వాగ్డేవి మనకున్న అతి కొద్ది మహిళా కార్టూనిస్టులలో సోదరి శ్రీమతి వాగ్దేవి ఒకరు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతల కారణంగా తక్కువ కార్టూన్లు గీసినప్పటికీ మంచి కార్టూన్లు ఎన్నో అనేక పత్రికలలో గీసారు. వారితో నా పరిచయం 2003 సం. లో జరిగింది… అప్పటి నుండి ఇటీవల వారి అమ్మాయి లాస్య ప్రియ వివాహం విజయవాడ వారి అబ్బాయితో జరగడం, తర్వాత విజయవాడ లో జరిగిన వివాహ పరిచయ కార్యక్రామానికి కార్టూనిస్టు లందరం వెళ్ళడం, ఆ సమయంలో వారు మాతో ఎంతో అప్యాయంగా గడపి, తలో స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించారు. ఇంతలోనే ఈరోజు (26-11-2018)వారు కన్నుమూసారు అని తెలిసి షాక్ కు గురయ్యాను. చివరిగా గత నెల నాతో మాట్లాడుతు పాపకు మంచి సంభందం దొరికిందని సంతోషం వ్యక్తం చేసారు. ఇలాంటి సమయంలో అనారోగ్యంతో వారు అందరిని విడిచి దివికేగారు.
గుంటూరు జిల్లా, బాపట్ల లో పుట్టిన వాగ్దేవి గారు అక్కడ శ్రీరామకృష్ణ మిషన్ లో డ్రాయింగ్ నేర్చుకొని, కార్టూన్ రంగం వైపు ఆకర్షితులయ్యారు. “ఆంధ్రభూమి’వార పత్రికలో (1982) మొట్టమొదటి కార్టూన్ పబ్లిష్ అయ్యింది. మొదటిగా 1984లో క్రోక్విల్ల్ హాస్యప్రియ’ పత్రిక వారు నిర్వహించిన కార్టూన్ పోటీలో కొత్త కార్టూనిస్టుల విభాగంలో వాగ్దేవి గారికి ప్రథమ బహుమతి అందుకున్నారు. ఇక అప్పటి నుండి అనేక పత్రికలలో సుమారు 600 కార్టూన్లు వరకు గీసారు. 64కళలు.కాం పత్రికకు 40 కార్టూన్లు వరకు గీసారు. కొంతమంది కళాకారుల ఇంటర్వ్యూ లు చేసారు. వారానికి ఒకరోజైనా ఫోన్ చేసేవారు. వారి ఏకైక కుమార్తె లాస్య ప్రియ వివాహం కావడంతో వారిమనసు కుదుటపడింది. కుమారి రాగతి పండరి గారిని కలవడం తనకు చాలా గర్వంగా వుందని చెప్పేవారు. వారితో తరచు ఫోన్లో మాట్లాడుతూ వుండేవారు. "రాగతి పండరి స్మారక కార్టూన్ అవార్డ్" ను అందుకున్నప్పుడు తను చాలా ఆనంద పడ్డారు.
జనవరి 8, 1959 లో జన్మించిన తుర్లపాటి వాగ్దేవి గారు రైల్ వే లో ఇoన్జీర్ గా పని చేస్తున్న విశ్వేశ్వర రావు గారిని వివాహమాడి కాటంరాజు వాగ్దేవి అయ్యారు. వాగ్దేవి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ఆఫీసర్ గా 2016 లో పదవీవిరమణ చేసారు. గత కొన్నేళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న వాగ్దేవి గారు మనందరిని విడిచి 26-11-2018 న స్వర్గస్తు లయినారు. వారి ఆత్మకు శాంతి చేకురాలని గోతెలుగు.కాం తరపున ప్రార్దిస్తూ...
(తను బాగా 'ఇష్టపడ్డ ఫోటో అని నాకు మెయిల్ చేసిన ఫోటొ ఇదే, అందుకే ఇక్కడ ఇస్తున్నాను.)