“మెడిషాడో...” నగరం నడిబొడ్డున ఉన్న అయిదంతస్థుల భవనంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఉన్న ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది. భవనంలోని రెండవ అంతస్థులోని అధునాతనమైన కాన్ఫరెన్స్ హాల్ లో హాస్పిటల్ లోని సిబ్బంది అంతా ప్రత్యేకంగా సమావేశమై ఉన్నారు. ఒక్కరి ముఖాల్లోనూ నెత్తురుచుక్క లేదు. వేదిక మీద కూర్చుని ఉన్న మెడిషాడో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనుంజయ్, కార్డియాక్ సర్జన్, ఎర్రబడ్డ ముఖంతో ఉగ్రనరసింహుడిలా కనబడుతున్నాడు. అతడి కళ్ళు చింత నిప్పుల్లా కణకణలాడుతున్నాయి. అతడిని పలకరించే ధైర్యం చేయలేక మిగిలిన డైరెక్టర్లు అతని పక్కనే సైలెంట్ గా కూర్చుని ఉన్నారు.
ఎప్పుడూ లేనిది, ఆ హాల్ లో ఆ రోజు సూది క్రింద పడినా వినబడేంత నిశ్శబ్ధంగ ఉంది. అతని ఎదురుగా కూర్చుని ఉన్న స్పెషలిస్టులు, కన్సల్టెంట్స్, నర్సులు, హాస్పిటల్లోని ఇతర సిబ్బందికి అంతటి ఏసి. లోనూ చమటలు పడుతున్నాయి. అతడా మౌనముద్ర వీడి నోరు తెరిస్తే... ఎవరి ఉద్యోగం ఈ రోజుతో ఆఖరవుతుందో తెలియని భయంకరమైన టెన్షన్. అగ్ని వర్షంలా ఉధృతంగా వచ్చి తాకబోయే అతడి మాటల శరద్ఘాతాలకు ఎవరు బలైపోతున్నారో తెలియక అందరూ బిక్కచచ్చిపోతున్నారు.
“అసలేం జరుగుతోంది మన హాస్పిటల్ లో...?” అతని కంఠం ఖంగుమంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.“నాకు ఈరోజు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకిలా...జరుగుతోంది...?” ఆవేశంతో కూడిన ఆవేదన అతని గొంతులో వినబడుతుంది.
“ఈ హాస్పిటల్ ఇంతగా ఎదగడానికి నేనెంత కృషి చేసానో నా ఒక్కడికే తెలుసు. ఒక చిన్న డబ్బాలాంటి గదిలో ప్రారంభించిన దీనిని అంచలంచలుగా అభివృద్ధి చేసి, ఈరోజు నగరంలోనే నంబర్ వన్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాను. ఇక్కడి డాక్టర్లు ధన్వంతరి వారసులు కాదు, సాక్ష్యాత్తూ దేవతలే అన్నంతగా రోగులకు మన పట్ల ప్రగాఢ విశ్వాసం ఏర్పరిచాను. ఏదైనా జబ్బును ఐడెంటిఫై చేయడంలో... ఈ హాస్పిటల్ లోని డాక్టర్లను మించి మరొకరు ఉండరన్న గుడ్ విల్ ప్రజలలో డెవలప్ చేసాను. మనం రాసిచ్చే మందులు అమెరికా వంటి దేశాల్లో దేశాలలోని పేరు మోసిన డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేయలేరు. మరి ఇప్పుడేమైంది? ఎవరో...పగబట్టి చేస్తున్నట్లు ఈ హాస్పిటల్ లో వరుసగా ఈ మరణాలేంటి...? ఏం చేస్తున్నారు మీరంతా...?” అసహనంగా అరిచాడు.
ఏమైందో తెలియదు. తన హాస్పిటల్ లోని ఇన్ వార్డ్ పేషంట్స్.....ఒక్కొక్కరూ పిట్టల్లా రాలిపోతున్నారు. చూస్తుండగానే బెడ్స్ ఖాళీ అయిపోతున్నాయి. అన్నీ బాగున్నాయి. కండీషన్ బాగుంది... క్యూర్ అవుతున్నాడు. రేపో మాపో డిశ్చార్జ్ చేయొచ్చు అనుకుంటున్న సమయంలో... ఆ పేషంట్ హఠాత్తుగా మరణిస్తున్నాడు.
కొందరి ప్రాణాలు.....నిమిషాల్లో ముగిసిపోతున్నాయి. ఒక గంట క్రితం రౌండిగ్స్ కి వెళ్ళినపుడు చెక్ చేసి...ఓకే చెప్పిన ఒక వ్యక్తి... మరు నిమిషానికి పోయాడని నర్స్ వచ్చి చెపుతుంటే..... నిర్ఘాంతపోతున్నాడు. చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం తప్ప, తను ఏమీ చేయలేకపోతున్నాడు. రౌండ్స్ కోసం ఏ కారిడార్ లోకి వెళ్ళినా... ఆ కారిడార్ అంతా మరణించిన పేషంట్స్ తాలూకు శోకంతో మారుమ్రోగిపోతుంది. “మెడిషాడో” పై మరణఛాయలు అలుముకున్నట్లు, హాస్పిటల్ అంతా మృత్యుగీతం పాడుతోంది.
ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియడం లేదు. అప్పటికి నిద్రాహారాలు మాని రిఫరెన్స్ బుక్స్ అన్నీ తిరగేసాడు. తనేమైనా రాంగ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడా...? మిగిలిన డాక్టర్లలో నిర్లక్ష్యం పెరిగిపోయిందా...? మెడికల్ షాప్ లో ఉన్న మందులను తెప్పించి చూసాడు.. ఔట్ డేటెడ్ మందులు ఏమైనా ఉన్నాయా? అని. ప్రతి లాబ్ లో జరుగుతున్న టెస్టులను పరిశీలించాడు. రాంగ్ రిపోర్టు ఏమైనా ఇస్తున్నారా? అని. కానీ, అదేం జరగలేదు. మరి ఎలా... ఎలా...ఇదంతా జరుగుతోంది....??? తలపట్టుకు కూర్చున్నాడు.
అందుకే, హాస్పిటల్ లోని అన్ని తరగతుల సిబ్బందిని పిలిచి, ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.
“ఈ డెత్స్ వలన సిటిలో మన హాస్పిటల్ రేటింగ్ ఎంతగా పడిపోయిందో మీకు తెలుస్తుందా...? మీలో ఎవరో చేస్తున్న నిర్లక్ష్యం... ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. ఎవరు... వాళ్ళెవరో నాకు తెలిసి తీరాలి. ఇప్పటికే ఈ హాస్పిటల్ లో చనిపోయిన పేషంట్స్ బంధువులు... రోడ్డుపై చేరి హాస్పిటల్ మీద, నా మీద... దుమ్మెత్తి పోస్తుంటే తలెత్తుకోలేక పోతున్నాను. ఫ్రెండ్స్ ఫోన్ చేసి..."ఏమైంది.....? మేమేదైనా హెల్ప్ చేయాలా??" అనడుగుతుంటే... అవమానభారంతో చచ్చిపోతున్నాను”.
అందరివైపు చూసాడు. అంతటా నిశ్శబ్ధం...
సరిగ్గా అదే సమయంలో వార్డులలోని పేషంట్స్ మధ్య మృత్యుదేవతలా ""అతడు"" తిరుగుతున్నాడు. నిశ్చలంగా..... గాజు కళ్ళతో.. ఎవరో అతడిని మంత్రించి... యాంత్రికంగా నడిపిస్తున్నట్లు... ఒక్కో పేషంట్ దగ్గరకూ వెళ్తున్నాడు. చేతితో పేషంట్ నాడి పట్టుకుని, అతడి నుదుటి రాతను చదువుతున్నట్లు.... తీక్షణంగా పేషంట్ నుదురు చూసి, ఏదో అర్ధమైనట్లు తల ఊపి... డాక్టర్ గారు రాసి ఇచ్చిన మందులను ఈ డోసు ప్రకారం వేయండని పేషంట్ దగ్గరున్న హెల్పర్ చేతిలో పెడుతున్నాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది... అతను ఇస్తున్న డోసు, ప్రిస్క్రిప్షన్ లోనిది కాదు. అతడు... “మెడిషాడో” హాస్పిటల్ లో పదిరోజుల క్రితమే జాయిన్ అయిన కన్సల్టెంట్ “డాక్టర్ ఆనంద్".
*******
అందరూ మౌనంగా ఉండడంతో డా. ధనుంజయ్ కి అసహనం పెరిగిపోయింది. "చెప్పండి ఏం జరుగుతుంది....? మీరంతా ఏం చేస్తున్నారు? ఎందుకని పేషంట్స్ అంతా చచ్చిపోతున్నారు?" పట్టలేనంత గట్టిగా అరిచాడు. అందరూ భయంతో వణికిపోయారు. ఎవరికీ ఏమీ తెలియదు...ఏం చెప్పాలో ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఇంతలో హఠాత్తుగా క్రింద రిసెప్షనిస్టు రాధిక నుండి వస్తున్న కాల్ కి, సైలెంట్ లో పెట్టి ఉన్న చేతిలోని ఫోన్ వైబ్రేట్ అవుతుంటే, థర్డ్ ప్లోర్ హెడ్ నర్స్ వరలక్ష్మి మీటింగ్ మధ్యలోనుండి లేచి బయటకు పరుగెత్తింది. అప్పుడు గమనించింది. డాక్టర్ ఆనంద్ ఈ మీటింగ్ కి హాజరు కాలేదనే విషయం...!
ఫోన్ లిఫ్ట్ చేసి, “హెలో... హెలో... రాధికా...” లో గొంతుకతో అంది. “8వ నంబర్ వార్డుకి రా...” అవతలి నుండి ఎవరిదో గరుకైన కంఠస్వరం. అది రిసెప్షనిస్టు రాధిక గొంతు కాదు. ఏదో అనుమానంతో వరలక్ష్మి భృకుటి ముడివడింది.
“ఎవరికైనా... ఏమైనా అయిందా...?” కంగారుగా గబ గబా అటువైపుకి పరుగెత్తింది వరలక్ష్మి.
థర్డ్ ప్లోర్ లో ఆరునుండి తొమ్మిది వరకు ఉన్న నాలుగు జనరల్ వార్డులు తనవి. అప్పుడు సమయం... రాత్రి 10.30. అన్ని వార్డులలోని పేషంట్స్ నిద్రలో ఉన్నారు. వారి అటెండర్స్ మాత్రం ఒక్కరో ఇద్దరో మెలకువతో ఉండి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.
ఎనిమిదవ వార్డులో అడుగుపెడుతూనే... ఏదో విచిత్రమైన ఘాటు పరిమళం... మత్తుగా... అక్కడ “అతడు”. అతడిని చూసి నివ్వేరపోయింది. డా.ఆనంద్ 3వ నంబర్ బెడ్ దగ్గర నిలబడి ఆ పేషంట్ కి ఇంజక్షన్ చేస్తున్నాడు. దగ్గరగా వెళ్ళింది. “డాక్టర్... మీరు మీటింగ్ కి రాలేదెందుకు...?” ఆశ్చర్యంగా అడగబోతూ.. అతని వైపు చూసి ఠక్కున ఆగిపోయింది. అతని చర్య...ఎందుకో అసాధారణంగా, అసహజంగా ఉంది. అతడు పేషంట్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అతని నోటి నుండి “బిజ్...” అనే శబ్ధాన్నిస్తూ లోగొంతుకతో పదే పదే ఏదో మంత్రోఛ్ఛారణ... ”ఇహ జన్మని... కాయిక...వాచిక...మానసిక...ఇత్యాది పాప నివృత్తిరస్తు... స్వస్థ పరబ్రహ్మలోక నిత్యనివాస ప్రాప్తిరస్తు...” పేషంట్ కూడా అతని కళ్ళల్లోకే చూస్తూ రెండు చేతులెత్తి అతనికి నమస్కరిస్తున్నాడు. పేషంట్ కళ్ళల్లో ఏదో తృప్తి... ఇహలోక బంధాలనుండి విముక్తుడవుతున్నట్లు అదో అలౌకికానందం.
ఆశ్చర్యపోతూ...డా. ఆనంద్ ముఖంలోకి చూసింది. అతనో ఉన్మాదావస్థలో ఉన్నాడు. అతనేం చేస్తున్నాడో అతనికే తెలియని స్థితి. అతనిలో ఇంకెవరో ఉండి... అతనికి ఆదేశాలిస్తున్నట్లు, యాంత్రికంగా కదులుతున్నాడతను. ఆమెకు రెండు రోజుల క్రితం... ఫోర్త్ ఫ్లోర్ పిల్లల వార్డులకు చెందిన హెడ్ నర్స్ బ్రమరాంబ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. "అక్కా... డా. ఆనంద్ మనిషి కాదేమో...! నిన్న చిల్డ్రన్ వార్డులో వికాస్ కి టెస్టులు చేస్తున్నపుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు చూసాను... అతని ముఖం ఏదో వికృతంగా కనిపించింది. ఆకలిగొన్న మృగం లా వికాస్ వంక చూడటం నేను కళ్ళారా చూసాను." అపుడా మాటలు హాస్యానికే అనుకుని కొట్టిపారేసింది వరలక్ష్మి. ఇప్పుడు చూస్తే... అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇంజక్షన్ పూర్తి చేసి, సిరంజిని వరలక్ష్మి చేతిలో పెట్టి, డా. ఆనంద్ అక్కడనుండి వెళ్ళిపోయాడు.
ఆ ఇంజక్షన్ వైపు చూసింది. ఆమె గుండె ఆగినంత పనయ్యింది. ఆ సిరంజిలో మందు లేదు. అంటే... అంటే... ఆ పేషంట్ నరాల్లోకి కేవలం గాలిని ఇంజక్ట్ చేస్తున్నాడు డా. ఆనంద్.
సహజంగా పేషంట్స్ కి ఇంజక్షన్ ఇవ్వడానికి సిరంజిలో ఫ్లూయిడ్ నింపేటపుడు అందులో గాలి లేకుండా జాగ్రత్తపడాలి. కాని, కొందరు నర్సుల అనుభవలోపం, నిర్లక్ష్యం వలన అప్పుడప్పుడు సిరంజిలోని ఫ్లూయిడ్ కి ముందు మిగిలిపోయి ఉన్న కొంత గాలి మనిషి నరాలలోకి చేరుతుంటుంది. అలా వెళ్ళిన ఎయిర్ రక్తప్రసరణలో గ్యాప్ ని ఏర్పరచుతుంది. ఇది రక్తంతోపాటు ప్రవహించి ఊపిరితిత్తులు, మెదడు, ఇలా ఏదో ఒక ప్లేస్ లో ఆగిపోయి, అక్కడ సమస్యను సృష్టిస్తుంది. ప్రధానంగా ఇది గుండె లో సిచ్యుయేట్ అయినపుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సరియైన సమయంలో గుర్తించకపోతే, (కార్డియాక్ అరెస్ట్ తో) ఆ మనిషి మరణిస్తాడు.
అంటే.... ఈ హాస్పిటల్ లో జరుగుతున్న వరుస మరణాలకు కారణం డా. ఆనందే అన్నమాట...! వరలక్ష్మికి శరీరమంతా చమటలు పట్టేశాయి. మెదడంతా మొద్దుబారినట్లయిపోయింది. ఇంక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు. పరుగు పరుగున మీటింగ్ హాల్ కి వెళ్ళింది. అప్పటికి మీటింగ్ పూర్తయ్యింది.
