ఎంత హాయండి - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

ఒకానొకప్పుడు ఆడపిల్లల పెళ్ళికి తండ్రులు,  చెప్పులు అరిగేలా తిరిగేవారుట. ఆ పరిస్థితులు తారుమారయాయి.

ఈ మధ్యన ఓ ముగ్గురు కొడుకులున్న ఓ తండ్రిని కలిసే అవకాశం వచ్చింది. మొదటి ఇద్దరికీ పెళ్ళయింది. మూడో వాడికి సంబంధాలు చూస్తున్నారు. ఆయన వెళ్ళబోసుగున్న ‘బాధలు’ వింటూంటే, మేము ఎంత అదృష్టవంతులమో అనిపించింది!ఆ భగవంతుడి దయవలన, మా పిల్లలిద్దరికీ, 25 ఏళ్ళు నిండేటప్పటికే, వాళ్ళు కోరిన వారినిచ్చి పెళ్ళిళ్ళు చేసేశాము. వాళ్ళూ ఇద్దరేసి పిల్లలతో సుఖంగానే ఉంటున్నారు.ఇందులో మేమేమీ ఘనకార్యం చెసేశామని అనడం లేదూ, ఏదో అలా అన్నీ కలసొచ్చాయి అయింది.పిల్లలిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు నచ్చితే చాలూ అనుకున్నాము. వాళ్ళూ సుఖంగానే ఉన్నారు, మమ్మల్నీ తాతయ్య, అమ్మమ్మ/నానమ్మ చేసేశారు.ఇంకో రెండు మూడేళ్ళు అయిన తరువాత అయితే, మాకూ (స్పెషల్లీ మా ఇంటావిడకి మరీనూ)ఓపికా ఉండేది కాదు, పురుళ్ళూ పుణ్యాలూ చూసుకోడానికి.అందుకే అంటాను ఏది జరిగినా మన మంచికే అనుకున్నట్లయితే, అన్నీ బాగానే ఉంటాయి.ఆ భగవంతుడు చల్లగా చూస్తే చాలు.  ఇప్పుడు వెళ్ళేనే ఆయనకి ముగ్గురు కొడుకులు, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసి, తాతయ్యా, బామ్మా అయ్యారు.ఇప్పుడు మూడో కొడుక్కి చేయాలి. ఏదో మన రాష్ట్రం మీదా, ఆచారవ్యవహారాలమీదా అభిమానం కొద్దీ, తెలుగు సంబంధాలే చూస్తూఉన్నారు ఇన్నాళ్ళూ. కానీ ఈ విషయంలో ఆయనకి అయిన అనుభవాలు చెప్పి, వాళ్ళ కొడుకూ, డాడీ ఆంధ్రా సంబంధాలు చూడ్డం మానేసి, హాయిగా ఇక్కడే పూణే లోనో, ముంబైలోనో సంబంధం చూడండి, అక్కడివాటితో విసుగొచ్చేసిందీ అన్నాడుట.

ఏం లేదూ, వీళ్ళూ నెట్ లో వచ్చే యాడ్ లు చూసే సంప్రదించేవారు.కానీ వచ్చిన గొడవేమిటంటే,ఆ వధువు కి సంబంధించిన వారు, అన్నీ సరిపోయినా సరే, ఓ పట్టాన సమాధానం చెప్పకపోవడం, ఈయనేమో ఎన్నిసార్లు ఫోను చేసినా, ‘ఇంకా మా అమ్మాయి అభిప్రాయం అడగలేదండీ, ఇదిగో రెండు మూడు రోజుల్లో వస్తూంది, ఏవిషయమూ కనుక్కుని చెప్తామూ’ అని!కమ్యూనికేషను ఇంత ఫాస్ట్ అయినరోజుల్లో కూడా, ఇలాటి సమాధానాలు వింటూంటే, ఈయనకేమో చిరాకొచ్చేస్తుంది. వీళ్ళేమో క్లియర్ గా అప్పుడే చెప్పేశారు, మాకైతే మీ అమ్మాయి నచ్చిందీ, మీ అభిప్రాయం కూడా చెబితే, ముహూర్తాలు పెట్టుకుందామూ అని.అంటే 50% అయిపోయినట్లే కదా!ఆ మిగిలిన 50% దగ్గరే వస్తోంది గొడవంతానూ. ఓ పట్టాన చెప్పరూ, ఎప్పుడో చెప్పినా, ‘పూణె అంటే ఇక్కడికి ( అంటే విజయవాడ కి) చాలా దూరం అంటున్నారండీ, మా ఇంట్లో పెద్దాళ్ళు’ అని. అమెరికా అయితే ఫరవా లేదుట, కానీ పూణే నా? హైదరాబాదయినా ఫరవాలేదు! ఇది మరీ అన్యాయం అండి బాబూ!

ఇదివరకటి రోజుల్లో కూతురికి పెళ్ళి చేయాలంటే చెప్పులరిగేలా తిరిగేరనేవారు. ఇదేమిటో చిత్రం, మగపిల్లాడి పెళ్ళికి కూడా ఇలా తిరగవలసివస్తోందనుకోలేదు ఆయన!పోనీ ఆ పిల్లాడికేమైనా కాలొంకరా, కన్నొంకరా ఉందా అంటే అదీ లేదు. శుభ్రంగా 28 ఏళ్ళ young and handsome bridegroom! హాయిగా ఐ.టి.లో ఉద్యోగం, ఏ బరువూ బాధ్యతా లేదు. ఓ కారుకూడా కొనుక్కున్నాడు. అసలు మనవైపు వారి కోరికలు ఏమిటో ఆ మాట్రిమోనియల్ యాడ్ లో ముందరే పెట్టేస్తే,వారికి తగ్గ సంబంధాలే వస్తాయిగా. అన్ని వివరాలూ వ్రాయరు, దేనికైనా transparency అనేది ఉండాలి.లేకపోతే ఇలాగే ఉంటుంది. చివరదాకా వచ్చిన తరువాత ఎదో సాకు చెప్పేసి వద్దనేయడం.ఇలా నాలుగైదు సంబంధాలు తప్పిపోయేసరికి,ఇటు ఈ కుర్రాడికీ డౌటొచ్చేస్తుంది, ఇదేమిటీ మనలో ఏదైనా లోపం ఉందేమో అని!అమ్మాయైనా, అబ్బాయైనా ఇదే పరిస్థితి.ఏమిటో ఎప్పుడు బాగుపడతారో ఈ తల్లి తండ్రులు? ఏదో దొరికిన సంబంధమే చేసేయాలని కాదు,అన్నీ చూసుకునే చేయాలి. కానీ ఈ ‘అన్నీ’ అనేది ఓ relative term. ‘అన్నీ’ అంటే ఏమిటి?పెళ్లికొడుకు రూపం, ఉద్యోగం,సంపాదన వరకూ బాగానే ఉన్నాయి. మరి ఇంకా ఏమిటిట? ఈ ‘అన్నీ’ ల గురించి, మొదట్లోనే మొహమ్మాట పడకుండా చెప్పేస్తే అటువారికీ, ఇటువారికీ ఈ ఈతిబాధలు తప్పుతాయికదా.అసలే male/female ratio చాలా alarming గా ఉందని ప్రతీ రోజూ పేపర్లలో చదువుతున్నాము. దీనికి సాయం ఈ మనస్థత్వాలు కూడా తోడయ్యేయంటే ఇంక అడగఖ్ఖర్లేదు!  ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి ఓ ఇంటివాడో/ ఇల్లాలో అయేసరికి 30-35 ఏళ్లొస్తాయి. ఇక్కడేమో ఈ తల్లితండ్రులకు 70 దాటుతాయి. అప్పుడు పురుళ్ళూ,పుణ్యాలూ చూసే ఓపికా ఉండదు. మళ్ళీ ఏమీ సహాయం చేయటల్లేదో అని గోలా!

ఎందుకొచ్చిన గొడవలండి బాబూ, ఏదో ఆ ‘అన్నీ’ లన్నీ ముందరే చెప్పేసి, పిల్లల్ని చిలకా గోరింకల్లా హాయిగా పెళ్ళవలసిన టైముకి చేసేస్తే ఎంత హాయండి !

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు