గత కొద్ది రోజులుగా సమాజం లో జరుగుతున్న పరిణామాలు నా మనస్సును పరి విధములుగా ఆలోచిఇంపజేయడానికి ప్రేరేపించాయి, "మనిషి" ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? రోజు రోజుకూ దిగజారిపోతున్న మానవత్వపు లక్షణాలకు కారణం ఏమిటి? అనే ప్రశ్న నుండి ఉద్భవించిందే ఈ వ్యాసం.
ఒకసారి సృష్టి పరిణామ చక్రం గమనిస్తే, దీనికి మూల కారణం ఒక ఆది పురుషుడు, స్త్రీ అని వారి కలయిక సంతానం అని, వారందరి సముదాహం ఒక కుటుంబం అని, దాని అవసరాల రీత్యా, శారీరక ధృడత్వము చేత పురుషుడు, కుటుంబం రక్షకుడిగా, ఆహార అవసరాల రీత్యా, ఇంటి బయట బాద్యతలు నిర్వర్తించగా, ఇంటి లోని బాద్యతలను స్త్రీ స్వీకరించినట్లు మనకు అర్ధమైతుంది. (మనది పితృ స్వామిక కుటంబ వ్యవస్థ, ఆఫ్రికా ఖండాలలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్నది.)
ఇక్కడ అనుసరిస్తున్న పితృస్వామిక కుటుంబ వ్యవస్థ వలన , మన సమాజం లో స్త్రీ, పురుషులకు సమాన గౌరవం వున్నప్పటికీ, పురుషుడిది కాస్త ఎక్కువ సమానం!! అనుకోవచ్చును.
మనిషి అవసరార్ధము ఎన్నో కనుగొన్నాడు. చక్రము, రాతితో తయారుచేయబడిన ఆయుధములు మొదలుగునవి కాని, అంతవరకూ పచ్చి మాంసము తినుటకు అలవాటు పడిన మనిషి "నిప్పుని" కనిపెట్టాకా, రుచికరమైన ఆహారపదార్ధములను వండుటకు అలవాటుపడినాడు.
ఎప్పుడైతే మానవుడు ఒక కుటుంబం నుండీ, కుటుంబాలకు అలవాటుపడి విస్తరించాడో, అది సమాజం కి నాంది కారణమైనది. అంతవరకూ ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా పురుషుడు వ్యవహరిస్తుండగా, సమాజము దగ్గరకు వొచ్చే సరికి ఎవరు పెద్ద అనే ప్రశ్న మొదలై, ఆ రోజు నుండీ ఈ దినం వరకూ అది ఒక అంతుచిక్కని సమాధానము అయి కూర్చుంది.
తనే గొప్ప అనే స్థాయికి చేరుకున్న మానవుడికి అసలు మనిషి అంటే ఏమిటి? అని తెలియజెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే జ్ఞానులు మన పూర్వీకులు మానవుడి యొక్క సృష్టి రహస్యం పలురకాలు భోదించినారు. అందులోని ఒక అంశమును నేడు నేను ప్రస్తావించుటకు సాహసిస్తున్నాను.
స్త్రీ, పురుషుల సం యోగం జరిగినప్పుడు, సృష్టికి మూలకారణమైన ప్రాణి అను సూక్ష్మరూపం వీర్యగతమై స్త్రీ యొక్క గర్భవాసములో మత్స్యాకారములో జన్మిస్తుంది. దానినే మనం దశావతారాలలో మొట్టమొదటిది అయిన మత్స్యావతారం గా పేర్కొన్నాం.
తరువాత ఆ ఆకారం పిండ రూపం దాల్చి, ముడుచుకుని తల్లి యొక్క ఉదరభాగాన్ని కవచంగా ఏర్పరుచుకుని తాబేలు రూపం లోకి మారుతుంది. దానిని మనం రెండవ అవతారం కూర్మావతారం గా పేర్కొన్నాం.
ఇక తరువాత మూడవ నెలలో పిండం కాస్త ఎదిగి పాదాలు, తోక, చెవులు ఏర్పడి అచ్చు వరాహాన్ని పోలి వుంటుంది. దీని వరాహావతారం గా పేర్కొన్నాం.దీని తరువాత నెలలో విచక్షణా జ్ఞానం ఏర్పడి, మంచి, చెడుల బేరీజు వేసుకునే స్థితికి చేరుటకు మొదటి అడుగు ఏర్పడుతుంది. అందుకే చెడుకు మృగ రూపం , మంచికి నర రూపం ఏర్పరచి నరసిం హావతారం గా పేర్కొన్నాము.
