ఆర్ధిక సంస్కరణల ధర్మమా అని, దేశంలో విదేశీకంపెనీల హవా విపరీతంగా పెరిగిపోయింది.. ఎక్కడచూసినా, విదేశీ Brands సుళువుగా దొరికిపోతున్నాయి… వాటితోపాటే, Malls కూడా చాలా వచ్చేశాయి. దానితో చిన్నచిన్న దుకాణాలకి గిరాకీ తగ్గిపోయింది మొదట్లో.. అయిదారు సంవత్సరాలు గడిచేటప్పడికి , కిరాణా కొట్లకీ, ఈ Malls కీ ఉండే తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది…
ఈ Malls లో ఉండే సదుపాయమల్లా, కావాల్సిన సరుకులన్నీ ఒకేచోట కొనుక్కోగలగడం.. ఇదివరకు కిరాణా కొట్లలో ఇటువంటి సదుపాయం ఉండేది కాదు… సరుకులన్నీ ఒకేచోట దొరుకుతాయనే కానీ, ఆ సరుకుల్లోని నాణ్యతలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి… ఉదాహరణకి మనకి ఏ కోడిగుడ్లో కావాలనుకుందాం.. ఓ shelf లో అందంగా pack చేసి, పైగా వాటిమీద Date of packing కూడా stamp చేసుంచుతారు. ఆ పాకెట్ మీద, పాకింగ్ తేదీనుండి 15 రోజుల్లో వాడాలనికూడా ఉంటుంది… 14 రోజులు పూర్తయినా, వాటిని 50% discount లో అమ్మడానికే ప్రయత్నిస్తారు కానీ, తాజా సరుకుతేవాలని మాత్రం అనుకోరు… చవకలో వచ్చేస్తోంది కదా, మళ్ళీ వీటికోసం ఇంకో చోటకి వెళ్ళడం ఎందుకూ అనుకుని అక్కడే కొనేస్తారు… అదే ఏ కిరాణాకొట్టుకోవెళ్ళి చూడండి, తాజాగా ఉండేవి దొరుకుతాయి. దీనికి కారణం ఏమిటని విచారిస్తే తెలిసిందేమిటంటే, ఈ Malls వాళ్ళు ప్రతీదీ టోకుగా , అంటే ఊళ్ళో ఉండే అన్ని outlets కీ సరిపడేలా తెప్పించేస్తారు.. ఆ contract ఏదో ఓ ఏడాదిదాకా ఉంటుంది… వాడి Timetable ప్రకారం వాడు సరుకు తెచ్చేస్తాడు. అమ్ముకోడం, అమ్ముకోకపోవడం ఈ Mall వాడి బాధ్యత. అలాగని అన్నిసరుకులూ బాగా ఉండవని కాదు.
అలాగే మనకి కావాల్సిన పప్పులూ, మసాళా దినుసులూ, వాడిక్కావాల్సిన కిలో పాక్కులూ, అర్ధకిలో పాక్కులు మాత్రమే ఉంచుతాడు. మనకి ఎంత తక్కువ కావాల్సినా చచ్చినట్టు, వాడి అర్ధకిలో పాక్ మాత్రమే కొనాల్సుంటుంది. అదే కిరాణా కొట్లో అయితే, మనకి కావాల్సిన పావుకిలో ఏమిటి, 100 grams కావల్సొచ్చినా తూచి ఇస్తాడు. ధరలో మహా అయితే రూపాయో అర్ధో తేడా ఉంటుంది… ఇంకోవిషయం—ఈ Malls లో కళ్ళు మిరుమిట్లు కొట్టేటట్టుగా , నానారకాల వస్తువులూ ఉంటాయి. దానితో అవసరమున్నా లేకపోయినా, ఎప్పటికో ఉపయోగిస్తుందిలే అనుకుని కొనేయడం. అలాగే ఖరీదులు కూడా ఒక్కోప్పుడు, ఏదో Brand పేరుపెట్టి, రెండింతలు ఎక్కువ. ఉదాహరణకి ఈ మధ్యన , ఏదో చెక్కతో చేసిన అట్లకాడలాటిదానికి, 95 రూపాయలు తీసుకున్నాడు, దానికి ఓ Brand Tag తగిలించి.. అదే చెక్క అట్లకాడ, బయటకొట్లో 50 రూపాయలకి దొరికింది… క్వాలిటీ విషయంలో బయటదే బావుందనిపించింది.
అలాగే Amazon, Flipcart లాటి online stores ధర్మమా అని, ఈరోజుల్లో, బయటకి వెళ్ళి సరుకులు కొనడానికి బధ్ధకం ఎక్కువైపోయి, ఇంట్లో కూర్చునే, తెప్పించేసుకుంటున్నారు… చిన్నచిన్న సరుకులైతే పరవాలేదు కానీ, పెద్ద పెద్ద Electronic Items కి కూడా ఇదే తంతు. Brand outlet కి వెళ్ళి తీసుకుంటే మంచిదేమోననిపిస్తుంది కనీసం పెద్ద వస్తువులు..
సర్వేజనాసుఖినోభవంతూ…