స్వదేశాగమనం
ఆయన సింహళం చేరగానే వేలాది జనం జయజయ ధ్వానాలతో స్వాగతమిచ్చారు. మద్రాసులో, స్వాగత సంఘం వారు ఊరేగింపు ఏర్పాటు చేయగా ప్రతి ఇంటి దగ్గర, భగవంతునికిచ్చే మాదిరిగా హారతులూ, ఫల,పుష్పాదులూ స్వామికి సమర్పించబడ్డాయి.
శ్రీ రామకృష్ణ సేవా సంఘ సంస్థాపన
మానవ కళ్యాణం - మాతృదేశాభ్యున్నతి - యివి వివేకానందుని ముఖ్యాశయాలు. దీనికోసం ఒక సేవాసంఘాన్ని నెలకొల్పాలనే భావనతో ఆయన ఒకసభ ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచాడు.
"సంఘమనేది లేనిచో ఎటువంటి మహాకార్యమూ కొనసాగదని విదేశీ పర్యటన వల్ల నాకు కలిగిన అనుభవాన్ని బట్టి గ్రహించాను. ప్రస్తుతం మనదేశంలో ప్రజాస్వామిక సూత్రాలపై ఒక సంఘాన్ని స్థాపించవలసిన అవసరం వుంది. ఏ మహా పురుషుని మూలంగా మేము సన్యాసాశ్రమం స్వీకరించామో - ఏదివ్య పురుషుని మేము ఆదర్శప్రాయంగా గ్రహించి గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తున్నారో, ఏ మహాత్ముని పేరు ఆయన నిర్వాణానంతరం ప్రపంచ వ్యాప్తి పొందినదో, ఆ రామకృష్ణ పరమహంస పేరునే యీ సంఘానికి పెట్టాలని నా అభిమతం. ఇది అన్నివిధాలా అనుగుణంగా వుంటుంది. కనుక యీ సంఘం శ్రీ రామకృష్ణ సేవాసంఘం అని వ్యవహరించబడుతుంది అని చెప్పగానే సభలోని వారందరూ యీ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఏకమూ - శాశ్వతమూ అయిన సనాతన ధర్మాన్నే వివిధ మతాలూ - వేరు వేరు పద్ధతులలో ప్రదర్శిస్తున్నామని గ్రహించి సర్వమత సామరస్యాన్ని కల్గించడానికై శ్రీ రామకృష్ణుడు నెలకొల్పిన మహోద్యమాన్ని సక్రమంగా నిర్వర్తించడమే యీ సంఘ కర్తవ్యం.
విశ్వమానవ కళ్యాణం కొరకు శ్రీ రామకృష్ణుడు బోధన రూపంలోనూ, ఆచరణలోనూ ప్రకటించిన ధర్మతత్వాలను వ్యాప్తి చేయటమూ - శ్రీ రామకృష్ణ సేవా సంఘాశయము.
సన్యాసులకూ - సంఘ కార్యక్రమాలలో పాల్గొనదలచిన ఇతరులకూ శిక్ష నీయడానికై దేశమందలి వివిధ రాష్ట్రాలలో, మఠాలూ, ఆశ్రమాలు స్థాపించబడాలి.
విదేశాలకూ - భారతావనికీ సన్నిహిత సంబంధ మేర్పరచి మత విషయంగా సామరస్యాన్ని పెంపొందించడానికి కృషి జరగాలి. దీనికోసం విదేశాలలో మఠాలను, ఆశ్రమాలను స్థాపించడానికీ, వేదాంతాన్ని ప్రచారం చేయడానికి సుక్షితులైన వారిని పంపాలి.
ఈ సంస్థకు రాజకీయ విషయాలతో ఏ విధమైన సంబంధమూ ఉండకూడదు. సంఘ ఆశయాలతో ఏకీభవించే వారెవరైనా ఇందులో సభ్యులుగా చేరవచ్చు.
ఈ తీర్మానాలు ఆమోదించిన తర్వాత కార్య నిర్వాహకవర్గం ఏర్పాటైంది. సంఘానికి వివేకానందస్వామి స సాధారణాధ్యక్షుడయ్యాడు.
సంఘం కార్యక్రమాలు బాగా పెరగడం వల్ల పనులు చురుకుగానూ, సులభంగానే జరిగే నిమిత్తం యీ సంస్థను శ్రీ రామకృష్ణ సేవాసంఘమనీ, శ్రీ రామకృష్ణ మఠమనీ, రెండు భాగాలుగా విభజించారు. సేవాశ్రమాలు - విద్య, వైద్యాలయాలు మొదలైనవి స్థాపించి ప్రజాసేవ చేయటం సేవాసంఘ ఆశయం.
సన్యాశ్రమంలో చేరేవారికి అవసరమైన శిక్షణ నీయడం మఠ లక్ష్యం. ఆ రోజు వివేకానందుడు నెలకొల్పిన యీ రెండు సంస్థలూ ఈనాడు జగద్విఖ్యాతి నార్జించి అద్వితీయంగా వెలుగొందుతున్నాయి.
స్వామి ఆరోగ్యం పాడయింది నిరంతరం ఎడతెగని కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల. అందువల్ల విశ్రాంతి కోసం ఆయన హిమాలయ ప్రాంత మందలి "ఆల్మోరా" నగరానికి వెళ్లి కొన్నాళ్ళుండి, తర్వాత అనేకచోట్ల ప్రసంగాలు చేస్తూ క్షేత్రీ నగరం చేరుకున్నాడు. క్షేత్రీ మహారాజు స్వామిరాకకు, ఆనందపడి తాను స్వయంగా కొంత ధనమిచ్చి, ప్రజలచే విశేషంగా ధన మిప్పించాడు. వివేకానందుడు ఆధనాన్ని వెంటనే మఠానికి పంపించేశాడు. ఆ సమయంలో అక్కడ స్వామి ఉపన్యాస సారాంశమిది.
"నేటి భారతీయులు హిందువులు కారు. వేదాంతులు కారు. వారు "నన్ను ముట్టుకొనకు" మతస్థులు. వంట ఇల్లే వారి దేవాలయం. వంట పాత్రలే వారి దేవతలు" ఈస్థితి వెంటనే తొలగిపోవాలి. లేకపోతే మనమతానికే ముప్పురాగలదు. ఉపనిషత్తుల గొప్పతనాన్ని ప్రజాబాహుళ్యం గుర్తించాలి. వివిధ శాఖా సంప్రదాయాలలో అంతఃకలహాలు అంతరించిపోవాలి".
వర్ణాలలో ఉపశాఖలను త్రోసివేసి ఉపశాఖలలో అంతర్వివాహాలు జరుపుకోవాలి. తత్త్వ బోధనలకు ముందు అన్న వస్త్రాలు సమకూర్చి సామాన్య ప్రజల దుస్థితిని తొలగించాలి. ఇందుకు విద్యావ్యాప్తి అత్యవసరం. బ్రాహ్మణులనూ, పండితులనూ దూషించరాదు. ఎందుకంటే మన విజ్ఞానాని కంతకూ మూలాధారాలైన వేద శాస్త్రాలను నిలబెట్టినవారు బ్రాహ్మణులే. వారే లేకపోతే యీపాటికి భారతీయ సంస్కృతి రూపుమాసి పోయేది.
దేశంలో సంస్కృత విద్యావ్యాప్తి విరివిగా జరగాలి. మేధావంతులను వెలువరచే జాతీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి. సేవ - త్యాగమూ అత్యుత్తమ ఆదర్శాలని యావద్భారతీయులూ గ్రహించాలి.
ప్రజలలో ఐకమత్యం పెంపొందాలి. పాశ్చాత్యులకు సనాతన ధర్మతత్వాలను బోధించడానికీ, వారి పారిశ్రామిక విద్యలను నేర్చుకొనడానికీ శిక్షణ పొందిన యువకుల్ని పంపాలి?