మన విద్యా వ్యవస్థ - హనుమాన్ ప్రసాద్

Our educational system

వేద వేదాంగాలు, ఉపనిషత్తులు పుట్టిన గొప్ప నేల మన భారత దేశం. మనం పాటిస్తున్న ఆచారాలు, విలువలు, పాశ్చాత్యులు సైతం మెచ్చి మన సంస్కృతులను అవలంబించుటకు ముందుకు రావడం మనం చాలా గర్వ పడాల్సిన విషయం.

ఎటువంటి ఆచారాలైనా ఆచరణ యోగ్యమైనప్పుడు, అనుకరించడం తప్పు కాదు. కానీ, అలా చేయనప్పుడు అది మనకు అనుకూలంగా ఉంటుందో ఉండదో చూసుకోవడం మన బాధ్యత.

అమెరికా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణగా తీసుకుంటే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక వయసు వచ్చేవరకూ ఆర్ధిక తోడ్పాటునందిస్తారు. ఆ తర్వాత వారు, వారి అభిరుచికి తగిన, అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ప్రవేశించి, ఏకకాలంలో చదువు, సంపాదన చేస్తారు....ఇలా చేయడం వలన చిన్న వయసులోనే వారికి ఆర్ధిక విషయాలైన జమా ఖర్చులూ, బాధ్యతలను తెలుసుకోగలుగుతారు...ఇది అక్కడి తల్లిదండ్రులు వారికి కల్పించే అవకాశం.

ఇక మన దేశానికొస్తే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. గంపెడు మంది మనుషులు, వారి మధ్య అనురాగం, ఆత్మీయతతోపాటుగా ఆర్థిక సహాయ సహకారాలు కూడా ఉమ్మడిగా జరిగేవి. కాలక్రమేణా పాశ్చాత్య ప్రభావం వల్ల కావొచ్చు, మారుతున్న ఆలోచనా విధానాల వల్ల కావొచ్చు, ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమై, వివిధ రకములుగా రూపాంతరాలు చెందుతూ న్యూక్లియర్ ఫ్యామిలీ....అనగా సంపాదించే తండ్రి, ఇంట్లో వ్యవహారాలు చూసే తల్లి, ఒక పాప, లేదా ఒక పిల్లాడుగా పరివర్తన చెంది, అతి తొందరగానే  DISK ( Double Income with a Single Kid ) గా ఎదిగాయి. అది DINK( Double Income with No Kid) నుండి  Living Relationship గా ప్రస్తుతం పరిఢవిల్లుతున్నాయి.

మరి ఇన్నిరకాలుగా రూపాంతరాలు చెందిన మన కుటుంబ వ్యవస్థలో మన పిల్లలకు అతి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు " ఆర్ధిక స్వాతంత్ర్యం " ఇచ్చేస్తున్నారు. వారికి ఒక రూపాయి సంపాదన కంటే పది రూపాయలు ఖర్చు చేయడంలో ముందుంటున్నారు. దాని ద్వారా అసలు డబ్బంటే లక్ష్యం లేకుండా తయారవుతున్నారు.

డబ్బు విలువ నేర్పడంలో తల్లిదండ్రులే విఫలమవుతున్నారని చెప్పొచ్చు.

సంపాదనే ధ్యేయంగా మసులుకుంటూ, పసివయసులో వారికి అందించాల్సిన ప్రేమానురాగాలను ప్లే స్కూల్స్ లో అరువుకు ఇస్తున్నారు. వారు కాస్త పెరిగి పెద్దయ్యాక, వారిలో పోటీతత్వం అంటే కేవలం ఆ సమయంలో ఏం ఉద్యోగం చేస్తే బాగా సంపాదించగలరో కేవలం దానిమీద శ్రద్ధ చూపిస్తూ వారి సహజ నైపుణ్యాలకు భిన్నంగా వారిమీద యుక్త వయస్సులో కార్పోరేట్ కళాశాలలలో, క్లాసులవారీగా గుర్తించి వారిలో ఉన్న విజ్ఞానం కాకుండా కేవలం వారు ఉన్నదాన్ని ఎంత రీ-ప్రొడ్యూస్ చేయగల్గితే చాలు అనుకుని మురిసిపోతున్నారు.

పిల్లలకు అతి ముఖ్యమైన విలువలతో కూడిన విద్యనందించే బదులు ఆర్ధిక విలువలను సంపాదించడం ఎలా అనే వాటిపైనే శ్రద్ధ చూపిస్తున్నారు.

నేడు కాలానుగుణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను వివిధ విద్యాలయాల్లో చేర్చుటకు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి బ్యాంకింగ్ రంగం ముందుంటే, మరొకసారి సాఫ్ట్ వేర్ రంగం ముందుంటుంది. కానీ పిల్లల శక్తి సామర్ధ్యాలు వాటికి తగినట్లుగా ఉన్నాయా, లేవా? అని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అంటే ఎంతో శ్రద్ధ, తపన ఉన్న విద్యార్థులకే అందని ద్రాక్షపండులా ఉండేది.  అలాంటిది ఈ రోజున వేలంవెర్రిగా వీధివీధిన ఒక ఇంజనీరింగ్ కాలేజీ వెలిసింది.  దాని ఫలితంగా ఆ విద్యకున్న ప్రముఖ్యత తగ్గిపోయి, అనర్హులైన వాళ్ళంతా చేరి, ఈ రోజున కొన్ని వందల సంఖ్యలో కళాశాలలు మూతపడడానికి ప్రత్యక్ష, పరోక్ష కారణభూతులై వేలకొద్దీ అధ్యాపకులు రోడ్డునపడ్డారు.

ఇక ఇంజనీరింగ్ పట్టభద్రుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మేలు. ఇటీవల ఉత్తర ప్రదేశ్లో 5వతరగతి అర్హత కల మెస్సేంజర్ పోస్టులకు, అది కూడా తాత్కాలిక పోస్టులకు కొన్నివేలమంది పీహెచ్ డీ, ఎం టెక్, ఎం బీ.ఏ, ఎం.సీ.ఏ పట్టభద్రులు అప్లై చేసారంటే మన పట్టభద్రులకు ఏమిగతి పట్టినదో కళ్ళారా చూసినట్లయింది.

కనుక తల్లిదండ్రులలో కనీస మార్పును మనం మనసారా ఆశిద్దాం. వారి ఆలోచనా శైలిలో మార్పు వాళ్ళ పిల్లలకు మంచి మార్గదర్శిగా ఉండాలని కోరుకుందాం

-హనుమాన్ ప్రసాద్

Associate Professor & Head Department of MANAGEMENT STUDIES SKD ENGINEERING COLLEG

E GOOTY Anantapur .DIst

మరిన్ని వ్యాసాలు