ప్రతాప భావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ఈవారం ఒక సినిమా టాపిక్ తో మీముందుకు రావడానికి కారణం, ఇటీవల నిశ్శబ్ధంగా విడుదలై అద్భుతమైన విజయాన్నందుకొన్న ఒక చిత్రం, అది మనసుని ఆకట్టుకోవడమే....నిజానికది సినిమా అనేకంటే కొన్ని జీవితాల వాస్తవ చిత్రీకరణ...ఇది చిత్రసమీక్ష కాదు మంచి చెడులెంచడానికి....ఇందులో మంచే తప్ప చేదు లేదు...ఆ మంచి విషయాలు పాఠకులతో పంచుకోవాలనిపించింది... ఆ చిత్రమే.....c/o కంచరపాలెం.
సినిమా అంటే ఇలా ఉండాలి. అలా ఉండాలి. అని కొన్ని నిర్దుష్టమైన ఫార్ములాలు మన తెలుగు సినీ పరిశ్రమలో షికార్లు కొడుతుంటాయి. వాటిని మూస చిత్రాలు అనొచ్చు. థియేటర్లు ఉన్నాయి కాబట్టి అవి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. సినిమా అనేది ఫక్తు వ్యాపారం. అదీ కోట్లతో కూడుకున్నది. ప్రేక్షకులని మెప్పించడంలో, థియేటర్లకి రప్పించడంలో అంచనాలు కాస్త అటూ ఇటు అయితే డబ్బు బూడిదలో పోసిన పన్నీరే. తన చేతులు కాల్చుకోవాలని ఏ నిర్మాతా అనుకోడు. మంచి కథతో, నవీన సాంకేతిక విలువలతో సినిమా తియ్యాలని తపన ఎంత బలంగా ఉన్నా, పెట్టిన పెట్టుబడి తిరిగి రాదన్న భయంతో స్టార్ లకు కోట్లిచ్చి వాళ్ల కాల్షీట్ల కోసం ఎంతో కాలం ఓపిగ్గా ఎదురు చూస్తారు. మూస కథలైనా కనీసం స్టార్ వాల్యూస్ తో మినిమం గ్యారంటీకి ఆస్కారం ఉంటుందని, నాలుగు డబ్బులు కళ్ల చూడొచ్చని. ఓవర్సీస్ మార్కెట్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ ల రుచి చూశాక ఆ పిచ్చి మరీ ముదిరి పాకాన పడింది.
ఔత్సాహిక యువ దర్శకులు ప్రేక్షకులకు తమని తాము ‘కొత్తగా’ పరిచయం చేసుకోవాలన్న కాంక్షతో ఈ మధ్య బలమైన కథలతో, టెక్నిక్ లతో, తమదైన దృక్పథంతో, శైలితో ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. దానిక్కారణం అలాంటి చిత్ర నిర్మాణాలకి పెద్దగా ఖర్చు కాకపోవడమే!
దీనికి సరైన ఉదాహరణ c/o. కంచరపాలెం. ఏముందందులో- నటించిన వాళ్లు మనకు తెలియదు. తెర వెనుక పని చేసిన వాళ్లూ గొప్ప పేరు ప్రఖ్యాతులున్నవాళ్లు కాదు. భారీ సెట్టింగులు, విదేశీ షూటింగులూ లేవు. దర్శకుడి మొదటి సినిమా. మాటలు, పాటలు గొప్ప చేయి తిరిగినోళ్లు రాయలేదు. ఒక ఊళ్లో ఎనభై మంది ఊరి వాళ్లతో ‘ఎక్కడి పరిస్థితులు అక్కడ’ అన్నట్టుగా తీసిన తాజా చిత్రం. ఘనమైన ఫస్ట్ లుక్ లు, టీజర్లు, థియేట్రికల్ ట్రైలర్లు, ప్రమోట్ చేసే జిమ్మిక్కులు ఏవీ లేకుండానే అణువులా రిలీజై ఆకాశమంతైంది. ‘సినిమాలు ఇలా కూడా ఉంటాయా? ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనం చూడగలిగామా?’ అని థియేటర్ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకులు మురిసి పోతున్నారు. చూడమని తమ బంధు మిత్రుల చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మౌత్ పబ్లిసిటీతో ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
వెంకటేష్ మహ ఎన్నో ఏళ్లు అవకాశం కోసం ఆకలిగా ఎదురు చూసి, మరిన్నేళ్లు అంకిత భావంతో కృషి చేసి తెలుగు సినిమా ప్రపంచానికి ఒక అపూర్వమైన మైలు రాయిని కానుకగా ఇచ్చాడు. మన సినిమా సత్తాను కోట్లు కుమ్మరించి, అంతకంత వసూలు చేసిన బాహుబలే కాదు ఛ్/ఒ కంచరపాలెం కూడా ప్రపంచానికి చాటి చెప్పింది.
తన బలమైన పునాది తనే వేసుకున్న మహ ఇప్పుడు ఒక సెలబ్రిటి. విజయం అతని ఛ్/ఒ గా నిలిచింది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని ముక్క వాసన వేసే కథలతో అతనింటి ముందు నిర్మాతలు క్యూ కట్టే అవకాశం ఉంది. వాటికి లొంగకుండా, దీపం ఉండగనే ఇల్లు చక్కబెట్టుకోవాలని కాకుండా, తనదైన శైలితో నూతనత్వంతో చిత్రాలను నిర్మించి మహ సినిమాలంటే ‘మన సమాజంలోని ఒక పార్శ్వాన్ని హంగులు, ఆర్భాటాలు లేకుండా వెండి తెర మీద చూడ్డమే’ అన్న ఫీల్ తో జనం వెళ్ల గలగాలి. అలా అతను సినిమాలు తీసిన రోజున మనం మరిన్ని మంచి సినిమాలను చూశామన్న తృప్తే కాదు, ఎంతో మందికి తక్కువ బడ్జెట్ లో మంచి చిత్రాలు తీయాలన్న స్ఫూర్తీ కలుగుతుంది.   
హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టూ c/o కంచరపాలెం టీం.
 

మరిన్ని వ్యాసాలు