ప్రేమ గురించి చెప్పమంటే ప్రేమికులు కథలు కథలుగా చెబుతారు. అసలు ప్రేమంటే ఏంటి.? ఆడ, మగ మధ్య పుట్టే ఆకర్షణ బలపడి ఓ బంధంగా మారితే దాన్ని ప్రేమంటామా.? ఇంకేమైనా ఉందా.? ఇంకా చాలా చాలా ఉంది. ప్రేమ ఏ వయసులో పుడుతుంది.? ఏ వయసులోనైనా పుట్టొచ్చు. సినిమాలు చూడట్లేదేటీ.? అంటోంది నేటి యువత. ఏడో క్లాస్ ప్రేమ కథల్ని కూడా చూసేశాం. అంతకన్నా తక్కువ వయసులో ప్రేమ కథల్ని కూడా చూసేశాం. సినిమాల వరకూ తీసుకుంటే, కొన్ని కథలకు విషాదమే ముగింపు. మరి కొన్ని కథలకు పెళ్లి ముగింపు. ఇంతకీ ప్రేమ గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి నేటి యువతం ఆలోచిస్తోంది.
ఇరవై ఏళ్లు కని పెంచిన తల్లితండ్రుల కంటే అనుకోకుండా పరిచయమైన వ్యక్తి పట్ల కలిగే ఆకర్షణ ద్వారా పుట్టిన ప్రేమకి నేటి యువతరం జై కొట్టేస్తోంది. ఇది తప్పు కదా అని తల్లితండ్రులు అడిగితే, మీరు ఇరవై ఏళ్లే పెంచారు. నేను ఇంకో ఎనభై ఏళ్లు బతకాలి. అది ఇంకొకరితో. ఆ ఇంకొకర్ని నేను ఎంచుకుంటే తప్పేంటీ? అనే సమాధానం నేటి యువత నుండి వస్తోంది. ఇదీ కొంత నిజమే. కానీ తొమ్మిదో తరగతి చదివే అమ్మాయికి, లేదా అబ్బాయికి ప్రేమ విషయంలో తల్లితండ్రుల్ని ఎదిరించే హక్కు ఉందా? ఇదే కీలకమైన పాయింట్. మైనర్లుగా ప్రేమించుకుందాం. మేజర్లయ్యాకా పెళ్లాడేద్దాం అనే ఆలోచనతో చాలా మంది ప్రేమికులున్నారు. మేజర్ అయ్యే వయసు వచ్చిన రోజే వైవాహిక బంధంతో ఒక్కటవుతున్నారు కానీ, సంసార జీవితం నడపడానికి తగినన్ని ఆర్ధిక వనరులు లేక బలవన్మరణాలకు పాల్పడడం, లేదా విడి పోవడం చేస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని ప్రేమ కథలూ, వెండి తెరపై ఎలా సూపర్ హిట్ అవ్వవో, రియల్ లైఫ్ లోనూ అంతే.!
తల్లితండ్రులు తమ పిల్లల్ని లగ్జరీస్ లైఫ్‌కి అలవాటు పడేలా చేయడం, లేదంటే వారి పట్ల నిర్లక్ష్యం చూపడం ఇలాంటి కొన్ని చర్యలు పిల్లల్ని వేరే ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. తమ పిల్లలు ఏం చేస్తున్నారు.? ఎవరితో తిరుగుతున్నారు.? వంటి విషయాలపై ఆరా తీసేంత తీరిక ఈ రోజుల్లో ఎంత మంది తల్లితండ్రులకు ఉంది.? తమ పిల్లల ప్రేమ గురించి తెలియగానే నానా యాగీ చేసే తల్లితండ్రులే కాదు, వారిని అర్ధం చేసుకునే తల్లితండ్రులూ ఉన్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తల్లితండ్రుల బాధేంటో పిల్లలకు అర్ధమవుతుంది. పిల్లల మనసులో ఏముందో తల్లితండ్రులకు తెలుస్తుంది. పిల్లల్ని ప్రేమించే తల్లితండ్రులు తమ పిల్లల మనసెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. బయటి వ్యక్తి ప్రేమలో పడే పిల్లలు కని, పెంచిన తమ తల్లితండ్రుల్ని ప్రేమించాలన్న కనీస బాధ్యతను గుర్తెరగాలి. అప్పుడే ప్రేమ గెలుస్తుంది. రెండు మనసులు కలిస్తే ప్రేమ కాదు. రెండు శరీరాలు కలిస్తే సంసారం కాదు. రెండు జీవితాలు కలవాలి. ఆ జీవతాల వెనక ఎన్నెన్నో ఆశలు, బాధ్యతలు ఉంటాయి. వాటిని నెరవేర్చడమే 'ప్రేమ'.!