జనాభా తగ్గించడానికి ఓ దివ్యౌషధం - భమిడిపాటిఫణిబాబు

A decline to reduce the population

ఒకానొకప్పుడు మద్యం సేవించడం తప్పనే వారు.. చిన్నతనమంతా నిజం కాబోసనుకుని దాని జోలికి వెళ్ళకుండా గడిపేసారు.. దానికి ప్రభుత్వాలు కూడా, ఏవేవో చట్టాలు చేసి మద్య పాన నిషేధం కొంత కాలం వరకూ కొనసాగించారు.. దానికి సాయం ఆ రోజుల్లో మహాత్మా గాంధీ ప్రభావం కూడా ఉండేది…  ఆ రోజుల్లో  ఎక్సైజ్ డిపార్ట్ మెంట్  వాళ్ళు,  దొంగతనంగా మద్యం తయారు చేసే వారి మీద దాడులు జరిపే వారు.. కాల క్రమేణా ప్రభుత్వాలు ఓ గొప్ప విషయాన్ని గమనించారు ఈ మద్య పాన నిషేధం ఎత్తేస్తే , ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందనీ.. ఇంకేముందీ ఎత్తి పారేయడమే కాకుండా, ఎక్కడ పడితే అక్కడ, అధికారంగా  మద్యం దుకాణాలు తెరుచుకో వచ్చన్నారు.. కొంత కాలం మద్యం తాగడానికి పర్మిట్ కావాలన్నారు, చివరకి షాపులు వేలం వేసి ఆదాయం పెంచుకోవడం మొదలెట్టారు. ఇంకేముందీ, ఈ రోజుల్లో వీధి వీధికీ, సందు సందుకీ  బెల్ట్ షాపులే.
మన దేశంలో ఓ సౌలభ్యం ఉంది… చట్టాలు లేవనీ కాదూ, కానీ చట్టాలు పాటించే వారే బహు తక్కువ… ఎవడికి వాడే “ తనకి తానే చట్టం “ అనుకుంటాడు, రాజకీయ నాయకులైతే మరీనూ..  మన దేశ రాజ్యాంగంలో   ఫండమెంటల్ రైట్స్  అని కొన్నున్నాయి..అవేమిటో సాధారణంగా, ఆం ఆద్మీలకి అంతగా తెలియదు, ఏదో న్యాయ వాదులకి తప్ప. ఒకలా చెప్పాలంటే, మనిష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసేయడమూ, మన అదృష్టం బాగుండి, ఏ గొప్ప న్యాయ వాదినో కుదుర్చుకుని, ఫండమెంటల్ రైట్స్ పేరున తప్పించేసుకో వచ్చు. కింది కోర్టులు ఒప్పుకోక పోయినా, అత్యున్నత న్యాయస్థానం వారు, వాదం లోని నిజా నిజాలు గమనించి తీర్పులిస్తూంటారు. అప్పుడు తెలుస్తుంది… “ ఓహో ఫలానాది  ఫండమెంటల్ రైట్  అన్నమాట అని. సరే అనుకుని వీడు కూడా ఏదో ఓ తింగరి పని చేస్తాడు, వీడి రోజు బాగోపోతే, వీడి ప్లీడరు అంతగా వాదించ లేక పోతే, జైలు పాలవుతాడు… ఏదో  ఫండమెంటల్ రైట్  పేరు చెప్పి, , వాడెవడో నచ్చలేదని వాణ్ణి చంపేస్తేనూ, ఎవరో కళ్ళకింపుగా కనబడ్డారని ఆమె మీద అత్యాచారం చేస్తేనూ ఒప్పుకుంటారా మరి? ఇక్కడే అంతా గందరగోళం – వేటిని  ఫండమెంటల్ రైట్ అంటారో, సామాన్య ప్రజానీకానికి కూడా తెలియ చేస్తే బావుండును… అప్పుడు వాటిలో మనకి నచ్చినవి చేసుకుంటూ, చట్టం బారి నుండి కూడా తప్పించుకో వచ్చు కదూ…

మన పెద్ద వాళ్ళు చెప్పడం మూలాన అనండి, పుస్తకాల్లో చదవడం వలనో, చిన్నప్పటినుండీ, ఆడ వారికీ, మగ వారికీ ఉండే తేడాలు తెలిసేవి.  ఎవరెవరు, ఏఏ పనులు చేయాలో, చేస్తారో కూడా ఓ విధంగా అర్ధమయేది.. కాల క్రమేణా సమానత్వం పేరుతో పరిస్థితులు మారుతున్నాయీ, మారాలి కూడా… అందులో సందేహం లేదు.  హక్కులూ అవీ సమానం అన్నారు బావుందీ.. కానీ కొన్ని కొన్ని విషయాలు మరీ విపరీత పోకడలకి దారి తీస్తుందేమో..

సాధారణంగా స్త్రీ పురుషులు ఒకరివైపింకొకరు ఆకర్షితులవుతూంటారు…   ఆడం ఈవ్  నుండీ, అదే సాంప్రదాయంగా వస్తోంది…  జనాభా పెరుగుదల కూడా అలాగే జరుగుతోంది. కానీ  కొన్ని కొన్ని సందర్భాల్లో,  హార్మోన్ల   ప్రభావం మూలాన,  స్వలింగ  ఆకర్షణలు కూడా ఉంటూంటాయి.. ఎవరిష్టం వారిదీ.. వాళ్ళేదో గుట్టు చప్పుడు కాకుండా, వారి పని వారు చేసుకుంటూంటారు.. విదేశాల్లో అయితే, దీనిని ఆమోదిస్తారుట..  సమాజం లో కూడా వీరిని ఎవరూ వింతగా చూడరు.  మన దేశంలో ఇలాటి వాటి గురించి వింతగా చెప్పుకోవడమూ, అలాటి వారిని దగ్గరకు చేర నీయక పోవడమూ లాటివి జరిగేవి..  వీళ్ళా ఊరుకునేదీ? మొత్తానికి ఈ మధ్యన మన అత్యున్నత న్యాయ స్థానం వారు “ ఫరవా లేదూ.. ఎవరి దారిన వాళ్ళుండొచ్చూ.. ఇదంతా  ఫండమెంటల్ రైట్స్  లోకే వస్తుందీ అని తీర్పిచ్చేసారు…

మద్యం వలన ఆదాయం పెరుగుతుందని  నిషేధం ఎత్తేసి చట్ట బధ్ధం చేసేసారు.. జనాభా నియంత్రణ గురించి మొత్తుకుని మొత్తుకుని చివరకి చేతులెత్తేసారు.. జనాభా పెరిగి పోతోందాయె.. మరెలా ? స్వలింగ సంపర్కాన్ని చట్ట బధ్ధం చేసేస్తే సరీ అనుకున్నారు.. మనకు తెలిసినంత వరకూ ఆడా మగా కలిస్తే, అవేవో  ఎక్స్, వై క్రోమోజోంస్ కలిస్తేనే సంతానోత్పత్తీ అనీ.. ఇంక   ఎక్స్  తో ‍ఎక్స్ , వై తో  వై  కలిస్తే సంతానం లేదూ, చట్టు బండలూ లేదు. జనాభా తగ్గించడానికి ఓ దివ్యౌషధం కదూ…

కానీ  దీని వలన జరిగే పరిణామాలో? దేశంలో  అంతరించిపోయినవీ, అవుతున్నవీ ఎన్నో ఉన్నాయి..సంస్కృతి, భాష లాటివి. ఇప్పుడు కొత్తగా చేరేది  “అమ్మ“  అనే  వ్యక్తి. అసలు సంతానమే లేక పోతే, అమ్మ ఎక్కణ్ణుంచొస్తుందీ?  వైద్య విధానంలో ఇంక  పీడియాట్రీషియన్స్ కి కి గిరాకీలే ఉండరూ పిల్లలే లేక పోతే, వాళ్ళు వైద్యాలేం చేస్తారూ? హాయి కదూ—అప్పుడెప్పుడో  అబార్షన్స్ ని   లీగలైజ్  చేసారు.. ఇప్పుడు ఆ గొడవే ఉండదూ..  మెటిర్నిటీ  క్లినిక్స్ మూసేయాలి.. అన్నిటి లోకీ ముఖ్యం ఇటు పైన ఆడ పిల్లల  పెళ్ళిళ్ళకి అంతంత కట్నాలిచ్చుకోనక్కర్లేదూ….. ఆడ వారి మీద అత్యాచారాలు కూడా తగ్గు ముఖం పడతాయేమో…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు