ఇల్లూ వాకిలీ, వీధీ వాడా, పల్లే పట్టణం శుభ్రంగా వుండాలంటే మొదటి మెట్టుగా ఇంట్లో నేలా, గోడా, బట్టా, పక్క, ఒకటేమిటీ అన్నీ శుభ్రంగా, కంటికింపుగా వుండాల్సిందే. అందుకే, శుభ్రతకి నాందీ వెలుతురు అంటారు పెద్దలు.
పూర్వం ఇంటి కప్పులు ఎత్తైనవి కావు. వానకి మట్టి గోడలు తడవకుండా వుండేందుకు కొంపలట్లా కట్టుకున్నారు. వెలుతురు కష్టమే. అందుకు మూలింట్లో దీపం ఎప్పుడూ వెలగాల్సిందే. ఆ దీపానికి నూనె పోస్తూ వుండాల్సిందే. ఆ పని ఆ ఇంటి ఇల్లాలిదే. దీపం బాధ్యత మాత్రం కాదు, ఇల్లలికి వంట చేసి, పిల్లా పీచుకి తినిపించి, సంసారం నడిపించే మూడొంతుల బరువు, ఆమె నెత్తి మీదే. ఆ ఇల్లాలే లేక పోతే ఇల్లు చీకటి కొంపే. కుప్ప తొట్టే. అనాదిగా, నట్టింట దీపం వెలిగించే ఈ సంప్రదాయం ఈనాటికీ మన సంస్కృతిలో కొనసాగుతోంది. ఆ దీపం, ఇంటి ఇల్లాలు వెలిగిస్తేనే, మంగళదాయకం. ఇల్లాళ్ళ మీద ఎన్ని కార్టూన్లు గీశామో. తిట్టాము, చీదరించుకున్నాము, మొత్తాము, ఏవగించాము, ఎద్దేవా చెశాము,
కానీ, ఆమె ను మెచ్చుకునే కార్టూన్లు తక్కువే గీశాము. ఈ సబ్జెక్ట్ మీద మన కార్టూనిస్టులెలా స్పందిస్తారో చూద్దామని మిత్రులనడిగాను. ఈ కార్టూన్లు గీశారు. గోతెలుగు పాఠకులు వీటిని ప్రశంశిస్తారని ఆశిస్తాను.
--- కార్టూనిస్ట్ జయదేవ్.