కవితలు - ..

పల్లెకు కదులుదాం

మూడుగర్భాలు మునిగి ఉప్పురుసిపోయి ఉపద్రవాలకు తప్ప ఉపయోగ శూన్యం
శేషంలో అధికభాగం అధికార
ఆక్రమణపర్వంలో అధీకృతం
మిగిలిన అల్పశేషాన్ని నెత్తికెత్తుకుని
అవిశ్రాంతంగా చదును చేస్తూనేవున్నాడు
కడలి ఆవిరుల కరిమబ్బులు
చుక్కనీరు రాల్చక అన్యాయం చేసినా
తాలుగింజలతో, అధికవడ్డీలతో
వాణిజ్యం వెన్నుపోటు పొడిచినా
ఆదుకుంటానన్న రాజకీయం
అర్ధాంతరంగా ప్లేటు ఫిరాయించినా
తట్టుకోలేని అవమానాలు  ఎదురైతే
తనువును బీడులో పూడ్చుకున్నాడే గాని
నిలదీసి ఎవరినీ నిష్టరమాడలేదు
అవనిని నమ్ముకున్న అజాతశత్రువతను
ఆతనికి తోడుగా కదలాలి యువతరం
అవినీతికి చరమగీతం పాడుతూ
అన్నదాతకు తోడుగా కదంతొక్కాలి
ఇంటికొక్క ప్రవాసభారతీయుడు కాదు
ఊరికొక్క రైతు యువకుడు కావాలి
ఋణమాఫీలు కాదు వడ్డీలేని ఋణం
కర్షకునికి కావాలని నినదించాలి
ముష్టిజాతి కాదు మాది కష్టజాతని
లోకానికి ముఖంవాచేలా చెప్పాలి
యువశక్తి ముందుకురికితే రాదా మనకు
స్వర్ణయుగం
పట్టణాల వదలి తరలిరాదా పల్లెకు
జనజీవనం

- శింగరాజు శ్రీనివాసరావు
****************


అరుణోదయ ప్రభవంలో...

ఝల్లుమని వచ్చిన మెలకువ తీరం
వెలుగు కిరణాల గుత్తులమధ్య
మేఘాల నీడల్ని పరుగేట్టిస్తూ
సూర్యోదయమౌతుంది.
మంద్రంగా వీస్తున్న చల్లనిగాలి
హృదయాంతరాళంలోకి
సెలయేరులా ప్రవహిస్తూ
అనుభూతుల పొరలమీదుగా
సాగుతున్నప్పుడు ఆలోచనల
విత్తనాలు ఆ ఆర్ద్రతకే
జీవంపోసుకుంటాయి.
తీరంలో అక్కడక్కడా పడిఉన్న
ముత్యపుచిప్పల్ని ఏరుకుంటున్నలోపే
బయటకు చిమ్మిన ముత్యాలు
మొలకెత్తిన ఆకులపై
తుషారబిండువులౌతాయి.
అక్షరం కలంపై పాదం మోపగానే
బ్రహ్మకడిగిన పాదమై కవిత్వం
ఆవిష్క్రుతమౌతుంది.

- కొత్తపల్లి ఉదయబాబు

****************


   నాలోసగం

నిశ్శబ్ద జీవనదిలా
నా హృదయం లోకి ప్రవహించావు
నా ఉచ్చ్వాషనిచ్చ్వాసాలలో
వెచ్చని గాలి నీవై ఒదిగిపోతావు
నా గుండె చప్పుడులో లయలా
నా సుఖదుఖాఃలలో
కన్నీటిచెమ్మలా మారిపోతావు
నా గుండెలపై పసుపుపచ్చని
తాళిబొట్టై నన్నుచేరావు
నీలో సగంనేనంటూ
నేనంటే నీవయ్యావు
సప్తపది బాసలేవో ఎరుగనుకానీ
నా కనులు పలికే బాసలన్నీ నీకెరుకే
మనసుముడివేసిన బందంలో
ఏడేడు జన్మల పయనం మొదలయింది
చెక్కిలిచేరే సిగ్గుల విల్లైనా
కన్నీటిచారలైనా
నీ కొనగోటి స్పర్శ కై ఎదురుచూస్తాయి
బతుకుపండే దారిలో
పూలే ముల్లైనా
సేదదీర్చే నీ గుండెపై అలుపురాదు.

- కె.త్రివేణి
****************

 


కవిత

ఆక్షరాల పుప్పొడిని
కాగితంపై కలం స్రవించింది
పదసొంపుతో జతకూడి
ఇంపైన కవితగా వెల్లివిరిసింది
సుగంధ పరిమళాలను
నలుదిశల వెదజల్లింది
ఊసులెన్నో వివరించి
ఊహాల్లో విహరింపచేసింది
మనసు ఆఘ్రాణించి
మదిని మత్తెక్కించింది
మత్తుగా గమ్మత్తుగా
మదిలోన నిదురించింది
-కొమ్ముల వెంకట సూర్యనారాయణ

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు