మెమరీ
మీరు గమనించరో లేదోగాని ఒకప్పటికీ ఇప్పటికి మనం మన నిత్య జీవితంలో మన మెదడులోని మెమరీని ఉపయోగించడం చాలా చాలా తగ్గిపోయింది.
ఒక్కసారి గతంలోకి వెళదాం. అప్పట్లో మాష్టార్లు ఎక్కాల పుస్తకాల్లోని ఎక్కాలు పైనుంచి కిందకి కింద నుంచి పైకీ ఇరవై ఎక్కాలు భట్టీ పట్టించేవారు. అలాగే లెక్కాల సూత్రాలూను. తెలుగు, హింది మరియు ఇంగ్లీషు భాషల్లోని పద్యాలు నోటికొచ్చేయాల్సిందే! ఇహ సామాన్యం, సాఘీకం లాంటి సబ్జెక్ట్స్ లో అయితే పశ్నలు జవాబులు ముక్కున బట్టాల్సిందే! ఒకవేళ మనం చెప్పలేకపోతే.. అసలు ఆ ఊహే భయానకంగా ఉండేది..ఉండదూ మరి. చదువు విషయంలో అప్పటి మాష్టార్లు ఛండశాసనులే! గోడకుర్చీలు, గంటలకొద్దీ ఎండల్లో ఒంగోబెట్టడాలు, చేతులతో చెవులను క్రాస్ గా పట్టించి మైదానమంతా కప్పగంతులు ఇలా వివిధ రకాల శిక్షా స్మృతులను పిల్లలపై అమలుపరచేవారు. భయంతోనో, గౌరవంతోనో..దానా దీనా చదువంత మన బుర్రలో నిక్షిప్తం అయిపోయేది. నర నరాన జీర్ణించుకుపోయేది. పెద్దయినా శరీరాన్ని వదిలేదికాదు. ఇన్ఫాక్ట్ చచ్చేవరకు మనకు తోడుండేది. అందుచేత మెరుగ్గా కనిపించే వాళ్లని మీరు ఏ స్కూళ్లో చదివారు? అని అడిగి, వాళ్లు చెప్పగానే-అబ్బో ఆ స్కూలా? మరి చెప్పరే..అక్కడ చదివితే ఇలాగే పాదరసం మాదిరే! అంటూ మెచ్చుకునేవారు. అప్పట్లో ఒకప్పుడు పది చదివినా, ఇప్పుడు డిగ్రీ చదివినా ఒకటే అనడం చాలాసార్లు విన్నాను. నిజానికి ఇంగ్లీషులో వాళ్లు లెటర్ డ్రాఫ్ట్ చేసినంత ఇప్పుడు చదివిన వాళ్లు చెయ్యలేరని సవాల్ చేసేవారు. గ్రామరు అంతలా వాళ్ల మెదడులో ఒదిగిపోయేది.
ఇహ ఇప్పటి జమానాకొస్తే మనకు ఎక్కాలు లెక్కలు రాకపోయినా ఫర్వాలేదు అండగా కాలిక్యులేటరో, ల్యాఫ్ టాపో ఉంటే మన చేతుల్లో మెదడున్నట్టే! మాష్టార్ల భయం లేదు. వాళ్లకే పిల్లల భయం పట్టుకుంది. ఏమంటే, ఏం కంప్లయింట్ చెప్పి తమవాళ్లతో స్కూలుకు వచ్చి గొడవ చేస్తారోనని.
ఇహ మనల్ని ప్రశ్నలు సమాధానాలు పదిసార్లు రాసుకురమ్మన్నా, ఎవరి రికార్డ్ బుక్కన్నా రిఫరెన్స్ కు తీసుకున్నా జస్ట్ కొన్ని నిముషాల్లో జిరాక్స్ తీయించేసుకుంటాం. అవును మరి ఎవరు రాస్తూ, చదువుతారు?
ఒకప్పుడు ఏదైనా ఎగ్జిబిషన్ కో, మరో కొత్త ప్రదేశానికో వెళ్లినప్పుడు మనతో ఓ బుక్కు, పెన్నూ తీసుకెళ్లేవాళ్లం. ఎందుకంటే కొన్ని విశేషాలు తెలిస్తే నోట్ చేసుకోవచ్చని మనో వికాసం కలుగుతుందని. జనరల్ నాలెడ్జీలో అడిగే ప్రశ్నలకు ఠక ఠక సమాధానాలు చెప్పే పిల్లాణ్ని అందరూ మురిపెంగా చూస్తూ మెచ్చుకునేవారు. మరిప్పుడు మన చుట్టూ ఇన్ఫర్మేషనే! విషయాల వరదే! ఏదీ వింతా విడ్డూరం కాదు. అవసరమొచ్చినప్పుడు ఒక్క క్లిక్ తో చూసుకోవచ్చు మన మెదడులోని మెమరీని ఎందుకు అనవసరంగా నింపుకోవడం. దాన్ని అలాగే ఎమ్టీగా ఉంచుకుంటే సరి.
మనిషి బుర్ర చాలా గొప్పది. కొన్ని తెలుసుకుంటేనే, మరిన్ని ఆవీష్కరించవచ్చు. సాంకేతికత అనేది మన సమయం ఆదా చేయడానికి. అంతేకాని మన మెదడుకు ప్రత్యామ్నాయం కాదు. కానేకాదు. రక రకాల విషాయాలున్న పెట్టె, మానవ మెదడు ఎన్నటికీ కాలేదు.
మెదడుకు పదును పెడుతూనే ఉండాలి. మేత పెడుతూనే ఉండాలి. అదే మనలను చురుగ్గా ఉంచుతుంది. లేదంటే మనందరం షడ్డవున్ అయిపోయినట్టే! ప్రపంచంలో మనం లేనప్పుడూ మెషిన్లున్నా ప్రయోజనమేమిటి?