" మాతృదేవోభవ! పితృదేవోభవ" "ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి దండ్రులు మనకు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక సార్ధకత చేకూర్చేది ఒక "ఆచార్యుడు" మాత్రమే.
ఒక విధంగా చెప్పాలంటే, తల్లిదండ్రులకు తమ పిల్లల మీద మమకారం వుండడం అత్యంత సహజం. కానీ, ఎటువంటి 'రక్త సంబంధం లేకుండా, కేవలం సేవాతత్పరతతో సదా విరజిల్లే "గురువే" తల్లిదండ్రుల కంటే గొప్పవారు అని మనం అంగీకరించక తప్పదు.
మన సమాజంలో '"గురువు" అంటే , అజ్ఞానంధకారము నుండి మనల్ని జ్ఞాన మార్గమున నడిపించువాడు అనే అర్ధం వున్నది. గురువే మనకు ప్రత్యక్ష దైవం అని కూడా భావించవచ్చును. వారి ఆశీస్సులు లేకుండా ఏ శిష్యులు ఎదగలేరు . శిష్యులకు మార్గదర్శనము చేసేప్పుడు, తనే ఒక ప్రత్యక్ష మార్గదర్శిగా నిలబడి, తన అనుభవాన్ని అంతటినీ రంగరించి, శిష్యుల యొక్క అభివృద్ధికి పాటుపడే ఒక నిత్య విద్యార్ధి గురువు.
తల్లి దండ్రులు, తమ పిల్లల అవసరాలు దగ్గర వుండి తీరిస్తే, ఒక గురువు ఆ పిల్లల జ్ఞాన తృష్ణ తీర్చే కల్ప తరువు. పూర్వాశ్రమములో మనకు రెండు రకాల గురువులు వుండేవారు. ఒకరిని "ఆచార్యుడు" అని మరొకరిని "ఉపాధ్యాయుడు" అని సంబోధించేవారు.
వీరిలో ఆచార్యుడి ది గొప్ప పాత్ర. ఆయన విద్యాభోదనలో అత్యంత సూక్ష్మమైన విషయాలతో పాటు, సమాజం లో ఒక ఉత్తమ పౌరుడుగా విద్యార్ధి ఎలా వుండాలో అని మార్గదర్శనము చేసేవారు. విద్యార్థులు గురువులు నివసిస్తున్న ప్రదేశానికే వెళ్ళి వారికి పరిచర్యలు చేస్తూ విద్యా విషయాలు సంగ్రహించేవారు.
ఇక ఉపాధ్యాయుడు పాఠ్యాంశం లో వున్న విషయాలను విద్యార్ధులకు చక్కగా భోదించి దానికి ప్రతిఫలముగా కొంత సొమ్మును తిరిగి పొంది దానిని ఒక వృత్తి గా తీసుకొనినవాడు.
కావున సమాజం, ఉపాధ్యాయుడి కంటే ఎటువంటి లాభాపేక్ష లేని ఆచార్యులకు అగ్ర తాంబూలం ఇచ్చెడిది. ఆచార్యులు నివసించే ప్రదేశాన్ని గురుకులం అని పిలిచేవారు. అందులో ప్రవేశ మార్గములే బహు కష్ట సాధ్యమైనది. ఎందుకంటే, ఒక శిష్యుడు, గురువును పలు విధములుగా సంతృప్తి పరచిన తరువాతనే, తనకు ప్రవేశ అర్హత కలిగేది. ఒక్కసారి ప్రవేశించినాక గురువును అతి దగ్గరగా చూసి నేర్చుకునే అదృష్టం వారికి కలిగేది. అందువలనే వారు ఎరిగి పెద్దయ్యాక ఒక్క చదువు లోనే కాదు, సంస్కారములో గుణ గణాలలో అన్నింటి లోనూ రాణించి సమాజం లో ఒక భాద్యతాయుతమైన పౌరులుగా మసులుకును భాగ్యం లభించెడిది.
కాలక్రమేణా, ఈ విద్యా వ్యవస్థ, పాఠశాల, కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ గా రూపాంతరం చెంది, ఒకప్పుడు శ్రద్ధా భక్తులతో విద్యను అభ్యసించు స్థాయి నుండి ఈనాడు చదువు "కొనే" దౌర్భాగ్యపు స్థితికి చేరుకున్నది.
విద్యా వ్యవస్థ మారినా "గురువు" ఎప్పుడూ మారలేదు. తాము ఏ రంగం లో వున్నా, అరకొరకు, చాలీ చాలని జీత భత్యాలు తీసుకొని తమ జీవితాలు వెల్లడిస్తున్నా, తన శిష్యులను మాత్రం నిర్లక్ష్యం చేయకపోవడం వాళ్ళు విద్యా సరస్వతి కి ఇచ్చే అపురూప అమూల్యమైన గౌరవం.
కావున నేటి విద్యార్ధులు ఒక గురువు స్థానాన్ని గౌరవించి మంచి నడవడికలు నేర్చుకుని ఉన్నత స్థితులకు చేరడానికి సోపానాలుగా గురువు యొక్క తోడ్పాటు తీసుకోవాలని ఆశిద్దాం.
రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు, ఒక విద్యార్ధికి ఉత్తమ గురువు లభించడం అదృష్టం అయితే, ఒక గురువుకు 'ఉత్తమ శిష్యుడు" లభించడం పూర్వజన్మ సుకృతంగా భావించడం ఒక్క గురువుకే సాధ్యం. ఎందుకంటే, ఎంతటి జ్ఞాన సంపత్తి వున్న గురువైనా, తమను తాము ఎప్పటికీ "నిత్య విద్యార్ధులం" అని వినయం గా చెప్పుకునే గురువులు అందరూ మనకు ఆదర్శం.