స్మార్ట్ ఫోన్ వచ్చాక సీక్రెసీ అనేది లేకుండా పోయింది. అంతా స్మార్ట్ ఫోన్ లోనే. ఛాటింగ్, షాపింగ్, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఇలా ఒక్కటేమిటీ అంతా ఆన్‌లైన్ లోనే అయి పోతోంది. ఇదంతా పాత విషయమే. అలాగే చాటు మాటుగా తీసిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను ఆసరాగా తీసుకుని ఆకతాయిలు చేస్తున్న బెదిరింపులు, వెకిలి చేష్టలను కూడా చూసేశాం. తద్వారా జరిగిన, జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలతో పాటు జరిగిన ఆత్మహత్యలు, హత్యలు వంటి దారుణాలను కూడా వినేశాం. అయితే స్మార్ట్ ఫోన్ ని దుర్వినియోగం చేసిన వారి లిస్టు ఇది. కానీ ఆ స్మార్ట్ ఫోన్ ని సద్వినియోగం చేసుకున్నవారూ లేక పోలేదు. అలాంటి వారు చేతిలో ఉన్న తమ స్మార్ట్ మొబైల్‌తో తమకు అందుబాటులో ఉన్న వనరులతో తీసిన ఫోటోలను, వీడియోలను తమ ఉపాధి కోసం వినియోగించుకుంటున్నారు.
ఓ స్మార్ట్ ఫోన్ మట్టి లోని మాణిక్యాన్ని వెలికి తీసిందంటే నమ్మ గలరా.? నమ్మి తీరాలి. తూర్పు గోదావరి జిల్లా, ఓ మారు మూల పల్లె. ఏ రకమైన వసతి సౌకర్యాలు లేని ఊరు. అసలు ఆ ఊరంటేనే భయ పడే జనం. అలాంటి ఊరి నుండి ఓ టాలెంట్ బయటికి వచ్చింది. అక్షరాలా స్మార్ట్ ఫోన్ తోనే అది సాధ్యమైంది. ఓ గాన కోకిల ప్రపంచానికి పరిచయమైంది. ఆమె పేరు బేబి. బేబికి చిన్నతనం నుండీ పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆమె ఏ సంగీతమూ నేర్చుకోలేదు. అలా ఓసారి సరదాగా పాడిన ఆమె పాటను తన స్నేహితురాలు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే లక్షల్లో లైకులొచ్చేశాయి ఆ పాటకి. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆమెకు ఫోన్ చేసి, సినిమాల్లో పాడేందుకు అవకాశమిచ్చారు. చూశారా. స్మార్ట్ ఫోన్ మాయాజాలం. ఊహించని మలుపు అది. అలాంటి అనూహ్య ఘటనలు ఒక్క బేబి జీవితంలోనే కాదు, స్మార్ట్ మొబైల్ వచ్చాక ఎందరో మట్టిలోని మాణిక్యాలు తమ తమ క్రియేటివిటీకి పదును పెడుతుండగా, ఆ క్రియేటివిటీ ప్రపంచానికి సులువుగా చేరే అవకాశం దక్కుతోంది.
ఫేస్‌బుక్, వాట్సాప్స్‌లాంటి స్టార్ట్ యాప్స్‌ని కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తుండగా, ఇలా కొంత మంది తమలోని క్రియేటివిటీని బయట పెట్టేందుకు వాడుతున్నారు. అనుకోకుండా తీసిన వీడియోలు షార్ట్ ఫిల్మ్‌లుగా మారి, వారి ఆర్ధిక ఉన్నతికి ఉపయోగపడుతున్నాయి. రకరకాల ఉపాధి మార్గాలుగా మారుతున్నాయి. ఉపాధి కొంతైతే, సమాజానికి మేలు చేసే వివిధ అంశాల పట్ల చైతన్యం పెంచుకునేందుకు మరికొన్ని ఉపయోగ పడుతున్నాయి. ఏది ఏమైనా టెక్నాలజీ డెవలప్ చేసుకోవడమే కాదు, దాన్ని వినియోగించుకోవడంలో మనమెంత ముందున్నామనేదే గుర్తించాల్సిన అంశం. నేటి యువత ఈ విషయాన్ని గమనించి పెరుగుతున్న టెక్నాలజీని సమాజ హితం కోసం ఉపయోగించాలనేది నిపుణులు సూచిస్తున్న చిరు సలహా. ఈ చిన్న సలహా పాటిస్తే మరెన్నో అద్భుతాలకు స్మార్ట్ మొబైల్స్ నెలవుగా మారతాయనడం అతిశయోక్తి కాదు.