పొద్దున్నే కాసేపు వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఇప్పుడు కొత్తగా వింటున్నదేమీ కాదు. వందల ఏళ్లుగా, వేల సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే ఇది. డయాబెటిస్ కావచ్చు. హైపర్ టెన్షన్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వైద్యులు ప్రిస్క్రిప్షన్ కంటే ముందు వ్యాయామం అనే ఆరోగ్య విధానం గురించి చెబుతారు. ఉదయాన్నే, లేదంటే సాయంకాలాన కాసేపు నడక, తగినంత వ్యాయామం చేయమని డ్టార్లు చెప్పగానే, ఆ వ్యాయామానికి సంబంధించి చాలా మందికి కలుగుతోన్న ఆలోచన ఒక్కటే. ఏ గాడ్జిట్ వ్యాయామానికి ఉపయోగపడుతుంది అని. చేతికీ, కాలికీ, గుండెకీ ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో గ్యాడ్జెట్ అందుబాటులో ఉన్నాయి. వేర్వేరుగానే కాదు, అన్నింటికీ కలిపి కూడా కొన్ని గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఓ గ్యాడ్జెట్‌ని తగిలించుకుని వ్యాయామానికి వెళితే, ఎంత సేపు చేయాలో ఎలా చేయాలో, సదరు వ్యాయామం గురించి సమాచారమ్ దొరికేస్తోంది.
సరే, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. 20 నిముషాలు నడిస్తే, ఇన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. కాసేపు ఎక్సర్‌సైజ్ చేస్తే ఇంత మేర కొవ్వు కరిగించుకో వచ్చు. గ్యాడ్జెట్స్ ద్వారా మనం ఈ సమాచారాన్ని విశ్లేషించుకోవడం తప్పేమీ కాదు. కానీ గ్యాడ్జెట్ చెప్పినట్లే అన్నీ జరిగి పోవు కదా. ఎంత సేపు వ్యాయామం చేయాలి. ఎలా వ్యాయామం చేయాలి అనేది డాక్టరు మనకు సూచిస్తున్నారు. సో అది ఫాలో అయితే సరి పోతుంది. వ్యాయామానికి వెళ్లే వాళ్లు చేతికి వాచ్ లేకుండా వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదు. కాసేపైనా గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉంటేనే అసలు సిసలు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఏ పని చేస్తే ఆ పని మీదే దృష్టి పెట్టడం వల్ల చేసే పని మరింతగా మెరుగైన ఫలితాల్నిస్తుంది. వైద్యులు పదే పదే ఈ గ్యాడ్జెట్స్ విషయంలో ఎంతగా అప్రమత్తం చేస్తున్నా, కొత్త ఒక వింత అన్న ధోరణి మాత్రం వీడడం లేదు మనం.
గ్యాడ్జెట్స్ చేసే మేలు కంటే, కీడే ఎక్కువని ఓ సర్వేలో తేలింది. ఏ గ్యాడ్జెట్ అయినా సరే పవర్‌తో రన్ అవ్వాల్సిందే. ఆ పవర్ ఆ గ్యాడ్జెట్‌కి ఓ బ్యాటరీ ద్వారా అందుతుంది. అంటే దాని నుండి విడుదలయ్యే రేడియేషన్ కావచ్చు మరోటి కావచ్చు.. శరీరానికి హానికారకమైన అంశం మన కంటికి కనిపించకుండా మన శరీరంలోకి ప్రవేశిస్తోందన్న మాట. ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. ఒక రోజు ఒక కిలో మీటరు దూరం నడిస్తే అలా ఆ దూరం నడవడానికి ఎంత సమయం పడుతుందో మనకి ఓ అంచనా వచ్చేస్తుంది. మరుసటి రోజు మన శరీర తత్వాన్ని బట్టి ఆ సమయాన్ని తగ్గించుకో వచ్చు. పెంచుకో వచ్చు. అంటే మన గురించి, మన శరీరం గురించి మనం ఓ అనాలిసిస్ చేసుకో గలుగుతాం. నడిచే సమయంలో కావచ్చు. వ్యాయామం చేసే సమయంలో కావచ్చు వేరే ఇతర ఆలోచనలు లేనప్పుడు మెదడు సామర్ధ్యం మరింత బలోపేతం అవుతుంది. గ్యాడ్జెట్స్ ఆ సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తాయి. రోజంతా గ్యాడ్జెట్స్‌తో గడిపేస్తున్నాం కాబట్టి, వ్యాయామం చేసే ఆ కాసేపైనా వాటిని కొంచెం పెట్టాల్సిందే. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సర్వేలు, పరిశోధనలు వెల్లడిస్తున్న వాస్తవం.