కవితలు - ..

అంకితం

కోటి చంద్రుల చల్లదనాన్ని
నీ ప్రశాంత వదనంలో చూశాను
కోటి మృదంగాల మృదునాదాన్ని
నీ పలుకులలో విన్నాను
నీ స్వరం నా పేరు పలికిన ప్రతిసారి
కోటి వీణల మనోహర సంగీతాన్ని
ఆస్వాదించాను
నీపై ప్రేమతో నిండిన నా హృదయం
కోటి భావ గీతాల సమ్మేళనం
అందుకే ఈ కవిత నీకే అంకితం !!

 

 

 

సుజాత పి.వి.ఎల్‌

 

 

 

*************

వారిని చూశాను


అరవై సంవత్సరాలు దాటిన-వారిని చూశాను,
ఆత్మస్థైర్యంతో వాళ్ళు వేసే అడుగుల్ని,
అవి కురిపిస్తున్న పిడుగులను గమనించాను.
డెబ్బై దాటిన-వారిని చూశాను,
దీనత్వం కనిపించని వారి దినచర్యల్ని,
వాటిలో కనిపిస్తున్న ధీరత్వాన్ని గ్రహించాను.
ఎనభై దాటుతున్న- వారినీ చూశాను,
నైరాశ్యం నినదించని వారి నడతని,
అందులో నిండి ఉన్ననిశ్చలత్వాన్ని కనుగొన్నాను.
మరి యాభై నాలుగులోనే ఉన్న నేనిలా,
నిరంతరం నిలువెత్తు నిర్లిప్తతకు లోనవటమేమిటని అనిపించింది.
వెంటనే వారిని కలుసుకున్నాను,
వారి పెదవులపై విరిసే ధరహాసాల రహస్యాలను తెలుసుకొన్నాను.
గతాన్ని తలుచుకుని కుమిలిపోవటం వల్ల,
ఎదుటివారి వైభవాన్ని చూసుకొని కుళ్ళిపోవటంవల్ల,
నష్టమే తప్ప లాభం లేదని తెలుసుకున్నాను.
తాతల మనుగడను గుర్తుకుతెచ్చుకొని మురిసిపోవటంవల్ల,
ఎదుటివారిని పడగొట్టే ఎత్తుగడలను ప్రయోగించటంవల్ల,
కష్టమే తప్ప సుఖం రాదని తెలుసుకున్నాను.
అవమానాలను తట్టుకొంటూ,అభిమానాలను పట్టుకొంటూ,
ముందుకు అడగులు వేయటమే
వారి ఉత్సాహానికి కారణమని తెలుసుకున్నాను.
ఆవేశాలకు ఆనకట్టలువేస్తూ,కావేశాలకు తిలోదకాలిస్తూ,
నిగ్రహానికి గొడుగులు పట్టటమే
వారి ఊపిరి నిలవటానికి ప్రేరణమని తెలుసుకున్నాను.
వారిని అనుసరిద్దామని నిశ్చయించుకున్నాను.


భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

 

*************

ఎండమావి నిర్వేదన

బాధ్యతలు తీరిపోయాకా
పాశాలు విలపిస్తుంటాయి...
బంధనాలు తెంచుకోలేక
ప్రాణం అవస్తలు పడుతూంటుంది.
ఆవేదనతో సుష్కించే శరీరాన్ని
ఆశ్రయించిన రోగాలు విజ్రుంభిస్తాయి...
ఎదురుతెన్నులు చూస్తున్న కళ్ళకు
నిరీక్షణాఎడారులు మొలుస్తాయి....
గడచిన మూడు అరల జీవితాన్ని
తడుముకుంటే మూలల్లో
పురుగులజాడలు...వంశాభివృద్ధి
కోసం గుడ్లను పోదుగుతుంటాయి...
పాతబట్టల గబ్బు సువాసన..
తలపుల తలుపుల వెనుక
రాజ్యమేలుతుఉంటుంది...
అరల న్యూస్ పేపర్ల కింద...
అపురూప జ్ఞాపకాలు శిలాజాలై
నిస్తేజ తాజా పరిమళం
వెదజల్లుతుంటాయి...
తడిమితే మాత్రం పునరుజ్జీవితమై...
కంటిచలమలలో ఆర్ద్రతను పండించి..
మురిపిస్తూ మెరిసిపోతుంటాయి...
ఆశలు ఎండిన కట్టె
కట్టెపుల్లల దహనకాండపు
సహచరత్వం కోసం తహతహ
లాడుతూ మూగగా రోదిస్తుంటుంది.
నిన్ను కోరేదొక్కటే భగవాన్...!
ఆ వరాన్ని ఇష్ట కామ్యం చేయమని...!!!

కొత్తపల్లి ఉదయబాబు.

*************

"మా వీధిలో ముసలోడు"

మా వీధిలో ఆ అరుగుమీద
తనువు దాస్తుండే వాడు!
మీ ఊరు పేరని అడిగితే
ముసి ముసి బోసి
నవ్వొకటి విసిరి
అజ్ఞానిలా చెయ్యూపుతాడు!
చేతికర్రే అతని నేస్తం
గొచి గుడ్డే అతని కవచం
ఎండ ,వాన ,చలికి
చలించని చెట్టు !
ఏవగింపులని
ఆదరింపులని
ఒకేరీతిన స్వీకరించే
యోగి!
సమస్యల ముళ్ళబాటకి
పరిష్కార రహదారివేసే
మార్గదర్శి!
పిచ్చోడు, బిచ్చగాడు
దిక్కులేనోడు, బైరాగి
అనుభవి, జ్ఞాని
ఎలా పిలిచినా అదే తీరు
బోసి నోటిని
తెరిచి పసివాడిలా నవ్వు!
కోరి వచ్చిన వారికి
అనుభవ సారాన్నంతా
సంచుల్లో నింపిపంపే
తరగని గని!
గని ని తవ్వుకుందామని
తలచివస్తే తను లేడు
తన అమూల్యసంపదనంతా
సర్దుకుని పయనమయ్యాడు
తిరిగిరాని అనంత తీరాలకు!!!

నాగ్రాజ్....

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు