దసరా.....మిన్నంటిన సంబరాల పండుగ....హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకూ ఒక పౌరాణిక నేపథ్యం ఉన్నట్టే, దసరాకూ ఉంది...ఉంది అనడం కంటే అనేకం ఉన్నాయి అనడం కరెక్ట్... పాండవులు అజ్ఞాత వాసం ముగించి శమీ వృక్షం పై నుంచి తమ ఆయుధాలు దించడం అనేది ప్రసిద్ధి గాంచిన, అందరికీ తెలిసిన కథ...ఆ విధంగా శమీ వృక్షం నేటికీ ఎంతో ప్రసిద్ధి....
అదే కాక, దసరా పండుగ వ్యక్తిత్వ వికాసానికి దోహద పడే పండుగగా కూడా చెప్పుకోవచ్చు...ఎలాగో చూద్దాం....
ఒకప్పుడు కౌస్థుడనే ఒక శిష్యుడు గురు దక్షిణ ఏం సమర్పించుకోవాలని గురువు గారిని అడగగా, ఆ గురువుగారు తన శిష్యుడిని పరీక్షింపగోరి, 14 కోట్ల బంగారు నాణేలను గురు దక్షిణగా సమర్పించమని కోరారట...సమర్పించుకోవడానికి తన దగ్గర అంత సొమ్ము లేక పోవడంతో కౌస్థుడు రఘువు అనే చక్రవర్తిని సహాయం కోరాడు..ఈ రఘువు అనే చక్రవర్తే శ్రీరాముని రఘువంశ మూల పురుషుడు. అయోధ్యాధిపతి అయిన ఆ రఘు చక్రవర్తి అంతకు ముందే విశ్వజిత్ యజ్ఞ క్రతువు జరిపించి, తన సకల సంపదలనూ దాన ధర్మాలు చేసి ఉన్నందున ఆయన కోశాగారము నిండుకొని ఉండి...కౌస్థుడు అడిగిన 14కోట్ల బంగారు నాణేలు ఇవ్వ లేక పోయాడు....కానీ, అపర దాన గుణము కల్గిన ఆ మహా చక్రవర్తి కౌస్థుడిని నిరాశ పర్చడం ఇష్టం లేక సంపన్నుడైన కుబేరుడితో యుద్ధం చేసి, ఓడించి, అతడి నుంచి ఆ సొమ్మును సేకరించాలని సంకల్పించాడు...వెంటనే యుద్ధం ప్రకటించాడు...ఆ యుద్ధంలో విజయం సిద్ధించుట కోసం శమీ వృక్షం కింద ఒక మహా యాగము చేయ సంకల్పించాడు.
ఇది తెలిసిన కుబేరుడు, రఘు చక్రవర్తితో యుద్ధం చేయ ఇష్టం లేక ఆయన మనసు లోని కోరికను తెలుసుకొని, ఆ శమీ వృక్షము మీద బంగారు నాణేలను ప్రసరించాడు.
రఘు చక్రవర్తి ఆ బంగారు రాశులను కౌస్థుడికి కానుకగా ఇవ్వగా, అందులోంచి కౌస్థుడు తన గురువుకి దక్షిణగా ఇస్తానన్న 14 కోట్ల బంగారు నాణేలను మాత్రం తీసుకుని వెళ్ళాడు...వాటిని తీసుకు వెళ్ళి తన గురువు గారికి దక్షిణగా సమర్పించుకొన్నాడు.
ఈ వృత్తాంతం నేపథ్యం లోనే దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తమ కంటే పెద్ద వారికి, ముఖ్యంగా గురువులకు ఈ శమీ పత్రములను సమర్పించుకొని నమస్కరించుకోవడం, ఆత్మీయులకు శమీ పత్రమును బంగారంగా భావించి సమర్పించి ఆలింగనం చేసుకోవడం అనాదిగా వస్తోంది.
దసరాను దశ హరా అని కూడా ఉచ్చరిస్తారు...ఎందుకంటే, శ్రీరాముడు దశ కంఠుడైన రావణుడిని సమ్హరించిన రోజు కావటాన.
అప్పుడెప్పుడో జరిగిన దానిని ఇప్పటికీ పండుగగా జరుపుకోవడం మాత్రమే కాక, మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది ఈ రావణ సమ్హారంలో. అదేమిటో చూద్దామా...దశ కంఠుడు ఆనాడే మరణించినా, మనలో కూడా ఇంకా మిగిలే ఉన్న ఆ దశ అవ లక్షణాలను సమ్హరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించడం....
1) అహంకారం
2) దురాశ
3) మాయ
4) అపరిపక్వత
5) అసూయ
6) ద్వేషం
7) బద్ధకం
8) దురాలోచనలు
9) వంచన
10) నిర్ణయాత్మక శక్తిలేమి
ఈ అవలక్షణాలను సమ్హరించడానికి దశ ఆయుధాలను ధరించాలి....
1) ధైర్యం
2) పట్టుదల
3) సమగ్రత
4) వినయం
5) స్వీయ నియంత్రణ
6) దయ
7) ప్రేమ
8) ఆశావాదం
9) క్షమ
10) తెలివి
ఈ విధంగా విజయదశమి వ్యక్తిత్వవికాస పండుగగా కూడా చెప్పుకోవచ్చు...
మన శత్రువులైన దశ అవలక్షణములను సమ్హరించి, మనలో నిద్రాణమైన శక్తులను వెలికి తీసి భవిష్యత్తుని విజయాల పరంపరగా మలుచుకోవడానికి ఈ విజయదశమి నాంది కావాలని ఈ పండుగలోని పరమార్థం....