జయీభవ.. విజయీభవ.. - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

దసరా పండగొచ్చిందంటే చాలు  అందరికీ హడావిడే.. దసరా మామూళ్ళూ, ఉద్యోగస్థులకి బోనసులూ, ( కొన్నిచోట్లైతే దీపావళికిస్తారు ఈ బోనస్ ), ఊరంతా  తొమ్మిదిరోజులూ పందిళ్ళూ, చివరిరోజు విజయదశమి రోజున రావణాసురుడి బొమ్మ ని తయారుచేసి, దాన్ని బాణా సంచాతో , నిప్పుపెట్టి దహనం చేయడంతో మొత్తానికి పూర్తయేది.

కర్మాగారాల్లోనూ, వృత్తి పనులు చేసుకునేవారూ, తమతమ అస్త్రశస్త్రాలకి “ ఆయుధ పూజ “ చేయడం, ఒక సాంప్రదాయం… ఇంక  నడిపే వాహనాలకి కూడా దండలువేసి అలంకరించడమైతే ఉంటుందే.. ఇవన్నీ సాధారణంగా దసరాల్లో జరిగే వేడుకలు. ఇప్పుడంటే , ఎక్కడ చూసినా కార్పొరేట్ స్కూళ్ళే (  LKG  నుంచీ )  అవడంతో, చిన్నప్పుడు చేసుకునే కొన్ని అద్భుతమైన సంబరాలకి, ఈనాటి పిల్లలు దూరమయ్యారనడంలో  సందేహమే లేదు. అవన్నీ నవ్వులాటగా కనిపించొచ్చు, ఈ తరానికి, కానీ అందులో ఉండే ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది.

ఆ రోజుల్లో,   అక్షరాభ్యాసం నుండి, అయిదవ తరగతి దాకా,  అగ్రహారంలోని ఎలిమెంటరీ స్కూల్లోనే చదువంతా.. అయిదుక్లాసులకీ కలిపి మొత్తం  మహా ఉంటే ఓ అయిదారుగురు  టీచర్లుండేవారు. ఈరోజుల్లోలాగ కూర్చోడానికి  కుర్చీలూ, టేబిళ్ళూ ఉండేవి కావు.. నేలబారు బల్లోటుండేది. మాస్టారుకి మాత్రం ఓ కుర్చీ,  టేబులూ… బ్లాక్ బోర్డైతే సరేసరి…  ఈ స్కూళ్ళకి పెద్దపెద్దభవనాలుకూడా ఉండేవి కావు. ఓ పాకలో బడి నడిపేవారు.. దానిని “ పాకబడి “ అనేవారు. అక్కడ ఓనాలుగైదేళ్ళు విద్యాభ్యాసం చేసిన తరువాతే, హై స్కూల్ లో ఫస్ట్ ఫారంలో చేరడం.

ఈ పాకబడిలో అతిముఖ్యమైన పండగ దసరా.. దసరా అవడం తొమ్మిదిరోజులైనా, చివరి మూడురోజులే శలవిచ్చేవారు… దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి.   స్కూల్లో చదువుకునే పిల్లలు ( ఆడ, మగ ) అందరూ ఊరేగింపుగా. అగ్రహారమంతా తిరిగి రావడమో మధుర జ్ఞాపకం. స్కూల్లో చదివే ప్రతీవిద్యార్ధి ఇంటికీ , చేతులో గిలకలు పట్టుకుని వెళ్ళడం, స్కూల్లో  బోధించే ఉపాధ్యాయులు కూడా తోడొచ్చేవారు. అందరూ కలిసి… “  జయీభవ.. విజయీభవ.. “ అంటూ కేకలేసుకుంటూ ఒక్కో ఇంటికీ వెళ్ళడం,…

“  పావలా ఇస్తేను పట్టబోమయ్యా..”

“ అర్ధ ఇస్తే మేము అంటబోమయ్యా “

“ అయ్యవారికి చాలు అయిదు వరహాలు “

“  పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు “

--- అంటూ పాటలు పాడ్డం… ఆ ఇంటివారు, తమ స్థోమతను బట్టి, మాస్టర్లకు, అయిదు, పది రూపాయలదాకా ఇచ్చేవారు.పిల్లలందరికీ పప్పుబెల్లాలూ..  కొంతమంది ధనవంతులైతే, మాస్టర్లని నూతన వస్త్రాలతో సత్కరించేవారు కూడా. అందరిళ్ళకీ ఊరేగింపుగా వెళ్ళి, భోజనాల టైముకి ఇంటికి చేరడం.. ఇంట్లో అమ్మ వండిన పిండివంటలతో సుష్టుగా భోజనం చేయడం.

దసరాకి ఏదున్నా లేకపోయినా, బొమ్మలకొలువు, సాయంత్రం పేరంటమూ తప్పనిసరిగా ఉండేవి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే, ఇంక అడిగేదేముందీ?..  ఆడపిల్లలందరూ బొమ్మలకొలువులతోనూ, పేరంటంతోనూ  బిజీగా ఉంటే, మగపిల్లలందరూ  ఊళ్ళో పెట్టిన పందిళ్ళల్లో తిరగడం.  ఆ రోజుల్లో ఊళ్ళో ఓ అయిదారు శరన్నవరాత్ర పందిళ్ళుండేవి.. ఆ  యేరియా కి సంబంధించిన వర్తకులందరూ కలిసి ఏర్పాటు చేసేవారు—ఈరోజుల్లోలాగ  ఇంటింటికీ వెళ్ళి చందాలు వసూలు చేసి కాదు. మొత్తం తొమ్మిదిరోజులూ,  చీకటిపడ్డతరువాత ఏదో ఒక  సాంస్కృతిక కార్యక్రమం ఉండేది.  నాటకాలూ, బుర్రకథలూ, సంగీతకచేరీలూ, కొన్నిచోట్లైతే సినిమాలూ, ఇంకొన్ని చోట్లైతే భోగం మేళాలూ ( పిల్లల్ని అనుమతించేవారు కాదు ).. ఇలా ఒకటేమిటి, ఎన్నో రకాల కార్యక్రమాలుండేవి… దసరా టైముకైతే ఓ కొత్త సినిమా రిలీజయ్యేదే. మర్చేపోయాను.. తోలుబొమ్మలాటలోటి.

విజయ దశమి రోజున చీకటి పడేవేళకి, ఓ పేద్ద రావణాసురుడి  వెదురు బొమ్మని, అలంకరించి, దానినిండా బాణసంచా అమర్చి, దూరం నుండి , ఓ ఊళ్ళో ఏ పెద్ద మనిషి చేతో, మంటలొచ్చే బాణంతో, ఆ బొమ్మని గురిచూసి కొట్టించి, పూర్తిగా అంటించేయడంతో దసరా ఉత్సవాలు ముగిసేవి.

ఈ రోజుల్లో సందుకో దసరా పందిరి, చిత్ర విచిత్ర దీపాలంకరణలు, చెవులు హోరెత్తించే సినిమా పాటలు, రికార్డింగ్ డాన్సులూ ఒకటేమిటి హడావిడే హడావిడి. ఈరోజుల్లో చిన్నపిల్లలకి మరి, ఆ దసరా గిలకలూ, పప్పుబెల్లాలూ రమ్మంటే వస్తాయా… ?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు