వింటర్‌లో శరీర బరువును తగ్గించుకోవడం తేలిక అనే భావన చాలా మందికి ఉంటుంది. వర్కవుట్స్ చేస్తే చెమట పెద్దగా పట్టదు కాబట్టి, చెమట పట్టినా, ఆ తర్వాత ఆహ్లాదకంగా ఉంటుంది కాబట్టి, ఫిట్‌నెస్ కోసం వింటర్‌ని పర్‌ఫెక్ట్ టైం గా భావిస్తుంటారు. యువతీ యువకులు ఈ మధ్య ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగింది. వింటర్‌లో స్టార్ట్ చేసి, సమ్మర్‌లో కొనసాగించి ఫిట్‌నెస్ లెవల్స్ పెంచుకోవాలనీ ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. పార్కుల్లో ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు, కండలు పెరిగేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటున్న వారు ఎక్కువయ్యారు. రకరకాల ఫిట్‌నెస్ ఫుడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అవగాహన లేకుండా వాటిని కూడా విచ్చలవిడిగా వాడేస్తున్నారు నేటి యువత. కానీ అవి అంత శ్రేయస్కరం కాదంటారు వైద్యులు.
అసలు వర్కవుట్స్ చేయడానికి ఏ కాలమైనా ఒకటే. వింటర్ కొంతమందికి ఇంకొంచెం అనుకూలిస్తుందంతే. వింటర్‌లోనూ ఇబ్బందులు తక్కువేమీ కాదు. రెస్పిరేటరీ సమస్యలు వింటర్‌లో చాలా ఎక్కువ. వింటర్‌లో తగు జాగ్రత్తలు తీసుకోకుండా వర్కవుట్స్ చేస్తే రెస్పిరేటరీ సమస్యలు ప్రాణాంతకంగా మారొచ్చు. కండరాల సమస్యలు కూడా ఇబ్బందిపెట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రతీరోజు తగనంత సమయం కేటాయించి, నెమ్మదిగా మొదలుపెట్టి, క్రమంగా వేగం పెంచి ఓ పద్ధతి ప్రకారం వర్కవుట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఎలాగోలా పని కానిచ్చేద్దాం అంటే బరువు తగ్గడం సంగతి దేవుడెరుగు.. అనవసర సమస్యలు పెరిగిపోతాయి.
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, అంటీలైనా, అంకుల్స్ అయినా ఎవరైనా ఫిట్‌నెస్ కంట్రోల్‌కి అర్హులే. ఔట్ సైడ్ ఫుడ్‌ని చాలావరకూ అవైడ్ చేయాలి. హోమ్ మేడ్ జ్యూస్‌లు, హోమ్ మేడ్ ఫుడ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వింటర్‌లో ముఖ్యంగా ఆకలెక్కువ వేస్తుంటుంది. కడుపు నిండా తిని, కాలు కదపకుండా కూర్చోవాలని అనిపిస్తుంటుంది. అదే రెస్పిరేటరీ సమస్యలకు, కండరాల స్థంభనకూ కారణమవుతోంది. అందుకే ఫుడ్ దగ్గరే లిమిట్స్ పాఠించి, ఆత్మారామున్ని కాస్త కంట్రోల్‌లో ఉంచడం తప్పనిసరి. పై జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ వింటర్‌ని అంత తేలిగ్గా పంపించలేం. అలాకాక మన ఆత్మారాముడు చెప్పినట్లు మాట వింటే ఫిట్‌నెస్ పక్కన పెట్టేసి, వింటర్ నుండి సమ్మర్‌కొచ్చేసరికి మన చేతులారా మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నవారమైపోతాం. తస్మాత్ జాగ్రత్త.