భగినీ హస్త భోజనం - ఆదూరి హైమావతి

bhaginee hasta bojanam

"ఏమోయ్ అనంత్! దీపావళి పండుగ కాగానే సంచీ తగిలించి బయల్దేరావ్! ఎక్కడికేం?"

"ఓరినీ! వసంతూ నీకెన్నిమార్లు చెప్పానురా! బయటికి వెళ్ళే వారిని 'ఎప్పుడు? ఎక్కడికి? ఎందుకు? ' అనే ప్రశ్నలు వేయకూడదని? ఎన్నిమార్లు చెప్పినా నీ వంకర నోరు మారదేంట్రా?" కోపంగా అన్నాడు అనంత్.

"ఏదో అలావాట్లో పొరపాటురా!"

"ఛ నోరుముయ్యరా! నీకు రోజూ నీతులు చెప్పలేక పోతున్నా ను. పెరిగేకొద్దీ తెల్సుకోవలసినవి చాలా ఉంటాయిరా! కేవలం శరీరం పెంచుకోడమే కాదు పద్ధతులుకూడా నేర్చుకోవాలి. ఐనా నేనే కాదు ఎవరెక్కడికెళితే నీకేం పోయిందీ! చెప్పేవైతే చెప్తారు, స్వవిషయాల్లో తల దూర్చరాదని ఇంత వయసొచ్చినా తెలీక పోతే మరెప్పుడు
తెల్సుకుంటావురా?" సంచీ బయటే పెట్టి లోపలి కెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఒక గ్లాసు నీరు త్రాగి బయటికి వచ్చాడు అనంత్.

"సరే నాతో పాటుగా బస్టాండు వరకూ అఘోరించు, చెప్తాను." అంటూ మళ్ళా సంచీ భుజానికి తగిలించుకుని బయల్దేరాడు అనంత్. 

 నోరు మూసుకుని  మౌనంగా అనుసరించాడు వసంత్.

ఇద్దరూ అడుగులేస్తూ వెళ్ల సాగారు. అప్పుడప్పుడే తెల తెలవారుతున్నది. రాత్రంతా కల్చిన టపాకాయల కాగితాలు వీధుల నిండా పోగై ఉన్నాయి. పక్కనే ఉన్న స్లం పిల్లలు ఆ కాగితాల్లో ఏవైనా కాల్చని టపాకాయల కోసం పొడవాటి  పుల్లలు తీసుకుని గెలుకుతున్నారు. కుక్కలు వీధుల్లో పడుకుని మూడంకే వేసి నిద్రపోతున్నాయి ఇంకా. జనం వీధుల్లో కి రాలేదు ఇంకా.

ఆ కాయితాలన్నీ చూసి 'రాత్రి ఎన్ని వేల లక్షల రూపాయలు మసి బూడిదై ఉంటాయో, ఎంత వాతావరణ కాలుష్యం జరిగి ఉంటుందో 'అని ఆలోచిస్తూ నడవ సాగాడు అనంత్.  

కొద్ది దూరం వెళ్ళాక అనంత్ "వసంత్ ! దీపావళి పండుగ అయ్యాక ప్రతి సంవత్సరం మా చెల్లాయి ఇంటికెళ్ళి భోజనం చేసి ఆమెకు ఏదైనా బహుమతి ఇచ్చి రావడం నాకు అలవాటు." నోరూరకుండని వసంత్ " ఆ వెళ్ళేదేదో దీపావళి పండుక్కే వెళ్ళ వచ్చును కదా! ఆమే సంతోషించేది"

"ఓరీ ఆ పండుగకు ఆమె ఆడపడుచులూ ఇంకా దగ్గరి చూట్టాలూ వస్తారు. ఆమె చాలా బిజీగా ఉంటుంది కదా! వారికి అటెండవను ఇబ్బంది కలిగించకుండా పండుగ వెళ్ళాక వెళుతుంటాను. అంతేకాదు-- మా అమ్మా నాన్నగారూ ఒకే మారు ఒక ప్రమాదంలో గతించగా మా అమ్మమ్మే మమ్మల్ని కాచి పెంచి పోషించి చదివించి పెద్ద వారిని చేసి పెళ్ళిళ్ళు చేసింది. ఆమె చనిపోయే ముందు నాకో మాట చెప్పింది" ఓరే నాయనా అనంతూ!  కార్తీక శుద్ధ విదియన, దీపావళి వెళ్ళిన రెండవ నాడు నీవు మానకుండా ప్రతి ఏడాదీ నీ చెల్లాయి చిన్మయ్ ఇంటికెళ్ళి భోజనం చేసి, ఆమె కేదైనా బహుమతి ఇచ్చి రా నాయనా! అని చెప్పింది. ఆమె కిచ్చిన మాట ప్రకారం ఇలా వెళుతున్నాను."

"ఓహ్ మీ అమ్మమ్మే మరునాడు వెళ్ళమని చెప్పిందా! భలే ఉందే!"

" దానికీ ఒక సాంప్రదాయముంది లేరా! ఈ రోజున అన్న దమ్ములు అక్కచెల్లెళ్ళ ఇళ్ళకెళ్ళి  వారు ప్రేమతో తమ సోదరులకు ఇష్టమైన పదార్ధాలు వండి పెడితే తిని  వారి చేత రక్షణా తిలకం నుదుట పెట్టించుకుంటారు. ఇది సాంప్రదాయం. రక్షా బంధనం పండుగ రోజున  అన్నదమ్ములు తమ సోదరి చేత రాఖీ  కట్టించుకుని ఆమెకూ అండగా ఉంటామని చెప్తా రు. రాఖీ కట్టిన సోదరికి తమ అనురాగాన్ని చూపుతారు. ఇది సోదరి క్షేమానికి సంబంధించిన పండుగ ఐతే ఈ కార్తీక శుద్ధ విదియ 'భగినీ హస్త భోజనం' అనే పేరుతో  సోదరుని క్షేమానికి సంబంధించినది. సోదరి సోదరునికి మనసారా చిన్ననాడు తమ తల్లి అతనికి ఇష్టమైన పదార్ధాలు వండి భోజనం ఎలా పెట్టిందో గుర్తు చేసుకుంటూ తానూ తన చేతి వంట తినిపి స్తుంది అప్యాయంగా. దానికి బదులుగా సోదరులు అనురా గంతో కానుక ఇస్తారు. దీని వెనుక ఒక కధ ఉంది. 

ఒకానొక సమయంలో యముడు తన భటులను తమ  కర్తవ్య పాలనలో వారి మనసులకు కష్టం కలిగిన సంఘటన ఏదైనా ఉందా?' అని అడగ్గా, తాము ఒక మానవుని ప్రాణాలను తెచ్చినపుడు కొత్తగా వివాహమై  అతని భార్య ఎంతో దుఃఖ పడిన విషయం గుర్తుకు తెచ్చుకుని, తమకా సంఘటన ఎంతో వేదన కలిగించినదని చెప్తారు. యముడు అది విని సమవర్తి ఐనా బాధపడి, బాధ పడినా చేయ గలిగిందేమీ లేదని చెప్తూ 'మానవులు ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు తమ సోదరి ఇంట భుజించి ప్రతిగా తమ సోదర ప్రేమను చూపుతూ ఆమెకు  బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అప మృత్యువును నివారించుకోవచ్చు' అని చెప్తాడు.

"అదేంట్రా ! అదెలా సాధ్యం?"

"నీకంతా తొందరే! చెప్పేది వినవు. పూర్తిగ విను. దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు. ఒకమారు యముడు తన సోదరితో ఆమె మీది ప్రేమతో ఒక వరం ఇస్తాడు. ఎవరైతే  నీ నదిలో స్నానం చేస్తారో వారికి, ఎవరైతే కార్తీక శుద్ధ విదియ రోజున తన సోదరి ఇంట భుజించి ఆమెను సంతోష పెట్టి ఆమె ఆదరణకు పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్ల యమునలో స్నానం చేసిన వారికి అప మృత్యు బాధ ఉండదట. ఐతే అందరూ యమునా స్నానం చేయలేరు కనుక సోదర సోదరీ ప్రేమకు ప్రతిగా నిలిచిన యమున, యముల బంధాల్ని గుర్తు చేసు కుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు 'భగినీ ' అంటే సోదరి చేతి  భోజనం చేసి నట్లయితే అప మృత్యు నివారణ పొందవచ్చు."

" అసలు యముడంటే ఎవరు? కాస్త వివరంగ చెప్తావా కోప్పడకుండా అనంత్, నీకు తెల్సినన్ని నాకు తెలీవురా! నీకైతే నీ అమ్మమ్మ అన్ని చెప్పింది."

" సరే నాకు మా అమ్మమ్మ చెప్పినవి నీకూ చెప్తాలేరా! యమునికి చాలా పేర్లే ఉన్నాయి. ఈయన్ని కాలుఁడు అని కూడా అంటారు. ఈయన మంత్రి అంటే ఈయన వద్ద పని చేసే ఉద్యోగి  చిత్రగుప్తుడు. మనం చేసే పనులన్నీ గుప్తంగా చిత్రిం చే వాడు అంటే అన్నీ మన ఖాతాలో వ్రాస్తూ పోతాడన్న మాట. మన మరణకాలంలో మనం మంచి పనులు చేస్తే పుణ్య లోకాలకూ, చెడ్డ పనులు చేస్తే పాప లోకాలకూ అంటే నరకానికీ పోతాం, ఈయన వ్రాతలే నిదర్శనం.
కశ్యప ప్రజాపతి కొడుకు కు వివస్వంతుడు అంటే సూర్యుడు. ఆయన  కొడుకు యముడు. యముడు అష్ట దిక్పాలకులలో ఒకడు. పితృ లోకానికి అధిపతి. ఇతని దిక్కు దక్షిణము. భార్య శ్యామలా దేవి. పట్టణం సంయమని. వాహనం మహిషం అంటే ఏంటంటావు దున్నపోతు . ఆయుధం దండం. ఇదే యమ దండం. ఈయన దేహ ఛాయ నలుపు. ఇతనిని ధర్ముఁడు అని అంటారు. అన్నీ ధర్మ బధ్ధం గా చేస్తాడన్న మాట."

"చాలా చెప్పావురా!"

"సరే బస్టాండు వచ్చింది. ఇహ వెనక్కు పద. అదో మాచెల్లాయి ఊరికి బస్ కదులుతోంది. వస్తాను. బై బై" అంటూ వెళ్ళి అనంత్ బస్సెక్కగా, వసంత్. చేయి ఊపి వెనక్కు నడిచాడు.  

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు