడలమీద స్థంభాలమీదా కుమారస్వామికి సంబంధించిన కథలు శిల్పాలలోనూ , చిత్రాలలోనూ చూడొచ్చు .
ఇన్ని మహిమలు గల యీ క్షేత్రం తప్పక దర్శించుకోవలసినది , అటువైపు వెళ్లినప్పుడు తప్పక దర్శించుకోండి .మరో విషయం యేమిటంటే సుభ్రమణ్యుడు అన్ని గ్రహాలకు అధిపతి కావడం వల్ల జాతక చక్రంలో యే గ్రహం దోషంతో వున్నాసుభ్రమణ్యుని దర్శించుకుంటే తొలగిపోతాయట .
వచ్చేవారం తమిళనాడులోని మరో మందిరం గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు .