జనానందావళి!
అన్ని పండగల్లోకి డబ్బు దండగచేసేది. అతి ప్రమాదకరమైనదీ దీపావళి పండగ.
పిల్లలకు టపాసులు. పెద్దలకు అవి కుప్పపోసిన నోట్ల కట్టలు.
ఎవ్వరం ఒక్క పైసా ఉత్తగా కర్చుపెట్టం. ఎవరికీ అప్పనంగా ఇవ్వం. ఒకవేళ అప్పుగా ఇస్తే, మళ్ళీ తీసుకునేదాకా మనకి మనశ్శాంతి ఉండదు. వాళ్లకీ ఉంచం. పొరబాటున కిందపడిపోతే దొరికేదాకా వెతుకుతాం. అలాంటిది మనంతట మనం డబ్బును టపాసులుగా మార్చుకుని, ఇంటికి తెచ్చుకుని తగలేస్తాం. ఎంత విచిత్రమో కదా!
కళ్లు మిరమిట్లుగొలిపే వెలుగులు, చెవులు చిల్లుపడేశబ్దాలు, మంటలతో జరిగే ప్రమాదాలు. దీపావళి మరుసటిరోజు పేపర్ చదివితే, టీవీల్లో వార్తలు చూస్తే శరీరాలు కాలిపోయినవాళ్లు. కళ్లు పోగొట్టుకున్నవాళ్లు. హృదయం ద్రవించిపోతుంది.
కర్మాగారాల్లో భద్రత పట్ల కార్మికుల్లో అవగాహన కలిగిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది చిన్న పిల్లలు సైతం పెద్ద పెద్ద బాంబులు వెలిగిస్తారు. అదెంత ప్రమాదం? చిచ్చుబుడ్లు ముఖం మీద పేలడం, భూ చక్రాలు నిప్పులు విరజిమ్ముతూ మీదకి రావడం మనకు తెలియదూ. మనం వెలిగించే రాకెట్లు ఎక్కడ పడి ఎలాంటి ప్రమాదం తెస్తాయో, మన ఊహకు అందదు? అయినా నిర్లక్ష్యం.
మనింటి చుట్టుపట్ల రోగులు, కొద్దిరోజుల క్రితం పుట్టిన పిల్లలూ ఉంటారు. వాళ్లకి శబ్దం గుండేగుబేలనిపిస్తుందని మనకు తెలియదూ! తెలుసు, అయినా మనకనవసరం. మన ఆనందమే మనది.
ఇదంతా ఒక ఎత్తు, దీపావళి తరువాతి రోజు ఆడవాళ్లకి, మున్సిపాలిటీ వాళ్లకీ ఆ చెత్తంతా ఊడ్చి, ఎత్తడం పెద్దశిక్ష. పండగ అనేది సంబరం. అది సరదాగా జరుపుకోవలసిందే. కాని డబ్బు దుబరా చేసేదిగా, జీవితాల్ని కబళించేదిగా ఉండకూడదు.
లక్ష్మీదేవిని మనింటికి ఆహ్వానిస్తూ చక్కగా ప్రమిదల్లో ఇంత నూనెపోసి, దీపాలు వెలిగించి ఇంటి చుట్టూతా అలంకరిస్తే ఎంత బావుంటుంది.
కొత్త బట్టలు ధరించి కాకరపువ్వొత్తి (అదీ చిటపటలు లేనిది) వెలిగించి, తర్వాత ఇంత తీపి తింటే దీపావళి పండగ అవదా?
డబ్బు సంపాదించడం చాలా కష్టం. మన సంప్రదాయంలో డబ్బును లక్ష్మీదేవిగా పూజిస్తాం. దీపావళినాడు లక్ష్మీదేవికి పూజ చేస్తాం. అదే రోజు డబ్బును ఇలా వృధా చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.
మనం సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషం పంచాలనేది మన సంస్కృతి. దానికి అన్ని విధాల విఘాతం కలిగించేది దీపావళి.
వినాయక చవితి విషయంలో వినాయకుడి పరిమాణం తగ్గించాలని, సహజ రంగులతో అలంకరించిన మట్టి వినాయకుణ్నే పూజించాలని చెప్పగా, చెప్పగా చాలా వరకు జనాల్లో మార్పొచ్చింది.
అలాగే దీపావళి శబ్ద/ వాతావరణ కాలుష్యానికి దూరంగా, డబ్బును వృధా చేయకుండా జరుపుకునే రోజు ఎప్పుడొస్తుందో అదే నిజ దీపావళి. జనానందావళి!
గోతెలుగు అభిమాన పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు!