మనలో కొంతమంది (మాత్రమే) చదువు పూర్తయ్యాక ఏదో ఒక ప్రొఫెషన్లో తమదైన శైలిలో పనిచేస్తూ తగిన అనుభవం గడిస్తారు. నిష్ణాతులవుతారు. మరికొంతమంది కేవలం భుక్తికోసం ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ల ఎయిటవర్స్ డ్యూటీ శాలరీ కోసమే! ఇలాంటివాళ్లు అన్ని ప్రొఫెషన్లలో ఉంటారు. అయితే ఉప్పుకప్పురంబులాగా అంత ఈజీగా బయట పడరు. కాకుల మధ్య ఉన్నప్పటికీ గొంతు విప్పంగానే కోకిల అస్తిత్వం ప్రపంచానికి బట్టబయలు అవుతుంది. అలాగే సమయం వచ్చినప్పుడు అసలైన ప్రొఫెషనల్ సత్తా బయట పడుతుంది.
ఉదాహరణకు ఒక డాక్టర్‍ను తీసుకుందాం.. సాధారణంగా ఎవరైనా రోగంతో ముక్కుతూ, మూలుగుతూ వస్తే ఓ నాలుగైదు మందులు రాసి, రెండు మూడు రోజుల తర్వాత కనిపించమని ఆ పేషెంట్ ద్వారా తన ప్రతిభను పరీక్షించుకుంటాడు. ఇలా సాధారణంగా తొంభై శాతం జరుగుతుంది. మిగతా పది శాతం కేసులు ఎప్పుడు, ఎలా వస్తాయంటే? అవి రెప రెప లాడుతూ, క్రిటికల్ కండీషన్‍తో పేషెంట్ క్రమంగా మృత్యువు ఒడిలోకి ఒరిగిపోతున్న కేసులు. ఆ సమయంలో డాక్టర్ తొట్రుపడకుండా, క్షణాల్లో ఒక పద్ధతిగా ఆలోచించుకుని చెయ్యాల్సినవన్నీ మనసులో కూర్చుకుని కరెక్ట్ డోస్ ఇంజక్ట్ చేసి పేషెంట్‍ను మృత్యుముఖం నుంచి ఇవతలకు లాక్కొస్తాడు. ఆయనే నరుడి రూపంలో ఉన్న వైద్య నారాయణుడు.
ఇది ఓ లాయర్ కైనా, ఇంజనీర్ కైనా, మరే వృత్తి కైనా వర్తిస్తుంది. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనలాగానే సంబంధిత సబ్జెక్ట్ లో యావరేజ్, బిలో యావరేజ్, ఎబో యావరేజ్ మార్కులు తెచ్చుకున్నవాళ్లు వాళ్లలోనూ ఉంటారు. కొతమంది వృత్తిపట్ల అంకిత భావంతో అహర్నిశం శ్రమిస్తూ సబ్జెక్ట్ మీద బలమైన పట్టు సంపాదిస్తారు. వాళ్లు చేయేస్తే అన్నీ సానుకూలమైపోతాయి. అదే హస్తవాసి.
అలాంటివాళ్లని ఐడెంటిఫై చేయలేం. మనం వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడే అనుభవంలోకొస్తుంది. మామూలు విషయాల్లో అయితే ఫర్వాలేదు కానీ క్రిటికల్ కేసుల్లో టైం చాలా చాలా ఇంపార్టెంట్ అయి, తీసుకునే డెసిషన్ అతి ముఖ్యమైన సందర్బాల్లో కొంతమంది జీవితాలను కోల్పోతారు.
ఆప్షన్ మన చేతుల్లో ఉంటే ఫర్వాలేదు కాని మన చేతుల్లో లేనప్పుడు, అంత సమయం దొరకప్పుడు? మనం అసమర్థుని చేతిలో పడితే దానికి కారణం..
మన తలరాతా? పూర్వజన్మ సుకృతమా? లేక మరో లాజిక్కేమైనా ఉందా? తెలియదు.
నేనెప్పుడూ నా సన్నిహితులకి ఒక ఎగ్జాంపుల్ చెబుతుంటాను.
అర్ధరాత్రి వేగంగా వెళుతున్న ఒక ట్రైన్‍లో కూపేలోని ఒక వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు-ఆ ట్రైన్ లో-
కేస్ 1. డాక్టర్ లేకపోవడం, స్టేషన్ కూడా చాలా దూరంగా ఉండడం
కేస్ 2. అదే కూపేలో ఒక డాక్టర్ ఉండడం, సమయానికి సరైన ముందస్తు చికిత్స (ఫస్ట్ ఎయిడ్) చేసి రోగిని కాపాడ్డం.
కేస్ 3. అదే కూపేలో ఒక డాక్టర్ ఉండడం, కాని ‘మనకెందుకొచ్చిన ఖర్మ..’ అని మిన్నకుండడం
వీటిన్నంటికీ వెనకాల ఏవన్నా కారణముంటుందా? ఏమో!
*****