ముగ్గురమ్మల మూలపుటమ్మ మాతా వైష్ణవీదేవి - ..

mata vaishnavi devi

అక్టోబరు 10 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమౌతున్నాయి , ప్రతి యింటా అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలోపూజలందుకొని కోరిన కోర్కెలను తీరుస్తోంది . దేవి నవరాత్రులు బెంగాలులో , కర్నాటకలోని మైసూరులోనూ బాగా ప్రసిధ్ది  ప్రతీ అమ్మవారి  కోవెల  భక్తులతో  కిటకిట  లాడుతాయి .  ఇందులో  అమ్మవారి  అష్టాదశ  పీఠాలైతే  అడిగే  తొమ్మిది రోజులు బొమ్మలకొలువులు పెట్టి ముత్తైదువలకు పసుపు కుంకుమ యివ్వడం ఆనవాయితీ ఒరిస్సా ,బెంగాలు , ఈశాన్య రాష్ట్రాలలో సామూహిక దుర్గా పూజలు చెయ్యడం ఆనవాయితీ ఉత్తరాది జిల్లాలలో మొలకెత్తిన నవధాన్యాలనిమట్టికుండలలో పెట్టి వాటిని దేవిగా తొమ్మిది రోజులు ఆరాధించడం , ఈ తొమ్మిది రోజులూ నవధాన్యాలను ఆహారంగా తీసుకోకుండావుండడం , అష్టమినాడు అష్టకన్యలకు కన్యాపూజలు చేయం ఆనవాయితీ .విదేశాలలో స్థిరపడిన భారతీయులు యీ పండగలను వారివారి ఆచారం ప్రకారం జరుపుకోడం చూస్తే యెంతో ఆనందంకలుగుతుంది .

మన పండగలు యింకా బ్రతికి వుండడానిక కారణం వీరే కదా ? , అని అనిపిస్తుంది . నవరాత్రుల  సందర్భంగా  మనం కూడా అష్టాదశపీఠాలలో ఒకటైన వైష్ణవీదేవి గురించి చెప్పుకుందాం  ఆది గురువును శంకరాచార్యులవారు దేవి భగవతంలో చెప్పబడిన పీఠాలను గుర్తించి మందిర నిర్మాణం చేసి తన కూడా వున్నశిష్యులను నిత్యపూజలకొరకై నియమించి క్రింది శ్లోకాన్ని జనుల సౌకర్యార్థం రచించేరు . ఈ శ్లోకం లో ఆయా పీఠాలు యెక్కడవున్నాయోతెలుసుకోవచ్చు . అయితే శంకరులవారు ముందుగా నాలుగు ఆదిపీఠాలని గుర్తించేరు అవి ముఖఖండే దక్షిణ కాళిక , కలకత్తా నగరానికిదగ్గరా వున్న దక్షిణేశ్వర్ లో వున్న కాళికాదేవి , స్థనఖండే తారతరిణి ఒడిస్సా రాష్ట్రం లో బరహంపూర్ కి దగ్గరా వుంది , యోనిఖండేకామాఖ్య అస్సాం రాష్టంలో గౌహతి కి దగ్గరా వుంది , పాద ఖండే బిమొళాదేవి అంటే విమలా దేవి  పూరి లో జగన్నాధానికి కోవెలప్రాంగణం లో జగన్నాథుడి కోవెలకు పక్కగా వుందీ మందిరం  తరువాత  అష్టాదశపీఠాలను  గురించి  యిలా చెప్పేరు .

లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే ,

ప్రద్యుమ్నే శృంగళాదేవి , చాముండీ క్రౌంచపట్టణే ,

ఆలంపురే జోగులాంబ , శ్రీశైలే భ్రమరాంబికే ,|

కొల్హాపురే మహాలక్ష్మి , పీఠికాయాం పురుహూతికా,

ఒఢ్యానాం గిరిజాదేవి , మాణిఖ్యే దక్షవాటికే ,

హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి ,

జ్వాలాయాం వైష్ణవీదేవి , గయా మాంగల్యగౌరికా ,

వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరేతు సరస్వతి 

తరువాత 51 పీఠాలు , తరువాత 108 శక్తి పీఠీలనూ తెలియ జేసేరు . ఈ నవరాత్రుల సందర్భంగా మనం అష్టాదశ పీఠాలల ఒకటైనవైష్ణవీ దేవి గురించి తెలుసుకుందాం . 

ఓం    ఐం    హ్రీం   క్లీం   చాముండై   విచ్ 

జై మాతా ది . 

జై మాతాది అనే నినాదం కొండలలో మారుమ్రోగుతూ రాత్రి పగలు అనే బేధం లేకుండా ,  దోపిడీ దొంగల బెడద లేకుండాదర్శనానికి భక్తులు వచ్చే ప్రదేశం యేమిటో తెలుసుకుందాం . నవరాత్రులు తొమ్మదిరోజులూ వివిధఅలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చి వారి కోర్కెలు తీర్చే అమ్మ వైష్ణవీ మాత .

జమ్ము-కష్మీరు రాష్ట్ర వేసవి ముఖ్యపట్టణమైన జమ్మూ నగరానికి సుమారు 50కిమీ. దూరంలో  వున్న  "కట్ర "  అనే  చిన్నపట్నం దగ్గర నుంచి  నడక  ప్రయాణం  మొదలౌతుంది .  దేవి  నివాసమున్న  పర్వతాన్ని  త్రికూట  పర్వతమని  అంటారు.  దేశంలోని  సుమారు  అన్ని ముఖ్య  పట్టణాల నుంచి  జమ్ము  నగరానికి  ట్రైన్,  విమాన  సౌకర్యాలు  వున్నాయి .  దేశ  రాజధాని  ఢిల్లి  నుంచి  కట్ర  వరకు  ఈ  మధ్య  కాలంలో రైల్  సేవ  కుడా  మొదలయ్యింది.జమ్మూ రైల్ స్టేషన్ నుంచి ప్రతి 10నిమి.. లకి రాష్ట్ర రోడ్డు రవాణా వారి బస్సులు కట్ర  వరకులభ్యమౌతాయి . వైష్ణవదేవి దర్శనానికి వెళ్ళే భక్తులు కట్ర బస్సు స్టాండుకి యెదురుగా వున్నా యాత్రీనివాస్ లో దర్శనానికి టోకెన్తీసుకోవాలి , ఒకవేళ భవన్ ( వైష్ణవదేవి కోవెల వున్న ప్రదేశాన్ని భవన్ అంటారు) లో రాత్రివుండ దలచుకున్నవారు  కట్రాలొనేయాత్రినివాస్ లో ముందుగా రూముకి కూడా సొమ్ము చెల్లించి రసీదు తీసుకోవాలి . కట్ర  బస్సు  స్టాండు  నుంచి  నడక దారి   మొదలయ్యే చోటుకి సుమారు 2కిమి.. దూరం షేర్డ్ ఆటోలు ,  వైష్ణో దేవి    బోర్డ్  వాళ్ళ  వుచిత  బస్సులలో  కూడా  వెళోచ్చు . 

