యజ్ఞోపవీతం - భమిడిపాటిఫణిబాబు

yagnopavetam

మరీ కూలంకషంగా తెలియకపోయినా, కొన్ని కొన్ని విషయాలు మనం చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణం ధర్మమా అని, తెలుసుకోడానికి ప్రయత్నిస్తాము… ఇప్పుడంటే చాలాచోట్ల ఆధునిక పోకడలు ఎక్కువవడం వల్లనైతేమి, సమయాభావమైతేనేమి, లేకపోతే బధ్ధకం మూలానైతేమి, చాలా సాంప్రదాయాలమీద అంతగా శ్రధ్ధ చూపడంలేదనిపిస్తోంది…. అలాటివాటిలో ముఖ్యమైనది యజ్ఞోపవీతం ఒకటి..

భారతీయ ఋషులు మానవజీవితాన్ని చక్కదిద్దుటకు , వేదమంత్రముల ఆధారంగా షోడశ సంస్కారాలు ఏర్పాటుచేసారు. మామూలుగా మంచి వారిని  “ ఆర్యులు- సవ్రతులు “, చెడ్డవారిని  “ దన్యులు- అవ్రతులు “ అని వేదంలో చెప్పారుట. ఈ ఆర్యులకి వంశపారంపర్యంగా  కొన్ని  బాధ్యతలు  స్వీకరించాల్సొస్తుంది.. ఓ వ్రతంలా చేయాలి…ఈ వ్రతారంభానికి అర్హులు కావడానికి, సత్సంకల్పం మర్చిపోకుండా, గుర్తుపెట్టుకోడానికి ,ఈ యజ్ఞోపవీత ధారణ ముఖ్యం. వేదంలో ఈ యజ్ఞోపవీతాన్నే యజ్ఞసాధనగా పరిగణించారు..
యజ్ఞ =  యజ్ఞార్ధము… అనగా ఉత్తమ కర్మలు ఆచరించుటకు చిహ్నంగా…

ఉపవీతము =  దారం.

ఆర్యులు వ్రతమయంగా జీవితం గడపడానికి చిహ్నంగా ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఈ యజ్ఞోపవీత ధారణ ఉపనయన సంస్కారాల్లో జరుపబడుతుంది. ఉపనయనంలో రెండు సంస్కారాలున్నాయి – 1. యజ్ఞోపవీత ధారణ.  2 వేదారంభము ( గాయత్రీ మంత్రోపదేశం ). గురువులు తమవద్దకు వచ్చిన విద్యార్ధి, విద్యార్ధినులకు , విద్యాచిహ్నంగా యజ్ఞోపవీత ధారణ చేసేవారు. ఇది ఒక బయటకి కనిపించే బాహ్య చిహ్నం… చిహ్నమంటే ఉంది కానీ, శారీరిక, మానసిక  ప్రవర్తన లో మార్పొస్తుందా అనే ఒక అనుమానం చాలామందిలో ఉంటుంది… ఇది ఎలాటిదంటే, యూనివర్శిటీ స్నాతకోత్సవ టైములో,  Graduates  కి గౌనులిస్తారు,  non graduates  కి అవుండవు. కానీ ఇద్దరూ విద్యార్ధులే.. వారి మధ్యలో తేడాలు చూపించడానికే ఈ చిహ్నాలు, అలాగే ఈ యజ్ఞోపవీతాలూనూ…

కొందరు యజ్ఞోపవీత ధారులు దృఢ సంకల్పంతో నియమాలు పాటించకపోతే, ఫలితాలు పొందలేరంటారు.. నిజమే కదా మరి , మొదటి భాగం సంకల్పం మాత్రం చేసేసి, రెండవభాగం ప్రార్ధన చేయకపోతే ఫలితం ఎలా వస్తుందీ ? ఈ యజ్ఞోపవీతం సిధ్ధ పురుషులకీ, ఋషులకీ ఉండదు. కారణం –వారు సాధకావస్థను దాటి సిధ్ధావస్థ లోకి వచ్చేసారు. కొందరంటారూ, మరి వీరిని ఆర్యులని ఎలా అనగలరూ అని,  Degree  తో సంబంధం లేకుండా, చదువుకునే వారినందరినీ విద్యార్ధులు అన్నట్టుగానే ఇదీనూ..

మనిషి పుట్టడమే మూడు ఋణాలతో పుట్టాడని వేదంలో చెప్పారు – 1. దేవఋణము. 2. పితృఋణము 3. ఋషిఋణము.. యజ్ఞోపవీతంలోని మూడు పేటలూ, ఈ మూడు ఋణాలనీ గుర్తుచేస్తూంటాయి.

యజ్ఞోపవీతం పరిమాణం , ధరించేవాడి ఎత్తుని బట్టి ఉంటుంది… మూడు పోగులలోనూ ఇరవై ఏడు ఒంటి పోగులుంటాయి… కాలాంతరంలో ఈ యజ్ఞోపవీతాన్నే తెలుగులో  “ జందెము “ అంటారు. యజ్ఞోపవీత మంత్రం చెప్పుకుంటూనే, దీన్ని ధరించాలి… వీటిని ధరించినవారు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా తప్పకుండా పాటించాలి పవిత్రత కాపాడ్డంకోసం…. ముఖ్యంగా మలమూత్రవిసర్జన సమయంలో…  ఈరోజుల్లో ఎంతమంది పాటిస్తున్నారనేది చర్చనీయాంశమే.

వివాహపూర్వము, వివాహానంతరము ఈ యజ్ఞోపవీత రూపంలో మార్పు వస్తుంది. ఉపనయన సమయంలో ఒకటే ముడి, గృహస్థాశ్రమానికి మారిన తరువాత  రెండు కానీ , మూడుకానీ ముడులు ఉంటాయి. ఈ యజ్ఞోపవీతం  జీర్ణం అయినప్పుడు, మంత్రయుక్తంగా నే తీసేసి,  ఏ నదిలోనో, చెట్టుమీదో వేయాలి.

ఆర్యసమాజ స్త్రీలు కూడా యజ్ఞోపవీత ధారణ చేస్తారని చదివాము… వేదాల్లో రాసిన దానికి , చాలామంది భాష్యాలు చెప్పారు. కొంతకాలం వరకూ బ్రాహ్మణులు మాత్రమే ధరించేవారు. కాలక్రమేణా దయానంద సరస్వతి లాటి సంఘసంస్కర్తల ధర్మమా అని, ఇతర వర్ణాలు—వైశ్య, క్షత్రియ వర్ణాలవారు కూడా ధరిస్తున్నారు… ఏ వర్ణం వారు ధరించినా, యజ్ఞోపవీత పవిత్రతని కాపాడ్డం మాత్రం వారి బాధ్యత.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు