తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

సమయాపురం , తిరుచరాపల్లి

శ్రీరంగనాథుని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో సమయాపురం ‘ మారియమ్మను ‘ దర్శించుకోవాలని అనుకున్నాం . తిరుచరాపల్లి వెళ్లేదారిలోనే వస్తుంది ‘ సమయాపురం ‘ హై వే 45 కి కాస్త పక్కగా వుంటుంది అమ్మవారి కోవెల . రోడ్డుమీదకే పెద్ద ద్వారం తరువాత పొడవైన మండపం తరువాత మరో పెద్ద ద్వారం ఆలోపల గర్భగుడిల కొలువై వుంటుంది భక్తులను చల్లగా కాపాడే ‘ మారియమ్మ ‘ . పేరు విని యిదేదో మరో మతస్తులదని భావించకండి , పార్వతీ దేవిని ‘ మారియమ్మ ‘ అనడం  మన తమిళతంబిల అలవాటు . సమయాపురం లోని గ్రామదేవత మందిరం ఈ అమ్మవారు , గ్రామీణ ప్రజలు గ్రామదేవతగా కొలుస్తారు . ఈ అమ్మ కి దీర్ఘకాలికరోగాలు తగ్గించే శక్తివుందని తమిళుల నమ్మకం . గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని రోడ్డుమీంచే దర్శించుకునే వీలుగా కట్టబడిన మందిరం . పెద్ద విగ్రహం  మట్టి తో చెయ్యబడింది .మందిరం అల్లంతదూరంలో వుందనగా పూలు కొబ్బరికాయల దుకాణాలే కాకుండా వెండి బంగారాలతో చేసిన కన్ను , కాలు లాంటి అవయవాల ముద్రలు , ఉప్పు , మిరియాలు అమ్ముతూ కనిపిస్తారు . నిలువెత్తు నిమ్మకాయల దండలు దుకాణాలలో వ్రేలాడుతూ కనిపిస్తాయి . అమ్మవారికి ఉప్పు మిరియాలు సమర్పిస్తే రోగాలు , దుష్ట శక్తులను అమ్మవారు తరిమి కొడుతుందని భక్తుల నమ్మకం .చరిత్రలో పదిహేడవ శతాబ్దంలో రాజా విజయరాయ చక్రవర్తి యీ మందిరాన్ని నిర్మించినట్లుతెలుస్తోంది కాని అంతకు ముందు విషయాలు చరిత్రలో లేవు . కొంత మంది స్థానికుల ప్రకారం 17 వ శతాబ్దానికి ముందు అమ్మవారి లోహ విగ్రహం శ్రీరంనాథస్వామి మందిరంలో వుండేదట , అప్పటి రాజుకు దుఃస్వప్నములు కనిపిస్తూ వుంటే మంత్రులను జ్యోతిష్కులను సంప్రదించగా వారు రంగనాథ మందిరములో వున్న యీ విగ్రహం వలననే యిలా జరుగుతోంది కాబట్టి విగ్రహాన్ని వూరికి దూరంగా పెట్టమని సలహా యిచ్చేరట , వారి సలహా మేరకు రాజు ఆ విగ్రహాన్ని వూరవతల చిన్న మందిరం కట్టించి అందులో వుంచేడని చెప్తారు విజయరాయ చక్రవర్తి యప్పుడు వున్న మందిరాన్ని నిర్మించేడట . మందిరం లో వున్న పెద్ద విగ్రహం మట్టి తో చేసినది కావడం వల్ల ఆ విగ్రహానికి అభిషేకం నిర్వహించరు . చిన్న లోహపు విగ్రహానికి అభిషేకాదులు నిర్వహిస్తారు .

పాత కట్టడం , లోపల అమ్మవారికి పసుపు కుంకుమలు , చీర రవికల బట్టలు సమర్పిస్తూ వుంటారు భక్తులు . ముఖ్యంగ అమ్మవారికి యిష్టమైన ఆది , మంగళ , శుక్ర వారాలు చుట్టుపక్కల గ్రామాలే కాదు  దేశాలనుంచికూడా వేల సంఖ్యలో భక్తులు వస్తూ వుంటారు . ముఖద్వారం లోపల వున్న మండపంలో అమ్మవారికి పొంగలి వండి నైవేద్యాలు సమర్పిస్తూ వుంటారు . ఈ అమ్మవారి మందిరాలలో చాలా మటుకు జంతుబలి సాగుతోందేమో అనే అనుమానం కలిగింది . అటువంటిదేమీ నా కళ్ల పడకపోయినా అక్కడ జంతుబలి జరుగుతున్నట్లు అనిపించింది . లోపల ద్వజస్థంబం , స్థలవృక్షం , శివమందిరం , భైరవమూర్తి వున్నాయి . అమ్మవారి విగ్రహం మంచికళగా వుంటుంది . చైత్రం , ఆషాఢాలలో వుత్సవాలు నిర్వహిస్తారు . ఉత్సవాలలో రకరకాల విన్యాసాలు చేస్తారు అమ్మవారి భక్తులు , నిప్పులు తొక్కడం , నాలుకకు త్రిశూలంగుచ్చుకోడం , నోట్లో యీ పక్కనుంచి ఆ పక్కకి కత్తి దూర్చుకోడం , వీపుకి కొక్కేలు దూర్చుకొని రథం లాగడం లాంటి వికృత చేష్టలు చాలా చేస్తారు . తైపూసం వుత్సవాలు ఫాల్గుణ మాసంలో చేస్తారు . తైపూసం ఉత్సవాలలో ‘ సమయత్తం ‘ జరుగుతుంది . పసుపు బట్టలు ధరించిన ఓ మహిళ పైకి అమ్మవారు వచ్చి రాబోయే సంవత్సరంలో జరుగబోయే సంగతులను వివరిస్తుంది . చాలా మటికి ఆమె చెప్పినట్లగానే జరుగుతుందని అంటారు . ఆషాఢమాసంలో శుక్రవారం నాడు చుట్టుపక్కల పల్లెలనుంచి వచ్చిన భక్తులు కోవెలప్రాంగణంలోనే వండిన పొంగలి అమ్మవారిక పెట్టి అక్కడే వారు తిని విశ్రమించి సాయంత్రం యిళ్లకు వెళతారు .

తమిళనాడులో పళని తరువాత యెక్కువ సొమ్ము మొక్కుబడుల రూపంలో ఆర్జించే మందిరంగా పేరు పొందింది . తమిళులకి యీ అమ్మవారి మీద యెంత భక్తంటే శ్రీలంక , సింగపూరు , మలేషియ , సౌతాఫ్రికా , ఫిజి దేశాలలో కూడా ‘ సమయాపురం మారియమ్మ ‘ మందిరాలు నిర్మించుకున్నారు .సమయాపురం నుంచి తిరుచ్చి వెళదాం .తిరుచ్చి గా పిలువబడే తిరుచరాపల్లి నగరం క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుంచి వుందని చరిత్ర వల్ల తెలుస్తోంది . చోళులు , పాండ్యులు , పల్లవులు , ముథరియార్లు , విజయనగర రాజులు , నాయకర్లు , కర్నాటక నవాబుల తరువాత ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది తిరుచ్చి . తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి సుమారు 375 కిలోమీటర్ల దూరం లో వున్న తమిళనాడులోని 4 వ పెద్ద నగరం యీ తిరుచ్చి . కావేరి నదీ డెల్టాలో వుండడం వల్ల తిరుచ్చి చుట్టూ పంటలు బాగా పండుతాయి , ఎటుచూసినా వరి అరటి పంటలతో పొలాలు పచ్చగావుంటాయి . చెన్నైలో కనబడే హడావిడ లేకపోయినా గత కొన్ని సంవత్సరాలలో నగరం విస్తరించడం వల్ల రోడ్లమీద రద్దీ బాగా పెరిగిందని చొప్పుకోవాలి .ఉన్న బి హెచ్ యి యెల్ లే కాక మరెన్నో పరిశ్రమలు రావడంతో నగరం పెరిగింది నగరం పెరిగినంతగా సౌకర్యాలు పెరగక పోవడంతో రద్దీ బాగా పెరిగింది . నగరంతో గాని రద్దీ తో గాని మనకి సంబంధంలేదు . తిరుచ్చి కి అన్ని పెద్ద నగరాలనుంచి రైలు సౌకర్యం వుంది అలాగే చెన్నై నుంచి రాష్ట్రప్రభుత్వపుబస్సులే కాకుండా ప్రైవేట్లు రంగాలు నడుపుతున్న ఎసి బస్సు సౌకర్యం కూడా వుంది . తిరుచ్చి లో చూడవలసిన ప్రదేశాలేంటో చూద్దాం .

రాక ఫోర్ట టెంపులు , ఉఛ్చపుళియార్ , మ్యూజియం , జంబుకేశ్వర మందిరం , ఆర్ధర్ కాటన్ చే నిర్మింపబడ్డ అప్పర్ అనకట్ట .

ఉఛ్చపుళియార్

 ఏ పని తలపెట్టినా , యే పూజ చేసినామనం ముందు వినాయకుడిని తలుచుకోడం గాని యధాశక్తి పూజించుకోడం గాని చేస్తాం కదా ? అలాగే మనం ముందుగా ‘ ఉఛ్చపుళియార్ ‘ అంటే  ఎత్తుగా వున్న వినాయకుడు అని అర్ధం . ఆ మందిర విశేషాల గురించి తెలుసుకుందాం .

ఈ మందిరం రాక ఫోర్టులో వుంది . అతి యెత్తైన రాతిగోడలతో అతి పటిష్టంగా వుండే కోట యిది . శతృరాజుల దాడికి తట్టుకోడానికి నిర్మింపబడింది . నున్నగా వుండే రాళ్లతో నిర్మింపబడింది .సుమారు 83 మీటర్ల యెత్తున్న రాయిమీద నిర్మింపబడిన మందిరం . రాయి పైభాగాన వుంటుంద ‘ ఉచ్చ పుళియార్ ( పిళియార్ ) విగ్రహం . క్రిందన వున్న వినాయకుడిని ‘ మాణిక్య పుళియార్ ‘ అని అంటారు . ముందుగా మాణిక్య పుళియార్ కి పూజలు నిర్వహించికొని పైకి వెళ్లిన తరువాత ఉచ్చ పుళియార్ కి పూజలు చేసుకుంటారు . పైకి వెళ్లడానికి చాలా యెత్తైనరాతి మెట్లు వున్నాయి , పైకి వరకు యెక్కే సరికి చాలా ఆయాసం వస్తుంది , పైకి వెళుతున్న కొద్దీ గాలి చల్లబడటం , ఆ యెత్తునుంచి తిరుచ్చి వూరిని , శ్రీరంనాథ ఆలయ శిఖరాన్ని , ఆర్దర్ కాటన్ ఆనకట్టని , కావేరీనదిని , శ్రీరంగం దగ్గర  రెండుగా చీలి యేర్పరచిన ద్వీపాన్ని చూస్తూ మన కాళ్ల నొప్పులను మరచిపోతాం .

పెద్ద రాయిని రకరకాల దేవతా మూర్తులుగా తీర్చి దిద్దిన కళాకారుల ప్రతిభ యేమని చెప్పగలం . ఉఛ్చ పుళియార్ ఆలయం దగ్గర గాలి మనుషులన విసిరేంత జోరుగా వీచుతూ వుంటుంది . స్థల పురాణం గురించి చెప్పుకుందాం .         మొదట స్థలపురాణం విన్నమాకు గోకర్ణం కధ గుర్తొచ్చింది . అక్కడ రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకు పోతూ వుంటే వినాయకుడు లింగాన్ని సముద్రపు వొడ్డున క్రింద పెట్టేస్తాడు . దాంతో రావణాసురుడు ఆ లింగాన్ని కదిలించలేక సముద్రపు వొడ్డున వదిలేసి , అలా చేసిన వినాయకుడి తలపై మొట్టి లంకానగరానికి వెళ్లిపోతాడు . ఇక్కడ కూడా అలాగే అయితే రావణాసురునకు బదులు విభీషనుడు , రామరావణ యుధ్దానంతరం రాముడు విభీషణుని భక్తికి మెచ్చి శ్రీరంగనాథుని విగ్రహం యిచ్చేడట , అసురులకు విష్ణుమూర్తి విగ్రహం యివ్వడం యిష్టం లేని దేవతలు వినాయకునకు చెప్పి విగ్రహం లంకానగరం చేరకుండా చూడమన కోరేరుట , వినాయకుడు బాలకుని అవతారంలో వచ్చి విభీషణుడు నిత్యకృత్యాలకొరకు కావేరి నదీ తీరంలో ఆగడం తో ఆవిగ్రహం అక్కడే అతుక్కు పోయేట్లుగా చేసేడట , అది చూసి కోపగించుకున్న విభీషణుడు బాలకుని తరమసాగేడు ,  వినాయకుడు అక్కడున్న పెద్ద రాయపైకి పరుగెత్తేడట , విభీషణుడు వెంబడించి ఆ బాలకుని తలపై మొట్టేడట , అలా చెయ్యడంతో బాలకుడు వినాయకునిగా ప్రకటితమవగా విభీషణుడు వినాయకున మన్నింపు కోరి ఆ విగ్రహాన్ని అక్కడే విడిచి పెట్టి లంకకు వెళ్లిపోయేడట , విభీషణుడు మొట్టిన చోట విగ్రహం పైన గొయ్యపడి వుంటుంది .

కొన్ని వేల సంవత్సరాలనంతరం రాజు వేటకి వెళితే అడవులలో కొండపైనయీ విగ్రహం లభ్యమయిందట . ఈ మందిర నిర్మాణం పల్లవులు మొదలుపెట్టగా విజయనగర సామ్రాజ్యం లోని మధురై నాయకర్లు పూర్తి చేసేరు .

వచ్చేవారం జంబుకేశ్వర మందిర వివరాలు తెలుసుకుందాం , అంతవరకు శలవు .           

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు