#1 మీరు మీ పరిసరాల ప్రతిబింబమే
సద్గురు: మీ అంతర్గత ప్రపంచం, దాని గురుంచి మీరు చెప్పాలంటే, అది మీ పరిసరాల ప్రతిబింబమే. ఇది ‘మీ అంతర్గత ప్రపంచం, బయట ప్రపంచానికి ఒకదానికొకటి సంబంధం ఉండకూడడు, లేకపోతే మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల చెడిపోతారు’ లాంటి కొన్ని నీతి సిద్ధాంతాలకి పూర్తిగా వ్యతిరేకం అయి ఉండవచ్చు. అది నిజం కాదు. మీరు మీ పరిసరాల వల్ల ఎప్పుడు చెడిపోతారంటే, మీకు ప్రతీఒక్క విషయం మీద ఏవో అభిప్రాయాలు ఉన్నప్పుడు.
మీరు ఒక దాన్ని మంచిదిగాను, ఇంకొకదాన్ని చెడ్డదిగాను చూస్తారు. ఏదైతే మంచిదనుకుంటారో మీరు దానిపై మొహాన్ని ఏర్పరుచుకుంటారు. మీరు చెడ్డది అనుకున్న దాన్ని ఎలాగైనా తప్పించుకోడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తారు, కానీ అది మిమ్మల్ని అంతర్గతంగా పాలిస్తుంది. కాని అలా ఉండకూడదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసే విధానమే, అంతర్గతంగా కూడా చూసే విధానం కావాలి. ఉన్నదానిని ఉన్నట్టుగా కాకుండా వేరేగా చూస్తే, మీరు మీ అభిప్రాయాలు, పక్షపాత ధోరణితో ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నారన్నమాట.
సృష్టి ఎలా ఉందో మీరు దానిని అలాగే చూడాలి కాని మీకు ఎలా కావాలి అనుకున్నారో అలా తయారు చేయడానికి కాదు. ఇది సృష్టికర్త సృష్టిపై మనిషి చేసే దుశ్చర్య. ఇంత అద్భుతమైన సృష్టి – మీరు చేయాల్సింది ఏముంది? మీకు కుదిరితే ఆస్వాదించండి, ఇంకేమి వద్దు, అసలు అది కూడా అంత తేలిక కాదు ఎందుకంటే ఈ సృష్టంతా కూడా అసాధారణమైన బహుళ అంచలుగా ఉంది. అది కేవలం ద్రవ్య పదార్థాలే కాదు. అసాధారణమైన, ఊహకందని ఎన్నో ఇప్పుడు, ఇక్కడ, ఒకదానిలో ఒకటి, అన్ని ఒకేచోట, ఒకే సమయంలో జరుగుతున్నాయి.
మీరు జరిగిపోయినది అనుకున్నది, జరుగబోతుందని అనుకున్నది ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. మీరు ప్రతి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే, ఈ సృష్టంతా మీలో ప్రతిబింబిస్తుంటే, మీరు ఈ సృష్టిని ఉన్నది ఉన్నట్టుగా మీలో ఇముడ్చుకోగలిగితే, మీరు ఈ సృష్టి యొక్క మూలం కావచ్చు. ఈ విధంగానే అంతర్గత, బహిర్గాత ప్రపంచాలు ఉండాలి.
#2 మానసిక రోగి కాకండి
మీరు ఇక్కడ సృష్టిలో ఒక భాగంగా ఉంటే అది చాలా మంచిది లేదా ఈ సృష్టికి మూలంగా ఉండగలిగితే అది అత్యద్భుతం. కాని ఒక మానసిక రోగిగా ఉండడం మంచిది కాదు. ఒక మానసిక రోగిగా ఉండడానికి, మిమ్మల్ని కనటానికి మీరు మీ తల్లిని కష్టానికి గురి చేయక్కర్లేదు. ఆమె ఒక ఫైల్ (దస్త్రం) ని కని ఉంటే సరిపోయేది. ఎవరో ఒకరు దానిని పరిశీలించేవారు. ఒక మానసిక రోగిగా ఉండడం అనవసరం. ఒకవేళ మీరు మీ ఆలోచనలు, భావోద్వేగాల మిశ్రమంగా మాత్రమె మీ జీవితాన్ని పరిగణిస్తూ, అంతకు మించి ఏమీ లేదని భావిస్తే, మీరు ఒక మానసిక రోగే. మీరు ఒక ఆలోచనలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు, పక్షపాతాలుతో నిండిన మానసిక రోగిగా చనిపోకూడదు. మీరు ఒక ఉత్సాహపూరితమైన, పూర్తి స్థాయి జీవం కావాలి. ఇవి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు.
మిమ్మల్ని మీరు ఆలోచనల, భావోద్వేగాల నమునాగా నిర్వచించుకోవడం కన్నా, ఉన్నతమైనది ఏదైతే ఉందో దానిని స్ప్రుసించడం ఎంతో ముఖ్యం ఇంకా అది జీవితంలో మీరు చేయగలిగే గొప్ప కార్యం. మీరు పూర్తిగా సంపూర్ణ జీవితం గడపడానికి ప్రయత్నించాలి. సంపూర్ణ జీవితం అంటే బయటకు వెళ్ళి అన్ని రకాల దోపిడీలు చేయడం కాదు. మిమ్మల్ని మీరు లోతుగా, పరిమాణంకల వ్యక్తిగా ఎదిగే విధంగా మలచుకోవాలి. ప్రతి మనిషి ఇది చేయాలి.
#3 ఏది అవసరమో అది చేయాలి
మనం చేసేది మనకు ఏమి కావాలో అనే దానిని బట్టి నిర్ణయింపబడుతుంది. ఈ మధ్య నేను ఎక్కడకి వెళ్ళినా ప్రజలు నన్ను ఎన్నో మొక్కలు నాటిన వ్యక్తిగానో, ఎంతో మంది పిల్లలను చదివించిన వ్యక్తిగానో, ఎన్నో ఆసుపత్రులు నిర్మించిన వ్యక్తిగానో గుర్తిస్తున్నారు. నేను ఈ విధంగా గుర్తింపబడటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దురదృష్టం ఏమిటంటే చాలా మంది ప్రజలు ఆహారం, చదువు, ఇంకా అలాంటివి దాటి ఆలోచించలేరు.
ఒకవేళ దేశం లేదా ప్రపంచం అంతా బాగుండి, ప్రతీ వారికీ తినడానికి సరిపడ తిండి ఉండి, ప్రతీ వాళ్ళకి మంచి చదువు ఉండి, అంతా బాగా జరుగుతూ ఉంటే ఈషా విద్య స్కూల్ మొదలుపెట్టి, మధ్యాహ్న భోజనం పెట్టడంలో అర్థం ఏముంటుంది? ఇప్పుడు పిల్లలకు పౌష్టికాహారం లేకపోవటం వలన, మధ్యాహ్న భోజనం ఒక గొప్ప దీవెనలాగ ఉంది. అది క్రూరమైన పేదరికం వల్లే దీవెన అయ్యింది. అది నిజమైన దీవెన కాదు. మనం కావాల్సిన ఆహారం లేకుండా మనుషులను పుట్టించాం కనుక మధ్యాహ్న భోజనం పెట్టడం గొప్పగా భావిస్తున్నాం. అదేమి గొప్ప కాదు. దురదృష్టవశాత్తు అటువంటివి ఇంకా ఈ ప్రపంచంలో అవసరం.
ప్రతీవాళ్ళు బాగా తింటున్నా, వాళ్ళకి కావలిసినవి అన్నీ ఉన్నా, అంతిమ అవకాశానికి జీవితాన్ని మెరుగు పరిచే అనుభవం ఎల్లప్పుడూ అర్థవంతమే. అంతిమంగా జీవం యొక్క లక్ష్యమిదే – పూర్తిగా వికసించడమే. అది చిన్న మొక్క కావచ్చు, ఒక వృక్షం, ఒక ఏనుగు, ఒక చీమ, ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ -- అంతిమ లక్ష్యం పూర్తి స్థాయి జీవితాన్ని జీవించడం
కాని ప్రపంచంలో ఉన్నందుకు మనం ఏదైనా ఒక ఆట ఆడాలి. మనం మన చుట్టు పక్కల ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉండేలా, ఒక అర్థవంతమైన ఆట ఆడాలి. మీరు సృష్టి ఏవిధంగా ఉందో ఆ విధంగా ప్రతిబింబిస్తే, మీరు ఆట ఆడే వ్యక్తిగత అవసరం ఉండదు, ఇంకా ఏ ఆటలోనూ బలవంతంగా భాగస్వామి అయ్యే అవసరం కూడా ఉండదు. మీరు గుహలో ఉన్నా లేదా జనజీవన స్రవంతిలో ఉన్నా, అది కూడా ఒక ఆటే. ఏ ఆటలోనూ భాగం కాకూడదనుకుంటే విలీనం చేసుకోవడమే. అది చాలా గొప్ప విషయమే, కానీ మనుషులు అంతర్గతంగా ఒక స్పష్టతకి వస్తే, వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళకి అపారంగా ఉపయోగం, కనుక వాళ్ళు కొంత కాలం ఇక్కడే ఉండి ఇతరులకు మరింత స్పష్టత ఇవ్వగలిగితే మంచిది.