ఇంట్లోనే చూసేద్దాం - భమిడిపాటిఫణిబాబు

will watch at home

చిన్నప్పుడు, ఓ సినిమాకి వెళ్తే, చాలా రోజుల పాటు దాని ప్రభావం ఉండేది..  ఆ సినిమా లోని హీరో మనమే అయినంతగా ఊహించేసికుంటూ… కదూ… ? సినిమాలు కూడా అలాగే ఉండేవి… కుటుంబ వాతావరణమో, లేదా ఏ దేవుడి గురించో తీసేవారు. మధ్యలో ఎన్నున్నా, చివరకి ఏదో నీతి బోధించేవారు. నూటికి 70 మందికి కనీసం ఆ నీతి వంటబట్టేది. కాలక్రమేణా, ఆ “నీతి ప్రబోధాలు“ కొండెక్కేసేయ్. ఇప్పుడు, అమ్మాయిలని బుట్టలో ఎలా వేయాలో,  నచ్చని వాడిని ఎలా నరికేయాలో, etc..etc.. ఇంకోటుందండోయ్— రాజకీయాల్లో ఎడా-పెడా వాగ్దానాలెలా ఇవ్వాలో కూడా అప్పుడప్పుడు నేర్పుతూంటారు.

ఒకానొకప్పుడు న్యూస్ పేపర్లు చదవడమనేది ఓ గొప్ప అలవాటుగా ఉండేది. General Knowledge  పెంచుకోవడం కోసమనండి, లేదా మన వాడుక భాష అభివృధ్ధి చేసుకోవడానికైతేనేమిటి. ఉపయోగకరంగా ఉండేవి…రానురానూ పేపర్లలో వాడుతూన్న భాష ధర్మమా అని, మనకొచ్చిన  ఏ కొద్దో గొప్పో భాష మర్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి.

ఒకానొకప్పుడు సినిమాలు దేశంలోని లొకేషన్లలోనే తీసేవారు, ఖర్చు కూడా అంతగా ఉండేది కాదు. కానీ, ప్రజల్ని ఉధ్ధరించేద్దామనే సదుద్దేశంతో, ఎన్ని విదేశీ లొకేషన్లుంటే అంత గొప్ప అనే పధ్ధతి లోకి వచ్చేసారు మన నిర్మాతలు. యూనిట్ అంతా విదేశాలకి వెళ్ళాలంటే మరి ఖర్చుతో కూడిన పనేగా. దీనికి సాయం, హీరో హీరోయిన్ల పారితోషికాలైతే కోట్ల రూపాయల్లోకి వెళ్ళి పోయాయి. ఆతా వేతా జరుగుతున్నదేమిటంటే, ఓ సినిమా తీసేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలవుతోంది. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే  అంత “భారీ“ చిత్రమన్నమాట. ఆ సినిమా ఎంత చెత్తదయినా. మరి ఆ ఖర్చు పెట్టిందంతా తిరిగి రావొద్దూ? ఒకానొకప్పుడు స్వదేశానికే పరిమితమయిన సినిమాలు, ప్రపంచమంతా రిలీజు చేస్తేనే కానీ, కిట్టుబాటవడం లేదు. సినిమా రిలీజైన మర్నాటి నుండీ ప్రకటనలూ..మొదటిరోజు కలెక్షనింతా, మొదటి వారం ఇంతా అంటూ..

ఇదివరకటి రోజుల్లో అయితే pirated CDs  వచ్చేవి.. Footpathల మీద అమ్మే వారు గుర్తుందా? క్వాలిటీ మరీ ఒరిజినలంత కాక పోయినా, పనైపోయేది. ఆ CDల వ్యాపారం కొనసాగాలంటే ముందుగా ఓ CD Player అవసరమోటీ. ఈరోజుల్లో ప్రపంచమంతా  Digitalమయం కదా..  ఒక్కోప్పుడు ఆ “భారీ“ సినిమా రిలీజయ్యే లోపు లోనో, మహా అయితే రెండో రోజుకో, Internet లో Upload చేసేస్తున్నారు…ఈ సినిమా నిర్మాతలందరూ నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామూ, అన్ని కోట్లు ఖర్చు పెట్టామూ. అంటూ. అసలెవడు ఖర్చు పెట్టమన్నట్టూ?  అర్ధం పర్ధం లేని పాటలూ అవీ  foreign locationsలో, హీరోయిన్ కి  engagement అమెరికా లోనూ, పెళ్ళి   మారిషస్ లోనూ, హనీమూన్  Alps లోనూ, గర్భం Parisలోనూ, విలన్లతో ఫైటింగ్ ఇంకో సింగపూర్ లోనూ అవసరమంటారా? అవేవో మన దేశంలో తీస్తే సరిపోదా?  పోనీ అలాగని ఏ విదేశీ సినిమా అయినా, మన దేశంలో తీసిన పాపాన్న పోయారా? మరి అంత వెంపర్లాట ఎందుకో?

పోనీ ఇదివరకటి రోజుల్లో అయితే, విదేశాల్లోని వింతలూ, విశేషాలూ అందరికీ చూసే అవకాశం లేదు కాబట్టీ అనుకోవచ్చు. ఇప్పుడలాగ కాదే.. ఈ సినిమాల వాళ్ళు చూపించే  Graphics కంటే, లక్షణంగా TV ల్లో కావాల్సినన్ని Channels ఉన్నాయి. ఇంకో విషయం—సినిమా ఖర్చంతా వీలైనంత త్వరలో తిరిగి రాబట్టుకోవడానికి, దేశంలో ఎడా పెడా రిలీజుచేస్తారు. ఒకే నగరంలో ఉండే Multiplex  ల్లో..భార్యా భర్తా, ఇద్దరు పిల్లలూ కలిసి వెళ్తే  ఖర్చు తడిపి మోపెడవుతుంది… 20రూపాయల వాటర్ బాటిల్ 50 Rs, ఇంక మిగిలిన చెత్తంతా,  బయట కంటే మూడింతలు…పోనీ అదేదో  Weekends enjoyment  అనుకుందామా అంటే, ఆ సినిమా థియేటర్లో పెట్టే  sound  కి గుండె బేజారెత్తి పోతుంది.. బయటంతా  Sound Pollution  అని పెద్ద పెద్ద లెక్చర్లిస్తారే, మరి అక్కడ జరిగేదేమిటీ?..

ఈ గొడవలన్నీ పడలేక, హాయిగా ఏ  TV  లోనో వచ్చినప్పుడు చూస్తే హాయనిపిస్తుంది—ఇదివరకటి లాగ మరీ సంవత్సరాలు పట్టడం లేదు ఈ రోజుల్లో, మహా అయితే రెండు మూడు నెలల్లో వచ్చేస్తున్నాయి… కానీ మళ్ళీ ఇక్కడో గొడవుంది—రెండు గంటల సినిమాని, మాయదారి  Commercial Ads  తో మూడున్నర గంటలు భరించాలి… ఈ  మధ్యన  Amazon Prime Video, Netflixల ధర్మమా అని, ఇంకా తొందరగానే వచ్చేస్తున్నాయి… మరీ ఇదివరకటి రోజుల్లో లాగ  First Day, Firsh Show  అక్కర్లేదనుకుంటే, హాయిగా మనిష్టం వచ్చినప్పుడు చూసుకోవచ్చు…

ఈ ప్రస్థానంలో వస్తూన్నవే, వివిధ  sites  లోనూ  upload  అవుతూన్న సినిమాలు.. వాటిని చూడ్డంలో తప్పేమిటో నాకైతే అర్ధమవదు… ప్రతీ విషయమూ  commercialise  అయి పోయిన ఈరోజుల్లో, ఎవరైనా లాభసాటి వాటికే చూసుకుంటారు కదా…సినిమాలు తీసే వాళ్ళు లాభాల కోసం చూసుకున్నప్పుడు, చూసే వాళ్ళు చూసుకుంటే తప్పేమిటీ?  మహా అయితే, ప్రభుత్వానికి వచ్చే Entertainment Tax కి గండి పడుతోందనొచ్చు… అలాటప్పుడు, entertainment  పేరుతో  torture  చేస్తూన్న సినిమాల మాటేమిటీ? దానిక్కూడా  Tax  కట్టాలంటారా?..

సర్వేజనా సుఖినోభవంతూ…

 

 

మరిన్ని వ్యాసాలు