డా. ధనుంజయ్ ని చూడగానే అతని దగ్గరకు వెళ్ళబోయింది. వెంటనే ఇదంతా అతనితో చెప్పాలి. కానీ, ఎవరో పట్టి ఆపినట్లు నిల్చున్న చోటునుండి కాలు కదపలేకపోతుంది. కనీసం పక్కనున్న వారివైపు చూసింది. అందరూ మసగ్గా కనబడుతున్నారు. ఎవరూ తనవైపు చూడటం లేదు. ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుంది..? తలతిప్పి పక్కకు చూసింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెకు కొద్ది దూరంలో జేబుల్లో చేతులు పెట్టుకుని డా. ఆనంద్ నిలబడి ఉన్నాడు. అతడి చూపు తనవైపే ఉంది. అతని ముఖంలో గగుర్పాటు కలిగించే ఓ భయంకరమైన నవ్వు మెరిసి మాయమైపోయింది.
******
ఉదయం నుండీ తల బ్రద్దలైపోతుంది వరలక్ష్మికి. ఈ రోజు పొద్దున హాస్పిటల్ కి రాగానే... ఆ ఎనిమిదో వార్డులోని మూడవ నెంబర్ బెడ్ పేషంట్ మరణించాడని తెలిసింది. అతని మరణానికి ప్రత్యక్ష సాక్షి తను. కానీ, ఆ విషయం ఎవరికీ చెప్పలేక పోతుంది. అయినా ఈ హాస్పిటల్ లో ఇంతమంది డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉండగా. డా. ఆనంద్ తనకే ఎందుకు తెలిసేలా చేసాడు...? అతడు తననే ఎందుకు ఫోన్ చేసి పిలిచాడు? హఠాత్తుగా బ్రమరాంబ గుర్తొచ్చింది. ఆరోజు తను అలా అంది అంటే... ఆమెకు కూడా డా. ఆనంద్ గురించి తెలుసా...?
బ్రమరాంబను పిలిపించి అడగాలని పిల్లల వార్డుకు వెళ్ళింది. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు బ్రమరాంబ ఈ రోజు హాస్పిటల్ కి రాలేదని చెప్పడంతో వెనుతిరిగి వస్తూ ఉంటే... అయిదోనెంబరు వికాస్ బెడ్ ఖాళీగా కనబడింది.
అప్పుడు గుర్తొచ్చింది వరలక్ష్మికి. ఈ రోజు హార్టు పేషంట్ పదేళ్ళ వికాస్ కి హార్ట్ సర్జరీ. రివ్వున ఆపరేషన్ థియేటర్ దగ్గరకు పరుగెత్తింది. అప్పటికే లోపల ఆపరేషన్ ప్రారంభమైంది. మైగాడ్... ఇప్పుడెలా...?? బ్రమరాంబ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. “ఆకలిగొన్న మృగంలా వికాస్ వంక చూడటం నేను కళ్ళారా చూసాను”
గబ గబా ఆపరేషన్ థియేటర్ ఇన్ ఛార్జి దగ్గరకు వెళ్ళి, అతని దగ్గరున్న రిజిష్టరు లో చూసింది. ఆపరేషన్ కి అటెండ్ చేస్తున్న డాక్టర్ల పేర్లు చదివింది. వారిలో డా. ధనుంజయ్ తో పాటు, Pediatric Cardiologists డా. అశోక్ మరియు విజయవర్మల పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో డా. ఆనంద్ పేరు లేకపోవడం చాలా ఆనందాన్నిచ్చింది.
అతను ఈ పరిసరాలలో లేడు కాబట్టి, ధనుంజయ్ గారికి ఈ విషయం చెప్పడానికి ఇదే మంచి సమయం అనిపించి, థియేటర్ ఇన్ ఛార్జితో ఏదో మాట్లాడింది. అతడు లోపల ఉన్న ధనుంజయ్ తో ఒకసారి ఫోన్ లో మాట్లాడి, వరలక్ష్మి ఆపరేషన్ థియేటర్ లోని డాక్టర్స్ రెస్ట్ రూమ్ లోకి వెళ్ళడానికి అనుమతి ఇప్పించాడు. సాధారణంగా ఇలాంటి అనుమతి ఎవరికీ ఇవ్వరు. ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పడం వలన వరలక్ష్మికి ఆ అవకాశం లభించింది. ఆపరేషన్ పూర్తయ్యాక ఫ్రెష్ అవడానికి డాక్టర్లు ఆ గదిలోకే వస్తారు.
ఆ గదికి, ఆపరేషన్ థియేటర్ కి మధ్య గోడలా అడ్డుగా పేద్ద సౌండ్ ఫ్రూఫ్ గ్లాస్ ఉంది. దాని నుండి థియేటర్ లోపల వికాస్ కి జరుగుతున్న ఆపరేషన్ అంతా స్పష్టంగా కనబడుతోంది. వికాస్ బెడ్ చుట్టూ... డాక్టర్లతో పాటు మరో ఇద్దరు థియేటర్ నర్సులు, ఒక మేల్ నర్సు కూడా ఉన్నారు. అందరూ సర్జికల్ స్క్రబ్స్, క్యాప్స్ అండ్ మాస్క్ ధరించి ఉండడంతో ఎవరు ఎవరో గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. ఆ ఆపరేషన్ నే చూస్తూ ఆ అద్దం వెనుక నిలబడి పోయింది.
ఆపరేషన్ మధ్యలో డా. ధనుంజయ్ తనకు కుడిపక్కన ఉన్న మేల్ నర్స్ కి ఏదో సైగ చేశాడు. బహుశా... ఆక్సిజన్ లెవల్స్ పెంచమని కాబోలు. ఆ వ్యక్తి ఓ సారి తలెత్తి... అద్దం వెనుక నిలబడి చూస్తున్న వరలక్ష్మి వైపు చూసాడు. యదాలాపంగా అతనిని చూసిన వరలక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతడి కళ్ళు... నవ్వుతున్నాయి. ఆ కళ్ళు.. ఆ కళ్ళు... మైగాడ్... అతను డా. ఆనంద్.
అతడు ముందుకు కదిలాడు. “అతను ఏం చేయబోతున్నాడు...??” గుండె దడదడలాడుతుండగా ఆందోళనగా అతడినే చూస్తోంది వరలక్ష్మి. డా. ఆనంద్ నడిచి వెళ్ళి, గోడకు అమర్చి ఉన్న అక్సిజన్ నాబ్ దగ్గరకు వెళ్ళాడు.
ఆపరేషన్ సమయంలో ఇచ్చిన అనస్తీషియా వలన ఆపాదమస్తకం అచేతనంగా మారిపోయిన పేషంట్, తనంతట తాను శ్వాస తీసుకోలేడు కనుక, కృత్రిమ శ్వాస కోసం ఆక్సీజన్ మాస్క్ తొడుగుతారు. గతంలో ఆక్సీజన్ కొరకు సిలిండర్లు ఉపయోగించేవారు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వలన, ప్రతి హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి, అక్కడినుండి ICU, ఆపరేషన్ థియేటర్ వంటి ముఖ్యమైన గదులకు ట్యూబుల ద్వారా సప్లయ్ చేస్తారు. ఆ ట్యూబులను గది గోడలకు అమర్చి, వాటికి ఉన్న నాబ్స్ ద్వారా ఉపయోగిస్తారు.
అతడు గోడకు ఉన్న నాబ్ పై చేయిపెట్టడం వరలక్ష్మికి కనబడుతోంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అతని చేయి ఆక్సిజన్ నాబ్ పై లేదు. పక్కనే ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్ నాబ్ పై ఉంది. సాధారణంగా సర్జరీ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నపుడు, ఆ రక్తాన్ని గడ్డ కట్టించడం కోసం నైట్రోజన్ ఆక్సైడ్ ని ఉపయోగిస్తారు.
వరలక్ష్మి చూస్తుండగానే, ఆ రెండవ నాబ్ ని త్రిప్పి, ఆక్సీజన్ మాస్క్ లోకి నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల చేసాడు. కొద్ది సెకన్లలోనే...ఆపరేషన్ టేబిల్ పై వికాస్ శరీరం ఎగిరెగిరి పడటం. అక్కడున్న డాక్టర్లకు పరిస్థితి అర్ధం అయ్యేలోపే... వికాస్ కి అమర్చిన హార్ట్ రేట్ మానిటర్... బీప్ సౌండ్ తో సరళరేఖను సృష్టిస్తూ... వికాస్ మరణాన్ని ఖరారు చేసేయడం... కళ్ళముందే జరిగిపోయాయి.
వరలక్ష్మి పూర్తిగా కొయ్యబారిపోయింది. ఆమె మెదడు పనిచేయడం మానేసింది. అక్కడనుండి కలలో నడుస్తున్నదానిలా థర్డ్ ఫ్లోర్ లోని తన రెస్టు రూమ్ కి వచ్చేసి, కుర్చీలో కూర్చుండిపోయింది. అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. బాగా చీకటి పడిపోయాక, నైట్ డ్యూటీ నర్సు వచ్చి కదిపితే, లేచి ఇంటికి బయలుదేరడం కోసం హేండ్ బ్యాగ్ తగిలించుకుని లిఫ్ట్ లోకి వెళ్ళి నిల్చుంది.
లిఫ్ట్ లో అదే వింతయిన పరిమళం... తన పక్కనే ఎవరో నిల్చున్నట్లనిపించి చూసింది. “డా. ఆనంద్ ...!” ఉన్నచోటే బిగుసుకుపోయింది.. అతడు ఆమె వంక చూస్తూ చెప్పాడు. "ఈ రోజుతో ఇక్కడ నా బాధ్యత పూర్తయింది. కాలం తీరిన వారినందరినీ నావెంట తీసుకుని...నేను వెళ్ళిపోతున్నాను." అతని కళ్ళు విచిత్రంగా ఉన్నాయి. కనుగుడ్లు కదలకుండా ఆగిపోయి ఉన్నాయి. గొంతు కూడా.... అతనిలా లేదు. అతనిలో ఇంకెవరో ఉండి మాట్లాడుతున్నట్లుంది.
లిఫ్ట్ క్రిందకి వచ్చి ఆగింది. అతడు డోర్ తెరచుకుని నిశ్శబ్ధంగా హాస్పిటల్ బయటకు నడిచాడు. కాస్సేపటిలో బయట ఉన్న చీకటిలో కలిసిపోయాడు. అప్పుడు కనబడింది. అతనితో పాటు డా. ధనుంజయ్ ఉన్నాడు. చేష్టలుడిగి వాళ్ళిద్దరు వెళ్ళినవైపే చూస్తుండిపోయింది వరలక్ష్మి. ఆమె మస్తిష్కంలో వేయి ప్రశ్నలు.."డా. ఆనంద్ ఎవరు...?????" మనిషా...? మృత్యువా...?
వెనుక ధనుంజయ్ చాంబర్ దగ్గర కలకలం... “ఓ మైగాడ్... డాక్టర్ ధనుంజయ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు...” ఎవరో గట్టిగా అరుస్తున్నారు.
.....దూరంగా ఇంకో హాస్పిటల్ దగ్గర కుక్కలు మోరలు చాపి ఏడుస్తున్నాయి. డా. ఆనంద్ ఆ హాస్పిటల్ లో అడుగుపెట్టాడు.
: మృత్యువు మనుషుల ప్రాణాలు హరించడానికి ప్రత్యక్షంగానే కాదు, మరో మనిషిని కూడా మీడియం చేసుకుంటుందా..? ఇక్కడ... ఆ మీడియం...డా. ఆనందా...??
******