రామాయణం చెప్పిందేమిటి... - ఆదూరి హైమావతి

what ramayana told us

రామాయణం లోని ధర్మములన్నీ వేద ధర్మాలే. ధర్మాలు రెండు విధా లు. ఒకటి ప్రవృత్తి ధర్మం, రెండవది నివృత్తి ధర్మం. లోక సంబంధమైన ధర్మాలన్నీ ప్రవృత్తి ధర్మాలు.

"బిడ్డా! నీకు ఆకలైతే అన్నాన్ని భుజించు" అని చెబుతుంది ప్రవృ త్తి.  తక్షణమే నివృత్తి అడ్డు తగిలి  "బిడ్డా! నీకు ఆకలౌతోందని చేతికి చిక్కినదల్లా తినకు" అంటుంది.

ఎలాంటి తిండి తినాలి? ఏ రీతిగా తినాలి? అని బోధించేది నివృత్తి ధర్మం. మనస్సును వికల్పం చేసేది ప్రవృత్తి, హృదయాన్ని కరిగిం చేది నివృత్తి. బాహ్యమైన చర్యలకు సంబంధించినది ప్రవృత్తి.

ఈనాడు మనం లోకంలో కంటితో చూసేది, చెవులతో వినేది, మన స్సుతో అనుభవించేది అంతా ప్రవృత్తికి సంబంధించినదే. మన స్సుకు, ఇంద్రియాలకు అతీతమైన తత్త్వమే నివృత్తి. అట్టి నివృ త్తి మార్గమును బోధించాడు రాముడు. ఇదియే వేదము యొక్క ప్రధానమైన సూత్రం.
రాముడు దశరథుని కుమారునిగా పుట్టాడు. కాని, అతడు దశరథుని కుమారుడు కాదు, కౌసల్య గర్భంలో పుట్టలేదు; అగ్నిహోత్రం నుండీ నుండీ పుట్టాడు. ప్రవేశ జననం, ప్రసవ జన్మ కాదు. కనుక, రామ తత్త్వం ప్రాకృత సంబంధమైనది కాదు, ఇది మనస్సుకు, బుద్ధికి అతీతమైన తత్త్వం.

మంథర ఎవరు?
కైకకు రాముడంటే అత్యంత ప్రీతి. కైక తన స్వంత కుమారుడైన భరతుని కంటే రాముడినే అత్యంత ప్రేమతో చూసేది. కాని, మధ్యలో మంథర ఎవరు? ఒక పర్యాయం కైకేయి తండ్రియైన కేకయ రాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళినప్పుడు ఒక చోట అతనికి ఆడ, మగ జింకలు రెండు ఆడుకొంటూ కనిపించాయి. వెంటనే కేకయ రాజు మగ జింకను బాణంతో కొట్టాడు. ఆడ జింక ఏడ్చుకుంటూ తన తల్లిదగ్గరకు వెళ్ళి, ''అమ్మా! ఈ కేకయ రాజు నా భర్తను హతమార్చాడు. ఇప్పుడు నా గతి ఏమిటి?'' అన్నది. అప్పుడా తల్లి జింక కేకయ రాజు దగ్గరకు వచ్చి, ''రాజా! భార్యాభర్తలను విడదీయటం మంచిది కాదు. నీవు మహారాజువైయుండి ఇలాంటి పనికి పూనుకోవటం న్యాయం కాదు. ఇప్పుడు నీవు చేసిన పనియే నీ జీవితంలో అశాంతికి కారణమౌతుంది. నేనే విధంగా నా అల్లుని మరణంతో బాధ పడుతున్నానో అదే విధంగా, నీవు కూడా నీ అల్లుని మరణంతో బాధ పడతావు. దానికి నేనే కారణమౌ తాను''  అన్నది.  ఎవరు చేసిన పాపం అనుభవించక తప్పదు.

ఆ జింకయే మంథరగా పుట్టి, దశరథుని మరణానికి కారకురాలై, కేకయ రాజుకు దుఃఖాన్ని కల్గించింది. ఈవిధంగా విచారణ చేస్తే వేద శాస్త్ర పురాణాల్లో ఇలాంటి  ప్రమాణాలు చాలానే  కనిపిస్తాయి. దుర్జనుల స్పర్శ కూడా చాలా ప్రమాదకరం.

అందుకే ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన సంప్రదాయం కాదు. రెండు చేతులూ జోడించి నమస్క రించడం మన సంప్రదాయం.

మంథరకు పాత సంకల్పం మనస్సులో ఉంది. దశరథునిపై లేని పోని చాడీలు చెప్పి, అతని పట్ల కైకకు గల ప్రేమను చెడగొట్టాలని ఆమెకు బుద్ధి పుట్టింది. ఇంతలో దశరథుడు శ్రీరామ పట్టాభిషేక శుభ వార్తను కైకకు తెలియజేయను   మేళతాళాలతో ఊరేగింపుగా వస్తు న్నా డు. గుఱ్ఱములు సకిలిస్తున్నాయి, ఏనుగులు ఘీంకరిస్తున్నాయి, మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. ఈ శబ్దములు ఎక్కడి నుండి వస్తున్నాయో చూద్దామని గూని మంథర భవనం పైకి ఎక్కి చూసింది. దశరథుడు ఊరేగింపుగా రావటం కనిపించింది. రాజు ఇంత వైభవంగా ఉండటం ఆమెకిష్టం లేదు. క్రిందికి దిగి వస్తుంటే కౌసల్య చెలికత్తె ఒకామె ఎదురు వచ్చింది. ఆమె కౌసల్య తనకిచ్చిన పట్టు వస్త్రాలను, ఆభరణాలను ధరించి వాటిని కైకకు చూపించాలని వస్తోంది. మంథర ''ఏమిటి నీవింత అలంకారం చేసుకొని వస్తున్నావు? ఎవరి చ్చారు నీకివన్నీ?'' అని అడిగింది. తన కుమారుడైన రాముడు రాజుగా పట్టాభిషి క్తుడు అవుతున్నాడన్న ఆనందంతో కౌసల్య తన దాసీలందరికీ పట్టు వస్త్రాలను, నగలను బహూకరించిందని ఆమె చెప్పింది.  ఈ మాటలు వినగానే మంథరకు అసూయ కల్గింది. తనకు కూడా అట్టి గౌరవం మర్యాద, బహుమతులు దక్కనందుకు ఆమెకు కోపం వచ్చింది.

