“శాలినీ... డ్యూటీలో చేరుతున్న మొదటిరోజు ఓ అరగంట ముందుగానే ఉండాలి. ఇంకా నువ్వు రెడీ అవలేదు.” హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని పేపర్ చూస్తూ లోపలికి కేకేసాడు శాలిని తండ్రి విశ్వేశ్వరశర్మ.
“రెడీ అయిపోయాను డాడ్... అయామ్ కమింగ్ వితిన్ టూ మినిట్స్...” పెదాలకు లిఫ్టిక్ వేసుకుంటూ తన బెడ్ రూములోనుండి గట్టిగా చెప్పింది శాలిని.
“ఆండాళ్ళూ... అమ్మాయికి టిఫిన్ బాక్స్ రెడీ చేసావా...? అక్కడ క్యాంటిన్ లో ఫుడ్ బాగుంటుందో లేదో...!” కిచెన్ కేసి చూసి మరోసారి అరిచాడు విశ్వేశ్వరశర్మ. పట్టరానంత కోపంతో “ఎవరూ ఆండాళ్ళూ...? హా...? ఎన్నిసార్లు చెప్పాను నన్నాపేరుతో పిలవొద్దని...?” అరుస్తూ కిచెన్ నుండి విసవిస నడుచుకుంటూ వచ్చింది అనురాధ.
“ఓ... సారీ... ఆండాళ్ళూ అని పిలుస్తుంటే మోటుగా ఉందని పేరు మార్చుకున్నావు కదూ... మరచిపోయానే అనూ...! సరెగానీ, ఇంతకూ టిఫిన్ బాక్స్ రెడీ చేసావా...?” మళ్ళీ అడిగాడు.
“ఊ చేసాను...” కోపంగా అంది. చేతిలో ఉన్న బాక్స్ ఆయన ఎదురుగా టీపాయ్ మీద పెడుతూ... ఆమె కోపానికి ముసిముసిగా నవ్వుకున్నాడు విశ్వేశ్వరశర్మ. రోజూ అలా ఒక్కసారైనా భార్యను ఉడికించకపోతే, ఆయనకేమీ తోచదు. రోజూ అలవాటు అయినదే అయినా... ఆయన కోసం అలా ఉడుక్కున్నట్లు నటించకపోతే, అనురాధకూ ఊసుపోదు.
“డాడ్..మామ్......అయామ్ గోయింగ్...” హేండ్ బాగ్ తగిలించుకుని హాల్లోకి వచ్చింది శాలిని. ఇరవైరెండేళ్ళ సౌందర్య రాశి శాలిని. పాలమీగడలాంటి చర్మకాంతి, చక్కటి కనుదోయి, తీరైన శరీరాకృతి, ఒక్కసారి చూస్తే... కన్ను తిప్పుకోలేనంత ఆకర్షణీయమైన అందంతో దేవకన్యలా ఉంటుంది.
కూతురి అందాన్ని చూసి లోలోపలే మురిసిపోయాడు తండ్రి. తల్లి అనురాధ మాత్రం...”ఉద్యోగస్థురాలివయ్యావు. ఎంచక్కా చీరకట్టుకెళ్ళొచ్చు కదే...! కాలేజికి వేసుకెళ్ళినట్లూ ఈ దిక్కుమాలిన ఫ్యాంటూ షర్టూ, పెదాలకు ఆ లిప్ స్టిక్కూ, ఆ పొట్టి జుత్తూ... ఏమిటే ఇదంతా...? మనవాళ్ళెవరైనా చూస్తే ఏమనుకుంటారు...?” అంది.
“హబ్బా...” విసుక్కుంది శాలిని. “మామ్.....ఇదంతా కామన్. నేను చేస్తున్న ఉద్యోగానికి చీరలు, లంగా వోణీలు పనికిరావు. అక్కడంతా ఇలాగే ఫ్యాషన్ గా ఉంటారు. ఏం డాడీ...అవును కదా...! మమ్మీ చూడూ...నన్ను బామ్మలా తయారై వెళ్ళమంటోంది.” తండ్రి తో అంది గారాలు పోతూ...
“ఆండాళ్ళూ....దానిని కాస్త ప్రశాంతంగా వెళ్ళనివ్వవే ఉద్యోగానికి...!” చెప్పాడు.
“అవును... ఇదంతా తమరిచ్చిన అలుసు కదూ...! దాన్నెప్పుడైనా సాంప్రదాయంగా ఉండమని చెప్పారా...? ఇలాంటి వేషాలు చూస్తే... పిల్లను అడగడానికి మనవాళ్లలో ఎవరైనా ముందుకొస్తారా...?” భర్తపై విసుక్కుంది.
“అబ్బా ... ఆపవే... మళ్ళీ మొదలు. మనవాళ్ళలో ఎవరూ రాకపోయినా నాకు ఓకే, దానికి నచ్చినవాడెవరైనా దొరికితే, అతడు ఏ కులస్థుడైనా ఇచ్చి పెళ్ళి చేసేస్తాను. దానిష్టమే నా ఇష్టం. దానికి లేని పోని ఆంక్షలు పెట్టి, స్వేఛ్ఛగా ఎగిరే పక్షిని కట్టుబాట్లు అనే పంజరంలో పడేయొద్దు.” చెప్పాడు.
“ఏమైనా అంటే ఇలా అంటారు. సరే...సరే...! అక్కడ బాక్స్ పెట్టాను. అది బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళు. ’ఇదంతా కామన్, అక్కడంతా అన్నం తినకుండానే పనిచేస్తారు మమ్మీ...’ అని మాత్రం అనకు.” అంది తల్లి వెటకారంగా.
ఆ మాటలకు చటుక్కున తలతిప్పి చూసి, “వ్వాట్...? టిఫిన్ బాక్సా... నేనేమైనా స్కూల్ కి వెళుతున్నానా...? టిఫిన్ బాక్సు, వాటర్ బాటిలు బుజాన తగిలించుకుని వెళ్ళడానికి...? అఖ్ఖరలేదు. అక్కడ అన్నీ దొరుకుతాయి. కంపెనీ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఓ... మై గాడ్... డాడీ, మమ్మీనీ ఇన్నాళ్ళూ ఎలా భరిస్తున్నారు...? ఇంకా ఇక్కడుంటే, ఓ వారానికి సరిపోయే భోజనం, పదిరోజులకు సరిపడా బట్టలూ సర్ధి ఇచ్చేలా ఉంది... బై...బై.... డాడ్...!” చెప్పి, పరుగు పరుగున బయటకు వెళ్ళిపోయింది.
“హహహాహ...” నవ్వాడు విశ్వేశ్వర శర్మ. భర్తను చూసి కయ్యిమంది అనురాధ. “ఎందుకా నవ్వు...?? ఈ మాత్రం దానికేనా నన్ను పొద్దుట్నించి నానా హైరానా పెట్టి అదీ ఇదీ వండిచ్చారు. తీరా అమ్మాయి సరిగ్గా తినలేదు సరికదా... బాక్స్ కూడా తీసుకెళ్ళ లేదు. మీ తండ్రీ కూతుళ్ళకి తమాషాగా ఉంది నేనంటే...!!” తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అనురాధ.
********
ఆఫీస్ లో అడుగుపెట్టగానే... అందరూ తలలు త్రిప్పి చూసారు శాలిని వైపు. ఒక్కొక్కరూ తనను ఏంజిల్ ని చూసినట్లు చూస్తుంటే... తలవంచుకుని తనలో తనే గర్వంగా నవ్వుకుంది . తనకు తెలుసు... తన అందం అందరి మనసులను కొల్లగొట్టేస్తుందని. కాలేజి నుండీ తనకీ చూపులు అనుభవమే.
లోపలికి వెళ్ళి బాస్ ని కలిసింది.
“వెల్కమ్ శాలిని...” సాదరంగా ఆహ్వానించాడు రాఘవవర్మ. మనిషి బాగా వయసు పైబడినట్లు కనబడ్డాడు. ఎందుకో అతని ముఖం చూడగానే, దేనికో అతను దిగులుగా ఉన్నట్లు, అది కనబడకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది శాలినికి. ఏదో పలకరించాడే గానీ, ఆమెతో ఎక్కువ మాట్లాడలేకపోయాడు. వెంటనే, ఇంటర్ కమ్ లో తన మేనేజర్ రాజీవ్ ని పిలిచి, శాలినిని అందరికీ పరిచయం చేసి, తను చేయవలసిన వర్క్ ఎక్స్ ప్లెయిన్ చేయమని చెప్పి పంపించాడు. రాజీవ్ ఆమెను అందరికీ పరిచయం చేసాడు. అందరి బెస్ట్ విషెస్ ని సంతోషంగా రిసీవ్ చేసుకుంది శాలిని.
రాజీవ్ ఆమెను, ఆమెకు కేటాయించిన క్యాబిన్ లోకి తీసుకువెళుతుంటే... ఒక్కక్షణం తనకు తెలియకుండానే ఆగిపోయింది. ఆమె మనసు... ఏదో చిత్రమైన అనుభూతికి లోనవసాగింది. వెనుకనుండి చల్లని గాలేదో తన వీపును స్పర్శిస్తున్నట్లు... ఎవరిదో చూపు తనని అమాంతం తనవైపుకు లాగేస్తున్నట్లు... క్షణంలో తేరుకుంటూ చప్పున తలవెనక్కి తిప్పి చూసింది. వెనుక ఏమీ కనబడలేదు. తన ఆలోచనకు తానే నవ్వుకుంటూ... లోపలికి వెళ్ళింది.
సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చింది శాలిని.
“ఎలా ఉంది...జాబ్...?” తల్లిదండ్రులు అడిగారు.
“బాగుంది.” తన గదిలోకి వెళ్ళి, ఫ్రెష్ అయి వచ్చింది. తల్లి తెచ్చి ఇచ్చిన కాఫీ త్రాగుతూ, వాళ్ళిద్దరి మధ్య కూర్చుని, ఆరోజు జరిగిన విషయాలన్నీ ఉత్సాహంగా చెప్పింది.
రాత్రి భోజనం తరువాత... వెళ్ళి తన బెడ్ మీద పడుకుని ఆఫీస్ లో ఉదయం తను లోనైన ఆ అనుభూతిని గుర్తుచేసుకుని ఆలోచించసాగింది. ఎందుకని ఆ గది దగ్గర తనకలాంటి ఫీలింగ్ కలిగింది...? అలా ఎందుకు జరిగి ఉంటుంది...?
ఆలోచిస్తూనే గాఢ నిద్రలోకి జారుకుంది.
******
ఎక్కడో అందమైన వనం... రంగు రంగుల పూలతో ప్రతి చెట్టు సోయగాలు పోతోంది. తుమ్మెదల ఝుంకారం లయబద్దంగా వినబడుతోంది. పక్షుల కిలకిలారావాల ధ్వని ఏకమై... నవ సంగీతాన్నేదో ఆలపిస్తున్నాయి. ఆ వనంలో తను విహరిస్తోంది. ఇంత చక్కని పూవనాన్ని తనెప్పుడూ చూడలేదు. ఎటునుండి వీస్తోందో తెలియదు గానీ... ఆహ్లాదకరమైన చల్లని గాలి శరీరాన్ని తాకుతూ... తెలియని పరవశాన్నిస్తుంది. సరిగ్గా అప్పుడు జరిగింది. దూరంగా ఎవరో ఒక పొడవాటి వ్యక్తి... తనని చూసి, తన వంక రాసాగాడు. అతనెవరు...? అతనికి తను తెలుసా...? తనవైపు ఎందుకొస్తున్నాడు...? తను ఆలోచించేలోపే...అతడు తన ఎదుట వచ్చి నిలబడ్డాడు.
అతని ముఖం స్పష్టంగా కనబడటం లేదు. అతడిని ఎక్కడా చూసినట్లుగా కూడా అనిపించడం లేదు.
“శాలిని, నీకోసమే ఎదురుచూస్తున్నాను. రా వెళదాం...!” అంటూ ఆమె జవాబు కోసం ఎదురుచూడకుండానే... ఆమె చేయి పట్టుకున్నాడు. శాలినిలో ఏదో తెలియని తీయని అనుభూతి. అతని చేతి స్పర్శ ఏదో వెచ్చదనాన్ని ఇస్తుంది. బాగా కావలసిన ఆత్మీయుడి స్పర్శలా హాయిగా ఉంది. ఎవరతను...?
తను ముందుకు కదిలాడు. ఆమెను తీసుకుపోతున్నాడు. రానని చెప్పలేకపోతుంది. నిశ్శబ్ధంగా అతడిని అనుసరించి వెళుతుంది. పూలతోట దాటింది. ఏదో విశాలమైన ఎడారి ప్రాంతంలో... వచ్చి నిల్చున్నారు. అక్కడ ఏవో రెండు కొండల నడుమ చిత్రమైన కాంతి. ఇద్దరూ నడుస్తున్నారు. వెళుతున్నా కొద్దీ ఆ కాంతి పెద్దదవుతుంది. అక్కడి ప్రదేశమంతా... ప్రకాశవంతమవుతుంది. శాలినికి ఏమీ అర్ధం కావడం లేదు. తనని ఎక్కడికి తీసుకెళుతున్నాడు...?
“క్రీం........క్రీం......” అలారం వాచి మ్రోగింది. చటుక్కున శాలినికి మెలకువ వచ్చింది.
అప్పటివరకూ ఆమె ప్రక్కనే కూర్చుని ఆమె ముఖాన్నే తదేకంగా చూస్తూ ఉన్న “అతడు” నిశ్శబ్ధంగా లేచి, గదిలో ఉన్న చీకటిలో విలీనమయ్యాడు.
లైట్ వేసి లేచి కూర్చుంది శాలిని. గట్టిగా కళ్ళుమూసుకుని బెడ్ పై కాస్సేపు అలాగే కూర్చుండిపోయింది.
“ఎంత మనోహరంగా ఉందీ కల...!” నవ్వుకుంది. టైమ్ చూస్తే... తెల్లవారి అయిదవుతుంది. లేచి, యోగా చేయడం కోసం డాబా మీదకు వెళ్ళింది.
******
శాలిని ఆఫీస్ లో చేరి అది మూడవరోజు.
ఆ రోజు బాస్ రమ్మన్నాడని ఫ్యూన్ చెప్పగానే, ఫైల్ తీసుకుని సీట్ లోంచి లేచి బయటకు వచ్చింది. అప్పుడు పడింది ఆమె దృష్టి... తన క్యాబిన్ కి స్ట్రెయిట్ గా ఉన్న టేబిల్స్ లో ఖాళీగా ఉన్న మూడో టేబిల్ దగ్గర కూర్చుని తననే తదేకంగా చూస్తున్న ఒక యువకుడిని. ఎందుకో ఒక్క సెకనుపాటు...గుండె లయ తప్పింది.
చూడగానే ఆకట్టుకునే అందం, హుందాతనం అతడిది. అంతేకాదు, ఇదివరకు ఎప్పుడో అతడిని చూసినట్లుగా, అతడితో ఏదో చాలా ఏళ్ళ అనుబంధం ఉన్నట్లుగా అనిపించింది. అతడినే కాస్సేపు చూస్తూ నిలబడిపోయింది.
“మేడమ్...రండి...” ఫ్యూన్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, తనని తాను సంబాలించుకుని, “బాబోయ్... వీడేంటి ఇంత డిస్టర్బ్ చేసేస్తున్నాడు...?” అనుకుంటూ అతని ముందునుండే తడబడే అడుగులతో... బాస్ చాంబర్ లోకి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి అతను అక్కడ లేడు....
“హు...”ధీర్ఘంగా నిట్టూర్చి...తన క్యాబిన్ లోకి వెళ్ళి తన పనిలో తాను నిమగ్నమైపోయింది.
ఆ రాత్రి మళ్ళీ అదే కల...! విచిత్రమనిపించింది. ఒకే కల... వరుసగా రెండు రోజులూ రావడం ఏమిటీ...? ఇది దేనికి సూచన...?
ఆ మరుసటి రోజు ఆఫీస్ కి రాగానే ఆమె కళ్ళు అతనికోసం వెతికాయి. సేమ్ సీట్...లో కూర్చుని ఉన్నాడు. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో మెరిసిన మెరుపును ఆమె పసిగట్టింది. సిగ్గుతో తలవాల్చేసింది. అదేమిటో... కాస్సేపటికి అతను లేచి నిశ్శబ్ధంగా వెళ్ళిపోయాడు. ఆమెకు అర్ధమైంది. అతనెవరో... కేవలం తనను చూడడానికే వచ్చి, వెళ్ళిపోతున్నాడని. నవ్వుకుంది.శాలినికి అతను బాగా నచ్చాడు. ఇంట్లో అమ్మానాన్న అదేపనిగా పోరుతున్నా... తనకు తగిన వరుడు దొరికేదాకా పెళ్ళి చేసుకోనని భీష్మించుకు కూర్చుంది శాలిని. ఇప్పుడు అతనే తన సరిజోడు అనిపించేసరికి... హృదయం గాల్లో తేలిపోసాగింది. బహుశా తన కలలోకి వస్తున్న వ్యక్తి... ఇతనేనా...? ఇతనితోనేనా తన జీవితం ముడిపడబోతుంది? మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది.
ఆ సాయంత్రం... బాస్ ఎదో అర్జంటు మెయిల్ పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. తను తప్పనిసరిగా... ఉండిపోవాల్సి వచ్చింది. ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోతున్నారు. సడెన్ గా కంప్యూటర్ ... పనిచేయడం ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా... సరికాక పోయేసరికి, బయటకు వచ్చి, దిక్కుతోచనట్లు... చుట్టూ చూడసాగింది. అప్పుడు కనిపించాడతడు... నవ్వుతూ తన దగ్గరకు వచ్చి...”నేను హెల్ప్ చేయనా...?” అడిగాడు.
ఆమె నవ్వుతూ సరెనని లోపలికి దారితీసింది. రెండు నిమిషాల్లో... సిస్టమ్ ని సెట్ చేసాడు. థాంక్యూ చెప్పింది. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు.
అలా నెలరోజులు రోజూ అతను ఏదో ఒక టైం లో రావడం... ఆమె కోసం అదే మూడవ చైర్ లో కూర్చోని ఎదురుచూడడం, ఆమె రాగానే... తనివితీరా ఆమెను చూసుకుని, కాస్సేపాగి లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఆమెకు చాలా ఆనందాన్నిచ్చింది. అతని కోసమే, కావాలని క్యాబిన్ నుండి బయటకు రావడం, పని ఉన్నా...లేకున్నా అక్కడ పని చేసుకుంటున్న మిగిలిన వాళ్ళను పలకరించి పరిచయాలు పెంచుకోవడం చేయసాగింది. కానీ, అతని వివరాలు తెలుసుకుందామనే ప్రయత్నం చేయలేక పోయింది శాలిని.
ఆ రోజు రాత్రి కూడా... అదే కల. బహుశా... తను ప్రేమలో పడిపోయానని తెలియజేస్తుంది కాబోలు ఈ కల...!
ఉదయం ఆఫీసుకి రెడి అవుతుంటే... హాల్లో ఏదో హడావుడి విని, గదినుండి బయటకి వచ్చింది.
పరబ్రహ్మం మావయ్య...! అమ్మానాన్నలిద్దరూ అతని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. “హాయ్... మావయ్యా...” వెళ్ళి నవ్వుతూ పలకరించింది.
“చాలారోజుల తర్వాత వచ్చారు. ఇప్పుడు గుర్తొచ్చామా...?” నిష్టూరపడింది. నవ్వాడు పరబ్రహ్మం “అదేం లేదే... ముఖ్యమైన పనిమీద కాశి, వారణాశి వెళ్ళొచ్చాను.” చెప్పాడు. పరబ్రహ్మం... పౌరోహిత్యం చేస్తాడు. దైవభక్తితో పాటు, జాతకఫలితాలు కూడా తెలిసి ఉన్నవాడు.
“మామయ్యా... నీకో మాట చెప్పాలి” అంది శాలిని.
“చెప్పు...” తనకూ రోజూ రాత్రి వచ్చే కలను గురించి చెప్పింది. “ఎందుకు ఒకే కల రోజూ వస్తుంది నాకూ...?” అడిగింది. ఆమె చెప్పినది అంతా వినగానే, పరబ్రహ్మం భృకుటి ముడివడింది.
“నిన్నరాత్రి కూడా ఇదే కల వచ్చిందా...?” సందేహంగా అడిగాడు. అవునని చెప్పింది శాలిని.నిట్టూర్చి... “ఏమీ లేదులే... నువ్వు ఆఫీసుకు వెళ్ళు” సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. అని పంపించాడు.
అతడినే గమనిస్తున్న విశ్వేశ్వరశర్మ అడిగాడు. “ఏమైంది పరం...? ఏదైనా సమస్యనా...? కలే కదా... ఏమౌతుంది...?” అని.
“లేదు బావా... పూలతోట కలలోకి రావచ్చు. కానీ, ఎవరో తనని ఏదో కాంతి దగ్గరకు తీసుకెళుతున్నట్లుగా వస్తుందని చెప్పింది. అది సరియైన సూచన కాదు. ఆ దేదీప్యమైన కాంతి దైవానికి సూచన. అంటే, ఆ తీసుకెళ్ళేవ్యక్తి... అమ్మాయిని దేవుడి దగ్గరకు తీసుకెళుతున్నట్లు అర్ధంగా గోచరిస్తుంది ఈ స్వప్నంలో!” సాలోచనగా అన్నాడు.
భార్యాభర్తలిద్దరూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళిద్దరి ముఖంలో భయం తాండవిస్తుంది. “అంటే ఏమిటిరా తమ్ముడూ...?” ఏడుపు గొంతుతో అంది అనురాధ.
“భయపడకే... నేనొక్కసారి, శాలిని గది చూస్తాను.” అంటూ లేచాడు.
******
ఎప్పటిలాగే ఆఫీసులో తన గదిలోకి వెళుతూ ఆ మూడో సీట్ వైపు చూసింది. అతను లేడు. ఓ ఇంకా రాలేదన్నమాట అయ్యగారు... నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తరువాత, ఫ్యూన్ వచ్చి చెప్పాడు. “అమ్మా... బాస్ అందరినీ తన చాంబర్ లోకి రమ్మంటున్నారు” అని.
సరే, లేచి వెళ్ళింది. వెళ్తూ... అటువైపు చూసింది. ఊహూ... ఆ సీట్ ఖాళీగా ఉంది. ఏమైపోయాడు...? అనుకుంటూ బాస్ చాంబర్ లోకి వెళ్ళింది. అక్కడ అందరూ నిశ్శబ్ధంగా నిలబడి ఉన్నారు. మేనేజర్ చెపుతున్నాడు. "మన బాస్...రాఘవవర్మ గారి అబ్బాయి రవీంద్రవర్మ గారు యాక్సిడెంట్ లో మరణించి ఈ రోజు కు సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని మనమందరం ఓ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం..." అన్నాడు.
అందరూ మౌనం పాటించారు. అది అయిపోయిన తరువాత... అందరితో కలిసి... బాస్ సీట్ పక్కన బల్లపై పెట్టి, దీపం వెలిగించి ఉన్న ఫోటోకు పూలు వేయడానికి వెళ్ళిన శాలిని. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి, ఒక్కసారే మ్రాన్పడిపోయింది. ఆమె గుండె ఆగినట్లయింది. అతనెవరో కాదు...
రోజూ తన క్యాబిన్ కి ఎదురుగా ఆ మూడో సీట్ లో కూర్చుని తనకోసమే ఎదురుచూసే ఆ అందమైన యువకుడే...! కలలో నడిచి వచ్చినట్లుగా... వచ్చి క్యాబిన్ లోని తన సీట్ లో కూర్చుంది.
*******
“బావా.... శాలిని జాతకం అర్ధాయుశ్సును సూచిస్తుంది.” నెమ్మదిగా చెప్పాడు పరబ్రహ్మం... “ఇందాక తన గదిలోనికి వెళ్ళి చూసినపుడు తెలిసింది. ఆమె గదిలో మృత్యునీడ తారాడుతుంది. తనకి నెలరోజుల ముందునుండే... ఈ సూచనలు స్వప్నం రూపంలో అందుతున్నాయి.” చెప్పలేక చెప్పాడు.
“ఇప్పుడేం చేయడంరా తమ్ముడూ...” శోకాలు పెట్టసాగింది అనురాధ. విశ్వేశ్వరశర్మ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఇది వినగానే, మనిషి నిస్సత్తువగా కూలబడిపోయాడు. ఒక్కగానొక్క కూతురు. ఎంతో గారాబంగా పెంచాడు. అడిగినది కాదనకుండా ఇచ్చాడు. ఇంత ప్రేమగా పెంచుకున్నది... ఇలా కూతురును పోగొట్టుకోడానికా...?” నువ్వేం చేస్తావో, ఎన్ని పూజలు చేస్తావో తెలియదురా... నా కూతురు మీద ఉన్న ఆ మృత్యునీడ ను తొలగించు... ఎలాగో గొంతు పెగల్చుకుని చెప్పాడు.
“బావా... కంగారు పడకు. అమ్మాయి ఆఫీసునుండి ఇంటికి రాగానే, తనని తీసుకుని మా ఊరెళ్ళిపోతాను. అక్కడ పూజలో కూర్చోబెడతాను. అక్కా దాని బట్టలు సర్ధవే...!” ఫలితం లేదని తెలుస్తున్నా... ఏదో చెప్పేసాడు.
కొంచెం సేపటికి ఆఫీసునుండి ఫోన్ వచ్చింది. ఉన్నఫలంగా ఆఫీసుకి పరుగెత్తారు ముగ్గురు. ఆఫీసులో క్యాబిన్ లోని టేబిల్ పై వాలి చనిపోయి ఉంది శాలిని. ఆమె నోటివెంట రక్తం ధార. ఆమెనలా చూడగానే, ముగ్గురికి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. తల్లి అనురాధ స్పృహ తప్పి క్రిందపడిపోయింది.
శాలిని ఏదో తట్టుకోలేని విషయాన్ని విన్నందువలన, నరాలు చిట్లి మరణించి ఉంటుందనుకుంటున్నారు అందరూ...
*******
అందమైన వనం... రంగు రంగుల పూలతో ప్రతి చెట్టు సోయగాలు పోతోంది. తుమ్మెదల ఝుంకారం లయబద్దంగా వినబడుతోంది. పక్షుల కిలకిలారావాల ధ్వని ఏకమై... నవ సంగీతాన్నేదో ఆలపిస్తున్నాయి. ఆ వనంలో ఎటునుండి వీస్తోందో తెలియదు గానీ... ఆహ్లాదకరమైన చల్లని గాలి శరీరాన్ని తాకుతూ... తెలియని పరవశాన్నిస్తుంది. ఆ తోట దాటి అతనితో నడచి వెళుతుంది శాలిని.
అతను చెపుతున్నాడు. రెండేళ్ళ క్రితం... ఇదే రోజు నువ్వు ఎగ్జామ్ రాసి, బస్టాప్ లో బస్ కోసం ఎదురుచూస్తున్నావు. అప్పుడు బైక్ మీద వెళుతూ చూసాను నిన్ను. ఎంతగా నచ్చేసావంటే... చూడగానే నీతో ప్రేమలో పడిపోయాను. నిన్ను మళ్ళీ చూడటం కోసం, నిన్ను పరిచయం చేసుకోవడం కోసం... బండి వెనక్కి తిప్పుకోవాలని ప్రయత్నించాను. కానీ, యూటర్న్ కిలోమీటర్ దూరంలో ఉంది. అప్పటిలోపు బస్సు వచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావనే కంగారులో... ఏదైతే అదయిందని అక్కడే యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేసాను. అదే నా పాలిట శాపమయ్యింది. జరుగరాని ఘోరం జరిగిపోయింది. వరుసగా వస్తున్న వాహనాలను తప్పించబోతూ బండి కంట్రోల్ తప్పి, రోడ్డు డివైడర్ కి గుద్దుకుని నిన్ను చూస్తూ... అక్కడికక్కడే ప్రాణాలు విడిచాను. ఇది తెలియని నువ్వు... బస్సు ఎక్కేసి వెళ్ళిపోయావు.
అప్పటినుండీ నీ కోసం వెతుకుతున్నాను. నెల రోజుల క్రితం మా ఆఫీసుకు ఇంటర్వ్యూకి వచ్చినపుడు నిన్ను చూసాను. అప్పటికే నీ వెనుక మృత్యువు నీడ కదలాడటం నాకు కనబడింది. నువ్వు కూడా త్వరలోనే మరణించబోతున్నావని అర్ధమైంది. అందుకే, ఇన్నాళ్ళు రాత్రి పగలూ నీ వెంటే ఉన్నాను. ఈ రోజుతో నీ బంధాలూ తెగిపోయాయి. శాలిని మౌనంగా వింటూ అతనితో నడుస్తుంది. అంతలో విశాలమైన ఎడారి ప్రాంతం... అక్కడ దేదీప్యమానమైన కాంతి... ఇద్దరూ నడుచుకుంటూ ఆ కాంతిలో కలిసిపోయారు.
**********