ఇక మరుసటి ఎదుగుదల క్రమం లో, ఎదిగీ ఎదగని దేహం తో, కుబ్జ రూపాంతరం చెందిన శిశువును వామనుడు గా ప్రస్తావించడం జరిగింది. ఈ వామనావతారం లోని ప్రాశిష్టత ఏమిటంటే, బలి చక్రవర్తిని మూడు అడుగుల దానం కోరడం. ఒక మనిషి ఎంత ఎదిగిననూ, తను పోయాకా, అతనిని కేవలం ఏడు అడుగులలో మాత్రమే పూడ్చి పెడుతారు. పుట్టుట, గిట్టుట కొరకే కానీ, పుట్టిన తరువాత తన జన్మ సార్ధకత్వము కోసం ఆధ్యాత్మిక సాధన అవసరం. అందుకొరకు పద్మాసన స్థితిలో కూర్చోడానికి కావాల్సిన స్థలం కేవలం మూడూ అడుగులు మాత్రమే అని దాని అంతరార్ధం.
ఇక ప్రతి తల్లికీ, తన బిడ్డకు జన్మనివ్వడం మరుజన్మ లాంటిది. అంటే చచ్చి బ్రతికినట్లే. అందుకే జన్మనిచ్చి, పునర్జన్మనిచ్చి బిడ్డ ఇద్దరూ చావు బ్రతుకులకు కారణభూతులవుతారని చెప్పడానికే పరశురాముడి అవతార అంతరార్ధం. ఇక జన్మనిచ్చిన బిడ్డ సమాజం లో ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలంటే, ఒక మంచి పుత్రుడిగా, సోదరుడిగా, భర్తగా, పాలకుడుగా వుండవలసిన లక్షణాలన్నీ కలబోసిన మూర్తియే శ్రీరామ చంద్రుని అవతార అంతరార్ధం.
ఇక జన్మించిన బిడ్డ సమాజం లో ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలంటే , ఒక మంచి పుత్రుడిగా సోదరుడిగా భర్తగా, పాలకుడిగా వుండవలసిన లక్షణాలన్నీ కలబోసిన మూర్తియే శ్రీరామ చంద్రుని అవతార అంతరార్ధం. సమాజం లో మారుతున్న విలువలకు తగ్గ లోక్యం సంపాదన, సమాజ హితం వ్యక్తిగత అభివృద్ధి కలబోతగల భగవత్గీత సృష్టికర్త శ్రీకృష్ణుడు.ఈ అవతారాల అంతరార్ధమంతా ఒక మనిషి సమాజం లో ఎలా మసులుకోవాలో నేర్పే గొప్ప అక్షర సత్యాలు. నేడు మనిషి వాటి అంతరార్ధములు తెలుసుకోలేక భగవంతుడి పేరున ఎన్ని అరాచకాలు సృష్టిస్తున్నాడో మనం చూస్తున్నాము. తన మనుగడ కోసం, ఒక చక్రం , నిప్పు, ఆయుధం, భగవంతుడు ని కనిపెట్టిన మానవుడు చివరకు వీటన్నింటికంటే శక్తివంతమైన డబ్బుని కనుగొన్నాడు.
ఇది కనుగొన్న తరువాత మనిషికి, దేనిమీదా ఒక భయం అనేదే లేకుండా పోయి ఆఖరికి భగవంతుడిని కూడా మించిపోయేంత అహంకార పూరితుడై వివిధ కులాలు, మతాలు అనే చిచ్చును రగుల్చుకుని సాటి మానవుల మీద కనికరం లేకుండా మానవత్వం అనే మాటనే మంటగల్పే స్థితికి చేరుకున్నాడు.
ఏనాటికైనా, ప్రతి మనిషి తన జన్మకు వున్న కారణము తెలుసుకుని సాటి మనుషులతో ప్రవర్తించిన రోజు ఈ మనిషే ఒక గొప్ప "మనీషి" గా ఎదుగగలడని మనసారా ఆశిస్తూ...