వెంటనే కైక మందిరం లోనికి వెళ్ళింది. ఆ సమయంలో కైక చాలా ఆనందంగా అలంకరించుకుంటున్నది. మంథర ''కైకా! ఏమి నీ వైభవం? ఏమిటీ అలంకారం? ఎందుకోసం చేసుకుంటున్నావు?" అని అడిగింది. కైక మంధర మాటలను లెక్క చేయలేదు. దగ్గరకు వెళ్ళి  ''కైకమ్మా! రాజుకు నీవంటే చాలా ప్రేమ అని భావిస్తున్నావు. అది కపట ప్రేమ. ఆ ప్రేమను నమ్మి నీవు మోసపోతున్నావు. రానున్న కాలం లో నీ పరిస్థితి  చాలా దిగజారి పోనున్నది. చూడు, నా మాట విను'' అంటూ ఆమె భుజంపై సున్నితంగా కొట్టింది. ఆ స్పర్శ చేత ఆమెలో ఉన్న దుర్భావాలు కైకలో ప్రవేశించాయి.

కనుక దుర్గుణములు గలవారితో మనం ఎప్పుడూ చేర కూడదు.  వారి స్పర్శ కూడా మనకు చాలా ప్రమాదం తెప్పిస్తుంది. అంతవరకు రాముణ్ణి ఎంతగానో ప్రేమించిన కైక ఆ క్షణంలో అతనికి విరోధిగా మారి పోయింది. అసూయకు మారు పేరైన మంథర తన దుర్బోధలతో ఆమె మనస్సును పాడు చేసింది. అసూయ అనే పెను భూతం పట్టిన వారెవ్వరూ బాగు పడరు. కనుకనే, పెద్దలు గురువులూ  చెబుతుంటా రు – ''త్యజ దుర్జన సంసర్గం.'' దుర్గుణములు గల వారితో సహవాసం చేయ కూడదు. విూ ప్రాణం పోయినా సరే, అసూయా పరులతో స్నేహం చేయ కూడదు.

మంథర' ఈనాటికీ సజీవంగానే ఉన్నది!

దుర్గుణములన్నింటి లోనూ అసూయ చాలా చెడ్డది. అసూయ చేతనే లోకం మూడు భాగములు చెడి పోతున్నది. అందంగా ఉన్నవారిని వికారంగా చేయటం.... ఫస్ట్​ క్లాసులో పాసయ్యే వారిని పాడు చేయటం... ఈ రీతిగా బాగున్న వారిని చెడ గొట్టటమే అసూయ యొక్క పని.  
రామాయణంలో రావణుడు మరణించాడు గాని, మంథర ఈనాటికీ మరణించ లేదు. అసూయ అనే మంథర ఇప్పటికీ సజీవంగానే ఉన్న ది. ఈ 'మంథర'ను మరణింపజేసేవారు ఎవ్వరూ లేరు. దీనిని లెక్క చేయకుండా ఉండటమే మనం చేయ వలసిన పని.

చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. చెడు వినకు, అనకూ, చేయకు అన్నారు. ఇదే రామాయణం అందించే ప్రధానమైన ఆదర్శం. చెడ్డ మాటలు చెప్పిం ది మంథర చెడ్డ మాటలు విన్నది కైక. వారి గతి చివరకు ఏమైంది? ఈనాడు లోకంలో స్త్రీలెవరైనా మంథర లేక  కైక అని పేరు పెట్టు కుంటున్నారా? కౌసల్య పేరు పెట్టుకుంటారు గాని, కైక పేరు గాని, మంథర పేరు గాని ఎవ్వరూ పెట్టుకోరు.

చెడ్డ చూపులు చూశాడు కీచకుడు. తత్ఫలితంగా భీముడు అతని తల పగలగొట్టాడు. ఈనాడు మగ వారిలో ఎవరైనా కీచకుని పేరు పెట్టుకుంటున్నారా? ఎవ్వరూ పెట్టుకోరు. చెడ్డ మాటలు చెప్పిన వారిని, చెడ్డ మాటలు విన్న వారిని, చెడ్డ చూపులు చూసిన వారిని నిరసిస్తుంది లోకం.
ఈనాడు  ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు,శకుని అనే పేర్లు ఎవరైనా పెట్టుకుని పిలవగా విన్నామా. చెడు ప్రవర్తన, చెడు తలంపులు, భావనలు, చెడు వృత్తి గల వారినెవ్వరూ హర్షించరు. ఎంతో  శివభక్తి గల, మహా బలవంతుడైన , నాలుగు వేదాలూ, ఆరు శాస్త్రాలూ చదివిన రావణాసురుని పేరెవరైనా పెట్టుకుంటున్నారా?

చదవడం కాదు ముఖ్యం ఆచరణ. అందుకే చదివిన దాన్ని ఆచరించాలి.

[భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి ఉపన్యాసాల ఆధారంగా]

మరిన్ని వ్యాసాలు