నడక మొదలయ్యే చోటునుంచి భవన్ కి 13.5కిమి. ఈ దూరాన్ని నడిచి చాలామంది భక్తులు వెళ్తారు. నడిచి వెళ్లలేనివారుగుఱ్ఱాల మీద గాని డోలిలలో గాని వెళ్ళవచ్చు. సామానులను , చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళడానికి  " పిట్టులు " దొరకుతాయి. వీరికిఇవ్వవలసిన చర్జీలు బోర్డ్ ద్వారా నిర్ణయించ బడినవి కాబట్టి బేరాలు ఆడవలసిన పనిలేదు. ఆకాశ మార్గాన  వెళ్ళదల్చుకున్నవారుహెలికాప్టర్ లలో కుడా వెళ్ళవచ్చు . ఆకాశ మార్గంలో వెళ్ళదల్చుకున్నవారు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఆరోజు వాతావరణంబాగుంటేనే హెలికాఫ్టర్స్ బయలు దేరతాయి. అందుకనే హెలికాఫ్టర్ లో బుక్ చేసుకున్నవారు ఇతర సాధానాలలో కుడా ప్రయాణిండానికి తయారుగా వుంటే మంచిది.            మొత్తం దారి సిమెంట్ చెయ్యబడింది. చాలా మటుకు షెడ్స్ వెయ్యబడ్డాయి. దారంతా టీ , కాఫీ , ఫలహారాల విక్రయాలు బోర్డుద్వారా నిర్ణయించబడ్డ వెలకే విక్రయించ బడుతూ అందరకి అందుబాటులో వుంటాయి.            సుమారు  2.5కిమి.. కొండ యెక్కిన తరువాత చరణ పాదుక అనే ప్రదేశం వస్తుంది , ఇది ముందుగా అమ్మవారు తపస్సు చేసుకొన్నప్రదేశం , అక్కడనుంచి సుమారు 4 కిమీ. వెళితే  అర్ధ్  కుమారి  అనే  ప్రదేశం  వస్తుంది .  ఇది  నడక  మొదలు  పెట్టిన  దగ్గర నుంచి భవన్వరకు  వున్న దూరంలో సరిగ్గా సగం  వుంటుంది. ఇక్కడ అమ్మవారు గుహలో  కూర్చొని  తపస్సు  చేసుకున్నారట , ముందు  అర్ధ్  కుమారిని దర్శించుకున్న తరవాతే భవన్ లో అమ్మవారిని  దర్శించు కోవాలి . ఈ గుహలోకి ఒకరి తరువాత ఒకరుగా వెళ్ళాలి యెంత  సన్నగావున్నవారైనాసరే గుహలోకి  వెళ్లి బయటికి రాలేరేమో అన్నట్టుగా వుంటుంది కాని చాలా లావుగా వున్నవాళ్ళు కుడా గుహలోకి వెళ్లి  అంతేసులువుగా రాగలరు. అది అమ్మవారిపై గల భక్తికి తార్కాణం .

అర్ధ్ కుమారి దగ్గర భవన్ కి వెళ్లేదారి రెండుగా చీలుతుంది. ఒకటి గుర్రాల మీద వెళ్లేవారికి , రెండోది  నడిచి వెళ్లేవారికి. నడిచివెళ్లే  దారిలో బేటరీ తో నడిచే ఆటోలు నడుపుతున్నారు . ఇవి వృద్దులకు, వికలాంగులకు ,చిన్న పిల్లలతో వచ్చిన తల్లులకోసం 250రూ ..తీసుకొని భవన్ కి సుమారు 1.5కిమి.. దగ్గర వరకు తీసుకు వెళ్తారు .

గుర్రాలమీద వెళ్లేవారికి అర్ధ్ కుమారి నుంచి 3 కిమీ.. వెళ్తే  సాంఝి ఛత్ ,ఇక్కడ మళ్ళా రెండుదారులు కలుస్తాయి , ఒకటి భవన్ కివెళ్ళేది రెండోది భైరవ ఘాట్ కి వెళ్ళేది . రూములు బుక్క్ చేసుకున్నవారికి ఇక్కడే రూములు ఇస్తారు. యిక్కడకి అర కిమీ.. దూరంలోహెలిపాడ్ వుంటుంది. హెలికాఫ్టర్ లో  వచ్చిన  వాళ్ళు  భవన్  చేరడానికి  సుమారు  2.5కిమి..  నడచి గాని  గుర్రల మీద  గాని వెళ్ళాలి .  భవన్ చేరుకున్నాక పర్సులు, బెల్టులు,  పెన్నులు ,కెమారాలు , జోళ్ళు మొదలయినవి అన్నీ  అక్కడి క్లోక్ రూం లో పెట్టుకొనిదర్శనానికి వెళ్ళాలి .  ఈ కోవెల హారతి సమయాలలో తప్ప 24గంటలూ తెరిచే వుంటుంది . 1980 ల వరకు దేవి దర్శనానికి గుహలోంచి ముణుకులమీద పాకుతూ వెళ్ళవలసి వచ్చేది . గుహలో క్రిందన వనగంగ ప్రవహిస్తూ వుండేది. 1980 లలో పెరుగుతున్న భక్తులని దృష్టిలో వుంచుకొని గుహద్వారం ప్రక్కనే వెడల్పయిన మరో ద్వారం  పెట్టి భక్తులని ఆ ద్వారం ద్వారా అనుమతిస్తున్నారు.అప్పుడప్పుడు గుహ ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తూవుంటారు  . ప్రతి రోజు పూజారులు మాత్రం గుహాద్వారం నుండే దేవిదగ్గరకు చేరుకుంటారు. మనం  తీసుకు వెళ్ళే  మొక్కుబడులు, టెంకాయలు మొదలయిన వాటిని అక్కడ వున్నకౌంటర్ లో జమ చెయ్యాలి .  లోపల 5 అడుగుల ఎత్తైన కొండపైన మూడు  రాళ్ళ (పిన్ది) ఆకారంలో దేవి దర్శనం ఇస్తుంది. మధ్యనున్న చిన్న పసుపువర్ణం లోవున్నది లక్ష్మి యని, కుడిచేతివైపున  నలుపు వర్ణం లో వున్నది పార్వతి యని  యెడమ చేతివైపున వున్న తెలుపు వర్ణం కలిసినదిసరస్వతి యని అక్కడి పూజారులు చెప్తారు. దేవికి యెదురుగా అంటే పూజారికి వెనుక శివలింగం వుంటుంది . ఆ శివలింగం సాక్షాత్తుదేవిచే ప్రతిష్టింపబడి ఇవాళటకీ  దేవి పుజలందు కుంటోందని భక్తుల నమ్మకం. దేవి దర్శనానికి వెళ్ళే భక్తులు ముఖ్యంగా రాళ్ళఆకారంలో వున్న దేవిని , దేవికి యెదురుగా వున్న 

శివలింగాన్ని దర్శించుకోవాలి . బయటకి వచ్చేటప్పుడు వనగంగా జలాన్ని తీర్ధంగా స్వీకరించాలి. ఇక్కడ అమ్మవారు లక్ష్మీ స్వరూపం .

మేము మొదటిమారు వెళ్ళినప్పుడు పూజారులు ప్రసాదంగా చిల్లడబ్బులు చిన్నచిన్న  బంగారం, వెండి ముక్కలు యిచ్చేవారు. తరువాత కొన్నాళ్ళు లడ్లు, అమ్మవారిమీద కప్పిన చున్నీలు ప్రసాదంగా యిచ్చేవారు. యిప్పుడు పటికబెల్లం , దేవిమూర్తి గల కాయిన్ ప్రసాదంగా యిస్తున్నారు. 

ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేక మెట్లమీంచి కిందకి వెళ్తే అక్కడ శివలింగం వుంటుంది. దేవి యోగసమాధి  లోకి వెళ్ళకపూర్వం ఈ శివుడిని ఆరాదించేదట . అక్కడకి దగ్గరగానే దుర్గాదేవి మందిరం కుడా దర్శించుకోవాలి . ఇక్కడితో భవన్ లో దర్శనీయస్థలాలు పూర్తవుతాయి. భవన్ నుంచి సుమారు 2.5 కిమీ.. దూరంలో వున్న భైరవఘాట్ కి నడకన గాని గుర్రాలపై గాని డోలిలలో గానివెళ్లవచ్చు. భవన్ నుంచి భైరవ ఘాట్ వరకు వుండే కొండ చాలా  యెత్తుగా వుంటుంది. త్రికూట పర్వతం పైన భైరవ కొండ పైన చాలాకోతులుంటాయి. భైరవ నాధ్ దర్శనం తో వైష్ణవదేవి యాత్ర పుర్తౌతుంది .

ఇక వైష్ణవదేవి  కధ ---

కృతయుగంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి వారిలోని తేజస్సును తీసి , ఆ మూడు తేజస్సులను కలిపి ఒక చిన్న పాపలో ప్రవేశపెడతారు.ఆ పాప మహా తేజొవంతురాలై ప్రకాశిస్తూ "ఓ తల్లులారా నన్నెందుకు సృష్టించేరు " యని అడుగగా త్రేతాయుగంలో నువ్వుభూలోకంలో జన్మించి శ్రీరాముని విష్ణుని అవతారముగా గుర్తించిన అనంతరం భూలోకంలో నీ అవతారం పరిసమాప్తి ఔతుంది నువ్వువిష్ణువు లో ఐఖ్యమై వైష్ణవి గా భూలోకం లో పూజలందుకుంటావు అనిచెప్తారు .

ఆ ప్రకారంగా త్రేతాయుగంలో దక్షిణదేశం లో రత్నాకరుని యింట పాపగా జన్మిస్తుంది. పాప జన్మ రహాస్యం తెలియనిరత్నాకరుడు పాపకు వైష్ణవి అని నామకరణం చేసి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు . వైష్ణవి జ్ఞాన సముపార్జనలో గురువులందరిదగ్గరనుంచి విద్యను పొంది ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందడానికి గురువుల దగ్గరకి వెళ్ళగా యోగాన్ని మించినదిలేదని వారి నుంచితెలుసుకొని తపస్సమాధిలొకి వెళ్తుంది. 

త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసంలో వుండగా తపస్సులో వున్న వైష్ణవి వద్దకు వెళ్ళడం జరుగుతుంది , వచ్చినది విష్ణుఅవతారమని గ్రహించిన వైష్ణవి ప్రణమిల్లి తనని ఐఖ్యం చేసుకోమని కోరుతుంది . అందుకు శ్రీరాముడు పట్టాభిషేకానంతరం వచ్చిఆమెను అనుగ్రహిస్తానని  మాటయిస్తాడు . ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు పట్టాభిషేకానంతరం వైష్ణవి వద్దకు వృద్దుని రూపంలోరాగా వైష్ణవి తనవద్దకు వచ్చినది విష్ణుమూర్తి యని పోల్చుకోలేక పోతుంది . అప్పుడు శ్రీరాముడు తన నిజరుపంతో దర్శనమిచ్చి తిరిగితానూ కలియుగంలో కల్కి అవతారంలో వచ్చి ఆమెను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఆమెను త్రికూట పర్వతాన తపస్సమాధి లో వేచివుండమని చెప్తాడు . శ్రీరాముని ఆజ్ఞ మేరకు వైష్ణవి దక్షిణ భారతాన్ని విడిచి ఉత్తరభారతానికి వెళ్లి త్రికూట పర్వతప్రాంతాన వున్నఅడవులలో యోగసాధనలో వుంటుంది. ఆమె యెప్పుడూ కోతుల సముదాయముతో చుట్టుముట్టబడి సింహవాహనముపై తిరుగుతూవుండేది. 

త్రేతాయుగము ముగిసి ద్వాపరంలో కృష్ణావతారంలో విష్ణుమూర్తి కంసుడు , నరకాసురుడు మొదలగు వారిని సంహరించిమహాభారత యుద్ధానంతరం కృష్ణావతారం చాలించి వైకుఠంలో వుండ సాగెను. 

త్రికూట పర్వత ప్రాంతాన యోగసమాధిలో వున్న వైష్ణవి ముగిసిన ద్వాపరయుగము గురించి గాని కలియుగ ప్రారంభము గానితెలియలేదు.  యెప్పుడూ కోతుల సముదాయముతో చుట్టుముట్టబడి సింహమును వాహనముగా చేసుకొని తిరుగుతూ వుండే వైష్ణవిమామూలు మనవమాత్రురాలు కాదని తలచిన శ్రీధరుడు అనే పేదవాడు ఆమె భక్తుడుగా మారుతాడు . వైష్ణవి గురించి విన్న గోరక్షకనాధ్అనే యోగాసాధకుడు ఆమె యోగశక్తి ఎంతటిదో తెలుసుకొని రమ్మని తన ముఖ్య శిష్యుడైన బైరవనాధుని పంపుతాడు. భైరవనాధుడువైష్ణవి ని వెన్నాడుతూవుంటాడు . ఆమెని చూస్తున్నప్పుడు ఆమెయొక్క  యోగశక్తిని అంచనావెయ్యవలసిన అతని కళ్ళు ఆమెనుమొహంతో చూస్తూవుంటాయి . 

శ్రీధరునికి చుట్టుపక్కల వుండే సిద్దులకు, యోగులకు తాపసులకు భోజనాలు ఏర్పాటు చెయ్యాలనే తలంపు కలుగుతుంది.శ్రీధరుడు  పేదవాడగుటచే భోజనము యేర్పాటుకు కావసిన ధనము కాని సరకులు కాని లేకపోవుటచే అతను నగరములోని వారివద్దకుపోయి సహాయము అర్ధిస్తాడు . అలా సమకూడిన ధనము భోజన ఖర్చులకు సరిపోదని తెలిసిన శ్రీధరుడు ముందురోజు రాత్రిఆందోళనతో నిద్ర రాక గడుపుతాడు . మరునాడు గోరక్షక్ నాథ్ తన శిష్యులతో వస్తాడు . పిలిచిన వాళ్లకు రెట్టింపు మంది వస్తారు . వైష్ణవిఎనిమిది సంవత్సరాల బాలికగా వచ్చి అందరికి విస్తరాకులు పరచి వడ్డన సాగిస్తుంది . ఎవరు కోరిన వంటకాన్ని వారికి ఆ వంటకాన్నివారికి వడ్డించి వారిని సంతృప్తులను చేస్తుంది . శ్రీధరునికి , బైరవునకు ఆ బాలిక సామాన్య బాలిక కాదని సాక్షాత్తు వైష్ణవియే అని అనిపిస్తుంది  . శ్రీధరునిలొ ఆమె పట్ల భక్తి పెరుగగా భైరవునిలో ఆమె పట్ల మోహం అధికమౌతుంది . భైరవుడు తనను వివాహమాడమని వైష్ణవిని వేదింప సాగెను . వైష్ణవి భైరవుని తప్పించుకొని త్రికూట పర్వతంపైకి ఎక్కి అక్కడ తపస్సు చేసుకుంటూ  వుంటుంది . ఆప్రదేశాన్ని యిప్పుడు "చరణ్ పాదుకా " గా వ్యవహరిస్తున్నారు . కొంతకాలానికి భైరవుడు వైష్ణవి వునికి కనిపెట్టి అక్కడకు చేరుకుంటాడు .వైష్ణవి  అక్కడనుంచి యిప్పటి " అర్ధ్ కుమారి " అని పిలవబడుతున్న గుహకు చేరి అక్కడ తపస్సు చేసుకుంటూ వుంటుంది , భైరవుడుఅక్కడకు కుడా వచ్చి వేధించడంతో  అక్కడనుంచి భవన్ కు చేరుకొని శివలింగాన్ని ప్రతిష్టించుకొని ప్రశాంతంగా యోగ సాధనచేసుకుంటూ వుంటుంది . కొంతకాలానికి భైరవుడు అక్కడకు కుడా వస్తున్న సమాచారం యోగ శక్తితో తెలుసుకున్న వైష్ణవి తన వాహనమైన సింహాన్ని అధిరొహించి భైరవునకు యెదురు వెళ్లి తన కరవాలము తో భైరవుని శిరస్సు ఖండిస్తుంది . భైరవుని శిరస్సు ఎదురుగావున్న పర్వత శిఖరాన పడుతుంది. భైరవుని శిరస్సు నేలను తాకగానే అతని తప్పిదం అతనికి తెలుస్తుంది. భైరవుడు తన తప్పునుక్షమించమని వైష్ణవి ని వేడగా ఆమె అతన్ని క్షమించి అతనికి మోక్షప్రాప్తి నిస్తుంది . తన దర్శనానంతరం భైరవుని దర్శించని వారికివైష్ణవీదేవి యాత్ర ఫలం దక్కదు , కాబట్టి వైష్ణవదేవీని దర్శించు కోవాలి .శ్రీధరుడు వైష్ణవిని పూజించుకుంటూ శివసాన్నిధ్యంచేరుకుంటాడు. మానవ రూపంలో విష్ణువుకై వేచియుండడం ప్రమాద భరితమని తలచిన వైష్ణవి ఒక గుహలో ఐదు అడుగుల ఎత్తైనరాతిపైన  యోగసమాధిలో కల్కి కొరకై వేచియుంది . ఆమెకు రక్షగా పార్వతి , సరస్వతి ఆమెకు యిరువైపులా కొలువై వున్నారు . తనలోవున్న శివుని  ఎదురుగా నిలుపుకొని యిప్పటికీ యోగ సమాధిలో వుండి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ త్రికూటపర్వతంపై కొలువై వుంది మాతా వైష్ణవీదేవి .

వైష్ణవ దేవి కోవెలలో ప్రతి రోజు ప్రొద్దుట సాయంత్రం హారతి సేవ విశేషంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు నవరాత్రివుత్సవాలు జరుగుతాయి . అవి 1) చైత్ర నవరాత్రులు , 2) దుర్గా నవరాత్రులు . ప్రతీరోజూ ప్రొద్దుట హారతి సమయంలో ఎనిమిదేళ్ళబాలికలకు పూజ చేసి కానుకలు సమర్పించడం జరుగుతూ వుంటుంది . 

ఏడాది పొడవునా సాగే ఈ యాత్రను వర్షాకాలం మరియు శీతాకాలం వెళ్ళకుండా వుంటే మంచిది. యేకాలంలో వెళ్ళినా కుడా తగినచలి బట్టలు తీసుకోని వెళ్ళాలి. వర్షాకాలంలో వర్షాలకి కొండచరియలు విరిగి పడతాయి , శీతాకాలంలో హిమపాతం జరగవచ్చు , లేదా ఆచలి మనం తట్టుకోలేనంతగా వుంటుంది. మే ,జూన్ మాసాలలో కుడా కనీసమ్ రెండు చలిబట్టలుండాలి . కట్రా  లో వుండేందుకు అన్నివసతులు వున్నాయి . ఉత్తరాది , దక్షినాది భోజన సదుపాయాలూ కుడా వున్నాయి. 

కష్ట తరమైన యాత్రే కాని మనకు ఆ ప్రకృతిని , భక్తుల భక్తి పారవశ్యాన్ని చూస్తూవుంటే మనకు ఏ కష్టమూ తెలియదు. రాత్రికిపగలుకి తేడా లేకుండా భక్తులు " జై  మాతా ది" నామ స్మరణతో కొండ యెక్కుతూనే వుంటారు . 

ఇప్పటికి 25 అంతకంటే యెక్కువ సార్లు వైష్ణవీ దేవిని దర్శించుకున్నాం , యీ నవరాత్రులలో అమ్మవారిన తలచుకొని మీ అందరకీమాతను గురించి తెలియజెయ్యడానికి అవకాశం యిచ్చిన ‘ గో తెలుగు ‘ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

జై మాతాది , జైమాతాది , జోర్ సె బోలో జై మాతాది , మై నహి సుణియ , జై మాతాది , జై మాతాది .             

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు