అన్నీ స్మార్ట్ డివైజ్‌లు వచ్చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఒక్కటే కాదు. ప్రపంచమే స్టార్ట్‌గా మారిపోయింది. ముందు ముందు ఇంకెన్ని వింతలొస్తాయో కానీ, ఇప్పటికీ ఈ వింతలే కొంత మేలు చేస్తున్నాయి. కొంత కీడు కూడా కలిగిస్తున్నాయి. ఫేస్ రికగ్నేషన్ పాస్ వర్ద్స్, థంబ్ రికగ్నేషన్ పాస్ వర్డ్స్ ఇలా చాలా పద్థతులు వినియోగంలో ఉన్నాయి స్టార్ట్ టెక్నాలజీకి సంబంధించి. చేతిలో మొబైల్ కావచ్చు, ల్యాప్ ట్యాప్ కావచ్చు, కార్ కావచ్చు. ఇంకేదైనా కావచ్చు దేన్నైనా స్మార్ట్ టెక్నాలజీకి లింకప్ చేసేస్తున్నాం. దానర్ధం మన పర్సనల్ డేటా మొత్తం స్మార్ట్‌గా అందించేస్తున్నామన్న మాట. ఎవరికి అందిస్తున్నామో అనేది మనకే తెలియని పరిస్థితి. మన ఫోన్, మన కంప్యూటర్ మన చేతిలోనే ఉన్నాయనుకుంటే పొరపాటే.
ఒక్కసారి స్మార్ట్ టెక్నాలజీకి కనెక్ట్ అయ్యాకా, నీదీ లేదు, నాదీ లేదు, మన ప్రమేయం లేకుండానే మన బ్యాంక్ ఖాతాలు లూటీ అయిపోతున్నాయ్. మన వ్యక్తిగత సమాచారమ్ క్షణాల్లో విశ్వ వ్యాపితం అయిపోతోంది. ఇక్కడ అంతా సురక్షితం అని చాలా వెబ్‌సైట్స్ పేర్కొనచ్చు గాక, కానీ అవే మన సమాచారాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నాయంటే నమ్మగలమా.? నమ్మాలి, నమ్మి తీరాలి. నేను పక్కాగా ఉన్నాను. అంతా పక్కాగానే ఉంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్లే. సోషల్ మీడియా 'ఈ - షాపింగ్' ఏదైనా సరే మన సమాచారాన్ని అక్కడ పొందుపరిచామంటే అట్నుంచి అటు మూడో వ్యక్తి తేలిగ్గా అందేసుకుంటున్నాడు. అమ్మేసుకుంటున్నాడు. ఫోటోలకు ఒక రేటు, వీడియోలకు ఇంకో రేటు వ్యక్తిగత సమాచారానికి మరో రేటు.. నమ్మగలమా ఇది. ఊహూ.. నమ్మి తీరాల్సిందే.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థలే ఈ విషయంలో తామేం చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. మరెలా.? ఈ దోపిడీ నుండి మనల్ని మనం రక్షించుకోగలమా.? కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడ పొందుపరచాల్సి వచ్చినా ఒకటికి రెండు సార్లు, ఒకటికి పది సార్లు కాదూ, ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిందే. వేరే దారే లేదు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి ఎక్కడికైనా వెళతాయి. ఎలాగైనా మారతాయి.. అని మనకు మనం ఓ అవగాహన పెట్టుకోవాలి. తర్వాత గగ్గోలు పెట్టడం కంటే, మన పర్సనల్ కంటెన్ట్‌ని పర్సనల్‌గా ఉంచుకోవాలనే విజ్ఞత అన్నింటికంటే ముఖ్యమైనది. ఒక్కసారి నెట్టింట్లోకి స్మార్ట్‌గా ఎంట్రీ ఇచ్చాక జరిగే ఏ చర్యకీ బాధ్యులు ఎవ్వరూ కారు మీరు తప్ప.!