తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( కుంభకోణం , గర్భరక్షాంబిక )

కుంభకోణం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుక్కరుగ అనే గ్రామం లో వుందీ మందిరం . అయితే యీ గ్రామం తంజావూరు జిల్లా పాపనాశం తాలుకాలోకి వస్తుంది , కావేరి నది ఉపనది అయిన వెట్టారు నదీ తీరాన వుంది యీ కోవెల . యీ కోవెల ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం . తంజావూరు  నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం లో వుంది . కుంభకోణానికి దక్షిణాన యిరవై కిలోమీటర్ల దురాన వుంది . కాబట్టి యీ గ్రామం తంజావూరునుంచి గాని కుంభకోణం నుంచి గాని చేరుకోవచ్చు .

తిరుక్కరుగ వూరు వెట్టారు నదీ తీరంలో  చుట్టూ కొబ్బరి చెట్లు , వరిపొలాల మధ్య వున్న చిన్న గ్రామం  . గ్రామాన్ని చూస్తేనే కడుపు నిండపోతుంది . ఎటు చూసినా వరిపొలాల పచ్చదనమే .

తమిళనాడులో వున్న ప్రతీ చిన్నా పెద్ద కోవెళ్లలో పుష్కరిణి వుండి తీరుతుంది . అలాగే యీ కోవెల కి యెదురుగా పెద్ద పుష్కరిణి వుంటుంది . వివిధ దేవతా మూర్తులతో తీర్చి దిద్దిన తూర్పు దిక్కున వున్న రాజగోపురం లోంచి లోపలి కి వెళితే పెద్ద ప్రాకారం అందులో శివ పుత్రులైన వినాయకుడికి , కుమారస్వామికి మందిరాలు వున్నాయి . యిక్కడ వున్న వినాయకుడిని " కర్పగ వినాయకుడు " అని అంటారు . యీ విగ్రహం స్వయంభూ విగ్రహం . తమిళం లో కల్పవృక్షాన్ని  " కర్పగం " అని అంటారు .  కల్పవృక్షం అని యెందుకు అన్నారు అంటే కల్పవృక్షం యెవరు యే కోరిక కోరినా వెంటనే అంటే క్షణాలమీద తీరుస్తుంది. కల్ప వృక్షం లాగే భక్తులు కోరిన కోర్కెలు వెంటనే తీరుస్తాడుట యీ వినాయకుడు అందుకే ఇతనిని కర్పగ వినాయకుడు అని అంటారు . యీ కోవేలకి దక్షిణ దిక్కున కుడా రాజ గోపురం  ప్రవేశం ద్వారం వున్నాయి  .

పూర్వం యీ కోవెల ప్రాంతమంతా మల్లి తోట ఉండేదట , మల్లి వనం లో స్వయంభూగా వుద్భవించేడు కాబట్టి యిక్కడ శివుణ్ణి మల్లివన నాధుడు అని అంటారు , ఇప్పటికి శివలింగం మీద మల్లి తీగ చుట్టుకొని వున్నట్టుగా ఆనవాలు వుంది . యిక్కడ మల్లివన నాథుడు , అమ్మవారు గర్భ రక్షాంభిక మందిరాలు తూర్పు ముఖంగా వుంటాయి .         ఏ విధమైన చర్మరోగాలయినా మల్లివన నాథుడిని దర్శించు కుంటే పోతాయిట , దీర్ఘ కాలిక రోగ గ్రస్తులు మల్లివన నాధుడికి అభిషేకం చేసుకుంటే వారి రుగ్మతలు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం . ఈ ఈశ్వరునికి అభిషేకం అంటే నీళ్లతోనో , పాలతోనో , పంచామృతాలతోనో కాదు " పునుగు " తో చేస్తారు  అదే మల్లివననాథునికి అభిషేకం . ఎవరైతే యిలా " పునుగు " అద్దుతారో వారి సర్వపాపాలు , సర్వ రుగ్మతలు హరించి ఆయుః ఆరోగ్యాలు ప్రసాదిస్తాడట మల్లివన నాథుడు  . ఈ ఈశ్వరునకు అభిషేకాదులు యెందుకు వుండవంటే యీ ఈశ్వరుడు  పుట్టమన్నుతో యేర్పడ్డ స్వయంభూ కాబట్టి అభిషేకాదులు నిర్వహిస్తే శివలింగానికి క్షతి కలుగుతుందని అభిషేకాదులు నిర్వహించరు .

ఈశ్వరునికి ఎదురుగా వుండే నంది కుడా స్వయంభూవే , అంటే యీ కోవెలలో ఈశ్వరుడే కాక వినాయకుడు , నంది కుడా స్వయంభూలే , యే ఆలయంలో నైనా వొక దేవుడు స్వయంభూగా వుంటేనే ఆ ఆలయానికి విశిష్ఠత చేకూరుతుంది అలాంటిది ఈశ్వరుడు , వినాయకుడు మరియు నంది స్వయంభూలు గా వున్న యీ ఆలయం  యెంతటి మహత్తు గలదో కదా !

ఈ కోవెలలో మరో మహత్యం యేమిటంటే ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమకు చంద్రుడు తన కిరణాలతో మల్లివన నాథునికి అభిషేకం చేస్తాడు . ఈ వింతని చూసి తరించేందుకు దేశ విదేశాలనుంచి భక్తులు వస్తారు .

ఇక్కడి స్థల వృక్షం మల్లి తీగ .

ఇక యిక్కడ పార్వతీ దేవిని గర్భరక్షాంభిక అని అంటారు . ఏడడుగుల అమ్మవారి  విగ్రహం ఎంతో  కళకళ లాడుతూ వుంటుంది . అమ్మవారిని కంచి పట్టుచీరె కట్టి వజ్ర వైఢూర్యాలు పొదగ బడిన నగలతోను , రంగు రంగుల పూలతోను అలోకరిస్తారు . ఆ లంకరణలో  అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చడానికి సజీవంగా వచ్చి నిలబడిందేమో అనే భ్రమను కలిగిస్తుంది . అప్పార్ , సుందరార్ , సంభందార్ అనే పేరుపొందిన శివభక్తులు   అమ్మవారి అందమైన చిరునవ్వును ఆమె మహిమలను " పథిఘాం " లలో వర్ణించేరు .

ఇక్కడ పార్వతీదేవి గర్భరక్షాంబిక అవతారంలో కొలువైవుంది . ఇక్కడ స్థల పురాణం కోవెల గోడలపై చెక్కబడి వుంది .

అది ఏమిటో తెలుసుకుందాం .

పూర్వం నిదృవ మహర్షి తన అతి సౌదర్యవతి అయిన పత్ని వేదిక తో మల్లివన నాథుని కొలుచుకుంటూ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ వుంటాడు . ఆ అన్యోన్య దంపతులకు సంతానం లేదనే కొరత బాధిస్తూ వుంటుంది . పిల్లల కొరకై వారు మల్లివననాథుని వేడుకుంటూ సేవించు కుంటూవుంటారు . కాలాంతరాన వేదిక నెలతప్పుతుంది . భార్యా భర్తలు ఏంతో ఆనందించి తమ నిత్య క్రతువులను మరింత భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తూవుంటారు . ఒకనాడు వేదిక యేడోమాసం లో వుండగా నిదృవుడు వరుణుని దర్శనార్ధమై స్వర్గానికి వెళ్తాడు .

వేదిక నిత్యక్రతువులు నిర్వర్తించడం లో అలసి విశ్రమిస్తుంది . మిట్ట మధ్యాహ్నం ప్రయాణపు బడలికతో అటుగా వచ్చిన ఊర్ద్వపాద మహర్షి భిక్ష కొరకై వాకిట నిలిచి అర్దిస్తాడు , అలసి వున్న వేదిక నిద్రావస్థలో వుండుట వలన రుషి భిక్షకై వేచియున్నట్లుగా కూడా ఆమె గమనించు కోలేకపోతుంది . ఊర్ధ్వపాద మహర్షికి  వేదిక స్థితి తెలియనందున ఆమె తనను నిరాదరించినదని తలచి ఆమెకు " క్షయ " జబ్బు కలగాలని ఆ జబ్బుతో  ఆమె శరీరం నశించాలనే శాపం పెట్టి వెళ్ళిపోతాడు . మహర్షి శాపం వల్ల రోజు రోజు కి ఆమె శరీరం క్షీణిస్తూ , ఆమె గర్భం  లో వున్న పిండం కుడా రోగగ్రస్తమై పోతుంది . కరుణామయి అయిన పార్వతీ దేవి తన భక్తురాలిని రక్షించాలని నిశ్చయించుకొని  స్వయంగా ప్రకటితమై వేదికకు సపర్యలు చేసి , క్షతి కలిగిన పిండాన్ని సంరక్షించి ప్రసవం చేయిస్తుంది .

వేదిక అనారోగ్య కారణాన బిడ్డకు పాలు ఇవ్వలేని స్థితిలో వుండగా పార్వతీ దేవి కామధేనువు పాలు బాలునికి పడు తుంది . దేవి అనుగ్రహం వల్ల వేదిక  శాప విముక్తురాలౌతుంది . నిద్రవ మహర్షి స్వర్గలోకం నుంచి వచ్చి చంద్రుని వలే ప్రకాశిస్తున్న పుతృని చూచి ఎంతో ఆనందాన్ని పొందుతాడు . పిమ్మట వేదిక ద్వారా జరిగినదంతా తెసుకొని అమ్మవారిని ఎన్నోవిధాల స్తుతించి , అమ్మవారిని కలియుగములో భక్తుల కి కలిగే గర్భ సంబంధ మయిన సమస్యల నుంచి గర్భాన్ని రక్షించే తల్లిగా అక్కడే కొలువై వుండమని కోరుతాడు . మానవ కల్యాణార్ధం దేవి యిక్కడ గర్భరక్షాంభికగా అవతరించి యీ కోవెలలో కొలువుతీరి వుంది .

పిల్లలు కలగని దంపతులు యిక్కడ అమ్మవారిని పూజించి ప్రసాదంగా యిచ్చే ఘృతం (నెయ్యి) ప్రతి రాత్రి 48రొజులు తీసుకుంటే పిల్లలు కలుగుతారు అని భక్తుల నమ్మకం . ఇక్కడ పిల్లల కోసం వచ్చేవారికి ఘృతం , సుఖ ప్రసవం కోసం వచ్చేవారికి ఆముదం ప్రసాదం గా యిస్తారు . ప్రసవ నొప్పులు ప్రారభం అయినప్పుడు ఆముదం గర్భిణి కి పొట్టపై రాస్తే సుఖ ప్రసవం అవుతుందిట . యీ వూరి స్త్రీ లకు యిప్పటివరకు గర్భ స్రావాలు జరుగలేదుట , అలాగే యీ గ్రామం లో సంతానం లేనివారు కుడా లేరుట . గర్భానికి సంభందించిన యెటువంటి సమస్యలు యీ గ్రమస్థులను సోకలేదుట , అలాగే ప్రసవ సమయంలో కుడా యెటువంటి సమస్యలు రాలేదుట , యీ విషయం యీ గ్రామ ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు . తరచూ గర్భస్రావాలు జరుగుతూ వుండే వారు యీవురు వచ్చి ప్రసవం వరకు వుండి ఆరోగ్యవంత మైన పిల్లలకు జన్మనిచ్చి నట్లు కుడా చెప్తారు .

అమ్మవారి గర్భ గుడిలో పురాతనమైన ఊయల వుంచుతారు , యీ అమ్మవారి కృప వలన కలిగిన బిడ్డలని యీ ఊయలలొ వేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు , పిల్లల కొరకు వచ్చినవారు యీ ఊయల కి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటారు  . యీ ఊయల పొద్దున్న 6-30 నుంచి 12-30 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటలవరకు గర్భ గుడిలో ఉంచుతారు .

యీ ఆలయం వెయ్యి సంవత్సరాలకి ముందు నిర్మింపబడినట్లుగా ఆలయ చరిత్ర చెప్తోంది . యీ ఆలయ మహిమ తమిళ సంస్కృతాలలో గ్రంధస్థం చెయ్యబడింది . కోవెల లోపల శిలలపై ఆలయ మహిమల గురించి వ్రాయబడింది . పదవ శతాబ్దం లో పరాంతక చోళుడు యీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయం లో భీమదేవుడు , గరికరుడు , గౌతముడు మొదలైన రాజులు యిక్కడి మల్లివన నాథుని , గర్భ రక్షాంభికను , కర్పగ వినాయకుడిని , కుమారస్వామిని దర్శించుకొని తరించేరుట .

ఈ మందిరంలో మొక్కుకున్న తరువాత మాకు మనుమలు పుట్టిన సెంటిమెంటుతో సుమారు ప్రతీ సంవత్సరం మేము యీ కోవెలకు వెళ్తున్నాము , ప్రతీమారు యెందరో పిల్లలకోసం పూజలు చెయ్యడం చూస్తూ వుంటాము .

నమ్మితే అమ్మ నమ్మకపోతే బొమ్మ అంతే , నమ్మకం అనేది మన శ్రధ్దను బట్టి వుంటుంది .

వచ్చేవారం నవగ్రహ స్థానాలలో రెండవదైన చంద్రస్ధానం దర్శించుకుందాం .

అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు