హెచ్చరిక : ఈ గేమ్ సరదాకైనా సరే ఆడకండి. కొన్ని ప్రయోగాలు ఖచ్చితంగా ప్రమాదమే.
ఇప్పుడు విషయంలోకి వద్దాం.... మీకు దెయ్యాన్ని చూడాలని ఉందా...? చూసే గుండె ధైర్యం ఉందా..? కనబడ్డాక బ్రతికే ఉంటామనే నమ్మకం ఖచ్చితంగా ఉందా? ఉన్నా, లేక పోయినా... ఈ ప్రయోగం ద్వారా దెయ్యాన్ని చూడొచ్చని అంటున్నారు.
అది ఎలా అంటే...
అందరూ నిద్ర పోయాక... పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉన్నపుడు, ఎటువంటి అలికిడి లేదని నిర్ధారణ అయ్యాక. మీ గదిని పూర్తిగా చీకటిగా చేయండి. ఒక క్యాండిల్ వెలిగించుకుని అద్దం ముందు నిలబడి.....మూడు సార్లు "బ్లడీ మేరీ... బ్లడీ మేరీ......బ్లడీ మేరీ" అని పిలిచి క్యాండిల్ ఆర్పేసి అద్దంలోకి చూడండి.
అంతే... తప్పకుండా ఆ దెయ్యం మీకు కనబడుతుంది. ఇది నిజం...!”
చదువుతున్నమ్యాగజైన్ మూసేసి దీర్ఘంగా నిట్టూర్చింది చరిత. “ట్రాష్... మనుషుల నమ్మకాలతో, భయాలతో సృష్టించ బడిన శుద్ద వేస్టు కథలివి. పనికి మాలిన ప్రయోగాలివి”. సోఫాలో వెనక్కి జారగిలబడుతూ చెప్పింది.
ఎదురుగా కూర్చుని, చేతి వ్రేళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటున్న రేవతి తల ఎత్తి చరిత వైపు చూసింది. “అలా ఎలా చెప్పగలవే..? ఏమో... అందులో నిజం కూడా ఉండొచ్చుగా...” అంది నవ్వుతూ...
“నో.. నేనివి నమ్మను. అయినా ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ఏమిటీ...? సెన్స్ లెస్. ఈ రోజు చచ్చిన వాడు రేపు ఏమౌతాడో తెలియదు... అలాంటిది... ఎప్పుడో 15వ శతాబ్ధంలో, ఏవేవో కారణాలతో లండన్ లో చని పోయిన బ్లడ్డీ మేరీ... మనం మూడు సార్లు పిలవగానే, మన ఇండియాలో అందునా మన స్టేట్ లోకి వచ్చి, మన ఇంటి అద్దంలో కనబడడం అంటే... కట్టు కథ గాక ఇంకేమంటారు...?” కొట్టి పారేసింది చరిత.
రేవతి నవ్వింది... నెయిల్ పాలిష్ బాటిల్ కి మూత పెట్టేస్తూ... “ఓకే... ఓకే... నేను రెడీ అయి పోయాను. పార్టీకి టైమ్ అయి పోతుంది పద వెళదాం...” అంటూ లేచి హాండ్ బాగ్ తగిలించుకుంది.
“రాములమ్మా... తలుపేసుకో...” పని మనిషికి చెప్పి బయలు దేరారు.
*****
ఇద్దరూ బయటికి వచ్చి, కారులో బయలుదేరారు. రేవతి డ్రైవ్ చేస్తోంది. పక్కనే కూర్చున్న చరిత, రేవతితో కబుర్లు చెపుతూనే మొబైల్ ఓపెన్ చేసి, వాట్సప్ లో సమీర్ తో చాటింగ్ చేస్తోంది. ఇద్దరూ తమ ఫ్రెండ్ జీవని పుట్టిన రోజు పార్టీకి బయలు దేరారు.
విజయవాడలోని పేరెన్నిక గన్న “మాంగల్యం” వస్త్ర వ్యాపారస్థులు, అన్నాదమ్ములైన సుందర రావు, శ్రీనివాస రావుల పిల్లలు చరిత, రేవతి. ఇద్దరూ ఒకేసారి, ఇంచుమించు ఒకే ఘడియలో జన్మించారు. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు.. పెద్దయ్యాక విజయవాడలో తల్లిదండ్రుల కట్టుబాట్లలో ఉండి చదవడం ఇష్టం లేక, ఇద్దరూ కూడబలుక్కుని హైదరాబాద్ లోని ఐ ఈ ఎస్ లో ఎం బీ ఏ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ లో చేరారు. సీట్ వచ్చిన దగ్గర నుండి హైదరాబాద్ కి వెళ్ళి పోతామని పట్టు పట్టారు ఇద్దరూ. వారిని అంత దూరం పంపించడం పెద్దలకు ఇష్టం లేదు.
దానికో కారణం ఉంది. సుందరరావు, శ్రీనివాసరావుల తండ్రి శ్రీమన్నారాయణ గారు, మనవరాళ్ళిద్దరూ పుట్టగానే వారి ఫ్యామిలీ జ్యోతిష్కుడు శ్రీ శివరామకృష్ణ గారికి వారిద్దరి జాతకాలూ చూపించారు. దానిలో తెలిసిన విషయాలు కుటుంబ సభ్యులందరినీ భయ భ్రాంతులకు గురిచేసాయి. పిల్లలిద్దరికీ పుట్టినప్పటి నుండీ వివాహం జరిగే వరకూ జాతక రిత్యా... మూడు ప్రాణగండాలు ఉన్నాయని చెప్పారు. అవి ఎలాంటివో ఒక కాగితం మీద మాత్రం రాసి శ్రీమన్నారాయణ గారికి ఇచ్చారు. కానీ, వారికి 21 ఏడు వచ్చిన రోజు మాత్రమే దాన్ని తెరచి చూడమని చెప్పారు. శ్రీమన్నారాయణ గారు ఆ విషయం పెద్ద కొడుకు సుందరరావుకు మాత్రమే చెప్పి, పిల్లలనిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలని పెద్ద కోడలు విశాలాక్షిని, చిన్నకొడుకు శ్రీనివాసరావు ఆయన భార్య వాసంతిని గట్టిగా హెచ్చరించారు.
చిన్నప్పుడు పుష్కరాల కోసం కృష్ణానదికి స్నానాల కోసం వెళ్ళినపుడూ ఇద్దరు పిల్లలూ ప్రవాహంలో కొట్టుకు పోతుంటే ఎలాగో
కాపాడుకున్నారు. అలా మొదటి ప్రాణ గండం తప్పింది.
ఇక రెండవది... శ్రావణ మాసపు వన భోజనాలు మామిడి తోటలో ఏర్పాటు చేసారు. ఇద్దరు పిల్లలూ మిగిలిన పిల్లలతో కలిసి మామిడి కొమ్మకు ఊయల కట్టి ఊగుతూ ఆడుకుంటున్నారు. ఉన్నట్లుండి ఊయల కట్టిన కొమ్మ విరిగి... క్రింద ఉన్న చరిత, రేవతిలపై పడి, ఇద్దరూ స్పృహ తప్పి పడి పోయారు. సమయానికి ఇద్దరినీ హాస్పిటల్ కి చేర్చి కాపాడుకో గలిగారు. ఇక మూడవది వారు యుక్త వయస్సుకు వచ్చాక సంభవిస్తుందని తెలిసి కాస్త తెరిపిన పడ్డారు. ఈ లోపే శ్రీమన్నారాయణ గారు కాలం చేసారు. ఆ కొద్ది రోజులలోనే జ్యోతిష్కులు శ్రీ శివరామకృష్ణ గారు కూడా జరిగి పోయారు.
ఆ తరువాత అతని శిష్యుడు శ్రీ చిన శివరామకృష్ణుల వారు... ఏవో హోమాలు చేసి, పిల్లలపైన ఉన్న దోషాలు పోయాయి. ఇక ఏ ప్రాణ గండాలు లేవని తేల్చి చెప్పడంతో పూర్తిగా ఊపిరి పీల్చుకున్నా... ఎందుకైనా మంచిదని, తమ సమక్షాన్ని దాటి పిల్లలను బయటకి పంపించకుండా జాగ్రత్త పడ్డారు వారి తల్లిదండ్రులు. కానీ, ఇప్పుడు తప్పనిసరి కావడంతో వారి ఇష్టానికి అడ్డు చెప్పలేక... హైదరాబాదులో ఉన్న వాళ్ళ మేనమామ ప్రకాశ రావు సంరక్షణలో అతని ఇంటికి దగ్గర లోనే... పిల్లలిద్దరికీ నచ్చిన ఓ మంచి ఇళ్ళు తీసుకుని, అన్ని జాగ్రత్తలతో వారిద్దరినీ అక్కడ ఉంచి చదివిస్తున్నారు.
“రేవూ.... మనతో సమీర్ ఆడ్ అవుతాడట. కాస్త ముందుకు పోనిచ్చి ఆ కనిపించే బస్టాప్ దగ్గర ఆపు...” చెప్పింది. బస్టాప్ లో సమీర్, నీలిత, వైదిక ఆడ్ అయ్యారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ బయలు దేరి వెళ్ళి పార్టీ అటెండ్ చేసారు. పార్టీ అయి పోయాక, మరి కొందరు ఫ్రెండ్స్ తో కలిసి, అందరూ ఒకచోట కూర్చుని జోకులు, సైటేరులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నారు.
ఉన్నట్లుండి సమీర్ “మీకందరికీ బ్లడ్డీ మేరీ కథ తెలుసా...?” అనడిగాడు. హఠాత్తుగా అతడు అలా అడిగే సరికి, అందరూ ఒక్కసారే... సైలంట్ అయ్యారు.
కొంచెం సేపు తర్వాత... చరిత నోరు విప్పుతూ... “హా... బ్లడ్డీ మేరి కథ ఏమిటీ...? ఆ బ్లడీ మేరీ కూడా మాకు తెలుసు. నిన్ననే మా యింటికి వస్తే... కాఫీ ఇచ్చి పంపించాం..!” సీరియస్ గా చెప్పింది.
తను చెప్పిన విధానానికి అందరూ ఘొల్లున నవ్వారు.
సరిగ్గా అదే సమయంలో... ఎవరో ఆహ్వానించినట్లు ఎక్కడిదో ఓ పెద్ద గుడ్లగూబ... రెక్కలల్లార్చుతూ వచ్చి చరిత, రేవతిలు ఉండే ఇంటిపై వాలింది. అనుకోని అతిధిలా ఎవరిదో ఓ పొడుగైన నీడ... ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడి, కాస్సేపటి తరువాత... నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించింది. ఒక్కసారే ఆ వీధి వీధంతా కుక్కల ఏడ్పులతో మారు మ్రోగి పోయింది.
*****
“ఓరేయ్... బాబూ... అది ఎప్పటిదో పాత స్టోరీ... యూట్యూబ్ లో, వాట్సప్ లో, ఫేసు బుక్కుల్లో చక్కర్లు కొట్టి కొట్టీ... బోర్ కొట్టిన లొల్లాయి కథ. ప్రస్తుతం బ్లూవేల్, మోమో వంటి... ప్రాణాంతక గేమ్స్ హల్ చల్ చేస్తుంటే, నువ్వేంటిరా... ఓ పాత చింత కాయ పచ్చడిని, ఇప్పుడే ఓ కొత్త విషయాన్ని చెపుతున్నట్లు తొట్టి ఫేస్ వేసుకుని చెపుతున్నావ్...?” ఏడిపించాడు బన్ని. అందరూ మళ్ళీ నవ్వారు.
సమీర్ కి పౌరుషం వచ్చింది. చప్పున ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అది చూసిన జీవని “ఏయ్... కూల్... కూల్... నా పార్టీకి వచ్చి ఇలా ఎవ్వరూ హర్ట్ కావొద్దు ప్లీజ్... ఈ విషయాన్ని వదిలేయండీ...” శాంత పరచడానికి ప్రయత్నించింది.
“ఇందులో నిజమెంతో తెలియదు గానీ, ఈ విషయంలో నాలుగు ఆసక్తి కరమైన కథలు చెపుతారు.” ఎవరూ అడగకుండానే చెప్పడం ప్రారంభించింది వైదిక. అప్పటి వరకూ హాస్యంగా తీసుకున్నా... వైదిక చెప్పడం ప్రారంభించిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయి... ఆమె చెప్పింది వినసాగారు.
“వాస్తవానికి, ఇది 15వ శతాబ్ధంలో లండన్ లో జరిగిందని చెపుతారు. మనలాగే టీనేజ్ అమ్మాయి అయిన మేరీ... ఎప్పుడూ తను అనాకారిని అని ఫీలవుతూ ఉండేదట. ఆమె తల్లి ఒక పుట్టిన రోజున ఒక చక్కని గౌను కొని ఇచ్చిందట. అది వేసుకున్న మేరీ అద్దంలో చూసుకుని, తాను ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నానని మురిసి పోయిందట. ఇక ఎప్పుడూ అదే గౌను వేసుకుని, ఆ అద్దం ముందు కూర్చుని తనని తాను చూసుకుంటూ గడిపేసేదట. ఒక రోజు ప్రమాదవ శాత్తూ వాళ్ళ ఇళ్ళు మంటల్లో కాలి పోసాగిందట. అద్దం ముందు కూర్చుని ఉన్న మేరీ... ఇదేమీ గమనించక పోవడంతో... తను కూడా.. ఆ మంటల్లో కాలి సజీవ దహనమై పోయిందట. అందువల్లే... అద్దం ముందు నిలబడి ఎవరైనా బ్లడీ మేరీ... అంటూ మూడు సార్లు పిలిస్తే... తను వచ్చేస్తుందని చెపుతారు” చెప్పింది.
మరి ఇంకో మూడు కథలేమిటీ... రేవతి ఆసక్తిగా అడిగింది.
అది నేను చెపుతాను...బన్నీ స్టార్ట్ చేసాడు.”ఆమె లండన్ ని పరిపాలిస్తున్న మహారాణి అని, ఆమె తన సౌందర్యాన్ని పెంచుకోడానికి, 600 మంది స్త్రీలను చంపి వారి రక్తంతో స్నానం చేసేదని, ఇది తెలిసిన ప్రజలు, ఆమెను అదే స్నానం తొట్టి లోని రక్తంలో ముంచి చంపేసారని అంటారు. వాడుకలో ఉన్న ఇంకో కథ ఏమిటంటే... ఆమె మంత్రగత్తె అని, అందరికీ మంత్రాలు చేసి చంపుతుందని అందరు కలిసీ ఆమె బ్రతికి ఉండగానే సజీవ దహనం చేసేసారని అంటారు.” కొంచెం ఆగాడు. “ఇవే కాదు, ఆమె లండన్ క్వీన్ ఎలిజబెత్ పెద్దక్క అని, తనకు పిల్లలు లేరని, తన పరిపాలనలో ప్రజలు చాలా కష్టాలు అనుభవించారని, మంత్ర పూజలు చేయించేదని, తన పూజలకు... 60 మంది స్త్రీలను, 100 మంది పురుషులను బలి ఇచ్చిందని, ఆమె దుస్సాహసాలు చూడ లేక, రాజ కుటుంబీకులే ఆమెను హతమార్చారని కూడా చెపుతారు.” అన్నాడు.
“ఓకే... ఓకే.... ఇప్పుడు చెప్పండి. మీ అందరికీ తెలిసిన పాత కథే అన్నారుగా... ఇప్పటి వరకూ మీలో ఎవరైనా... అద్దం ముందు నిలబడి....బ్లడీ మేరీని ఒక్క సారైనా పిలిచారా...? పిలిచే దమ్ము మీలో ఎవరికైనా ఉందా...?” అడిగాడు సమీర్.
“ఊహూ... ఎవరమూ పిలవ లేదు.” రేవతి ఒప్పుకుంది.
“అయితే, ఈ రాత్రికే పిలవండి. రేప్పొద్దున లేచి, ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి చెప్పండి.” అన్నాడు సమీర్...
“షిట్..... ఏమిటీ సమీర్....ఇదంతా ట్రాష్......వీటిని ఎలా నమ్ముతున్నారు...? ఎప్పుడో, ఎక్కడో ఏదో జరిగితే, అది ఇక్కడ మనకెలా కనబడుతుంది...? ఒకవేళ అలాంటిదే చేస్తే... ఆ చీకట్లో మన ముఖం మనమే చూసి దడుచుకుంటాము. అందు వలన గుండె ఆగి మరణించామనుకో... అది ఆ ప్రయోగం ఫలితమేనా...? వాటీజ్ దిస్...?” కొట్టి పారేసింది చరిత.
“అసలూ... ఇలాంటివి సృష్టించే వేస్టు గాళ్ళను, పబ్లిసిటీ ఇచ్చి జనాలలో భయాన్ని నింపే మీడియాను అరెస్టు చేయించి, జైల్లో పెట్టించాలి. అప్పుడు గానీ, ఇలాంటి కథలకు చెక్ పడదు.” చెప్పింది.
అక్కడ... ఇదే సమయంలో చరిత, రేవతి ఇంట్లోకి ప్రవేశించిన నీడలాంటి ఆ ఆకారం... చరిత గదిలోని నిలువుటద్దం ముందు నిలబడి ఉంది.
“కరెక్ట్ గా చెప్పావు చరితా...!” బన్ని మెచ్చుకున్నాడు.”అన్నట్లు... రేపు మీ పుట్టిన రోజు కదా...! ఇద్దరూ ఇంటికి వెళ్ళి పోతున్నారా...? మరి మాకు పార్టీ ఎప్పుడూ...??” మళ్ళీ అడిగాడు.
చరిత, రేవతి ఇద్దరూ నవ్వారు. “ఎప్పుడూ ఉండేదే కదా... ఇంటికి వెళ్ళి వచ్చాక పార్టీ...” ఇక వెళతామంటూ ఇద్దరూ పైకి లేచారు.
*******
శ్రీమన్నారాయణ పెద్ద కొడుకు, చరిత తండ్రి సుందర రావు పూజ గది లోని చిన్న అల్మారాలో ఓ మూలగా దాచి పెట్టిన పాత పెట్టెను ఒకదానిని తీసుకొచ్చి, దేవుడి విగ్రహం ముందు కూర్చుని తమ్ముడిని పిలిచాడు.
“ఏమిటన్నయ్యా అది...?” శ్రీనివాస రావు అడిగాడు.
“రేపు మన పిల్లల పుట్టిన రోజులు. రేపటితో వాళ్లకి సరిగ్గా 20 నిండి 21 వ ఏడు పడుతుంది. ఆ రోజు పిల్లల జాతకం చూపించుకుని వచ్చాక నాన్నగారు ఈ పెట్టెలో ఒక కాగితం పెట్టి, దాన్ని పిల్లలు 21 ఏడులో అడుగు పెట్టిన రోజు తెరచి చూడమన్నారు. అందుకే...!” సుందర రావు చెప్పాడు.
“ఇంకెందుకు సమస్య ఏమీ లేదన్నారుగా అన్నయ్యా...?”
“లేదురా... కానీ, ఇందులో ఏముందో చూడమన్నారుగా నాన్నగారు. చూస్తే పోలేదా...?”
దాన్ని తెరచి చూసారు. ఒక్క సారిగా ఇద్దరి గుండెలాగి పోయాయి.
ఇద్దరి ముఖాల్లోనూ నెత్తురు చుక్క లేదు.
******
చరిత, రేవతి కారులో బయలుదేరి ఇంటికి వచ్చేసారు. అప్పటికి రాత్రి 11.50. “అబ్బా... బాగా ఆలస్యమై పోయింది. త్వరగా పడుకోవాలి. మళ్ళీ పొద్దున్నే లేచి ఊరు బయల్దేరాలి. ఆవలింతలు తీస్తూ... తన గదిలోకి వెళ్ళి బాత్రూమ్ లో దూరింది రేవతి.
చరిత కూడా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. బాత్రూమ్ లో స్నానం చేసి, నైటీ ధరిస్తూ... ఒకసారి తనను తాను నిలువుటద్దంలో చూసుకుంది. అప్పుడు గుర్తొచ్చింది “బ్లడీ మేరీ...” చరితకు నవ్వొచ్చింది. “పిలిస్తే వస్తుందా...?” ఒకసారి చెక్ చేస్తే...?
సరిగ్గా... రేవతి కూడా అదే సమయంలో అద్దం ముందు నిలబడి తనూ అలాగే అనుకొంటుంది. “పిలిస్తే వస్తుందా...?”
ఒక సారి చెక్ చేద్దాం... లైట్స్ ఆఫ్ చేసి... క్యాండిల్ వెలిగించి అద్దం ముందు నిలబడింది.
******
“అన్నయ్యా.... కాస్త స్పీడ్ పెంచు...” శ్రీనివాస రావు గొంతులో ఆందోళన. ఇద్దరన్నదమ్ములూ, వాళ్ళ భార్యలను తీసుకుని హైదరాబాదు బయలుదేరి అప్పటికే అరగంట దాటింది. వాళ్ళ మనసులోని భయం లాగే... కారు క్షణ క్షణానికి వేగం పెరుగుతుంది.
“ప్రకాశ రావుకి ఫోన్ చేసావా...?” సుందర రావు అడిగాడు.
“చేసానన్నయ్యా... అతడి ఫోన్ డెడ్ అయిందని చెపుతోంది. అదేమిటో పిల్లల ఫోన్లు కూడా స్విచ్డ్ ఆఫ్...!”
“భగవాన్.... నా బిడ్డలను రక్షించు...” సుందరయ్య కన్నుల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. శ్రీనివాస రావు పరిస్థితి కూడా దాదాపూ అదే...!
వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళిద్దరి భార్యలు శోకాలు పెడుతున్నారు. “ఎంత పని చేసారండీ... వాడెవడి మాటలో నమ్మి పిల్లలను కళ్ళ ముందు లేకుండా ఎక్కడికో పంపించారు. ఆ జాతకం కూడా అప్పుడే చదివి ఉంటే... నా బిడ్డలను ఎక్కడికీ వెళ్ళనివ్వకుండా... కడుపులో పెట్టుకుని కాపాడుకునే వాళ్ళం...!”
“జ్యేష్ట నక్షత్రం... నాల్గవ పాదాన్ని పదునైదు భాగాలుగా విభజించితే, అందులోని చివరి మూడు భాగాలలో జన్మించిన వారికి అకాల మరణం తథ్యం. వీరికి బాల్యంలో ఏడు సంవత్సరాల ప్రాయంలో ఒకసారి, పదునాలుగు సంవత్సరాల వయసులో రెండవ సారి ఈ మరణ ఘడియలు సమీపిస్తాయి. అప్పుడు తప్పించుకో గలిగితే... చివరిగా వారి 21 వ సంవత్సరం ఆరంభం లోనే మృత్యువు కబలించి వేస్తుంది. ఇది తప్పదు. వారి జాతక ఫ్రభావము అంతే... దీన్ని ఆపడం అనివార్యం...!”
కాగితం లోని ఒక్కో అక్షరం... పిడిబాకులా హృదయాన్ని చిద్రం చేస్తున్నాయి. ఆ రోజు నాన్న గారు ఈ కాగితాన్ని అంత భద్రంగా దాచమన్నది ఇందుకేనా...? ఆయనకు పిల్లల మరణం గురించి ముందే తెలుసు. శ్రీనివాస రావు గుండె ఆక్రోశిస్తోంది. పసి పిల్లలు... పుట్టిన రోజు కదా అని... ఉదయాన్నే బయలుదేరి వచ్చేస్తానని ఫోన్ చేసి చెప్పినపుడు బిడ్డలను చూడబోతున్నందుకు మనసు సంతోషంతో ఉరకలేసింది. పుట్టిన రోజు సందర్భంగా ఇల్లంతా అలంకరించి... వారి కోసం ఎదురు చూస్తున్నారంతా...! ఇప్పుడు వాళ్లను ఏ స్థితిలో... ఇకపై ఆలోచించలేక తల విదిల్చాడు శ్రీనివాసరావు.
******
గొంతు సవరించుకుంది రేవతి “ బ్లడీ ... మేరీ...” పిలిచింది. కిటికీలకు ఉన్న కర్టెన్లు గాలికి కదిలాయి.
“బ్లడీ మేరీ...” రెండవ పిలుపుతో... గదిలో ఏదో మార్పు... రేవతి గొంతులో కూడా ఎందుకో తెలియని సన్నని వణుకు. తమాయించుకుంది.
కాస్త గట్టిగా ఊపిరి పీల్చుకుని మూడో సారి పిలిచింది....”బ్లడీ మేరీ...”
చేతి లోని క్యాండిల్ తను ఆర్పక ముందే ఆరి పోయింది. రేవతి కళ్ళు భయంతో నిలబడి పోయాయి. ఎదుట అద్దంలో....
మృత్యు దేవతలా... చరిత....!
దిక్కులు పిక్కటిల్లేలా... భయంకరంగా అరచి, వెల్లకిలా విరుచుకు పడిపోయింది రేవతి. క్షణంలో ఆమె శ్వాస అనంత వాయువుల్లో కలిసి పోయింది. నోటి కొసల నుండి రక్తం.....
అప్పటి వరకూ ఇంటిపై వాలి ఉన్న గుడ్ల గూబ... ఒక్క సారిగా లేచి ఎటో ఎగిరి పోయింది.
ఇంట్లో ప్రవేశించిన ఆ నీడ... పని ముగిసి పోయినట్లు నెమ్మదిగా ఇల్లు వదలి... చీకటిలో కలిసి పోయింది.
*****
తెల్లవారు ఝాము నాల్గు గంటలకు ఇంటికి చేరుకున్నారు. చరిత, రేవతిల తల్లిదండ్రులు కారు దిగి...పరుగు పరుగున ఇంట్లోకి వెళ్లారు. గదిలో అద్దం ముందు నేలపై పడివున్న రేవతి పై పడి గుండెలు పగిలేలా ఏడ్వ సాగారు... శ్రీనివాస రావు, వాసంతి.
వణుకుతున్న చేతులతో... చరిత గది తలుపును తెరచిన సుందరయ్య... లోపలి దృశ్యాన్ని చూసి, చేష్టలుడిగి నిలబడి పోయాడు. “అయ్యో... తల్లీ... చరితా...” పెద్ద పెట్టున ఏడుస్తూ... గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వ్రేలాడుతున్న చరిత కాళ్లను వాటేసుకుని ఏడ్వసాగింది తల్లి విశాలాక్షి.
ఊహించని ఆ పరిమాణాలకు బిక్క చచ్చి నిలబడి పోయింది పని మనిషి రాములమ్మ.
రాత్రి ఏం జరిగిందంటే....!
అద్దం ముందు నిలబడి “బ్లడీ... మేరీని” పిలవాలనుకుంటున్న చరితకు... అవతలి గదిలో రేవతి ఏం చేస్తుందో తెలుసుకోవాలనిపించింది. నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిన చరితకు... ఆల్రెడీ లైట్లార్పేసి, క్యాండిల్ తో అద్దం ముందు నిలబడి ఉన్న రేవతి కనబడింది. చరితలో ఒక చిలిపి ఆలోచన.
రేవతి మూడో సారి పిలిచే సమయానికి వెనుకనుండి తనే క్యాండిల్ ఆర్పేసి, అద్దంలో భయంకరంగా ముఖం పెట్టి అరిచేసింది. అసలే... భయంతో... ఉన్న రేవతి... వచ్చింది “బ్లడీ...మేరీ” అనుకుని గుండె ఆగి మరణించింది.
తనవల్లనే... తన చెల్లి మరణించే సరికి తట్టుకో లేక... తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది చరిత.
వారిద్దరి జాతకరిత్యా... వారి మరణం అనివార్యమే అయింది. ఏది ఏమైనా... కాలపురుషుని పని పూర్తయ్యింది.
**************