అందాల అరకు లోయ(పర్యాటకం) - లాస్య రామకృష్ణ

araku valley tourism

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ని విశాఖపట్నం నగరానికి సమీపం లో ఉన్న హిల్ స్టేషన్ అరకు వాలీ. ఆంధ్రా ఊటీ గా ప్రసిద్ది చెందిన అరకు వాలీ తూర్పు కనుమల పైన సముద్ర మట్టం నుండి 900 మీటర్ల కంటే ఎత్తులో ఉంది. 36 చదరపు అడుగుల మేరకు విస్తరించబడిన అరకు వాలీ ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి, అందమైన జలపాతాలు మరియు ప్రవాహాలతో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటోంది. సహజ సిద్దమైన సౌందర్యానికి నిలువుటద్దం గా నిలిచే ఈ హిల్ స్టేషన్ పరిసరాలు ఆకు పచ్చటి అందాలతో కనువిందు చేస్తాయి. ఈ అరకు వాలీ యొక్క అందాలు ఎన్నో తెలుగు సినిమాలలో చిత్రీకరించబడ్డాయి. జీవవైవిధ్యానికి ప్రసిద్ది చెందిన అనంతగిరి మరియు సుంకరిమెట్ట అభయారణ్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ కి అనుకూలం గా ఉంటాయి. రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్ వంటి అవుట్ డోర్ ఆక్టివిటీస్ ల ని ఇష్టపడేవాళ్ళకి అరకు వాలీ అనువైన ప్రదేశం.

ఒరిస్సా సరిహద్దు కి సమీపం లో ఉన్న ఈ ప్రదేశం పచ్చటి కొండల మధ్య ఉన్న సుందరమైన ప్రాంతం. రాష్ట్రం లో ని అత్యంత సుందరమైన ప్రాంతాలలో ఒకటి గా గుర్తింపు పొందిన అరకు వాలీ ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. శీతాకాలం లో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. వివిధ రకాల తోటలకి అరకు వాలీ ప్రసిద్ది. కాఫీ గింజల పరిమళం అరకు లో కి ప్రవేశించగానే పర్యాటకులని పలకరిస్తుంది. ఎంతో మంది గిరిజనులకి ఉపాధి ఈ కాఫీ తోటల పెంపకం ద్వారా లభిస్తుంది. 2007 నుండి ఇక్కడ 'అరకు ఎమరాల్డ్' అనే బ్రాండ్ పేరుతొ వేలాది మందికి ఉపాధి కలిగించే ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకాన్ని దేశం లో ని మొదటి సారిగా ప్రవేశపెట్టారు.  ఈ కాఫీ తోటల నుండి ఉత్పత్తి చేయబడిన కాఫీ గింజలు స్వదేశం లోనే కాక అంతర్జాతీయం గా కూడా ప్రాచుర్యం పొందాయి. వీటిని వివిధ దేశాలకు ఉత్పత్తి చేస్తారు కూడా.

పర్యాటక ఆకర్షణలు
కాఫీ తోటల తో పాటు ఇక్కడున్న పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, ట్రైబల్ మ్యుజియం, బొర్రా గుహలు, టైడా వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శకులని అమితం గా ఆకర్షిస్తాయి.

పద్మాపురం బొటానికల్ గార్డెన్స్
అరకు రోడ్డు లో ఉన్న చరిత్రాత్మకమైన తోట పద్మాపురం బొటానికల్ గార్డెన్స్. ఇంతకు పూర్వం, ఈ తోట యొక్క ముఖ్య ఉద్దేశం రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న సైనికులకు కూరగాయలను సరఫరా చెయ్యడం. ప్రస్తుతం ఇది కేవలం బొటానికల్ గార్డెన్ మాత్రమే. ఈ గార్డెన్ లో వివిధ రకాలైన చెట్లు మరియు పూలు కనువిందు కలిగిస్తాయి.

ఈ గార్డెన్ లో ఉన్న ఒక టాయ్ ట్రైన్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ టాయ్ ట్రైన్ లో కుర్చుని పర్యాటకులు గార్డెన్ చుట్టూ ఒక ట్రిప్ వెయ్యొచ్చు. చెట్లపైన ఉన్న శిబిరాలు పర్యాటకులని ఆకర్షితాయి. పర్యాటకులు వీటిని బుక్ చేసుకోవచ్చు. రోజ్ గార్డెన్ కూడా ఈ తోటలో ఉంది. ఈ గార్డెన్ నుండి వివిధ రకాలైన మొక్కలను కొనుక్కోవచ్చు.

అరకు ట్రైబల్ మ్యూజియం
అరకు వాలీ కి హృదయం లో ఉన్న అరకు రోడ్ పై అరకు ట్రైబల్ మ్యూజియం ఉంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ కి సమీపం లో ఉన్న ఈ మ్యూజియం గిరిజన తెగల యొక్క జీవన శైలి కి అలాగే సంస్కృతీ సంప్రదాయాల కి అద్దం పడుతుంది. మట్టి మరియు క్లే తో ఈ మ్యూజియం నిర్మించబడింది.

గిరిజనుల కళలని ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియంలో ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సెంటర్ ఉంది. ఇక్కడ వర్క్ షాపులు ఇంకా ఎక్షిబిషన్లు జరుగుతాయి. ఈ మ్యూజియం లో గిరిజనులు  తయారు చేసిన హస్త కళాకృతులను అమ్ముతారు.

బొర్రా కేవ్స్ లేదా బొర్రా గుహలు
ఆంధ్రప్రదేశ్ ని మీరు సందర్శించాలనుకుంటే తప్పకుండా బొర్రా కేవ్స్ ని సందర్శించి తీరాలి. ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ ఈ బొర్రా కేవ్స్. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి కొండలపై బొర్రా కేవ్స్ ఉన్నాయి. ఇవి 10 లక్షల సంవత్సరాల క్రితానికి చెందినవని అంటారు. బొర్రా అంటే తెలుగులో 'లోతు', కేవ్స్ అంటే 'గుహలు అని అర్ధం'. కొండలపై నుండి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ఎన్నో అడుగుల ఎత్తు ఉన్న ఈ గుహలు సహజసిద్దం గా ఏర్పడినవి. కొన్ని రసాయనిక చర్యల వల్ల ఇలా గుహలు ఏర్పడతాయి. భారత దేశం లో నే లోతైన గుహలు గా ఇవి ప్రాచుర్యం పొందాయి.

ఈ గుహలో చీకటిగా ఉండటం వల్ల ఇంతకు ముందు కాగడాల సహాయం తో గైడ్లు గుహలని చూపించేవారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఈ గుహలలో లైట్ల ని ఏర్పాటు చేసారు. గుహల లో ఉన్న రక రకాల ఆకరాల పై లైట్లు అందంగా పడేటట్లు చక్కగా అమర్చారు.

ఈ గుహలో సహజ సిద్దం గా ఏర్పడిన 'శివ లింగం' పర్యాటకులని అమితం గా ఆకర్షిస్తుంది.

టైడా
విశాఖపట్నం నుండి అరకు వాలీ కి చేసే ప్రయాణం పచ్చటి తివాచీ పరిచినట్టి ప్రకృతి సౌందర్యం తో, తోటలు మరియు వివిధ రకాల పొలాలతో కనులకు విందు గా ఉంటుంది. రాష్ట్ర పర్యాటక శాఖ తో కలిపి అటవీ శాఖవారు ఉమ్మడిగా ప్రారంభించిన ఎకో టూరిసం ప్రాజెక్ట్  'టైడా'.  విశాఖపట్నం-అరకు ఘాట్ రోడ్డు పై ఉన్న 'జంగిల్ బెల్స్' అనే అందమైన ఫారెస్ట్ రిసార్ట్ ఈ ఎకో టూరిసం ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఆకర్షణ.

'జంగిల్ బెల్స్' అనే ఈ ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్ అయిదు ఎకరాల మేరకు విస్తరించబడినది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చే ఇందులో బాగా సిద్దం చెయ్యబడిన 18 కాటేజీలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. వివిధ రకాల వన్య మృగాలకి అలాగే వివిధ రకాల జంతువులకి ఈ ప్రాంతం స్థావరం.

ఆంధ్ర ప్రదేశ్ టూరిసం డిపార్టుమెంటు అధికారులచే ట్రెక్కింగ్, హైకింగ్ మరియు బర్డ్ వాచింగ్ వంటి అవకాశాలను కల్పించే క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు లో ఉదయాన్నే 4 కిలోమీటర్ల మేరకు కాలి నడకన దట్టమైన అడవిలోకి ప్రవేశించవచ్చు. దారిలో కొన్ని గిరిజన కుగ్రామాలు కనిపిస్తాయి.

ఎలా చేరాలి?

వాయు మార్గం
విశాఖపట్నం లో ఉన్న విమానాశ్రయం ఇక్కడ నుండి 115 కిలోమీటర్ల దూరం లో ఉంది. అరకు వాలీ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం ఇది. దేశం లో ని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి తరచూ విమాన సేవలు ఉన్నాయి. ఈ విమానశ్రయం నుండి అరకు వాలీ చేరుకునేందుకు టాక్సీ సేవలు లభిస్తాయి. విమానాశ్రయం నుండి అరకు వాలీ వెళ్ళే మార్గం కూడా ఎంతో అందం గా ఉంటుంది.

రైలు మార్గం
అరకు వాలీ లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇవి విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ లైన్ లో ఉన్నాయి. విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే రైళ్ళు ఎన్నో సొరంగాలు మరియు వంతెనలను దాటుకుంటూ వెళ్తాయి. అందుబాటు ధరల లో నే రైళ్ళ చార్జీలు ఉంటాయి. ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉన్నందువల్ల టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలి.

బస్సు మార్గం
విశాఖపట్నం నుండి అరకు వాలీ కి బస్సు సర్వీసులు కూడా కలవు.

వాతావరణం
ఏడాది పొడవునా ఆహ్లాదకరం గా ఉండే అరకు వాలీ లో ని వాతావరణం వివిధ కాలాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం

వేసవి కాలం
మార్చ్ నుండి మే చివరి వరకు అరకు వాలీ లో వేసవి కాలం. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ ని దాటుతుంది. మధ్యాహ్నం వెచ్చగా ఉన్నా సాయంత్రాలు ఆహ్లాదకరం గా చల్లగా ఉంటాయి.

వర్షాకాలం
జూన్ లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అక్టోబర్ మరియు నవంబర్ ల లో కూడా చిరుజల్లులు కురుస్తాయి. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కి పడిపోతుంది.

శీతాకాలం
నవంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివర వరకు కొనసాగుతుంది. 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా గరిష ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ ని దాటదు. సాయంత్రం మరియు రాత్రి వేళల్లో అతి శీతలం గా వాతావరణం మారుతుంది.

సందర్శించేందుకు ఉత్తమ సమయం
అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అరకు వాలీ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయం లో వాతావరణం ఈ ప్రాంత సందర్శనకు అలాగే ప్రయాణానికి అనుకూలం గా ఉండటం తో పాటు ఆహ్లాదకరం గా ఉంటుంది. సాయంత్రం అలాగే రాత్రి వేళలో చలి ప్రభావం ఉండటం వల్ల స్వెటర్ ని తీసుకెళ్ళడం మరచిపోకూడదు. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి