చెప్పులూ-బూట్లూ…… - భమిడిపాటి ఫణిబాబు

Cheppuloo - Bootlu

సృష్టిలో ముందుగా చెప్పులూ, ఆ తరువాతే బూట్లూ వచ్చేయనుకుంటా. మొదట్లో అవేవో పావుకోళ్ళని ఉండేవి. స్వామీజీలూ, ఆధ్యాత్మిక రంగంలో ఉండేవారూ ఉపయోగిస్తూంటారు. పెళ్ళికి ముందర పెళ్ళికొడుకు "కాశీయాత్ర" సందర్భంలోకూడా ఒక్కొక్కప్పుడు వాడుతూంటాడు. వీటి ఆయుర్దాయం అంటే ఈ పావుకోళ్ళకి ఎక్కువే. వచ్చిన గొడవల్లా  కాలక్రమేణా, మన జీవితాల్లోకి వచ్చిన చెప్పులతోనే. మళ్ళీ వీటిల్లో రకాలు-ఆకుజోళ్ళూ, అవేవో రబ్బరుతో చేసిన "హవాయి" చెప్పులూనూ. వాటిని హవాయి అని ఎందుకుపిలుస్తారో తెలియదు. బహుశా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఇవి ఎక్కువగా వాడుతారేమో. ప్రారంభం (introduction) ఇలా ఉందని ఖంగారుపడకండి. చెప్పుల "జీవితచరిత్ర" చెప్పాలనే ఉద్దేశ్యం నాకు ఎంతమాత్రమూ లేదు. ఈ చెప్పులతో వచ్చే తిప్పలు చెప్పడమే నా ముఖ్యోద్దేశ్యం.

చిన్నప్పుడు స్కూలు స్టేజీలో ఉన్నంతవరకూ చెప్పులెక్కడా? ఏదో బయటి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు, ఓ జత కొనేవారు, మళ్ళీ దానితో స్కూలుకి వెళ్ళకూడదు. ఎప్పుడో ఏ "తేలో" ఇంట్లోకి వచ్చినప్పుడు దాన్ని చంపడానికో, లేదా ఏ కొత్తిమిరి మడో తయారుచేయడానికి, ధనియాలు నూరడానికో మాత్రమే ఉపయోగించేవారు. ఈ చెప్పులతో వచ్చే పెద్ద బాధ "కరవడం". అదేమి కర్మమో కానీ, ఎప్పుడు కొత్త చెప్పులు వేసికున్నా, మొదటి నాలుగైదు రోజులూ మనల్ని నానా తిప్పలూ పెడతాయి.ఎక్కడెక్కడ కరుస్తాయో చెప్పఖ్ఖర్లేదనుకుంటా, చాలా మందికి అనుభవమే. పైగా ప్రతీవారూ ఇచ్చే సలహా ఏమిటంటే , కొద్దిగా మంచినూనో. కొబ్బరినూనో రాసి వాడితే కరవ్వని.నూనె దారి నూనెదే, అక్కడక్కడ ఏర్పడే పుళ్ళ దారి పుళ్ళదే. కాలూ, చేయీ జిడ్డోడడం తప్ప ఉపయోగం ఉండదని నా అనుభవం. వర్షాకాలంలో రబ్బరు చెప్పులు (హవాయి) వాడడం శ్రేష్ఠమంటారు. కారణం నీళ్ళల్లో ఎంతవాడినా, వాటికి ఆయుక్షీణం ఉండదని అయుండొచ్చు.ఎంత వర్షంలోనైనా హాయిగా వెళ్ళొచ్చు. కానీ అలా నడవడం వలన వచ్చే side effect ఉందే, అది చాలా తీవ్రంగా ఉంటుంది.ఒక్కో అడుగేసేకొద్దీ, ఆ నీటి తుంపరలు, మన నెత్తిమీదుగా ప్రయాణం చేసి, మనం వేసికున్న దుస్తుల ముందుభాగం మీదకూడా, కుడ్యచిత్రాలు ఏర్పడిపోతూంటాయి.

ఇలా వర్షంలో వెళ్ళి బట్టలు పాడుచేసికుని, చిన్నప్పుడు తల్లిచేతా, పెద్దయిన తరువాత ఇంటావిడచేతా చివాట్లు తెప్పించడానికి కాకపోతే ఇంకో పనిలేదు ఈ హావాయి చెప్పులకి. పోనీ వర్షాకాలంలోనే ఇలాటి కష్టాలు పెడుతుందనుకోవడానికి వీలు లేదు. వేసవికాలంలో ఈ హావాయి చెప్పులతో వచ్చే కష్టాలు ఇంకోరకం.

ఏదో బజారుదాకానే కదా అని,వాటిని వేసికుని వెళ్తాము. పుటుక్కున ఆ strap తెగూరుకుంటుంది. మామూలు చెప్పులైతే, కనీసం బొటనవేలు దోపుకోడానికి ఓ రింగులాటిదైనా ఉంటుంది. దీనికి ఆ strap అటూ ఇటూ ఊగుతూంటుంది. ఓ సూది పిన్నులాటిది గుచ్చి, తాత్కాలికంగా, ఏ చెప్పులు కుట్టేవాడో కనిపించేదాకా లాగించేయొచ్చు అదో సుగుణం. ఈ strap లు జతల్లోనే అమ్ముతూంటారు. డబ్బులుకి కక్కూర్తిపడకుండగా, అతనిచేతే వేయించేసికోవచ్చు, కానీ నూటికి తొంభైమంది, అలా ఖర్చుపెట్టేదో మిగుల్చుకుందామని, ఓ జత కొనుక్కుని ఇంటికి తీసికెళ్ళి మొదలెడతారు, ఈ కొత్త strap లు వేసే కార్యక్రమం. వాటిని ఆ చెప్పుకున్న చిల్లుల్లో దూర్చడం భగవంతుడిక్కూడా కుదరదు.ఓ కంఠాణీయో, స్క్రూ డ్రైవరో తీసికుని, ముందుగా ఓ చిల్లులో దోపి, కొత్తగా కొనుక్కున్నదానిని మొత్తానికి, ఆ చిల్లుని ఇంకా ఇంకా పెద్దది చేసేస్తూ,పని కానిస్తాడు. ఇంకో రెండు చిల్లులు మిగులుతాయి, వాటిలోకి కూడా నానా హైరాణా పడుతూ ఓ చెప్పుని functional చేసేస్తాడు.

అప్పుడే ఎక్కడయిందీ, లక్షణంగా ఉన్న రెండో చెప్పు సంగతి కూడా చూడొద్దూ, లేకపోతే ఒకదానికి కొత్త స్ట్రాప్పూ, రెండో దానికి కృంగి కృశించిన స్ట్రాప్పూనూ, ఎవడైనా చూస్తే అప్రదిష్ట కూడానూ.నానా తిప్పలూ పడి రెండోది కూడా పూర్తిచేసి అమ్మయ్యా కొత్త చెప్పులు కొనుక్కోకుండగా గడిచిపోయిందిగా అనుకుని, రెండో రోజు వేసికునేసరికి మళ్ళీ "కరవడం" , ఆ పుళ్ళకి బ్యాండ్ ఎయిడ్లూ, పాలాస్త్రి పట్టీలూ ప్రారంభం, పాపం ఆ స్ట్రాప్పులు కొత్తవిగా, వాటి పని అవి చేసికోవద్దూమరి?

కాలక్రమేణా ఈ చెప్పులలో ఆడవారు వేసికునే హై హీల్డ్ చెప్పులూ, లాటి వెరైటీలొచ్చాయి.  ఇదివరకటి రోజుల్లో ఇళ్ళలోకి ఈ చెప్పులతో రానిచ్చేవారేకాదు, కాలక్రమేణా వీటికీ గృహప్రవేశం కలిగింది. కొంతమందైతే వీటికి ఓ ఉచితస్థానం కూడా, "మడి చెప్పుల" ఉపాధి ఇచ్చేశారు. అంటే వీటితో, ఏదో ఏ పూజో చేసికునేటప్పుడు తప్ప, ఇల్లంతా తిరిగేయొచ్చన్నమాట. శుభం !

ఇంక ఈ చెప్పుల భ్రాతలు బూట్ల విషయం చూద్దాం.ఇదివరకటిరోజుల్లో, లెదర్ షూస్ అని ఉండేవి. గుర్రాలకీ, ఎద్దులకీవేసే నాడాల్లాటివి వీటికీ వేసుకునేవారు. నడుస్తూన్నప్పుడు ఠక్ ఠక్ మని చప్పుడు చేస్తూ, మనం కొత్తగా షూస్ కొనుక్కున్నామని చెప్పకుండానే తెలిసేది.కానీ పరీక్షల్లో వచ్చే వాచర్లు మాత్రం వీటిని ఎప్పుడూ వాడేవారు కాదు, ఏ రబ్బరు సోల్ దో వేసికోవడం, చడీ చప్పుడూ కాకుండగా టక్కున కాపీలు పట్టెయడమూనూ. కానీ నాడాలు వేసికుని చప్పుడు చేసే బూట్లతో వచ్చిన చిక్కేమిటంటే, ఏ నునుపు నేల మీదో నడిచినప్పుడు, జారి పడి నడుం విరక్కొట్టుకోవడం. ఏ జాతిదైనా, ఈ లేసుల బూట్లున్నాయే వాటిని వేసికోవడంలో చాలా కష్టాలు పాలౌతూంటారు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఎలాగూ దేవాలయాల్లోకే సాక్సులతో వెళ్తున్నాము కదా అని, ఇక్కడకూడా అలాగే కానిచ్చేస్తారు.ఏ టిఫినో తిన్న తరువాత, చేతులు కడుక్కోడానికి ఏ బాత్ రూమ్ముకో వెళ్తే, అక్కడేమో నేలంతా తడిగా ఉంటుందాయె, మన సాక్సులేమో తడిసిపోతాయేమో అని, మాట్టాడకుండా తీసేసి జేబులో కుక్కేసికోవడం. ఇంతవరకూ బాగానే ఉంటుంది, కబుర్లు చెప్పుకుని వెళ్ళేటప్పుడే అసలు గొడవంతానూ. ఒక కాలిమీద నుంచుని సాక్సూ, తరువాత బూట్లూ వేసికోవడమంటే బ్రహ్మవిద్యే మరి. వీడి బాధ చూడలేక, ఆ ఇంటివారు, మొహమ్మాటానికి, " అదేవిటండీ.. లోపలకొచ్చి వేసికోవచ్చూ.." అంటారే కానీ, గుమ్మానికడ్డంగా నుంచున్నవాళ్ళు ఒక్కరూ తప్పుకోరు. మొత్తానికి నానా విధ విన్యాసాలూ చేసి, జీవితంలో మళ్ళీ ఎవరింటికీ బూట్లు వేసికొని మాత్రం వెళ్ళకూడదూ అని ఓ శపథం చేసేసికుంటాడు.

వీటికి  పాలిష్ చేయించడం ఓ కళ. ఏ ఫుట్ పాత్ మీదుండేవాడిదగ్గరకో వెళ్ళీవెళ్ళగానే, మన షూస్ తీసికుని, అప్పటికే ప్రపంచంలో అందరిచేతా వాడబడ్డ ఓ హవాయి చెప్పుల జతఒకటి వేసికోమని చెప్పి, అదేదో పులిమేసి, పక్కన ఉంచేస్తాడు. ఇంతలో ఎవరో ఇంకో బేరం, చెప్పుకి కుట్టేయమనో, బ్యాగ్గుని కుట్టమనో వస్తారు.మన షూస్ పాలిష్ చేయడంతో వాడికి కడుపు నిండుతుందా ఏమిటీ, ఇలా ఒకటీ రెండూ బేరాలు మధ్యమధ్యలో చూసుకుంటూ, మొత్తానికి మన షూస్ ని తళతళా మెరిపించేస్తాడు. ఇంత సేపూ, ఆ మాయదారి చెప్పులు వేసికుని నుంచోడానికి మనకి నామోషీ. ఏ తెలిసినవాడైనా చూస్తే.... ఇదో గొడవ. ఇంక రిపేరీ విషయానికొస్తే అదేం కర్మమో, ఒకవైపు కుట్లూడిపోయి, బొడిపిలా తయారవుతాయి. ఆ చెప్పులు రిపేరీ చేసేవాడు, మనల్ని చూడ్డంతోనే గ్రహిస్తాడు, వీటిని ఏ సెకండ్ సేల్ లోనో కొన్న రకం అని.  మనం చెప్పిన చోటుమాత్రమే కుట్టువేస్తాడు. అతనికీ తెలుసు, ఆ రెండోవైపుకూడా ఒకటిరెండురోజుల్లో ఊడిపోయేదే అని. మన డాక్టర్లలాగే రోగాలన్నిటికీ ఒకేసారి వైద్యం చేసేస్తే, వాళ్ళ పొట్ట గడవొద్దూ, అలాగే ఈ చెప్పులుకుట్టేవాళ్ళుకూడా వాయిదాల్లో రిపేరీలు చేస్తేనే వాళ్ళూ బ్రతకగలిగేది !

ఇవే కాకుండా, గం బూట్లనేవుండేవి. వీటిని వర్షాకాలంలో మాత్రమే వాడడం. దాంట్లో కాలు దోపడం అంత హైరాణ ఇంకోటుండదు. ఓ ప్రత్యేక కోణంలో కాలు పెడితేనే సరీగ్గా ఉంటుంది, పైగా వీటిలో ఏ క్రిమికీటకాదులైనా చేరి, మనల్ని అల్లరి పెట్టే అవకాశాలూ ఎక్కువే. స్కూళ్ళలో పీటీ కి వేసికునే తెల్ల కాన్వాసు బూట్లు ఇంకోరకం. చవగ్గానే వస్తాయి, కానీ వీటికి పాలీషు పెట్టడం ఉందే, అదో పేద్ద యజ్ఞం.ఇదివరకటిరోజుల్లో ఏ గోడకేసేసున్నమో  ఓ డబ్బాలో దాచుకుని, దాన్నే ఆరారగా పాముతూ, ఎండలో ఓ రెండురోజులు పెడితే పనైపోయేది. కానీ ఈ రోజుల్లో వాటికీ బ్రాండెడ్ పాలిషులు వచ్చేశాయి. ఓ బుల్లి ప్లాస్టిక్ డబ్బా, దానికో స్పాంజీ బ్రష్షూ, ఆ డబ్బాలో ముంచడమూ, ఆ బూట్లకి పామడమూనూ. అదిమాత్రం ఎన్నిరోజులొస్తుందీ, ఎప్పుడో ఆ స్పాంజీ ఆయుద్దాయం కాస్తా పూర్తయి, ఊడిపోతుంది.అలాగని ఆ డబ్బా పారేస్తామా ఏమిటీ, ఇంకా మిగిలి ఉన్న ఆ "సున్నం" అరచేతిలో వేసికుని, ఓ వేలుతో శవనగా ఆ బూట్లమీద పట్టించడం. ఇదంతా పూర్తయేసరికి, ఇళ్ళల్లో సున్నాలు కొట్టేవారిలా, ఇల్లూ వళ్ళూ మరకలు చేసికోవడం. ఇంటి ఇల్లాలిచేత మాటలు పడడమూ.

ఈరోజుల్లో ఒక్కోదానికి ఒక్కోరకమైన షూస్. పార్టీకి ఒకటీ, వాకింగుకి ఒకటీ, జ్యాగింగుకి ఒకటీ,ఆఫీసుకి ఒకటీ ఇలా ఇంట్లో ఉండే ఇద్దరు పెద్దలూ, ఇద్దరు పిల్లలకీ వెరసి ఓ పరకో, పాతికో బూట్లూ, వీటికో షూ కేసూ, అన్నీ కలిపి ఓ  షూ మార్టులాగ ఉంటుంది. అయ్యా అదీ విషయం. హాయిగా చెప్పుల్లేకుండగా ఉండే రోజులే బాగుండేవి కదూ...

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు